• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లెబనాన్: ట్రెక్కింగ్‌తో ఐక్యత సాధిస్తున్న దేశం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

దశాబ్దాల అంతర్యుద్ధం లెబనాన్ ప్రకృతి సౌందర్యాన్ని, ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది.

కానీ, ఇప్పుడు ఆ దేశం మళ్లీ పుంజుకుంటోంది. తమ గురించి, తమ దేశం గురించి అంతర్జాతీయ పర్యటకులకు తెలియజెప్పడానికి ట్రెక్కింగ్‌ను ఒక సాధనంగా వాడుకుంటోంది.

lebanon

బేరూత్ నగరాన్ని దాటి, తీర ప్రాంత రహదారిపై మెల్లగా కొండల మీదకు ఎక్కుతుంటే ఓ పక్క మధ్యధరా సముద్రం తళుకులు, మరోపక్క ఎత్తుపల్లాలతో కూడిన కొండలు.. ప్రకృతి మనోహరంగా ఉంటుంది.

అక్కడి నుంచి మరో మలుపు తీసుకుని, కొండలపైన ఇరుకు దారిలో ప్రయాణిస్తే ఉత్తర కౌరా జిల్లాకు చేరుకుంటాం. అక్కడంతా ఎర్ర పెంకులతో పైకప్పులు, డాబాలు ఉన్న ఇళ్లు దర్శనమిస్తాయి.

కౌరాలో ఆలివ్, పండ్ల తోటలు, స్థానిక ఆలయాలు చూసుకుంటూ ముందుకెళితే, అక్కడ ఒక గుహలో రోమన్ ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ ఒక సాధువును కొలుస్తారు. తన తండ్రితో పాటు మఠంలో చేరేందుకు ఒక మహిళ, పురుషుడిగా మారువేషం వేసుకుంటారు. సాధువు రూపంలో ఉన్న ఆ మహిళనే ఈ ఆలయంలో పూజిస్తారు.

సిమెంట్ పరిశ్రమ కోసం మైనింగ్ చేసిన గుర్తులు కూడా ఆ పక్కనే కనిపిస్తాయి.

తరువాత, బిషారిలో పురాతన దేవదారు అడవుల గుండా ప్రయాణిస్తే అర్జ్ గ్రామానికి చేరుకుంటాం.

అక్కడి నుంచి కాలిబాటన 3,000 మీటర్ల ఎత్తున్న దహర్ అల్ ఖదీబ్ శిఖరం చేరుకోవచ్చు. లెబనాన్‌లో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఇది ఒకటి.

అర్జ్ గ్రామంలో మహిళలు మనకీష్ అనే స్థానిక లెబనాన్ వంటకం వండుతారు. బ్రెడ్ పైన చీజ్ లేదా థైమ్, నువ్వులు, మూలికలు కలిపిన పొడి చల్లి ఈ పదార్థాన్ని తయారుచేస్తారు.

ట్రెక్కింగ్ వీరుడు మౌఫారెజ్

ఏటవాలుగా ఉన్న సున్నపురాయి శిఖరం ఎక్కుతుంటే చిన్నవాళ్లు కూడా అలిసిపోతారుగానీ 77 ఏళ్ల మిషెల్ మౌఫారెజ్‌కు మాత్రం అలుపు రాదు. ఆయన అక్కడ స్థానిక గైడుగా వ్యవహరిస్తున్నారు.

మౌఫారెజ్‌కు లెబనాన్‌లో తెలియని ప్రదేశం లేదు. అయితే, ఆయనకు పుట్టుకతో వచ్చిన ఆరోగ్య సమస్యల వలన రెండు చేతులూ సరిగ్గా పనిచేయవు. కానీ, ఆయన కాళ్లకున్న బ్యాలన్స్ అద్భుతమైనది.

పర్వతంపైకి చేరుకున్న తరువాత, కిందకు చూస్తే బెకా లోయలోని మైదానాలు, సరస్సులు కనువిందు చేస్తాయి.

లెబనాన్‌లో ఏ కొండ ఎక్కడం ఇష్టమని అడిగితే మౌఫరెజె చెప్పలేదుగానీ ఈ పర్వతం అంటే ప్రత్యేకమైన అభిమానమని ఆయన మాటల ద్వారా తెలిసింది.

"దేవదారు వృక్షాలు విస్తరించి ఉన్న ప్రాంతం, ఎత్తైన పర్వతాల వరుసలు ఉన్న ఈ ప్రాంతం నాకు చాలా ప్రత్యేకమైనది. ఇక్కడి స్వచ్ఛమైన గాలి, మట్టి రంగు, కొండపై నుంచి విశాలంగా కనిపించే ప్రపంచం.. ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది" అని మౌఫారెజ్ చెప్పారు.

1997లో లెబనాన్ దేశంలో మొట్టమొదటి పర్యావరణ పర్యటక సంస్థ లిబాన్ ట్రెక్‌ను స్థాపించారు మౌఫారెజ్. అప్పటి నుంచి ఆయన అక్కడకు వచ్చే హైకింగ్ సమూహాలకు గైడుగా దారి చూపిస్తున్నారు.

అంతకుముందు కూడా అక్కడ కొన్ని హైకింగ్ గ్రూపులు ఉన్నప్పటికీ, ఆ దేశంలో 15 ఏళ్ల పాటు సాగిన అంతర్యుద్ధం (1975-1990) కారణంగా స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండేది కాదు.

అయితే, అంతర్యుద్ధం ముగిసిన తరువాత కూడా హైకర్లకు భయం తగ్గలేదు. దారులు సరిగ్గా లేకపోవడం, పేలని ల్యాండ్‌మైన్లు ఉంటాయన్న భయంతో అనుభవజ్ఞులైన గైడుల సహాయం తీసుకోవలసి వచ్చింది.

లెబనాన్ మౌంటైన్ ట్రైల్ నిర్మాణం

లిబాన్ ట్రెక్‌ను ప్రారంభించిన ఎనిమిదేళ్ల తరువాత, లెబనాన్ మౌంటైన్ ట్రైల్ (ఎల్ఎంటీ)ని రూపొందించడంలో మౌఫారెజ్ కీలక పాత్ర పోషించారు.

దేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు విస్తరించి, 75 కన్నా ఎక్కువ గ్రామాలను కలుపుకుంటూ వెళ్లే 470 కిలోమీటర్ల మార్గం ఇది.

అమెరికాలో ఉన్న అపలాచన్ మార్గం ప్రేరణతో రూపొందించిన ఈ మార్గం లెబనాన్ పర్వతాల సహజ సౌందర్యం, సాంస్కృతిక సంపదకు అద్దం పడుతుంది.

అంతేకాకుండా, ఒక చిన్న మధ్యధరా దేశాన్ని అంతర్జాతీయ హైకింగ్ మ్యాప్‌పై ఠీవిగా నిలబెట్టింది.

లెబనాన్ భూభాగం గురించి తనకున్న పరిజ్ఞానం, పాత ఆర్మీ మ్యాపుల సహాయంతో మౌఫారెజ్ ఈ మార్గానికి పునాది వేయడంలో సహాయపడ్డారు.

2007లో ఈ మార్గం తెరుచుకున్న తరువాత ఎల్ఎంటీ అసోసియేషన్‌కు తొలి ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు.

లిబాన్ ట్రెక్, ఎల్ఎంటీ ద్వారా సరికొత్త హైకింగ్ సంస్కృతిని నిర్మించే పనిలో ఉన్నారు మౌఫారెజ్.

ఉత్తర అక్కర్ జిల్లాలోని ఓక్ చెట్లు, పైన్ అడవుల దగ్గర నుంచి, బెకాలోని ద్రాక్ష తోటలు, సరస్సులు, ఖాదిషా లోయలోని మఠాలు, ప్రార్థనా మందిరాల వరకు. దేశంలోని విభిన్న ప్రాంతాల ప్రకృతి రమణీయతను లెబనీస్ ప్రజలకు, అంతర్జాతీయ పర్యటకులకూ చూపించడమే ఆయన లక్ష్యం.

అంతేకాకుండా, దేశంలోని ఛిన్నాభిన్నమైన జాతుల గురించి తెలియజెప్పడం, ఒకరికొకరిని పరిచయం చేయడం కూడా ఆయన లక్ష్యంలో భాగమే.

"హైకింగ్‌ను స్థానిక కమ్యూనిటీలకు లింక్ చేయడం మౌఫారెజ్ చేసిన ఒక మంచి పని. హైకింగ్ మార్గం మధ్యలో గెస్ట్‌ హౌసులు ఏర్పాటు చేద్దామన్న ఆలోచన కూడా అయనదే" అని ప్రస్తుత ఎల్ఎంటీ ప్రెసిడెంట్ ఒమర్ సక్ర్ చెప్పారు.

ఇవాల్టికీ మౌఫారెజ్ రూపొందించిన హైకింగ్ ప్రణాళికనే ఎల్ఎంటీ అసోసియేషన్ అనుసరిస్తోంది. హైకర్లు పగటి పూట హైకింగ్ చేస్తూ, రాత్రిళ్లు గెస్ట్ హౌసుల్లో విశ్రాంతి తీసుకుంటూ, స్థానికుల ఇంటి భోజనం చేస్తూ ముందుకు సాగుతారు.

'మాకు తెలియని మా దేశాన్ని చూస్తున్నాం'

బేరూత్‌లో క్రైస్తవులు ఎక్కువగా ఉండే మట్న్‌లో పుట్టి పెరిగిన రఫిక్ సాలిబా సుమారు 20ఏళ్ల క్రితం మౌఫారెజ్ హైకింగ్ గ్రూపులో చేరారు.

లిబాన్ ట్రెక్‌లో చేరిన తరువాత ఉత్తర అక్కర్ జిల్లాలోని కొండలు, లోయలతో ప్రేమలో పడిపోయానని, సున్ని ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలోని స్థానికులతో తాను సులువుగా కలిసిపోగలిగానని, వారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని రఫిక్ అంటారు.

ఇలాంటి కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ సందర్శకులకు లెబనాన్‌ను చూపించడమే కాకుండా, యుద్ధం కారణంగా దూర దూరంగా ఉండిపోయిన లెబనాన్‌ ప్రజలను ఒకరికొకరిని పరిచయం చేస్తున్నారు మౌఫారెజ్.

"విభిన్న వర్గాలతో కలిసి జీవించడం వలన వారి గురించి మరింత తెలుసుకోగలుగుతాం. వేరే ఎవరో చెప్పింది వినకుండా మనంతట మనమే తెలుసుకోగలుగుతాం" అని రఫిక్ అన్నారు.

వేల్స్‌లో సగం ఉన్న లెబనాన్, చిన్నదేశమైనా విభిన్న జాతులకు పుట్టినిల్లు. దేశ జనాభాలో సున్ని ముస్లింలు, షియా ముస్లింలు, క్రిస్టియన్లు, ప్రభుత్వం గుర్తించిన మరో 18 భిన్న వర్గాలవారు ఇంచుమించు సమాన సంఖ్యలో ఉంటారు.

ఈ విభజన దేశ అంతర్యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించింది. అంతర్యుద్ధం ముగిసి 30 ఏళ్లకు పైనే గడిచినా వీటిల్లో చాలా వర్గాలు ఇంకా ఉనికిలో ఉన్నాయి.

అంతర్యుద్ధం వలన తాము పుట్టిన ప్రాంతం తూర్పు బేరూత్‌కు మాత్రమే పరిమితమైపోయామని, కనీసం పశ్చిమ బేరూత్‌కు వెళ్లే అవకాశం కూడా ఉండేది కాదని లిబాన్ ట్రెక్‌లో తరచూ హైకింగ్‌కు వెళ్లే జోయెల్ రిజ్క్ చెప్పారు.

ఇప్పుడు వారానికోసారి మౌఫారెజ్‌తో ట్రెక్కింగ్‌కు వెళ్లే జోయెల్ దేశంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

దానివల్ల, తన దేశంపై తనకు మరింత ప్రేమ పెరిగిందని ఆమె అన్నారు.

"లెబనీస్‌గా పుట్టినందుకు నేనెప్పుడూ విచారించేదాన్ని. మాకు యుద్ధం, కష్టాలు తప్ప మరేవీ లేవని బాధపడేదాన్ని. కానీ, ఇప్పుడు లెబనీస్ అయినందుకు గర్వపడుతున్నాను. హైకింగ్ వల్లే నాలో ఈ మార్పు వచ్చింది" అని జోయెల్ చెప్పారు.

చిన్నప్పటి నుంచే ట్రెక్కింగ్‌పై ఆసక్తి

ట్రెక్కింగ్‌పై చిన్నతనంలోనే తనకు ఆసక్తి కలిగిందని, ఎత్తైన కొండలు, శిఖరాలు విశేషంగా ఆకర్షించేవని మౌఫారేజ్ చెప్పారు.

1970లలో 'లే క్లబ్ డెస్ వియెక్స్ సెంటియెర్స్' అనే హైకింగ్ గ్రూపులో చేరారు. 1975లో అంతర్యుద్ధం తీవ్రతరమైనప్పటికీ ఈ సమూహం ట్రెక్కింగ్ ఆపలేదు.

"యుద్ధ సమయంలో ఎక్కడికి వెళ్లడానికి వీలుంటే అక్కడికి వెళ్లేవాళ్లం. ఉదయం పూట కొండలెక్కి, రాత్రికి తిరిగొచ్చేసేవాళ్లం. బేరూత్‌లో బాంబు దాడులు, షెల్లింగ్ విపరీతంగా జరిగాయి. కానీ, అవేమీ మా దృష్టికి రాకుండా ట్రెక్కింగ్ కాపాడింది" అని ఆయన చెప్పారు.

యుద్ధం ముగిసిన ఏడేళ్ల తరువాత 1997లో ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగం వదిలేసి హైకింగ్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు మౌఫారేజ్. అప్పుడే లిబాన్ ట్రెక్ సంస్థను స్థాపించారు.

లిబాన్ ట్రెక్ నిర్వహించే ట్రెక్కింగులు తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యాయి.

ఎల్ఎంటీ రాకముందు హైకింగ్ మార్గం సులువుగా తెలిసేది కాదు. మౌఫారేజ్, ఇతర గైడుల సహాయంతో హైకింగ్ గ్రూపులు ముందుకు సాగేవి.

మౌఫారెజ్‌కు సోషల్ మీడియాలో చాలామంది అభిమానులే ఉన్నారు. ఒకసారి ఆయనతో ట్రెక్కింగ్‌కు వెళ్లినవారు లిబాన్ ట్రెక్‌ను విడిచి వెళ్లలేరని అంటారు.

"మౌఫారేజ్ లెబనాన్ మొత్తాన్ని ఒకే జాతిగా చూస్తారు. ఆయనకు ఈ దేశం గురించి అపారమైన జ్ఞానం ఉండడమే కాకుండా ఎక్కడైనా ఎవరితోనైనా సులువుగా కలిసిపోగలరు. గొర్రెల కాపరి అయినా, సైనికుడైనా ఆయనే ముందు వెళ్లి మాట్లాడతారు. ఆయనతో వెళ్తే భద్రత ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు, అందరూ తెలుసు. నేను ఆయనకు రుణపడి ఉన్నాను" అని 2000లలో లిబాన్ ట్రెక్‌లో చేరిన నార్బర్ట్ షిల్లర్ చెప్పారు.

'లెబనాన్‌ను అంతర్జాతీయ హైకింగ్ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యం'

2019 చివరలో ప్రారంభమైన నిరసనలు, ఆర్థిక సంక్షోభం, తరువాత 2020లో మొదలైన కరోనావైరస్, బేరూత్ పోర్ట్ పేలుడుకు ముందు అంతర్జాతీయ హైకర్లకు లెబనాన్ ఇష్టమైన ప్రదేశంగా మారిందని, హైకింగ్‌కు బాగా ప్రాచుర్యం పొందిందని ఎల్ఎంటీ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

అంతర్జాతీయ హైకర్లు లెబనాన్‌కు ఎందుకు రావాలని అడిగితే మౌఫారేజ్ పెద్ద చిట్టా విప్పుతారు.

ఇక్కడ ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, స్థానిక వంటకాలు, లెబనీస్ ప్రజల ఆతిథ్యం, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయని చెబుతారు.

"హైకింగ్‌కు లెబనాన్ చాలా మంచి ప్రదేశం. నేనైతే అద్భుతమైన ప్రాంతమని చెప్తాను. దీన్ని అంతర్జాతీయ హైకింగ్ డెస్టినేషన్‌గా మార్చడమే నా లక్ష్యం" అంటూ మౌఫారెజ్ ముగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Lebanon: A country united with trekking
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X