US Green Cards : ఆంక్షలు ఎత్తేసిన అమెరికా- ట్రంప్ నిర్ణయానికి బైడెన్ చెక్
తమ దేశంలో గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు అమెరికాలోని జో బైడెన్ సర్కారు శుభవార్త చెప్పింది. అమెరికాలో ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లే విదేశీయులకు గ్రీన్‌కార్డులు ఉదారంగా విషయంలో గతంలో ట్రంప్ సర్కారు విధించిన నిషేధాన్ని బైడెన్ సర్కారు ఎత్తేసింది. దీంతో భారత్, చైనా సహా పలు దేశాలకు చెందిన నిఫుణులు గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది.
కరోనా వైరస్ ప్రభావం కారణంగా అమెరికాలో భారీ ఎత్తున నిరుద్యోగ సమస్య తలెత్తడంతో గతేడాది ట్రంప్ సర్కారు విదేశాల నుంచి వచ్చే వారికి గ్రీన్‌కార్డులు ఉదారంగా ఇచ్చే విధానానికి మంగళం పాడింది. అంతే కాదు వారిపై మరిన్ని ఆంక్షలు కూడా విధించింది. ఇప్పుడు జో బైడెన్ సర్కారు ఆ నిర్ణయాన్నివెనక్కి తీసుకుంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బైడెన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది భారత్ సహా పలు దేశాల నుంచి వచ్చే సాంకేతిక నిపుణులకు మేలు చేయనుంది.

అమెరికాలో ఉన్న విదేశీ నిపుణుల కుటుంబాలను వారితో కలవనీయకుండా చేసేలా ఉన్న ఈ ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు బైడెన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇది అమెరికాలో వ్యాపారాలను సైతం దెబ్బతీసేలా ఉందన్నారు. ఇమ్మిగ్రేషన్ విధానం విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ సమీక్షిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బైడెన్ అన్నట్లుగానే అన్ని హామీల్ని నిలబెట్టుకుంటున్నారు. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాల్ని రద్దు చేసిన బైడెన్.. ఇప్పుడు గ్రీన్‌కార్డు దారులకు వీసాలు ఇచ్చేందుకు వీలు కల్పించారు.
బైడెన్ సర్కారు నిర్ణయంపై భారత్ వంటి దేశాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.