వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిబియా: తవ్వినకొద్దీ శవాలు.. 350కిపైగా హత్యలు చేసిన ఏడుగురు అన్నదమ్ములు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కాని బ్రదర్స్

లిబియా రాజధాని ట్రిపోలి నుంచి గంట సేపు ప్రయాణిస్తే టర్హునా చేరుకుంటాం. అక్కడున్న ఓ వ్యవసాయ క్షేత్రానికి ఏడు నెలలుగా తెల్లని రక్షక సూట్లు ధరించిన కార్మికులు వస్తూపోతూ ఉన్నారు.

ఎర్రని నేలపై ఎరుపు, తెలుపు రంగున్న టేపుతో దీర్ఘ చతురస్రాకారంతో గుర్తులు వేశారు.

ఈ గోతుల నుంచి ఇప్పటి వరకు 120 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా అక్కడ చాలా ప్రాంతాన్ని తవ్వాల్సి ఉంది.

"కొత్త మృత దేహాన్ని వెలికితీసిన ప్రతిసారీ దానిని చాలా సున్నితంగా పట్టుకుంటాను. ఒక్క ఎముక విరిగినా ఆత్మకు నొప్పి కలుగుతుందని మేము నమ్ముతాం" అని అక్కడ పని చేస్తున్న కార్మికుడు వాదా అల్ కీష్ అన్నారు.

కొన్ని మృతదేహాలు నిరుడు వేసవిలో టర్హునా చుట్టు పక్కల చోటు చేసుకున్న లిబియా పౌర యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన యువ సైనికులవిలా అనిపిస్తున్నాయి. కానీ, చాలా వరకూ మృత దేహాలు సాధారణ పౌరులవే. ఐదేళ్ల లోపు పిల్లల మృతదేహాలు కూడా వీటిలో ఉన్నాయి.

వీరంతా దారుణమైన హింసకు గురై మరణించినట్లుగా అనిపిస్తోంది.

కాని అనే కుటుంబం తయారుచేసుకున్న మిలీషియా (ముఠా) ద్వారా అక్కడ ఎనిమిదేళ్ల పాటు సాగించిన హింసాత్మక పాలనకు ఆ సమాధులు ఒక సాక్ష్యం.

'కాని’ కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు. పేర్లు... అబ్దుల్ ఖలీఖ్ , మహమ్మద్, మువమ్మర్ , అబ్దుల్ రహీమ్, మోహ్సెన్ , అలీ, అబ్దుల్ అధీమ్. వీళ్లు సాధారణ వ్యక్తులు కాదు.

ఈ ఏడుగురిలో ముగ్గురు ఇప్పటికే మరణించారు. మిగతావారు లిబియా నుంచి 2020 జూన్‌లో పారిపోయారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన లిబియా ప్రభుత్వ అనుకూల శక్తులు కొన్ని వారికి సహకరించినట్లు చెబుతారు.

కానీ, ఇప్పటికీ టర్హునా ప్రజలు మాత్రం ఆ అన్నదమ్ములు చేసిన నేరాల గురించి మాట్లాడాలంటే మాత్రం భయపడిపోతారు.

వారి మద్దతుదారులు ఇప్పటికీ చాలా మందిని బెదిరిస్తూ ఉంటారని కొంత మంది చెబుతారు.

మహమ్మద్, మోహ్సెన్, అబ్దుల్ రహీమ్

2011లో లిబియా నియంతృత్వ పాలకుడు గడాఫీకు వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటు తర్వాత చోటు చేసుకున్న అల్లర్లను ఒక పేద కుటుంబం తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకుందో 'కాని’ కుటుంబం గురించి తెలిసిన వారు చెబుతారు. అక్కడి సమాజాన్ని ఆ కుటుంబం నిరంకుశంగా ఎలా పాలింంచిందో వివరిస్తారు.

"ఆ ఏడుగురు అన్నదమ్ములు నైతిక విలువలు లేని కఠినాత్ములు. వారికసలు సాంఘిక హోదా కూడా లేదు" అని న్యాయవాది, సామాజిక కార్యకర్త హంజా దిలాబ్ చెప్పారు. 2011కు ముందు ఆయన వారిని కొన్ని వివాహ ఉత్సవాల్లో కలిశారు.

"వాళ్లంతా కలిస్తే... శవాలను పీక్కుని తినే హైనాల్లా ఉంటారు. వాళ్లలో వాళ్లు ఒకరితో మరొకరు గొడవలు కూడా పడతారు. కర్రలతో కొట్టుకుంటారు" అని ఆయన చెప్పారు.

లిబియాలో విప్లవం వచ్చినప్పుడు టర్హునాలో చాలా మంది ప్రజలు గడాఫీకి మద్దతు పలికారు. ఆయన కూడా ఆ పట్టణ ప్రజలలో చాలా కుటుంబాల వారికి భద్రతా దళాలలో ఉద్యోగావకాశాలు కల్పించి తన అభిమానం చూపించుకున్నారు.

కాని కుటుంబం విప్లవకారులకు మద్దతు పలికిన వారిలో ఒకరు. కానీ, ఆదర్శభావాలతో వారు ఆ పని చేయలేదని దిలాబ్ అన్నారు.

''కాని కుటుంబానికి తమ బంధువులతో 30 ఏళ్లుగా వైరం ఉంది. ఆ బంధువులు గడాఫీ మద్దతుదారులు కావడంతో వారికి వ్యతిరేకంగా వీరు తిరుగుబాటుదారులకు మద్దతు తెలిపారు’’ అని ఆయన చెప్పారు.

గడాఫీని పదవి పోయిన తర్వాత ఈ అన్నదమ్ములకు అవకాశం దొరికినట్టైందని, నెమ్మదిగా వారి బంధువుల కుటుంబాలను హత్య చేయించారని దిలాబ్ అన్నారు.

వీటికి ప్రతీకార హత్యగా కాని అన్నదమ్ములలో ఆఖరి వాడైన అలీ 2012లో హత్యకు గురయ్యాడు.

"అలీ ఈ ఏడుగురిలో అందగాడు. మరణించిన తర్వాత అతడిని గొప్ప చారిత్రక వ్యక్తి అన్నట్లుగా వీళ్లు ప్రచారం చేశారు" అని కాని కుటుంబం చరిత్రపై అధ్యయనం చేసిన జలేల్ హర్చౌ చెప్పారు. ఆయన నెథర్లాండ్స్‌లోని క్లింగెన్డేల్ ఇన్స్టిట్యూట్‌లో లిబియా వ్యవహారాల నిపుణుడిగా ఉన్నారు.

"కాని కుటుంబం తమ తమ్ముడి హత్యకు కారణమైన వారినే కాదు, వారి వారి కుటుంబాలను కూడా హతమర్చి తమ ప్రతీకారం తీర్చుకుంది" అని ఆయన చెప్పారు.

అలీ

"నెమ్మదిగా కాని అన్నదమ్ములు పట్టణంలో కొన్ని వేల మంది పోరాటకారులతో కలిసి తమకంటూ ఒక సొంత మిలీషియాను ఏర్పాటు చేసుకున్నారు. లిబియాలో ఉన్న చాలా మిలీషియాలలాగే, వీరికి కూడా ప్రభుత్వ నిధులు సమకూరేవి. ఇక ప్రతీకారం తీర్చుకునే దశ నుంచి టర్హునాలో తమ పూర్తి అధికారాన్ని నిలబెట్టుకునేలా ఈ అన్నదమ్ములు ఒక ముద్ర వేసుకున్నారు" అని జరేల్ వివరించారు.

"ప్రజలను భయోత్పాతానికి గురి చేయడమే వారి ఉద్దేశంగా ఉండేది. భయపెట్టడం కోసమే ప్రజలను చంపేవారు. వారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి ప్రాణాలు తీసేవారు" అని హంజా దిలాబ్ చెప్పారు.

కాని మిలీషియాకు చెందిన వ్యక్తులు 2017 ఏప్రిల్ 17న తమ ఇంట్లోకి చొరబడ్డారని, అప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని అన్నారు హనాన్ అబుక్లిష్.

''నా తలకు తుపాకీ పెట్టి ఇంట్లో ఎవరున్నారు అని అడిగారు. ఎవరూ లేరని చెప్పాను. కానీ, వారు నన్ను మా నాన్నగారి గదిలోకి తీసుకుని వెళ్లి, 'నిన్ను ముందు చంపేస్తాం’ అంటూ మా నాన్నను చంపేశారు. వాళ్ళని ఆపాలని చాలా చూశాను. కానీ, వాళ్ళు మా నాన్న గుండెల్లోకి తూటాలు పేల్చేశారు" అని ఆమె చెప్పారు.

అదే రోజు హనాన్ ముగ్గురి అన్నదమ్ములను, 14, 16 ఏళ్లు ఉన్న మేనల్లుళ్ళను కూడా కాని మిలీషియా చంపింది. వారి బంధువులను కూడా అపహరించింది. వారు కూడా కనిపించకుండా పోయారు.

హనాన్ కుటుంబం ఆ పట్టణంలో ధనికులు, గౌరవం కలిగినవారు అన్న ఒకే ఒక్కో కారణంతో కాని మిలీషియా ఈ హత్యలకు పాల్పడిందని హనాన్ అన్నారు.

అప్పటికే కాని కుటుంబీకులు టర్హునా చుట్టు పక్కల తమ చిన్న సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. పోలీసులను కూడా తమ అదుపులో పెట్టుకున్నారు.

అక్కడున్న ఫ్యాక్టరీల నుంచి, స్థానిక వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేస్తూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఓ షాపింగ్ మాల్‌‌తోపాటు కొన్ని చట్టబద్ధమైన వ్యాపారాలను కూడా మొదలుపెట్టారు.

వారి భూభాగం నుంచి వెళ్లే మాదక ద్రవ్య వ్యాపారులకు, సహారా నుంచి మెడిటరేనియన్ తీరానికి వెళ్లే వలసదారులకు రక్షణ కల్పిస్తూ లాభాలు కూడా ఆర్జించారు.

అక్రమ రవాణాలను నిరోధిస్తున్నామని, యుద్ధంతో చీలిపోయిన లిబియాలో పద్ధతైన ద్వీపాన్ని సృష్టించామని వాళ్లు గొప్పలు చెప్పుకునేవారు.

సమాధులు

ఈ చిన్న సామ్రాజ్యానికి అధిపతిగా మహమ్మద్ అల్ కాని ఉండేవాడు. ఆయన సలాఫీ అనే మత సిద్ధాంతాన్ని అనుసరించేవారు.

ఆ కుటుంబం మొత్తం మీద మహమ్మద్ ఒక్కడే కొంత చదువుకుని, ఉద్యోగం చేసిన వ్యక్తి. తిరుగుబాటుకు ముందు అతడు ఒక ఆయిల్ కంపెనీలో డ్రైవర్ ఉద్యోగం చేసేవాడు.

"నేరస్థుల కుటుంబాల్లో ఆధిపత్యం చెలాయించే వాళ్ళు మరీ భయపెట్టే విధంగా గాని, ఆకర్షించే విధంగా గాని ఉండకపోవడం సాధారణమే. క్లిష్టమైన పథకాలన్నింటినీ అర్ధం చేసుకోగలిగి మొత్తం పనిని చక్కబెట్టగలిగే నేర్పు ఉన్న వారు వ్యవస్థలో పైన ఉంటారు. అతడు అదే చేసేవాడు" అని జలేల్ హర్చౌ అన్నారు.

గుండుతో ఉండే అబ్దుల్ రహీమ్ మహమ్మద్ కింద అంతర్గత భద్రత బాధ్యతలు నిర్వహించే వ్యక్తిగా ఉండేవాడు. మొహ్సేన్ కాని మిలీషియాకు రక్షణ మంత్రిగా ఉండేవాడు.

అబ్దుల్ రహీం అత్యంత దారుణమైన హంతకుడని, మొహ్సేన్ ఆ తర్వాత స్థానంలో ఉంటాడని హంజా దిలాబ్ గుర్తు చేసుకున్నారు.

దిలాబ్‌తో సహా మరెంతో మంది టర్హునా నుంచి పారిపోయి అక్కడ జరిగే హత్యల గురించి తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు సమాచారం అందించినట్లు చెప్పారు. కానీ, ఆ నేరాల గురించి ప్రభుత్వాలేవీ పట్టించుకోలేదు.

కాని అన్నదమ్ములు భారీ ఆయుధాలు, అత్యున్నత స్థాయిలో పోలీసులు ధరించే యూనిఫామ్‌లతో,పెంపుడు సింహాలతో కలిసి 2017లోఒక సైనిక పరేడ్ నిర్వహించారు. ఇవన్నీ ఆ అన్నదమ్ముల వ్యక్తిగత ఆస్తులని... ఆ సింహాలకు వారు చంపేసిన వ్యక్తుల మాంసం విసిరేవారని కూడా పుకార్లు కూడా వచ్చాయి.

కాని అన్నదమ్ములు 2019లో పౌర యుద్ధంలో నిర్ణయాత్మకంగా ఖలీఫా హఫ్తార్ వర్గం వైపు తిరిగారు. వీళ్లు దేశపు తూర్పు భాగం వైపు ఆధిపత్యం కలిగి ఉండేవారు.

అనుకోకుండా ఈ చిన్న టర్హునా పట్టణం ఒక అంతర్జాతీయ పోరాటానికి కేంద్ర బిందువుగా మారిపోయింది. హఫ్తార్‌కు ఫ్రాన్స్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల కూటమి మద్దతు దొరికింది. వీరు కానిల తరఫున పోరాడటానికి కిరాయి సైనికులను పంపారు.

వీరికి వ్యతిరేకంగా టర్కీ ట్రిపోలి ప్రభుత్వానికి మద్దతుగా ఆయుధాలను సరఫరా చేసింది.

మోహ్సెన్ అల్ కానిని, అందరిలోకి చిన్న వాడైన అబ్దుల్ ఆధిమ్‌ని 2019లో టర్కీ డ్రోన్ ద్వారా చంపి ఉంటారని భావిస్తున్నారు.

పట్టణ ప్రజలు తమ శత్రువులతో జత కడతారనే భయంతో కాని కుటుంబం పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.

సమాధలు

రబియా జబల్లాహ్ అనే ఆమె తమ బంధువు తారిఖ్‌ను ఒక రోజు కాని సేనలు ఇంటి గుమ్మం బయటే కాల్చి చంపడం కళ్లారా చూశారు. ఆయన వాహనాన్ని కూడా వారు పట్టుకుని వెళ్లిపోయారు.

తారిఖ్‌ను సమాధి చేస్తుండగా, పోలీసులు అక్కడే ఉన్న శ్మశానాన్ని ముట్టడించి, రబియా భర్తతో సహా మరో 10 మందిని పట్టుకుని వెళ్లిపోయారు. వాళ్ళ దగ్గర తారిఖ్ ట్రక్ ఉండటాన్ని ఆమె చూశారు.

రబియా కుటుంబానికి కార్ల వ్యాపారం ఉంది. తమ వాహనాలను యుద్ధానికి వాడుకునేందుకు తమపై దాడి చేశారని ఆమె అన్నారు.

చివరకు 2020లో ప్రభుత్వం టర్హునాను కైవసం చేసుకుంది. కాని అన్నదమ్ములలో మిగిలిన నలుగురు అన్నదమ్ములు వారి సేనలతో కలిసి తూర్పు లిబియా వైపు పారిపోయి ఉండవచ్చు.

"ఆ రోజు రాత్రి మేము నిద్రపోలేదు. మా పిల్లలు చాలా సంతోషించారు" అని రబియా చెప్పారు.

ఆ మరుసటి రోజే ఆమెతో సహా అపహరణకు గురైన చాలా మంది కుటుంబాలు నిర్బంధ కేంద్రాలకు తమ కుటుంబ సభ్యులను వెతుక్కునేందుకు వెళ్లారు. ఒక జైలులో పడేసిన బట్టలు తప్ప ఎవరూ కనిపించలేదు.

"మా ఆశ అంతా చచ్చిపోయింది. ఆ గోడలు రక్తంతో నిండి ఉన్నాయి. నేనిక భరించలేకపోయాను. నేను కూలబడిపోయాను" అని రబియా చెప్పారు.

కాని కుటుంబం వెళ్లిపోయినప్పుడు సంబరాలు

కాని అన్నదమ్ములు ఓటమి పాలైన తర్వాత మిడిల్ ఈస్ట్ ఐ పత్రికకు చెందిన అంతర్జాతీయ రిపోర్టర్ డేనియల్ హిల్టన్ టర్హునా వెళ్లారు.

ఆయన తన రిపోర్టులలో కలచివేసే విషయాలను రాశారు.

"ఆ జైలు గదుల పైన కుప్పల కొలదీ బూడిద ఉందని, ఆ గదుల్లో మనుషులను పెట్టి పైన నిప్పుల కొలిమిని వెలిగించి వారిని హింసించినట్లుగా కనిపిస్తోంది" అని ఆయన రాశారు.

ఇంకొక జైలు నేలపై ముదురు రంగున్న చిన్న షూలు కనిపించినట్లుగా రాశారు. అవి ఎవరివో పిల్లలవి అయి ఉంటాయని, వారిని చంపేసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

టర్హునా నుంచి 350కుపైగా మంది తప్పిపోయినట్లు రికార్డుల్లో నమోదైందని 'గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్ (జిఎన్ఎ) ఫర్ సెర్చింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్’ సంస్థ అధిపతి కమల్ అబు బకర్ చెప్పారు.

కానీ, ఆ సంఖ్య 1000కి పైనే ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఈ శ్మశానాల్లో కొన్ని మృతదేహాలు మాత్రమే లభించాయని, ఇవి చాలా దిగ్బ్రాంతికి గురి చేశాయని అబూ బకర్ అంటారు.

బతికి ఉండగానే ఖననం

"మహిళలు, పిల్లల మృతదేహాలు దొరకడం ఇదే మొదటిసారి. ఒక మృతదేహం అయితే ఆక్సిజన్, నరాలకు పెట్టిన ట్యూబులు లాంటి వైద్య పరికరాలు అమర్చి ఉంది. అంటే ఆ రోగిని ఆసుపత్రిని నుంచి తీసుకుని వచ్చి బతికి ఉండగానే ఖననం చేసినట్లు అర్ధమవుతోంది" అని ఆయన చెప్పారు.

సమాధులు

ఈ హత్యలకు బాధ్యులైన వారి గురించి విచారణ చేస్తున్నామని ట్రిపోలి ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇప్పటి వరకూ ఏ ఒక్క విచారణా పూర్తి కాలేదని హ్యూమన్ రైట్స్ వాచ్ సీనియర్ లిబియా పరిశోధకురాలు హనాన్ సలాహ్ అన్నారు.

"ఈ మూకుమ్మడి సమాధుల గురించి అధికారులు తక్షణమే స్పందించి దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలి" అని ఆమె అన్నారు.

చాలా కాలం పాటు కానిలకు మద్దతు తెలిపిన జీఎన్ఏ ఈ అభియోగాలను చూసీచూడనట్లు వదిలేసిందని ఆమె ఆరోపించారు. వీటికి ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

ప్రభుత్వ అధికారులెవరూ బీబీసీ ఇంటర్వ్యూ అభ్యర్థనకు స్పందించలేదు.

ఇంతలో టర్హునా హత్యల గురించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది. అమెరికా ఆంక్షల జాబితాలో మహమ్మద్ అల్ కానిని చేర్చింది. కానీ, జనరల్ హఫ్తార్ రక్షణలో ఉన్న వీరు అంత త్వరగా చట్టానికి దొరికేటట్లుగా లేరు.

వీరి పై ప్రతీకారం తీర్చుకోవాలని టర్హునాలోనే చాలా మంది పిలుపునిచ్చారు. ఇక్కడ భవిష్యతు ఎలా ఉంటుందోనని వాదా అల్ కీష్ లాంటి యువకులు భయపడుతున్నారు.

"ఇక్కడ ప్రజలు ఒక మిలీషియా చేతుల నుంచి మరో మిలీషియా చేతుల్లోకి వెళ్లారు. ప్రభుత్వం కేవలం పైకి కనిపిస్తుంది. అక్కడ వాస్తవ పరిస్థితులను మిలీషియా నియంత్రిస్తుంది" అని ఆయన అన్నారు.

"అక్కడ దొరికిన మృతదేహాలను తిరిగి సమాధి చేస్తున్నప్పుడు ఒక బాధితుడి సోదరుడు ప్రార్ధన చేస్తూ కనిపించారు. విషాదం అలుముకున్న ఆ పట్టణంలో అది నాకు చిన్న వెలుగులా అనిపించింది" అని ఆయన అన్నారు.

"మా సోదరుడు తనను తాను ఏ ఆదర్శానికీ ఆత్మార్పణం చేసుకోలేదు. ఆయన తన కుటుంబం కోసం జీవించాలని అనుకున్నారు. ఈ యుద్ధంతో మాకెటువంటి సంబంధమూ లేదు. ఇక్కడ ప్రజలెవరైనా ఒక కారణానికి ఆహుతయ్యారని అంటే, వారి లాభం కోసం మా మరణాలను వాడుకోవడమే తప్ప మరేమి కాదు. ఈ ప్రతీకార చక్రాన్ని మేము ఆపాలని అనుకుంటున్నాం. ఇది దేశానికే ఒక విపత్తు" అని ఆ వ్యక్తి ప్రార్ధిస్తూ ఉన్నారని అల్ కీష్ చెప్పారు.

"ఈ మాటలు విన్నప్పుడు, నాకు ఏడుపు వచ్చేసింది. కానీ, ఒక విధంగా ఆ ప్రార్ధన అద్భుతంగా ఉనిపించింది’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
These seven brothers in Libya killed more than 350 people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X