• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా సీఐఏ గూఢచారులను రష్యా ‘రహస్య మైక్రోవేవ్ ఆయుధాల’తో చంపాలని చూస్తోందా?

By BBC News తెలుగు
|

పోలిమెరోపౌలోస్‌

రష్యా రాజధాని మాస్కోలో ఉన్న ఓ హోటల్ గదిలో నిద్ర లేవడంతోనే మార్క్ పోలిమెరోపౌలోస్‌కు తల తిరుగుతోంది. చెవుల్లో గుయ్‌మంటూ ఒకటే హోరు వినిపిస్తోంది.

''వాంతి వచ్చినట్లుగా అనిపించింది. కనీసం లేచి నిల్చోలేకపోతున్నా. కిందపడిపోతున్నా. ఇదివరకు నాకు చాలా సార్లు తూటాలు తగిలాయి. కానీ, ఈ అనుభవం అంతకన్నా ఘోరంగా ఉంది’’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ చెప్పారు మార్క్.

అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ‌లో సీనియర్ అధికారిగా మార్క్ ఇరాక్, సిరియా, అఫ్గానిస్తాన్ దేశాల్లో చాలా ఏళ్లు పనిచేశారు.

మాస్కోలో ఆ రోజు తనపై మైక్రోవేవ్ ఆయుధాలతో దాడి జరిగిందని మార్క్ చెబుతున్నారు.

2016-అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం వ్యవహారం తర్వాత... సీఐఏ నాయకత్వం రష్యాలో కార్యకలాపాలను పెంచింది. రాటుదేలిన తమ అధికారులను మళ్లీ అక్కడ రంగంలోకి దింపింది. మార్క్ కూడా అలా అక్కడకు వెళ్లినవారే.

యూరప్, యురేసియాల్లో సీఐఏ రహస్య కార్యకలాపాలకు ఆయన నేతృత్వ బాధ్యతలు తీసుకున్నారు. రష్యా మాజీ గూఢచారి సెర్జీ స్క్రిపాల్‌పై విష ప్రయోగంతో సహా వివిధ వ్యవహారాల్లో రష్యా ప్రభుత్వం పోషించిన పాత్రను బయటపెట్టేందుకు ఆయన అక్కడ పనిచేస్తూ ఉన్నారు.

2017 డిసెంబర్‌లో మార్క్ మాస్కో వెళ్లారు. అయితే, ఆయన మారుపేరుతో ఏమీ వెళ్లలేదు.

రష్యా, అమెరికా గూఢచారుల మధ్య అధికారికంగా జరిగే సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ పర్యటన గూఢచార కార్యకలాపాల కోసం కాదని ఆయన అన్నారు. కానీ, ఆయన రాక రష్యాకు అంతగా ఇష్టం లేదు.

ఆ పర్యటనలో మార్క్ అనారోగ్యం పాలయ్యారు. అమెరికా తిరిగివచ్చాక ఆయనకు తలతిరుగుడు పోయింది. కానీ, ఇతర లక్షణాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.

''వరుసగా మూడేళ్లపాటు నాకు మైగ్రేన్ ఉంది. అది అస్సలు దూరమవ్వట్లేదు’’ అని ఆయన బీబీసీతో చెప్పారు. మార్క్‌కు ఉద్యోగ విధులు నిర్వర్తించడం కష్టమైపోయింది. నెలల పాటు సెలవు తీసుకున్నారు. సుదీర్ఘంగా వైద్య చికిత్స తీసుకుంటున్నారు.

2016లో క్యూబాలోని హవానాలో కూడా అమెరికన్ దౌత్యవేత్తలకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. కెనడాకు చెందిన కొందరు కూడా ఈ లక్షణాలతో బాధపడ్డారు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత మార్క్‌‌లో అనుమానాలు మొదలయ్యాయి.

ఒక్కసారిగా ఏదో పెద్ద ధ్వని వినిపిస్తున్నట్లుగా ఉండి, తలనొప్పి పుడుతుంది. కొందరికి తల పట్టేసినట్లుగా ఉండి, కళ్లు తిరుగుతాయి. ఏదో ఒక దిశ నుంచో, చోటు నుంచో ఈ హోరు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. దీన్నే 'హవానా సిండ్రోమ్’గా పిలుస్తున్నారు.

క్యూబాలోని అమెరికా దౌత్య కార్యాలయం

'హవానా సిండ్రోమ్’ ఎందుకు వచ్చింది?

క్యూబాలో అమెరికన్ దౌత్యవేత్తలకు జరిగిందే మాస్కోలో తనకు కూడా జరిగిందని మార్క్ అంటున్నారు.

హవానా సిండ్రోమ్‌కు గురైనట్లుగా చెబుతున్నవారిలో ఒక్కో వ్యక్తిలో లక్షణాలు ఒక్కోలా కనిపించాయి. ఈ కేసుల్లో ఒకదానితో మరొకదానికి సంబంధం లేదని, మానసిక సమస్య వల్లే ఇలా జరుగుతుందని కూడా వాదనలు వచ్చాయి.

2020 డిసెంబర్‌లో అమెరికా నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్ దీనిపై లోతుగా విశ్లేషణ చేసింది. పల్స్‌డ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ చూపించే ప్రభావాలతో ఈ లక్షణాలు సరిపోతున్నాయని అభిప్రాయపడింది. ఇది మానసిక సమస్యో, విష ప్రయోగం వల్ల వచ్చిందో కాదని స్పష్టం చేసింది.

''ఈ సమస్యకు గురైన వ్యక్తుల్లో మేం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను గుర్తించాం. వాటి కారణంగానే మేం ఈ అభిప్రాయానికి వచ్చాం’’ అని ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ఏ రెల్మాన్ చెప్పారు.

అయితే, పల్స్‌డ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని ఏదైనా ఆయుధాల ద్వారా ప్రయోగించారా? ఈ దాడులు వెనుక ఎవరున్నారు? అనే విషయాలను మాత్రం వాళ్లు బయటపెట్టలేకపోయారు.

మార్క్‌పై పరీక్షలు చేసిన సీఐఏ వైద్యాధికారులు ఆయనలో కనిపించిన లక్షణాలు హవానా దౌత్యవేత్తలు ఎదుర్కొన్న లక్షణాల కన్నా కాస్త భిన్నంగా ఉన్నాయని... రెండింటి మధ్య సంబంధం లేదని అభిప్రాయపడ్డారు.

అయితే, దాడికి ఉపయోగించిన సాంకేతికతలో మార్పులు రావడం వల్ల లక్షణాలు కూడా మారి ఉండొచ్చని మార్క్ అంటున్నారు.

మరోవైపు తమ అధికారుల ఆరోగ్యానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని సీఐఏ అధికార ప్రతినిధి బీబీసీతో అన్నారు.

పోలిమెరోపౌలోస్‌

ఇతర దేశాల్లోనూ...

అనారోగ్యం కారణంగా 2019లో మార్క్ ఉద్యోగం నుంచి విరమణ పొందారు. తాను ఎదుర్కొంటున్న సమస్యకు స్పెషలిస్టు ఆసుపత్రి నుంచి చికిత్స దొరికేలా, విషయం అందరికీ తెలిసేలా చేయాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే మార్క్‌ ఒక్కరే కాకుండా ఇతరులు కూడా ఈ సమస్యకు గురై ఉండొచ్చన్న అభిప్రాయంతో సీఐఏలోని కార్యనిర్వాహక విభాగం ఈ విషయంపై మరింత దృష్టి పెట్టింది.

మరో ఐదారుగురికిపైగా అధికారులు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు వచ్చాయి.

''కొందరు సీనియర్ అధికారులకు కూడా ఇలా జరుగుతూ ఉంది. వారిలో కొందరు రష్యాపై చేపట్టిన కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారే. వాళ్లంతా మౌనంగా బాధను అనుభవిస్తూ ఉన్నారు’’ అని మార్క్ చెప్పారు.

క్యూబా, రష్యాతో పాటు చైనా లాంటి దేశాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి.

మార్క్ కేసును మొదట బయటపెట్టిన జీక్యూ మ్యాగజీన్... 2019లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఓ సీనియర్ సీఐఏ అధికారి కూడా ఈ దాడి బారినపడ్డారని తెలిపింది. పోలెండ్, జార్జియాల్లోనూ ఈ తరహా కేసులు నమోదయ్యాయి.

చైనాలోని అమెరికా కాన్సులేట్

2019 ఆగస్టులో లండన్‌లో ఓ హోటల్ గదిలో ఉండగా వైట్ హౌజ్ అధికారి కూడా ఇలాంటి సమస్యే ఎదురవుతున్నట్లు చెప్పారు. అయితే, బ్రిటీష్ భద్రతా అధికారులకు ఈ సంగతి తెలిసినా, అసలు ఏం జరిగిందన్నదానిపై వారికి కూడా స్పష్టత లేదు.

ఈ అంశమై బ్రిటన్, అమెరికా ప్రభుత్వాల మధ్య సంభాషణ కూడా నడిచింది. అయితే, తమ సిబ్బంది ఎవరూ ఈ సమస్య ఎదుర్కొన్నట్లు తమకైతే సమాచారం లేదని బ్రిటన్ విదేశాంగ, అభివృద్ధి కార్యాలయం తెలిపింది.

ఇందులో రష్యా పాత్ర గురించి ఏ మాత్రం ఆధారాలు దొరికినా, అదో 'కీలక మలుపు’ అవుతుందని బ్రిటన్ మాజీ నిఘా అధికారి ఒకరు అన్నారు.

Short presentational grey line

ఆధారాలున్నాయా?

హవానాలో జరిగిన ఘటనల తర్వాత ఆ విషయంలో రష్యా పాత్రను సూచించే కొన్ని రహస్య సంభాషణలు వెలుగుచూశాయని, అయితే ఇవి ప్రభుత్వం వద్ద రహస్యాలుగా ఉన్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ దాడుల బారినపడ్డ సీఐఏ అధికారులకు ఆయా ప్రాంతాల్లో దగ్గరగా వచ్చిన రష్యా నిఘా అధికారులను మొబైల్ ఫోన్ సమాచారం ద్వారా గుర్తించేందుకు సీఐఏ ప్రయత్నిస్తోందని కూడా వార్తలు వచ్చాయి.

అయితే, ఈ విషయంలో రష్యాపై అధికారికంగా ఆరోపణ చేసేందుకు తగిన ఆధారాలైతే ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వానికి లభించలేదు.

నిఘా అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు వారు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సమాచారం సేకరించేందుకు ప్రత్యర్థులు మైక్రోవేవ్ తరంగాలను ప్రయోగించడంతో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అయి ఉండొచ్చన్న వాదన కూడా ఉంది.

అమెరికా-రష్యా ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగేవి.

మాస్కోలోని అమెరికా దౌత్య కార్యాలయంపై రష్యా నిఘా అధికారులు మైక్రోవేవ్, ఎలక్ట్రానిక్ పల్స్‌లతో దాడి చేసేవారని మాజీ సీఐఏ అధికారి జాన్ సిఫర్ చెప్పారు. ఈ దాడుల కోసం రష్యా వ్యానులను కూడా తిప్పేదని, వ్యక్తులపై నిఘా పెట్టేదని ఆయన అన్నారు.

సీఐఏ అధికారులు ఇటీవల ఎదుర్కొంటున్న సమస్యలకు రష్యా ప్రభుత్వమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

నిఘా సమాచారం సేకరించే ప్రయత్నంలో రష్యా ఇలా చేసి ఉండొచ్చని మొదట తాను భావించానని, అయితే పరిస్థితులను బట్టి చూస్తుంటే దీన్ని కావాలనే 'ఆయుధం’గానే వాడుతున్నట్లు అర్థమవుతోందని మార్క్ అన్నారు.

పుతిన్

ఆ అవసరం ఉందా?

రష్యాకు క్యూబా సన్నిహిత దేశం. అమెరికా, క్యూబాల మధ్య సంబంధాలు మెరుగపడకూడదని రష్యా కోరుకుంటుండొచ్చు. రష్యా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మార్క్ లాంటి అధికారులను లక్ష్యంగా చేసుకోవచ్చు. వారిని పనిచేయకుండా చేయుచ్చు. ఇలా చేస్తే వనరులు తగ్గి, సీఐఏ కార్యకలాపాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇదంతా రష్యా పాత్ర ఉందని ఆరోపిస్తూ వస్తున్న ఒక వాదన.

గూఢచార సంస్థలు సాధారణంగా ఒకదాని సిబ్బందికి మరొకటి భౌతికంగా హాని చేయవు. కానీ, రష్యా ఇదివరకు కూడా దీన్ని ఉల్లంఘించినట్లు ఆధారులున్నాయని సీఐఏ, బ్రిటన్ గూఢచార సంస్థ ఎమ్ఐ6 చెబుతున్నాయి.

గూఢచారి సాలిస్బరీ‌పై నెర్వ్ ఏజెంట్‌తో జరిగిన విషప్రయోగం గురించి ప్రస్తావిస్తూ... రష్యా హద్దులు దాటుతోందని మార్క్ అన్నారు.

''అది కచ్చితంగా ఉల్లంఘనే. మా సిబ్బందిని బాధించడం వారికి కొత్తేమీ కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

రష్యా వద్ద 'లక్షిత మైక్రోవేవ్ ఆయుధాలు’ ఉన్నట్లుగానీ, వాటిని వినియోగించినట్లు గానీ తమ దగ్గర సమాచారం ఏదీ లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి నిరాధార ఆరోపణలపై తాము స్పందించనవసరం లేదని వ్యాఖ్యానించింది.

అమెరికా కాంగ్రెస్ కమిటీలు ఈ విషయంపై విచారణ జరపాలని మార్క్ కోరుతున్నారు. కొందరు సెనేటర్లు కూడా ఇందుకు అంగీకరించారు.

అమెరికా అధికారులపై రష్యా మైక్రోవేవ్ ఆయుధాలను వాడిందని రుజువైతే అది సంచలనమే అవుతుంది. కానీ, దాన్ని రుజువు చేయడం మాత్రం చాలా కష్టం.

తాను రోజూ పడుతున్న వేధన దూరం అయినా, కాకపోయినా... దాని వెనుకున్న అసలు వాస్తవం బయటకు రావడం ముఖ్యమని మార్క్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Russia looking to kill US CIA spies with 'secret microwave weapons
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X