• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిమ్‌ జోంగ్‌ ఉన్‌: తాత కిమ్‌ ఇల్‌-సంగ్‌ నుంచి నియంతృత్వాన్ని వారసత్వంగా పొందిన ఉత్తర కొరియా అధినేత

By BBC News తెలుగు
|
ఉత్తర కొరియా మాజీ సుప్రీం నాయకుడు, అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్

అది 1945, అక్టోబర్ 14. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ఓ స్టేడియంలో రెడ్‌ ఆర్మీకి స్వాగతం పలికేందుకు బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

చుట్టూ సోవియట్‌ సైనికాధికారులు నిలబడగా, కిమ్‌ ఇల్‌-సంగ్‌ తొలిసారి బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. అప్పుడాయన వయసు 33సంవంత్సరాలు. ఆ సమయంలో పొట్టిగా కత్తిరించిన జుట్టు, నీలిరంగు సూట్‌తో ప్రసంగం కాపీలను చేతిలో పట్టుకుని బెరుకు బెరుకుగా నిలబడి ఉన్నారు కిమ్‌ ఇల్‌-సంగ్‌.

వాస్తవానికి అది ఆయన సూట్‌ కూడా కాదు. ఈ కార్యక్రమం కోసం ఎవరి నుంచో అరువు తీసుకున్నారు. చూడటానికి చైనీస్‌ డెలివరీ బాయ్‌లాగా ఉన్నారని ఆ సమావేశానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఓ వ్యక్తి వెల్లడించారు.

ఇల్‌-సంగ్‌ కొరియన్‌ భాష కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఆయన తన 33 సంవత్సరాల జీవితంలో 26 ఏళ్లపాటు ప్రవాసంలోనే గడిపారు.

వాస్తవానికి కొరియాకు నాయకత్వం వహించే విషయంలో సోవియట్ రష్యా మొదటి ఆప్షన్‌ చో మన్‌ సిక్‌. ఆయన తర్వాతే కిమ్‌ ఇల్‌-సంగ్‌ తెర మీదకు వచ్చారు.

మొదటి ప్రసంగంలోనే ఆయన అట్టర్ ఫ్లాప్‌ అయ్యారు. కానీ అదృష్టం ఆయన్ను వదల్లేదు. ఎందుకంటే చో మన్‌ సిక్‌ తమ తోలుబొమ్మ కాదని స్టాలిన్‌ బృందానికి త్వరగానే అర్ధమైంది.

కొరియాను పాలించే విషయంలో చో మన్ సిక్‌ రష్యా నాయకత్వం మాటలను ఏమాత్రం వినలేదు. దీంతో కిమ్‌ ఇల్‌-సంగ్‌ తమకు అనుకూలమన్నరష్యా పెద్దలు గుర్తించారు.

దీంతో 1948 సెప్టెంబర్‌ 9న డెమొక్రాటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా ఏర్పడింది. రష్యా ఆశీస్సులతో కిమ్‌ ఇల్‌-సంగ్‌ దాని నాయకుడయ్యారు.

సోవియట్ యూనియన్ పాలకుడు స్టాలిన్

దక్షిణ కొరియా ఆక్రమణ

అప్పట్లో జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నవారితో కలిసి కొరియా పీపుల్స్ ఆర్మీని ఏర్పాటు చేశారు కిమ్‌ ఇల్‌-సంగ్‌.

దక్షిణ కొరియాపై దాడి కోసం స్టాలిన్‌ సాయం పొందటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఉత్తరకొరియాపై దాడి జరిగితేనే స్పందిస్తామని స్టాలిన్‌ ఇల్‌-సంగ్‌కు స్పష్టం చేశారు.

“కిమ్ ఇల్‌-సంగ్‌ విజ్జప్తి చేసిన ఏడాది తర్వాత దక్షిణకొరియాపై దాడికి స్టాలిన్‌తోపాటు మావో కూడా అంగీకరించారు. 1950 జూన్ 25న ఉత్తరకొరియా దళాలు రష్యా తయరీ టి-34 ట్యాంకులతో దక్షిణ కొరియాలోకి ప్రవేశించాయి.

కొద్దిరోజుల్లోనే ఉత్తరకొరియా దళాలు బుసాన్ సమీపంలో కొన్నిప్రాంతాలు మినహా, ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించాయి" అని బ్రాడ్లీ మార్టిన్ తన 'అండర్ ది లవింగ్ కేర్ ఆఫ్ ది ఫాదర్లీ లీడర్' అనే పుస్తకంలో రాశారు.

జనరల్ డగ్లస్ మెక్‌కార్తి, జపాన్‌లో అమెరికా ఆర్మీ కమాండర్

అమెరికా భీకర దాడి

జపాన్‌లో ఉన్న అమెరికా ఆర్మీ కమాండర్‌ జనరల్ డగ్లస్‌ మెకార్తీ ఈ దాడి ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ప్రతీకార చర్యలను ప్రారంభించారు. సియోల్‌కు పశ్చిమాన ఉన్న ఇంచియాన్‌ సమీపంలో అమెరికన్‌ దళాలను రంగంలోకి దింపారు. ఆరు నెలల తరువాత ఉత్తరకొరియా సైన్యాన్ని తిరిగి తమ ప్రాంతాలకు పరిమితం చేయగలిగారు.

ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నాయి. కానీ ఎవరికి స్పష్టమైన విజయం దక్కలేదు.

“హిరోషిమా-నాగాసాకిలపై ఆటంబాంబు దాడి జరిగిన ఐదేళ్ల తర్వాత ఉత్తరకొరియాపై అణుబాంబు ప్రయోగం గురించి మెకార్తీ తీవ్రంగా ఆలోచించారు. కానీ ఆ తర్వాత దాన్ని మానుకున్నారు.

అందుకు బదులుగా టన్నుల కొద్దీ బాంబులను ఉత్తరకొరియాపై జార విడిచారు. రాజధాని ప్యాంగ్యాంగ్‌లోనే 2 లక్షల బాంబులను జారవిడిచారు. అంటే నగరంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక బాంబును వేసినట్లు లెక్క’’ అని 'ది కొరియన్‌ వార్‌- ఎ హిస్టరీ’ అన్న పుస్తకంలో బ్రూస్‌ కమ్మింగ్స్‌ పేర్కొన్నారు.

ఈ విధ్వంసం తర్వాత విజయం సాధించడం అసాధ్యమని గమనించిన ఉత్తరకొరియా, దక్షిణకొరియాలు 1953 జులై 27న కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి.

బాంబు

ప్రజలపై నిఘా

యుద్ధం ముగిశాక కిమ్ ఇల్-సంగ్‌ ఉత్తరకొరియాపై తన పట్టును పెంచుకున్నారు. ఏక పార్టీ కింద సాగిన పాలనలో ప్రజలు ఏం చేయాలి, ఏం చదవాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడికి ప్రయాణించాలిలాంటి విషయాలన్నీ ప్రభుత్వమే నిర్ణయించింది.

“గూఢచారులు ప్రతి ఒక్కరి మీదా నిఘా పెట్టడం ప్రారంభించారు. ఎదురు తిరిగిన వారిని ఉత్తరప్రాంతంలోని కొండల్లోని లేబర్‌ క్యాంపులకు పంపించేవారు.ప్రజల వ్యక్తిగత జీవితంలోకి చొరబడేందుకు భద్రతాధికారులకు పూర్తి అధికారాలు ఉండేవి’’ అని 'ది రియల్ నార్త్‌ కొరియా: లైఫ్‌ అండ్‌ పాలిటిక్స్‌ ఇన్‌ ఏ ఫీల్డ్ స్టాలినిస్ట్‌ ఉటోపియా’ అనే పుస్తకంలో ఆండ్రే లంకోవ్‌ పేర్కొన్నారు.

ఇల్‌-సంగ్‌

తారస్థాయిలో వ్యక్తి పూజ

1955లో ఉత్తర కొరియా భీకరమైన కరువు కోరల్లో చిక్కుకుంది. కనీసం చెప్పులు కూడా లేకుండా పిల్లలు మంచు కొండల్లో వేటకు వెళ్లడం కనిపించేది. ఆర్ధిక సాయం కోసం ఉత్తర కొరియా పూర్తిగా చైనా, సోవియట్‌ యూనియన్‌లపై ఆధారపడింది.

అయితే ఒకపక్క సాయం పొందుతూనే మార్క్స్‌,లెనిన్‌, స్టాలిన్‌లాంటి నేతల విగ్రహాలను, బొమ్మలను క్రమంగా తొలగించడం ప్రారంభించింది. 1954 ఆగస్టు 15న నేషనల్‌ డే సందర్భంగా జరిగిన ఆర్మీడ్రిల్‌లో కమ్యూనిస్టు నేతల చిత్ర పటాలు ఒక్కటి కూడా కనిపించ లేదు. వారి స్థానంలో కిమ్‌ ఇల్‌-సంగ్‌ బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి.

కిమ్‌ ఇల్‌-సంగ్ అడుగు కూడా పెట్టని ప్రాంతాలో ఆయనకు పూజలు మొదలయ్యాయి. ఆయన విశ్రాంతి తీసుకున్న రాళ్లను కూడా పవిత్ర ప్రాంతాలుగా గుర్తించడం మొదలైంది. ఎక్కడ చూసినా కిమ్‌ చిత్రాలే కనిపించేవి.

ఆయన సందేశాలకు అంతులేకుండా ఉండేది. ఆఖరికి ఆయన తేనెటీగల పెంపకం, పళ్లు ఫలాల సాగు, వ్యవసాయ విధానాలను కూడా కిమ్‌ ఇల్‌-సంగ్‌ బోధించడం మొదలు పెట్టారు’’ అని ఉత్తర కొరియాలో రష్యా రాయబారిగా పనిచేసిన వి.ఇవనోవ్‌ రాశారు.

కిమ్ ఇల్ సంగ్ మరణం

చిన్న తప్పులకు పెద్ద శిక్షలు

దేశాధినేత మీద విపరీతమైన అనుకూల ప్రచారంతోపాటు, వ్యతిరేకంగా మాట్లాడినా, తప్పు చేసినా శిక్షలు కూడా విపరీతంగానే ఉండేవి. అధినేతను ఎవరైనా చిన్న మాట అన్నా సహించే పరిస్థితి లేదు.

“ఓ వ్యక్తి కిమ్‌ ఇల్‌-సంగ్‌ ఫొటో ఉన్న పేపర్‌ను తన పుస్తకానికి అట్టగా వేసుకున్నందుకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కిమ్‌ చిత్రపటాన్ని చూసి ఆయన ప్రజలను హింసిస్తున్నారు అని తిట్టినందుకు ఒక రైతును ఏడేళ్లపాటు లేబర్‌ సెంటర్‌కు పంపారు” అని కోల్డ్‌వార్‌ ఇంటర్నేషనల్‌ హిస్టరీ ప్రాజెక్ట్‌ బులిటెన్‌లో ప్రచురితమైన 'న్యూ ఎవిడెన్స్‌ ఇన్‌ ద కోల్డ్‌వార్‌ ఆన్‌ నార్త్‌ కొరియా ఇన్‌ 1956’ అనే వ్యాసంలో పేర్కొన్నారు.

కిమ్ ఇల్ సంగ్

మూడు వర్గాలుగా ప్రజలు

1957లో ఉత్తర కొరియా మొత్తం జనాభాను మూడు భాగాలుగా విభజించారు. దీనికి ప్రమాణం కిమ్‌ పట్ల ఉన్న విధేయతే.“క్లాస్‌ ఆధారంగానే ఉత్తరకొరియాలో ప్రతిదీ నిర్ణయిస్తారు. కుటుంబానికి అందే రేషన్‌ నుంచి, పిల్లల హక్కులు, విద్య, ఉపాధిలాంటి అంశాలన్నీ దీని ఆధారంగానే నిర్ణయిస్తారు.

ఈ క్లాస్‌ వ్యవస్థ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. తమ బంధువులు కొందరు దక్షిణ కొరియా ఉన్నారన్న అపప్రదను ఎదుర్కొంటున్న వారిని పట్నాల నుంచి పల్లెలకు పంపేవారు’’ అని “క్రైసిసెస్‌ ఇన్‌ నార్త్‌కొరియా’’ అన్న పుస్తకంలో ఆండ్రే లంకోవ్‌ రాశారు.

ఇలా రాజకీయంగా నమ్మదగిన వ్యక్తులుకాదన్న అనుమానంతో సుమారు 3లక్షలమందిని ప్యాంగ్యాంగ్‌ నుంచి పల్లెలకు పంపించి వేశారు.

ప్రేమ కథలు, ప్రేమ గీతాలు పాడడం దేశంలో నిషేధం. థియేటర్లను మూసేశారు. శాస్త్రీయ సంగీతాన్ని బ్యాన్‌ చేశారు. విదేశాల నుంచి వచ్చిన అనేక పుస్తకాలను 1968లో స్వాధీనం చేసుకున్నారు.

కిమ్ ఇల్ సంగ్ 20 మీటర్ల ఎత్తైన విగ్రహం

కిమ్‌ ఇల్‌-సంగ్‌ భారీ విగ్రహం

జపాన్‌పై తనకున్న వ్యతిరేకతను ప్రదర్శించడానికి 1956లో ప్యాంగ్యాంగ్‌లో సుమారు 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రివల్యూషనరీ మ్యూజియంను నిర్మించారు.అందులో 12 కిమ్‌ ఇల్‌-సంగ్‌ భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

15 సంవత్సరాల తరువాత దీన్ని 50వేల చదరపు మీటర్లకు విస్తరించారు. మ్యూజియం బయట 20 మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ విగ్రహంలో కిమ్‌ తన నడుముపై చేయి పెట్టుకుని ‌ కనిపిస్తారు. కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహాన్ని చూడగలిగేలా రాత్రి పూట ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు.

ఈ మ్యూజియంలో కిమ్‌ వాడిన గ్లవ్స్‌, బూట్లు, బెల్టులు, టోపీలు, కోటులాంటి అనేక వస్తువులను ఉంచారు. కొన్ని సంవత్సరాలపాటు కిమ్‌ ఇల్‌-సంగ్‌ ప్రజలకు కనిపించడం మానేశారు. కానీ ఆయన చేసిన ప్రకటనలు మాత్రం పత్రికలలో వచ్చేవి.

విద్యార్దులకు సంబంధించిన బయాలజీ పుస్తకమైనా, ఇంజినీరింగ్‌ పుస్తకమైనా అందులో కిమ్‌ ఇల్‌-సంగ్‌ గురించి ఉండాల్సిందే.“దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్‌ చుంగ్‌ హీని హత్య చేయడానికి 1968 జనవరిలో కిమ్‌ ఒక బృందాన్ని దక్షిణ కొరియాకు పంపారు. కానీ అది విజయవంతం కాలేదు.

ఈ ఘటనలో కొంతమంది కమెండోలు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కిమ్‌ ఆదేశాల మేరకు 'పాబ్లో' అనే అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ బోట్‌ను పట్టుకున్నారు.

అందులో ఉన్న 80మందిని 11నెలలపాటు హింసించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులను కిమ్‌ బహిరంగంగా అభినందించారు. కానీ సుదీర్ఘ చర్చల తర్వాత ఆ ఖైదీలను విడుదల చేశాక, తన 12మంది జనరళ్లను పదవుల నుంచి తొలగించారు కిమ్‌.

ఏ నియంతా తన కింద పని చేసే శక్తివంతమైన జనరల్స్‌ను కొనసాగించరు. వాళ్లు ఎంత విధేయులైనా సరే” అని డి-సూక్‌ సు అనే రచయిత తన పుస్తకం 'కిమ్‌ ఇల్‌ సంగ్‌:ది నార్త్‌ కొరియన్‌ లీడర్‌’లో పేర్కొన్నారు.

కిమ్ ఇల్ సంగ్ విగ్రహాలు

కిమ్ ఫొటో ముందు తలవంచే సంప్రదాయం

1972 డిసెంబర్‌లో పార్టీ అధ్యక్షుడిగానే కాక దేశానికి కూడా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు కిమ్‌. దేశంలోని ప్రతి పౌరుడు అతని ఛాతీకి ఎడమవైపున కిమ్‌ ఫొటో ఉన్న బ్యాడ్జ్‌ను ధరించడం తప్పనిసరైంది.

కిమ్‌ 60వ సంవత్సర వేడుకల సందర్భంగా ఫ్యాక్టరీలలో పని చేసే కార్మికులు షిఫ్ట్‌ ప్రారంభమయ్యే ముందు, వెళ్లే సమయంలో ఆయన ఫొటోకు తలవంచి నమస్కరించడాన్ని టీవీలలో చూపించారు. అది సంప్రదాయంగా మారింది.

క్రమంగా ప్రజలు కిమ్‌ ఇల్‌-సంగ్‌ కుమారుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌ పట్ల కూడా విధేయత చూపడం ప్రారంభించారు. కిమ్‌ జోంగ్‌-ఇల్‌ను తన వారసుడిగా ప్రకటించారు కిమ్‌ ఇల్‌-సంగ్‌.

కిమ్ ఇల్ సంగ్

సీనియర్‌ కిమ్‌ మరణం

1994 జూలై 8న తన 82వ ఏట కిమ్‌ ఇల్-సంగ్ మరణించారు. ఆయన మృతి గురించి 34 గంటలపాటు దేశానికి సమాచారం ఇవ్వలేదు.“ఒక గొప్ప హృదయం పని చేయడం మానేసింది’’ అని రేడియో ప్యాంగ్యాంగ్‌ ద్వారా ఆ తర్వాత ప్రకటించారు.

ఉత్తర కొరియాలోని ప్రతి ఆఫీసు, స్కూలు, ఫ్యాక్టరీ ముందు నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించారు. చాలామంది ఏడుస్తూ కనిపించారు.

విమానాలలో పైలట్లు, ఓడల్లో నావికులు ఏడుస్తున్నట్లు టీవీలలో చూపించారు. దేశం మొత్తం 10 రోజుల సంతాపం ప్రకటించారు. ఈ బాధతో స్పృహ తప్పిపడిపోయిన వారి కోసం వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. చాలా రోజులు కిమ్‌ ఇల్‌-సంగ్‌ విగ్రహానికి పూలు సమర్పించే కార్యక్రమం కొనసాగింది.

కిమ్ ఇల్ సంగ్ శవపేటిక

ప్రజలు నిజంగా ఏడుస్తున్నారా, ఏడుస్తున్నట్లు నటిస్తున్నారా అని తెలుసుకోవడానికి నిఘా బృందాలు నిరంతరం రహస్యంగా తిరుగుతూ ఉండేవి.

కిమ్‌ ఇల్‌-సంగ్‌ తర్వాత ఆయన కుమారుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌ అధికారంలోకి వచ్చారు. తన తండ్రికి పెద్ద సమాధి కట్టించారు. ఉత్తర కొరియాలోని ప్రతి నగరంలో ఆయన పేరు మీద పెద్ద పెద్ద టవర్లు నిర్మించారు.“గొప్ప నాయకులు ఎప్పటికీ జీవించే ఉంటారు’’అని వాటి మీద రాశారు.

ప్రస్తుతం కిమ్‌ ఇల్‌-సంగ్‌ మనవడు కిమ్ జోంగ్ ఉన్‌ ఉత్తర కొరియాకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన నియంతృత్వానికి సంబంధించి కూడా అనేక కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kim Jong Un: North Korean leader inherits dictatorship from grandfather Kim Il-sung
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X