రివర్స్‌లో పాలన: దాని నిర్మాణానికి బ్రేక్: నిధుల్లేవ్: కీలక ఉత్తర్వుల జారీలో బిజీగా బిడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడి పూర్తయింది. జో బిడెన్, కమలా హ్యారిస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధ్యక్షుడి హోదాలో జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్‌తో కలిసి వైట్‌హౌస్‌లో ప్రవేశించారు. ఆ వెంటనే బిడెన్.. ఓవల్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. అప్పటికే సిద్ధం చేసి ఉంచిన.. పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకాలు చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో చోటు చేసుకున్న తప్పులు, లోటుపాట్లను తాను సరి చేస్తానంటూ ప్రకటించిన బిడెన్. దానికి అనుగుణంగానే యాక్షన్‌లోకి దిగారు.
బిడెన్ ప్రమాణ స్వీకారం వేళ.. బాంబు బెదిరింపు: క్షణాల్లో ఖాళీ: ఉలిక్కిపడ్డ వాషింగ్టన్: గార్డ్స్

15 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు..
ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 15 ఎగ్జిక్యూటిివ్ ఆర్డర్లపై బిడెన్ సంతకాలు చేశారు. పారిస్ క్లైమెట్ అకార్డ్, ముస్లింల ప్రవేశంపై నిషేధం ఎత్తివేత, కరోనా మాస్కుల ధారణ తప్పనిసరి చేయడం, ప్రపంచ ఆరోగ్యం సంస్థలో పునఃప్రవేశం, అమెరికన్లకు ఆర్థిక ప్యాకేజీ, విద్యార్థులకు జారీ చేసే రుణాల మంజూరును మరింత సరళతరం చేయడం, మెక్సికో సరిహద్దుల్లో నిర్మించే గోడకు నిధుల మంజూరును నిలిపివేయడం, డెఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరివైల్స్ (డాకా) చట్టం, లింగ సమానత్వం, ఎల్జీబీటీక్యూ హక్కుల పరిరక్షణ, పనిచేసే స్థలాల్లో మహిళలపై లైంగిక దాడులను నిరోధించడాన్ని బలోపేతం చేస్తూ రూపొందించిన మార్గదర్శకాలు ఇవ్వడం వంటివి ఇందులో ఉన్నాయి.

ట్రంప్ పాలనకు భిన్నంగా..
వాటి వివరాలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రకెటరీ జెన్ పిసాకీ వెల్లడించారు. ఈ 15 ఉత్తర్వుల్లో చాలావరకు ట్రంప్ హయాంలో జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయడానికి సంబంధించినవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది, పారిస్ క్లైమెట్ అకార్డ్ నుంచి 2017 నవంబర్‌లో అమెరికా వైదొలగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను జో బిడెన్ రద్దు చేశారు. పారిస్ క్లైమెట్ అకార్డ్‌లో మళ్లీ ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు.

ముస్లిం దేశాల పౌరుల ఎంట్రీపై నిషేధం ఎత్తివేత
ఇదివరకు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ముస్లింల అమెరికా ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేయడానికి ఉద్దేశించిన ఉత్తర్వులపైనా బిడెన్ సంతకం చేశారు. ఇరాన్, ఇరాక్, లిబియా, సొమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాలకు చెందిన ముస్లిం పౌరులెవరూ అమెరికాలో ప్రవేశించే వీలు లేకుండా డొనాల్డ్ ట్రంప్ 2017 జనవరిలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడా నిషేధాన్ని రద్దు చేశారు కొత్త అధ్యక్షుడు. అగ్రరాజ్యంలోకి ప్రవేశించడానికి ఏ దేశ పౌరుడైనా ప్రవేశించవచ్చని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల పట్ల అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ స్వాగతించింది.

మెక్సికో వాల్ నిర్మాణానికి నిధులు నిలిపివేత..
అమెరికా-మెక్సికో మధ్య గోడను నిర్మించడానికి అవసరమైన నిధులను నిలిపివేస్తూ జో బిడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలో మెక్సికన్ల అక్రమ ప్రవేశాన్ని నిరోధించడానికి ఈ రెండు దేశాల మధ్య భారీ గోడను నిర్మించేలా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడా గోడ నిర్మాణ పనులు స్తంభించిపోనున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను మంజూరు చేయడాన్ని నిలిపివేస్తూ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల రద్దును కూడా ఈ జాబితాలో చేర్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చైనా వైపు మొగ్గు చూపేలా వ్యవహరించిందనే కారణంతో ట్రంప్.. నిధుల జారీని నిలిపివేశారు.