• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇజ్రాయెల్, పాలస్తీనా: భారత్ ఎటు వైపు, ప్రధాని మోదీ ఈ హింసపై ఎందుకు మాట్లాడడం లేదు

By BBC News తెలుగు
|

మే 11న ఒక ట్వీట్ చేసిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ "సౌమ్యా సంతోష్ కుటుంబంతో మాట్లాడాను. ఆమె మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశాను. వారికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చాను" అని చెప్పారు.

కేరళకు చెందిన సౌమ్య గాజా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న అష్‌క్లోన్‌లో కేర్ టేక‌ర్‌గా పనిచేసేవారు. గాజా నుంచి ప్రయోగించిన ఒక రాకెట్ దాడిలో ఆమె చనిపోయారు.

"మేం జెరూసలెంపై జరిగిన దాడులను, హింసను ఖండిస్తున్నాం. రెండు పక్షాలు సంయమనం పాటించాలని కోరుతున్నాం" అని మురళీధరన్ తన ట్వీట్‌లో చెప్పారు. ఇదే ట్వీట్‌ను భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జయశంకర్ కూడా రీట్వీట్ చేశారు.

ఈ ట్వీట్లు తప్ప ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘర్షణలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

https://twitter.com/MOS_MEA/status/1393379278926991361

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి మే 11న భద్రతామండలి సమావేశంలో తూర్పు జెరూసలెంలో జరిగిన ఘర్షణలు, మధ్యప్రాచ్యం గురించి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చర్చల సమయంలో మాట్లాడారు. రెండు పక్షాలూ క్షేత్రస్థాయిలో యథాతధ స్థితి మారకుండా చూడాలన్నారు.

గాజా నుంచి జరుగుతున్న రాకెట్ ప్రయోగాలను ఖండించిన తిరుమూర్తి అన్ని పక్షాలూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని, భద్రతామండలి తీర్మానం 2334ను అనుసరించాలని, శాంతి చర్చలు మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మే 12న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి చర్చల సమయంలో మాట్లాడిన తిరుమూర్తి భారత్ ఈ హింసను, ముఖ్యంగా గాజా రాకెట్ దాడులను ఖండిస్తోందని అన్నారు. హింసకు తక్షణం ముగింపు పలికి, ఉద్రిక్తతలకు తెరదించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తీర్మానం 2334 ఏంటి?

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి 2016లో తీర్మానం 2334 పాస్ చేసింది. అందులో, తూర్పు జెరూసలెం సహా 1967 తర్వాత నుంచి స్వాధీనం చేసుకున్న పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ కాలనీలు ఏర్పాటు చేయడంలో చట్టబద్ధత లేదని చెప్పింది.

అంతర్జాతీయ చట్టం ప్రకారం ఆ కాలనీల ఏర్పాటు తీవ్ర ఉల్లంఘన అని కూడా సూచించింది..

చరిత్రను ఒకసారి గమనిస్తే, పాలస్తీనా ప్రజలపై భారత్ సానుభూతి విధానం అనుసరిస్తోంది. మరోవైపు గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్‌తో భారత్ సాన్నిహిత్యం కూడా చాలావరకూ పెరిగింది.

అంటే ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య జరుగుతున్న ఈ హింసాత్మక ఘర్షణలు భారత్‌కు ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించిందనేది సుస్పష్టం.

భారత్ 1950 సెప్టెబర్ 17న ఇజ్రాయెల్‌కు గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత యూదు ఏజెన్సీ బాంబేలో ఒక ఇమిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి ఒక వాణిజ్య కార్యాలయం, తర్వాత దానినే వాణిజ్య రాయబార కార్యాలయంగా మార్చారు. 1992లో సంపూర్ణ దౌత్య సంబంధాలు ఏర్పడడంతో రెండు దేశాల్లో రాయబార కార్యాలయాలు తెరిచారు.

1992లో సంబంధాలు బలపడిన తర్వాత, రెండు దేశాల మధ్య రక్షణ, వ్యవసాయ రంగాల్లో సహకారం పెరిగింది. గత కొన్నేళ్లుగా చాలా రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతోంది. 2017 జులైలో నరేంద్రమోదీ 70 ఏళ్లలో ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాన మంత్రి అయ్యారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మోదీ పర్యటనను ఒక అద్భుతంగా వర్ణించారు. రెండు దేశాలు అంతరిక్ష, వాటర్ మేనేజ్‌మెంట్, వ్యవసాయం లాంటి ప్రధాన రంగాల్లో ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

నెతన్యాహు 2018 జనవరిలో భారత్ వచ్చారు. ఆ సమయంలో సైబర్ సెక్యూరిటీ, చమురు, గ్యాస్ సహకారం, ఫిల్మ్ కో ప్రొడక్షన్, వాయు రవాణా మరో ఐదు పాక్షిక ప్రభుత్వ ఒప్పందాలపై కూడా సంతకాలు చేశారు.

ఈ పర్యటనలకు ముందు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2015లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు రూబెన్ రివ్లిన్ కూడా 2016లో భారత పర్యటనకు వచ్చారు.

పాలస్తీనా అంశానికి మద్దతు

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం పాలస్తీనా అంశానికి మద్దతివ్వడం అనేది దేశ విదేశాంగ విధానంలో ఒక అంతర్భాగం. 1974లో పాలస్తీనా విముక్తి సంస్థను పాలస్తీనా ప్రజల, చట్టబద్ధ ప్రతినిధిగా గుర్తించిన ఏకైక అరబ్ యేతర దేశం భారత్. 1988లో పాలస్తీనా దేశాన్ని మొదట గుర్తించిన దేశాల్లో భారత్ ఒకటి. 1996లో భారత్ గాజాలో తన ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 2003లో దానిని రమల్లాకు మార్చారు.

ఎన్నో బహుపాక్షిక వేదికలపై భారత్ పాలస్తీనా అంశానికి మద్దతివ్వడంలో చురుకైన పాత్ర పోషించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 53వ సమావేశంలో పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికారంపై ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత్ మద్దతివ్వడమే కాదు, దానికి అనుకూలంగా ఓటు కూడా వేసింది.

విభజన గోడ కట్టాలనే ఇజ్రాయెల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2003 అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కూడా భారత్ సమర్థించింది. 2011లో పాలస్తీనాకు యునెస్కో సంపూర్ణ సభ్యత్వం ఇవ్వడానికి అనుకూలంగా ఓటు వేసింది.

పాలస్తీనాకు ఐక్యరాజ్యసమితి ఓటింగ్ హక్కు లేకుండా 'నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టేట్' చేయాలనే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని 2012లో మద్దతిచ్చిన భారత్ దానిపై చర్చించింది. భారత్ ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు కూడా వేసింది.

2015 సెప్టెంబర్‌లో పాలస్తీనా జెండాను ఐక్యరాజ్యసమితి ప్రాంగణంలో ఏర్పాటు చేయాడాన్ని కూడా భారత్ సమర్థించింది.

భారత, పాలస్తీనా అధికారుల మధ్య అప్పుడప్పుడూ ఉన్నతస్థాయి ద్వైపాక్షిక పర్యటనలు కూడా జరిగేవి.

భారత్ అంతర్జాతీయ, ద్వైపాక్షిక స్థాయిలో బలమైన రాజకీయ మద్దతుతోపాటూ పాలస్తీనా ప్రజలకు చాలా రకాలుగా ఆర్థిక సహకారం కూడా అందించింది.

భారత ప్రభుత్వం గాజాలోని అల్ అజహర్ విశ్వవిద్యాలయంలో జవహర్‌లాల్ నెహ్రూ గ్రంథాలయం, గాజాలోని దిల్ అల్-బలాహ్‌లో పాలస్తీనా టెక్నికల్ కాలేజీలో మహాత్మా గాంధీ గ్రంథాలయంతోపాటూ స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ ఏర్పాటుకు కూడా సాయం చేసింది.

వీటితోపాటూ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించడానికి భారత్ పాలస్తీనాకు సాయం అందిస్తూ వస్తోంది.

2018 ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ పాలస్తీనా భూభాగానికి వెళ్లిన మొదటి భారత ప్రధానిగా నిలిచారు. పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను సంరక్షించడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన అప్పుడు పాలస్తీనా పాలనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు భరోసా ఇచ్చారు.

https://twitter.com/narendramodi/status/962288082413289472

"పాలస్తీనా ప్రాంతం శాంతి వాతావరణంలో ఉండే ఒక సౌర్వభౌమ, స్వతంత్ర దేశంగా మారాలని భారత్ కోరుకుంటోంది" అని మోదీ ఆ పర్యటనలో అన్నారు.

గందరగోళంలో భారత్

గందరగోళంలో భారత్

న్యూ దిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో స్ట్రాటజిక్ స్టడీస్ ప్రోగ్రాం చీఫ్ ప్రొఫెసర్ హర్ష్ వీ పంత్ ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.

భారత్ బహిరంగంగా ఎప్పుడూ పాలస్తీనాకు మద్దతు పలుకుతోంది. కానీ తెరవెనుక మాత్రం ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు ఉండేలా చూసుకుంటోంది.

"మన దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా...ఇజ్రాయెల్, భారత్ మధ్య రక్షణ, నిఘా రంగాల్లో దొడ్డి దారిన సహకారం ఎప్పుడూ ఉంటోంది. కానీ బహిరంగంగా ఇజ్రాయెల్‌కు అండగా నిలిస్తే, దాని పరిణామాలు ఎలా ఉంటాయో, భారత్‌లోని ముస్లిం సమాజాలు ఏమంటాయో అని భారత్ దానికి అధికారిక గుర్తింపు ఇవ్వడానికి వెనకాడుతుంటుంది".

పంత్ వివరాల ప్రకారం 1992 తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు ఏర్పరుచుకున్న తర్వాత ఆ దేశంతో తన బంధాలను భారత్ బహిరంగంగా ముందుకు తీసుకెళ్లింది. అయితే, నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ వెళ్లిన మొదటి భారత ప్రధానమంత్రిగా నిలిచారు.

కానీ, రెండు దేశాల సంబంధాల విషయానికి వస్తే, ఆ బంధం ఎన్నో ఏళ్ల నుంచీ ఉందని పంత్ చెప్పారు.

"కార్గిల్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ భారత్‌తో కీలక సమాచారం పంచుకుంది. నిఘా సమాచారం కూడా షేర్ చేసుకుంది. భారత్‌కు ఇజ్రాయెల్ నుంచి రక్షణ పరికరాలు కూడా అందాయి. అంటే ఇజ్రాయెల్ సుదీర్ఘ కాలం నుంచీ మన భద్రతలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది" అన్నారు.

రక్షణ నిపుణులు ఉదయ భాస్కర్ భారత నావికా దళం కమాండర్‌గా రిటైర్ అయ్యారు. ఆయన ప్రస్తుతం దిల్లీలోని సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనియన్ల మధ్య కొనసాగుతున్న హింసపై బీబీసీతో మాట్లాడారు.

"ఇది చాలా సున్నితమైన స్థితి. భారత్‌కు కత్తిమీద సాము లాంటిది. సంప్రదాయబద్ధంగా భారత్ పాలస్తీనా అంశాన్ని సమర్థిస్తోంది. భారత్ అలీన సమావేశం ఏర్పాటు చేసినపుడు యాసర్ అరాఫత్ దిల్లీ వచ్చారు. ఆయనకు స్వాగతం పలికారు. అదే సమయంలో నరసింహారావు పదవీకాలంలో మనం ఇజ్రాయెల్‌తో అధికారిక సంబంధాలు ఏర్పరుచుకున్నాం" అన్నారు.

భారత్ ప్రయత్నం ఒక్కటే.. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండింటితో తమ ద్వైపాక్షిక సంబంధాలను సంతులనంతో కొనసాగించాలని చూస్తోంది.

రాజకీయ సంతులనం కాపాడుకునే ప్రయత్నం భారత్ వైపు నుంచి ఎప్పుడూ ఉంటుందని పంత్ అభిప్రాయపడ్డారు.

"మోదీ ఇజ్రాయెల్ వెళ్లారు, కానీ ఆ తరవాత ఆయన పాలస్తీనా భూభాగంలో కూడా పర్యటించారు. అరబ్ దేశాలతో ఈ ప్రభుత్వం తమ సంబంధాలను ఎలా పెంపొందించుకుంటోంది అనేది చాలా ముఖ్యం. పీవీ

నరసింహారావు నుంచి ఇప్పటివరకూ ప్రతి ప్రభుత్వం ఆ సంతులనం కొనసాగేలా ప్రయత్నిస్తోంది. కానీ మోదీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు దౌత్యపరంగా ఎంత బహిరంగ ఎంత మద్దతు ఇస్తోందో, అంత గత ప్రభుత్వాలు ఇవ్వలేదు".

గాజాలో శిథిలాలు

పంత్ అభిప్రాయం ప్రకారం భారత్ క్షేత్ర స్థాయిలో ఈ ఘర్షణల్లో ఎలాంటి ప్రబావం చూపలేదు. అందుకే శాంతియుత పరిష్కారానికి అపీల్ చేస్తూ భారత్ ఒక నిర్మాణాత్మక వైఖరిని అవలంబించవచ్చు.

"భారత్‌ ఇంతకు మించి ఎక్కువ చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ రగులుతోంది ఒక చారిత్రక సమస్య. ఆ రెండు పక్షాలకు తమ తమ అవసరాలు ఉన్నాయి. రెండు పక్షాలూ హింసను ఉపయోగిస్తున్నాయి". అన్నారు.

అయితే, ఈ భయంకర హింసాత్మక పరిస్థితుల్లో భారత్ ఆ సంతులనం కొనసాగించగలదా.

గల్ఫ్ అరబ్ దేశాలు దీనిపై ఒక సంతులన వైఖరి కొనసాగించినప్పుడు, భారత్ కూడా అలా చేయవచ్చని పంత్ సమాధానం ఇచ్చారు.

"అరబ్ దేశాలు తెలివిగా దీనిని ఇజ్రాయెల్ సమస్యగా చెబుతున్నాయి. కానీ, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన అబ్రహాం అకార్డ్‌లో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ వైపు ఎలా తమ చేయి చాచాయో మనం చూడచ్చు. ఇక పాలస్తీనియన్ల విషయానికి వస్తే, గల్ఫ్‌లో అరబ్ దేశాలే దానికి ఏ పరిష్కారం వెతకలేనప్పుడు, అక్కడ భారత్ ఏం చేయగలదు" అన్నారు.

దౌత్యపరంగా భారత్ తన సంతులనం కొనసాగిస్తుంది. అది మనకు సులభం కూడా. ఎందుకంటే భారత్‌కు అక్కడ నేరుగా చేయడానికి ఎలాంటి భాగస్వామ్యం లేదని పంత్ అన్నారు.

"మధ్యవర్తిగా జోక్యం చేసుకోవాలని భారత్‌కు ఎవరూ అడగడం లేదు. మధ్యవర్తిగా జోక్యం చేసుకోవాలని భారత్ కూడా అనుకోవడం లేదు. కావాలనుకుంటే భారత్ ఇజ్రాయెల్‌కు అనుకూలంగా మాట్లాడగలదు. కానీ, అలా చేయదు. ఎందుకంటే దానివల్ల మరిన్ని చిక్కులు ఎదురవుతాయి" అని పంత్ అన్నారు.

మోదీ ప్రభుత్వానికి ఇది ఒక క్లిష్ట పరిస్థితి. భారత్‌లోని ముస్లింలు ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా ఉన్నారు అంటారు పంత్.

ఈ అంశాన్ని బయటినుంచి పరిశీలిస్తే, హమాస్ ఒక దేశం శక్తినే సవాలు చేస్తోంది. హమాస్‌ అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థ కాదు. కానీ, ఇజ్రాయెల్ ఒక గుర్తింపు ఉన్న దేశం.

"ప్రతి దేశం దీనిని తమ జాతీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తుంది. అమెరికా, గల్ఫ్ దేశాలు మినహా ఇందులో వేరే ఏ దేశమూ జోక్యం చేసుకోడానికి ఏమీ లేదు. ఏదైనా పరిష్కారం వెతకాలంటే, అమెరికా లేదా అరబ్ దేశాలే దానిని కనుగొనాలి. అక్కడ వారి పాత్రే అస్పష్టంగా ఉన్నప్పుడు భారత్ కూడా ఒక దేశం వైపు మొగ్గు చూపకుండా ఉండగలదు" అని పంత్ చెప్పారు.

భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు

భారత్ ఇజ్రాయెల్ నుంచి రక్షణ టెక్నాలజీని దిగుమతి చేసుకుంటోంది. దానితోపాటూ రెండు దేశాల సైన్యం మధ్య కూడా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. భద్రతా అంశాల్లో రెండు దేశాలూ కలిసి పనిచేస్తున్నాయి. రెండు దేశాల మధ్య జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్ కూడా ఉంది.

2014లో కూడా భారత్, ఇజ్రాయెల్ మూడు ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

2015 నుంచి భారత ఐపీఎస్ అధికారులు ప్రతి ఏటా ఇజ్రాయెల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఒక వారం పాటు ట్రైనింగ్ తీసుకోడానికి వెళ్తుంటారు.

ఇజ్రాయెల్ ప్రజలు ముఖ్యంగా యువతకు భారత్‌ అత్యంత ఇష్టమైన దేశం. 2018లో 50 వేల మందికి పైగా ఇజ్రాయెలీలు భారత్‌లో పర్యటించారు. అలాగే, భారత్ నుంచి 70 వేల మందికి పైగా ఇజ్రాయెల్‌ అంతా తిరిగి వచ్చారు.

టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం, హీబ్రూ విశ్వవిద్యాలయం, హాయిఫా విశ్వవిద్యాలయంలో భారత్‌కు సంబంధించిన ఎన్నో పాఠ్యాంశాలను బోధిస్తున్నారు.

2019 గణాంకాల ప్రకారం ఇజ్రాయెల్‌లో దాదాపు 550 మంది భారత విద్యార్థులు ఉన్నారు. వారిలో ఎక్కువగా డాక్టరేట్, ఆ తర్వాత చదువులు చదువుతున్నారు. ఇజ్రాయెల్ భారత విద్యార్థులకు షార్ట్ టర్మ్ సమ్మర్ స్కాలర్‌షిప్‌లు కూడా అందిస్తోంది.

ఇజ్రాయెల్‌లో దాదాపు 14 వేల మంది భారతీయులు ఉన్నారు. వారిలో దాదాపు 13,200 మంది ఆ దేశంలోని వృద్ధులకు కేర్ టేకర్లుగా పనిచేస్తున్నారు. వీరితోపాటూ వజ్రాల వ్యాపారులు, ఐటీ నిపుణులు, విద్యార్థులు కూడా ఆ దేశంలో ఉన్నారు.

అంతే కాదు, ఇజ్రాయెల్‌లో భారత మూలాలున్న దాదాపు 85 వేల మంది యూదులు ఉన్నారు. వారందరికీ ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ ఉంది. 1950, 1960 దశకాల్లో భారత్ నుంచి చాలామంది ఇజ్రాయెల్ వెళ్లిపోయారు. వారిలో ఎక్కువమంది మహారాష్ట్ర నుంచి, మిగతా వారు కేరళ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల నుంచీ వెళ్లారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Israel, Palestine: Which side of India, Prime Minister Modi is not talking about this violence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X