ఎట్టకేలకు ప్రత్యక్షమైన జాక్ మా... ఇదిగో వీడియో... ఊహాగానాలు,అనుమానాలకు చెక్...
గత కొద్ది నెలలుగా ఎవరికీ కనిపించకుండా పోయిన చైనా దిగ్గజ పారిశ్రామికవేత్త,అలీబాబా సంస్థ వ్యవస్థాపకుడు జాక్ మా ఎట్టకేలకు తిరిగి ప్రత్యక్షమయ్యారు. దీంతో జాక్ మా అదృశ్యంపై చెలరేగిన ఊహాగానాలకు తెరపడినట్లయింది. బుధవారం(జనవరి 20) గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాక్ మా పాల్గొన్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను గ్లోబల్ టైమ్స్ రిపోర్టర్ కింగ్ చెన్ తన ట్విట్టర్లో షేర్ చేశారు.
గ్రామీణ ఉపాధ్యాయులకు అవార్డుల కార్యక్రమంలో..
పారిశ్రామికవేత్తగానే కాదు సాంఘీక సంక్షేమ కార్యక్రమాల్లోనూ జాక్ మా ముందుంటారు. ఈ నేపథ్యంలోనే 2015 నుంచి జాక్ మా ఫౌండేషన్ ద్వారా గ్రామీణ విద్య,ప్రజా సంక్షేమం వంటి అంశాలపై ఆయన ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ప్రతీ ఏటా గ్రామీణ ఉపాధ్యాయులకు జాక్ మా ఫౌండేషన్ అవార్డులు ప్రధానం చేస్తోంది. ఈసారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాక్ మా డార్క్ బ్లూ షర్ట్‌లో కనిపించారు.

రూరల్ ఎడ్యుకేషన్‌పై జాక్ మా ఫోకస్...
చైనా వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాలకు చెందిన 100 మంది ఉపాధ్యాయులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాక్ మా పలకరించారు. కరోనా అంతమయ్యాక మనమంతా నేరుగా కలుసుకుందామని ఈ సందర్భంగా చెప్పారు. 'విద్యా రంగంలో సేవలకు,ప్రజా సంక్షేమానికి మమ్మల్ని మేము అంకితం చేయాలని నా సహోద్యోగులు,నేను నిశ్చయించుకున్నాం. ఇందుకోసం మరింతగా పరిశోధిస్తున్నాం... ఆలోచిస్తున్నాం...' అని తాజా సమావేశంలో జాక్ మా పేర్కొన్నారు. 2019లో అలీబాబా సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న సమయంలో... భవిష్యత్తులో గ్రామీణ విద్యపై తాను ఎక్కువగా ఫోకస్ చేస్తానని జాక్ మా హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆ దిశగా ఆయన కృషి చేస్తున్నారు.

ఎట్టకేలకు ప్రత్యక్షమైన జాక్ మా...
దాదాపు గత మూడు నెలలుగా జాక్ మా ఎవరికీ కనిపించకుండా పోయారు. ఉన్నట్టుండి జాక్ అదృశ్యమవడంతో చైనా ప్రభుత్వం పైనే అనుమానాలు వెల్లువెత్తాయి. చైనా బ్యాంకింగ్ విధానాలను,ఆర్థిక సంస్కరణలను జాక్ మా తీవ్రంగా విమర్శించడంతో జిన్‌పింగ్ ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగిందా అన్న అనుమానాలు రేకెత్తాయి. దానికి తోడు చైనా ప్రభుత్వం జాక్ మాకి చెందిన అలీబాబా,యాంట్స్ సంస్థలపై విచారణకు ఆదేశించడం... ఆయన్ను దేశం విడిచి వెళ్లిపోవద్దని ఆదేశాలు జారీ చేయడం... అసలేం జరుగుతోందన్న ఉత్కంఠకు తెరలేపాయి. ఎట్టకేలకు జాక్ మా తిరిగి ప్రత్యక్షమవడంతో ఆయన అదృశ్యంపై సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.