వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియాలో ఓ ఫొటోగ్రాఫర్ కథ: ‘నా ప్రాణాలు తీసే బులెట్ ఆ పెన్‌డ్రైవ్’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
Abood Hamam on ruined bridge

సిరియాలో జరుగుతున్న విషయాలపై వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు రహస్యంగా కొన్నేళ్లపాటు అబూద్ హమామ్ కథనాలు పంపించారు. ఆయన అసలు పేరు ఏంటన్నది ఆ సంస్థలకు తెలియదు.

విచిత్రమేంటంటే, ఇటు సిరియా ప్రభుత్వం కోసం పనిచేసిన అనుభవమూ అబూద్‌కు ఉంది. అటు ఇస్లామిక్ స్టేట్ లాంటి మిలిటెంట్ సంస్థకూ ఆయన పనిచేశారు.

అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబానికి ఫొటోగ్రాఫర్‌గా అబూద్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్ విక్టరీ పరేడ్‌ను కూడా ఆయన చిత్రీకరించారు.

అయితే, ఇన్నాళ్లకు ఆయన తన గుర్తింపును బయటపెట్టాలనుకున్నారు. తన సొంత పట్టణం రఖ్కా నుంచి వలసవెళ్లిపోయిన జనాలు తిరిగి రావాలన్న ఆశతోనే ఆయన ఈ పనిచేశారు.

తనను తాను నిర్వచించుకోమన్నప్పుడు అబూద్ హమామ్ నవ్వారు. తొమ్మిదేళ్లు దేశంలో కొనసాగిన యుద్ధం తన వ్యక్తిత్వాన్ని, కనిపించే తీరును మార్చిందని అన్నారు.

''అద్దంలో చూసుకున్నప్పుడు నాకు ఇంత తెల్ల జుట్టు ఉందేంటా ఆని ఆశ్చర్యపోతా. యుద్ధం, ఒత్తిడిలో జీవించడమే దీనికి కారణం’’ అని అబూద్ అన్నారు.

అబూద్ వయసు 45 ఏళ్లు. ఆయన జీవితం ఎప్పుడూ ఓ తాడు మీద నడకే. సిరియాలో జరుగుతున్నదాని గురించి వాస్తవాలను ప్రపంచానికి చెప్పేందుకు సర్వం పణంగా పెట్టి, నిత్యం భయం మధ్య ఆయన బతికారు.

ఈ సంక్షోభ సమయంలో అన్ని ప్రధాన దళాల కింద పనిచేసిన ఫోటో జర్నలిస్ట్ బహుశా ఆయన ఒక్కరే అయ్యుండొచ్చు. అసద్ నియంత్రత్వపాలన, ప్రతిపక్ష ఫ్రీ సిరియన్ ఆర్మీ, జభాత్ అల్ నుస్రా, ఇస్లామిక్ స్టేట్ లాంటి ఇస్లామిస్ట్ సంస్థలు, కర్డుల నియంత్రణలో ఎస్‌డీఎఫ్ ఇలా అన్నింటి కిందా ఆయన పనిచేశారు.

Abood Hamam with tripod

''ఒక చిత్రం మీ ప్రాణం కాపాడగలిగినట్లే, ఒక చిత్రం మీ ప్రాణం తీయగలదు’’ అని అంటారు అబూద్.

తిరుగుబాటు మొదలైన సమయంలో... డమాస్కస్‌పై తిరుగుబాటుదారుల దాడులను రహస్యంగా తాను ఫొటోలు తీసినట్లు తెలిస్తే, రహస్య పోలీసు విభాగం ముఖాబరత్ తనను చంపేస్తుందేమోనని అబూద్ భయపడ్డారు. అప్పట్లో ప్రభుత్వం తిరుగుబాటుదారులకు పెరుగుతున్న సైనిక శక్తిని దాయడంపై దృష్టి పెట్టింది.

ఆ తర్వాత, ఆయన ఫొటోగ్రాఫర్ నైపుణ్యాలే ఆయన్ను ప్రాణాలతో ఉంచాయి. అబూద్ సొంత పట్టణం రఖ్కాను స్వాధీనం చేయసుకున్నాక ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఆయనతో అక్కడ సైనిక పరేడ్‌ను రికార్డు చేయించింది.

రఖ్కాలోని పచ్చటి మైదానాల్లో అబూద్ జీవిత ప్రయాణం మొదలైంది. ఆ మైదానాల ఫొటోలను కూడా ఆయన చాలా తీశారు. అబూద్ తండ్రి అక్కడ వ్యవసాయం చేసేవారు.

''నిజం చెప్పాలంటే, నేను పెరిగిన సమాజం, నా తల్లిదండ్రులు జర్నలిజం, ఫొటోగ్రాఫర్ల పట్ల అంత మెచ్చుకోలుగా ఉండేవాళ్లు కాదు. నేను ఉపాధ్యాయుడినో, న్యాయవాదినో కావాలని ఆశించేవాళ్లు. ఫొటోగ్రాఫర్ అంటే ఓ వెర్రి ఉద్యోగమని అనుకునేవాళ్లు’’ అని అబూద్ అన్నారు.

అబూద్‌కు తొలి కెమెరాను ఆయన అన్న కొనిచ్చారు. అది రష్యాలో తయారైన జెనిట్ కెమెరా. అక్కడి నుంచి అబూద్ ఫొటోగ్రఫీపై ఇష్టం బాగా పెరిగింది.

డమాస్కస్‌లోని స్కూల్ ఆఫ్ ఫొటోగ్రఫీలో అబూద్ చదువుకున్నారు. సిరియా ప్రభుత్వ వార్తాసంస్థ సనాలో ఫొటోగ్రఫీ హెడ్‌ పదవి కూడా పొందారు. ప్రభుత్వ ప్రచార విభాగం ఇది.

ఇదంతా 2011లో తిరుగుబాటు మొదలుకాకముందు.

అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఆయన భార్య అస్మా అధికారిక కార్యక్రమాలను చిత్రించడం కూడా అబూద్ విధుల్లో భాగంగా ఉండేది.

అస్మా బాగా ఒదిగి ఉండే మనిషి అని, సామాన్యులతోనూ బాగా మాట్లాడతారని పేరు సంపాదించుకున్నారు. అయితే, వారి చుట్టూ కెమెరా మెడలో వేసుకుని తిరిగిన అన్ని రోజుల్లో ఆమె గానీ, ఆమె భర్త గానీ తనతో మాట్లాడింది లేదని అబూద్ అన్నారు.

countryside near Raqqa

''అధికారిక కార్యక్రమాల్లో మాలాంటి ఫొటోగ్రాఫర్ల వెంట ఎప్పుడూ సీనియర్ సైనిక అధికారులు, నిఘా అధికారులు ఉండేవారు. నాకు చిరాకు అనిపించేది. వారితో పద్ధతిగా (గౌరవంగా) ఉండాలి. కానీ, అది నా వ్యక్తిత్వం కాదు’’ అని అబూద్ చెప్పారు.

2011లో భారీ నిరసనలు సాయుధ తిరుగుబాటులా మారిన తర్వాత, అబూద్ రెండు రకాల జీవితాలు మొదలుపెట్టారు. పగటిపూట తాను అధికారికంగా తీసే ఫొటోలతో ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచుతుండేవారు. రాత్రి రహస్యంగా ఫ్రీ సిరియన్ ఆర్మీ రాజధానిపై చేసే దాడులను చిత్రీకరించేవారు.

నుర్ ఫురత్ అనే మారుపేరుతో అంతర్జాతీయ వార్తాసంస్థలకు అబూద్ తాను తీసిన చిత్రాలు పంపేవారు. రఖ్కా మీదుగా ప్రవహించే యుఫ్రేటస్ నదిని అరబిక్‌లో ఫురత్ అని పిలుస్తారు. సమయం దొరికినప్పుడు అబూద్ ఆ నది దగ్గర విశ్రాంతి తీసుకునేవారు. ఇప్పటివరకూ తాను తీసిన ఫొటోలను ప్రచురించిన సంస్థలకు తన అసలు పేరు తెలియదని ఆయన అన్నారు.

అయితే, కొన్నాళ్లకు ఆయన జీవితం ప్రమాదకరంగా మారింది.

''అనుమతి లేని ఘటనల ఫొటోలు తీశాక, అవి ఉన్న పెన్ డ్రైవ్‌ను నా జేబులో పెట్టుకుని దొంగతనంగా తీసుకువచ్చేవాణ్ని. ఒకవేళ ఎవరైనా గుర్తిస్తే, నా ప్రాణాలు తీసే తూటా ఆ పెన్‌డ్రైవ్ అనుకునేవాణ్ని’’ అని అబూద్ అన్నారు.

2013లో రఖ్కా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్లింది. సిరియా కోల్పోయిన తొలి ప్రావిన్సు రాజధాని అదే. అబూద్ డమాస్కస్ నుంచి పారిపోయి, ఇంటికి చేరుకున్నారు.

ఫొటోగ్రాఫర్‌గా అక్కడ కూడా జీవితం ప్రమాదకరమైందే. నగరంపై నియంత్రణ కోసం పెనుగాలడుతున్న తిరుగుబాటు దళాలు తనను ప్రభుత్వ ఏజెంటుగా అనుమానించవచ్చని అబూద్ భయపడ్డారు.

2014లో అబూద్ పరిస్థితి మరింత సందిగ్ధంలో పడింది.

Abood Hamam and a girl with some harvested barley

''కార్లు, మోటారు సైకిళ్లు వీధుల్లో నల్ల జెండాలతో తిరుగుతున్నాయి. ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి, 'ఇది కొత్త ఇస్లామిక్ ఖలీఫా రాజ్యం’ అని అన్నారు. నాకు అర్థం కాలేదు. అసలేంటి ఖలీఫా రాజ్యం’’ అని అబూద్ చెప్పారు.

ఇస్లామిక్ స్టేట్ పాలన వచ్చాక, చాలా మంది జర్నలిస్టులు పారిపోయారు. అధ్యక్షుడి దగ్గర పనిచేసిన వ్యక్తైన కారణంగా అబూద్‌కు ఇంకా ప్రమాదం ఎక్కువ. అయితే, ఆయన మాత్రం అక్కడే ఉండిపోయారు. తన పని తాను చేస్తూ పోయారు. ఓసారి చనిపోయిన ఓ ఇస్లామిక్ స్టేట్ సభ్యుడి మొబైల్ ఫోన్‌లో... ఓ రోడ్డు జంక్షన్‌లో అబూద్ నిలబడి ఫొటోలు తీస్తున్న వీడియో రికార్డైంది. ఇది తర్వాత బయటకు వచ్చింది.

ఆ తర్వాత అబూద్‌ను తమ 'విక్టరీ పరేడ్’‌ను చిత్రీకరించాలని ఇస్లామిక్ స్టేట్ అడిగింది. ఇస్లామిక్ స్టేట్ రోడ్లపై తమ సైనిక యంత్రాలు, వాహనాలకు నల్ల జెండాలతో నిర్వహించిన ఊరేగింపు అంది.

ఆ తర్వాత 'ఖలీఫా రాజ్యం’లో అబూద్ మరెన్నో చేయల్సి వచ్చింది. బహిరంగ మరణశిక్షలను మాత్రం తానెప్పుడూ చిత్రీకరించలేదని అబూద్ చెప్పారు. అవి జరిగినప్పుడు బయటకు కూడా వెళ్లేవాడిని కాదని అన్నారు.

''ఇస్లామిక్ స్టేట్‌కు నేను విధేయత ప్రకటించుకోలేదు. ఆ అవసరం కూడా రాలేదు. ఎప్పుడూ స్వతంత్రంగా ఉండేందుకు నేను ఓ వ్యూహం రూపొందించుకున్నా’’ అని అబూద్ చెప్పారు.

Asma al-Assad

ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన రఖ్కాలోని గిరిజన నాయకులతో మంచి సంబంధాలున్న కారణంగా తనను అరెస్టు చేయలేదని అబూద్ అన్నారు. కానీ, 2015లో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ సభ్యులు ఆయన ఇంటి తలుపు తట్టి, పని ఇంకా కొనసాగిస్తే ప్రమాదం తప్పదని అబూద్‌ను హెచ్చరించారు. ఆ ఏడాది చివర్లో ఉత్తర సిరియాలో యుద్ధాన్ని కవర్ చేసేందుకు రఖ్కా నుంచి అబూద్ వెళ్లిపోయారు.

2017 చివర్లో మళ్లీ రఖ్కాకు అబూద్ తిరిగివచ్చారు. అప్పటికి అమెరికా నేతృత్వంలోని ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేక కూటమి బాంబుల దాడులతో నగరానికి విముక్తి కల్పించింది. కానీ, నగరం దాదాపుగా శిథిలమైపోయింది.

''మొదటి రోజు నేను మౌనంగా ఉన్నా. మాట్లాడేందుకు నా దగ్గర ఏమీ లేదు. అది నేను కాదు. రెండో రోజు బయటకు వెళ్లి, ఫొటోలు తీయడం మొదలుపెట్టా. ఏడవడం మొదలుపెట్టా. వీధుల్లో తిరుగుతూ ఏడుస్తూ ఉన్నా’’ అని అబూద్ చెప్పారు.

మెడలో కెమెరా వేసుకుని, రఖ్కా శిథిలాల మధ్య కొన్ని నెలలపాటు ఆయన తిరిగారు.

''శిథిలమై, మౌనం ఆవహించిన వీధులను, కుదేలయిపోయిన కుటుంబాలను చూశా. నగరానికి నేను ఓ సంరక్షకుడినైట్లు అనిపించేది’’ అని అబూద్ అన్నారు.

రఖ్కాలో 80 శాతం నివాసయోగ్యం కాకుండా పోయిందని, నగర జనాభాలో దాదాపు 90 శాతం మంది వేరే చోట్లకు వలసవెళ్లిపోయారని ఐరాస చెబుతోంది.

2012 Damascus attack victim

''నేను తీసిన చిత్రాలన్నింటిలో నన్ను బాగా బాధించింది ఓ అపార్టుమెంటు భవనం చిత్రం. గోడలు పేలిపోయి, ఓ మహిళ డ్రెస్ ఓ గది నుంచి బయటకు వేలాడం అందులో ఉంది. సాధారణంగా మహిళ ఇంటి లోపల ఉన్నప్పుడు వేసుకునే డ్రెస్ అది. ఆ కుటుంబం ఇప్పుడు అక్కడ లేదు. సంతోషం లేదు. ఆ డ్రెస్ మాత్రం వేలాడుతూ ఉంది. గాలికి అది అలా ఊగుతూ, వేలాడుతూ ఉన్న కొద్దీ, నాకు ఎవరో ఉరితాడుకు వేలాడుతూ, ప్రాణాల కోసం విలవిలలాడుతున్నట్లు అనిపించింది’’ అని అబూద్ అన్నారు.

నెమ్మదిగా నగరంలో జనజీవనం కుదురుకుంటున్నకొద్దీ, అబూద్ ఫొటోల్లో రంగులు కనిపించడం మొదలైంది. తెరుచుకున్న దుకాణాలు, యుఫ్రేటస్ నదిలో స్నానం చేస్తున్నవారు... ఇలా కళ తిరిగివచ్చింది.

చివరికి అబూద్ చీకటి నుంచి వెలుగులోకి రావాలనుకున్నారు. తన ఫొటోలను చూపించాలనుకున్నారు. తన నిజం పేరుతో 'అబూద్ : వితౌట్ బారియర్స్’ అనే ఫేస్‌బుక్ పేజీ మొదలుపెట్టారు. రఖ్కాను విడిచివెళ్లినవారు తిరిగివచ్చేలా చేయడం ఆయన లక్ష్యం.

''నా నగరానికి జరిగిన అన్ని చెడ్డ విషయాలకు ఎదురుగా ఇదొక అరుపు లాంటిది. ఎక్కడో ఉన్న రఖ్కా పౌరులకు, మన నగరాన్ని ఇప్పుడు మరో కోణంలో చూడండని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. ఇదివరకు బూడద రంగులో ఈ నగరం కనిపించి ఉండొచ్చు. కానీ రఖ్కా రంగుల్లో ఎలా ఉంటుందో గుర్తు చేసుకోండి. రఖ్కాను మళ్లీ ప్రేమించండి. ఇక్కడికి తిరిగిరావడం గురించి ఆలోచించండి. నేను తీసిన చాలా విచారకరమైన ఫొటోల్లోనూ మీకు బతుకుకు సంబంధించిన మంచి విషయమేదో కనిపిస్తుంది’’ అని అబూద్ అన్నారు.

మంచి కాంతివంతంగా ఉన్న దుస్తుల్లో సిగ్గుపడుతూ, నవ్వుతూ పండ్లున్న ఓ ప్లేటును పట్టుకున్న ఓ అమ్మాయి ఫొటో అబూద్ తీశారు. దీని పట్ల ఆయన గర్వపడుతుంటారు.

నల్ల జెండాలు ఎగరేస్తున్న జనం

సౌదీ అరేబియాకు వలసపోయి, తిరిగి రఖ్కాలోని కుటుంబాన్ని చేరుకున్న ఓ వ్యక్తి కూతురిది ఆ ఫొటో. ఆ వ్యక్తి స్థానికంగా పాఠశాల పునర్నిర్మాణానికి సాయపడ్డారు. అబూద్ ఫొటోలను ఆన్‌లైన్‌లో చూసిన తర్వాత, ఆయన ఈ పని చేశారు. తన ఫేస్‌బుక్ పేజీ కారణంగా ఇంకొందరు కూడా రఖ్కాకు తిరిగివచ్చారని అబూద్ చెబుతున్నారు.

అయితే, అబూద్ ఇప్పుడు తనకు ఇష్టమైన రఖ్కాలో లేరు. నగరం విడిచివెళ్లవద్దని ఆయన తీర్మానించుకున్నా, ఆయనలో ఉన్న జర్నలిస్టు ఆగలేదు. ఇప్పుడు ఉత్తర సిరియాలో టర్కీ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న సంక్షోభాన్ని ఆయన కవర్ చేస్తున్నారు.

ఇప్పుడు ఆయన రఖ్కాకు తిరిగి వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రస్తుతం రఖ్కాను పాలిస్తున్న కర్డుల ఆధిపత్యమున్న ఎస్‌డీఎఫ్ (సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్) తనను టర్కీ ఏజెంటుగా అనుమానిస్తుందేమోనని భయపడుతున్నారు.

అబూద్ ఎన్నో క్రూర దళాలను చూశారు. అతివాదుల చెర నుంచి రఖ్కాను పాశ్యాత్య మిత్రపక్షాలతో కలిసి ఎస్‌డీఎఫ్ విడిపించింది. కానీ, దాని కింద పనిచేయడం కూడా ప్రమాదమేనని అబూద్ భావిస్తున్నారు.

సిరియాలో తాను చేస్తున్న ఉద్యోగం కారణంగా, ఎప్పుడూ భయం నీడలో బతకాల్సిందేనని అబూద్‌కు చెప్పే సంకేతం కావొచ్చు అది.

''ఈ మొత్తం సమయంలో నేను సంతోషంగా ఉన్న క్షణాలేవీ నాకు గుర్తులేవు. ఓసారి వైమానిక దాడులను కవర్ చేయడానికి వెళ్లా. మృతుల్లో నా దగ్గరి బంధువు ఉన్నాడని తెలిసింది. నేను తీసిన వీడియో చూస్తే, అతడి శవం కనిపించింది. ఇలాంటివే నాకు గుర్తున్నాయి’’ అని అబూద్ అన్నారు.

''ఇప్పుడు నాకు 45 ఏళ్లు. యుద్ధం కారణంగా ఇంకా పెళ్లి చేసుకోలేదు. భార్య లేదు. కుటుంబం లేదు. ఇది బాధాకారమే’’ అని చెప్పారు.

''ఒక వేళ నా చేతిలో ఈ కెమెరా లేకపోతే, నేను తుపాకీ పట్టుకునేవాడిని. నేను ఆయుధాలకు వ్యతిరేకమే, కానీ యుద్ధ సమయంలో నేను ఒక సాధారణ పౌరుడిగా ఉంటే, నాపైన దాని ప్రభావం తక్కువగా ఉండేది’’ అని అన్నారు.

''సిరియాలో ఏం జరుగుతుందో నేను ఫొటోలు తీస్తూ వెళ్తా. అది బాధైనా, సంతోషమైనా. అందరూ చూడాలని నేను కోరుకుంటా. అవకాశం ఉంటే, ప్రశాంతమైన ప్రాంతంలో వన్యప్రాణుల ఫొటోలు తీయాలనుకుంటున్నా. స్విట్జర్లాండ్‌కు వెళ్లాలని నేను కలలు కనేవాణ్ని. నాకు ఆ ప్రశాంతత కావాలి’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Syrian Photographer finally reveals himself
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X