• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జపాన్: సముద్ర గర్భంలో అంతుచిక్కని ‘ప్రాచీన నగరం’

By BBC News తెలుగు
|
1987లో జపాన్ యోనగూని తీరంలో కనుగొన్న పిరమిడ్ ఆకారంలోని రాతి నిర్మాణం డైవర్లు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.

అది 1987 సంవత్సరం. ఒక స్థానిక డైవర్ జపాన్‌లోని ర్యూక్యూ ద్వీపాల తీరంలో అన్వేషణ కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో నీటి లోపల ఆయనొక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు.

సుమారు 25 మీటర్ల లోతులో ఆయనకు కొన్ని మెట్లలాంటి నిర్మాణాలు కనిపించాయి.

ఆ మెట్లను చాలా పద్ధతిగా నిర్మించినట్లు అనిపించింది. మెట్ల చివర్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి.

50 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ మహా కట్టడం సముద్ర గర్భంలో ఉన్న అసాధారణ, అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

దీన్ని ప్రస్తుతం యోనగూని మాన్యుమెంట్స్‌గా పిలుస్తున్నారు.

చాలా మంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు యోనగూని నిర్మాణాలను అధ్యయనం చేశారు.చాలామంది ఇది సహజమైన నిర్మాణమని భావిస్తున్నారు.

'ఆ దృశ్యాన్ని చూడగానే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి'

డైవింగ్ కోసం సరైన ప్రాంతాన్ని వెతుకుతున్న సమయంలో కిహచిరో అరటాకే అనే డైవర్‌కు ఈ నిర్మాణాలు కనిపించాయి. ఇవి యోనగూని ద్వీపానికి సమీపంలో ఉన్నాయి.

''ఆ దృశ్యాన్ని చూడగానే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అదొక అద్భుత దృశ్యం'' అని కిహచిరో బీబీసీతో అన్నారు.

''నేను వాటిని మొదటిసారి చూసినప్పుడు ఉప్పొంగిపోయాను. ఇది యోనగూని ద్వీపానికి తరగని నిధిగా మారుతుందని నాకు అనిపించింది'' అని కిహచిరో అన్నారు.

జపాన్ దేశపు అట్లాంటిస్

వీటికి జపాన్ దేశపు అట్లాంటిస్‌ అనే పేరు కూడా ఉంది.

పిరమిడ్ ఆకారంలో ఉన్న ఈ నిర్మాణాలు సుమారు 10,000 సంవత్సరాల కన్నా ప్రాచీనమైనవని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

కిహచిరో ఈ నిర్మాణాన్ని గుర్తించిన తరువాత, జపాన్‌లోని ర్యూక్యూ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త మసాకి కిమురా నేతృత్వంలోని బృందం సముద్ర గర్భంలోని ఉన్న ఈ అంతుచిక్కని నిర్మాణాలపై పరిశోధన చేసింది.

ఈ నిర్మాణాలు 10,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి భావిస్తున్నారు.

అయితే, వీటిని మనుషులే నిర్మించారా లేక సహజ సిద్ధంగా ఏర్పడ్డాయా అనే విషయంలో మాత్రం అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.

ఇవి పసిఫిక్‌ తీరంలో వర్ధిల్లి, చాలా సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన ఒక ప్రాచీన నాగరికతకు చెందిన శిథిలాలు అని కొందరు భావిస్తున్నారు.

క్రీస్తు పూర్వం సుమారు 12,000లో జోమోన్ తెగ ప్రజలు జపాన్‌లో నివసించే వారని చెబుతారు. ఈ కట్టడాలు వారికి చెందినవేనని కొందరి అభిప్రాయం.

''అవి సహజంగా ఏర్పడినవేనని కచ్చితంగా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆ నిర్మాణాలపై మానవ ప్రభావానికి సంబంధించి విస్తారమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి'' అని భూవిజ్ఞాన శాస్త్రవేత్త మసాకి కిమురా అన్నారు.

భూవిజ్ఞాన శాస్త్రవేత్త మాకోటో ఒట్సుబో కూడా ప్రకృతిలో మనుషులు నిర్మించినట్లు కనిపించే ఆకారాలు ఏర్పడటం అసహజం ఏమీ కాదని అన్నారు.

భూమి నుంచి సముద్రం లోపలికి నిర్మాణాలు

''ఇవి మనుషులు నిర్మించినవే అనడానికి ఆధారం, ఒక పద్ధతి ప్రకారం నిర్మించినట్లు కనిపించే మెట్లు'' అని డైవర్ కిహాచిరో అరటాకే చెప్పారు.

ఇక్కడ ఉన్న భారీ శిలలు, పలకల మాదిరిగా చెక్కినట్లు కనిపించడం వల్ల ఇవి మానవ నిర్మితాలే అని చాలామంది నమ్ముతున్నారు.

ఉత్తర ఐర్లాండ్‌లో సహజంగా ఏర్పడిన జెయింట్ కాజ్‌వే తరహాలో ఈ నిర్మాణాలు ఉన్నాయని మరికొందరు పరిశోధకులు చెబుతున్నారు.

మిలియన్ల సంవత్సరాల కిందట అగ్నిపర్వతం పేలి మెట్ల ఆకారంలో లావా పేరుకు పోవడం వల్ల ఆ జెయింట్ కాజ్‌వే ఏర్పడింది.

"నేను మొట్టమొదట వీటిని చూసినప్పుడు, ఈ ఆకారాలు భూమిపై కనిపించే నిర్మాణాల మాదిరిగానే ఉన్నాయని అనిపించింది'' అని ర్యూక్యూ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త తకాయుకి ఒగాటా అన్నారు.

''భూమి నుంచి సముద్రం లోపలి వరకు కనిపించే ఇలాంటి నిర్మాణాలను నేనెప్పుడూ చూడలేదు. అందుకే ఇవి నన్ను అమితంగా ఆకర్షించాయి" అని ఆయన చెప్పారు.

ప్రకృతిలో మనుషులు నిర్మించినట్లు కనిపించే ఆకారాలు ఏర్పడటం అసహజం ఏమీ కాదు అని ర్యూక్యూ విశ్వవిద్యాలయానికి చెందిన మరో భూవిజ్ఞాన శాస్త్రవేత్త మాకోటో ఒట్సుబో కూడా అన్నారు.

ఉత్తర ఐర్లాండ్‌లోని జెయింట్స్ కాజ్‌వే సహజ శిల నిర్మాణమేనని, అలాంటివి సముద్రంలో ఏర్పడటం వింత కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

చిత్రమైన ఆకారాలు

యోనగూని నిర్మాణాల గురించి విన్న ప్రొఫెషనల్ డైవర్ కెంజో వతనాబే లాంటివారు చాలామంది అక్కడికి వెళ్లడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

"ఇది పురావస్తు ప్రదేశంగా మారితే ఇకపై అక్కడ డైవింగ్‌కు అనుమతించరని కొందరు చెప్పారు. అందుకే తొందరగా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన చెప్పారు.

''వీటిని చూసిన తరువాత మనిషి సాధించలేనిది ఏదీ లేదని నాకు అనిపించింది. ముఖ్యంగా ఆ చదునైన ఉపరితలాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇవి సహజంగా ఏర్పడినవి అనిపించడం లేదు'' అని అన్నారాయన.

చూడటానికి ఇవి మనుషులు నిర్మించినట్లు కనిపిస్తున్నప్పటికీ, చాలామంది నిపుణులు ఇవి సహజంగా ఏర్పడిన ఆకారాలే అన్న వాదనవైపే మొగ్గు చూపుతున్నారు.

ఇవి ఎలా ఏర్పడ్డాయి అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఔత్సాహిక డైవర్లు మాత్రం ఈ ప్రాంతానికి వెళ్లడానికి, సరికొత్త అనుభూతిని పొందడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Japan: An elusive 'ancient city' in the womb of the sea
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X