• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి

By BBC News తెలుగు
|

బెసిల్ జాహ్రాఫ్

బెసిల్ జాహ్రాఫ్‌‌కు 'మర్చెంట్ ఆఫ్ డెత్' అని పేరు.

20వ శతాబ్దం ఆరంభంలో ఆయన చాలా పెద్ద ఆయుధ వ్యాపారి.

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరు. కానీ, ఇప్పటివారికి ఆయన గురించి పెద్దగా తెలియదు.

జాహ్రాఫ్ బతికి ఉన్న సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. కానీ, ఆయన జీవితమంతా రహస్యమయంగా ఉండేది.

అసలు ఆయన ఏ దేశం పౌరుడు అన్నది కూడా ఇప్పటివరకూ కచ్చితంగా తెలియదు.

ఆయన గ్రీస్‌కు చెందినవారన్న వాదన విస్తృతంగా ప్రచారంలో ఉంది.

1849 అక్టోబర్ 6న ఒటొమాన్ సామ్రాజ్యంలో ఆయన జన్మించారు.

పుట్టినప్పుడు ఆయన పేరు వాసిలెయోస్ జకారియాస్.

ఆయన తండ్రి వ్యాపారి అయ్యుండొచ్చని భావిస్తారు. 1820 నుంచి 1850 మధ్య గ్రీకుల ఊచకోత జరుగుతున్న సమయంలో తప్పించుకునేందుకు జాహ్రాఫ్ కుటుంబం కొన్ని ఏళ్లపాటు రష్యాలో నిర్వాసితులుగా జీవించి ఉండొచ్చని చెబుతారు.

అందుకే కొందరు విశ్లేషకులు జాహ్రాఫ్‌ రష్యా పౌరుడు అంటారు.

ఒటొమాన్ సామ్రాజ్యానికి తిరిగి వెళ్లే ముందు ఆ కుటంబం తమ ఇంటిపేరును జకారియాస్ నుంచి జాహ్రాఫ్‌గా మార్చుకుంది.

తిరిగి వచ్చిన తర్వాత కుస్తుంతునియా(ప్రస్తుత ఇస్తాంబుల్‌లో గ్రీకుల వాడ)గా స్థిరపడింది.

బెసిల్ జాహ్రాఫ్

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జాహ్రాఫ్ కుటుంబం కడు పేదరికం అనుభవించినట్లు తెలుస్తోంది.

కుటుంబ అవసరాలు తీర్చేందుకు బాల్యంలోనే చిన్న పిల్లలకు తగని పనులు కూడా జాహ్రాఫ్ చేయడం మొదలుపెట్టారు. వివాదాల్లోనూ తలదూర్చారు.

మొదటగా కుస్తుంతునియాలోని రెడ్ లైట్ ఏరియాలో వేశ్యల వద్దకు పర్యాటకులను తీసుకువచ్చే పనిచేశారు. ఆ తర్వాత అగ్నిమాపక శాఖలో పనిచేశారు.

అయితే, జాహ్రాఫ్ నిప్పు అంటించే పని చేసేవారని ఆయన జీవిత చరిత్ర రాసినవారిలో ఒకరైన రిచర్డ్ డెవన్పోర్ట్ హాయిన్స్ చెప్పారు.

అప్పట్లో అగ్నిప్రమాదాల నుంచి తమ విలువైన సంపదను కాపాడుకునేందుకు ధనవంతులు అగ్నిమాపక సిబ్బందికి డబ్బులు ఇచ్చేవారని ఆయన అన్నారు.

ఆ తర్వాత విదేశాలకు వెళ్లేవారికి ఆయా దేశాల కరెన్సీని మార్చి ఇచ్చే పనిచేశారు. అయితే, ఇలా ఆయన నకిలీ కరెన్సీ ఇచ్చేవారని కూడా ప్రచారంలో ఉంది.

జాహ్రాఫ్ గురించి ఓసారి వారి ఇంట్లోనూ గొడవ జరిగిందని బ్రిటానియా ఎన్‌సైక్లోపీడియాలో ఉంది.

అప్పుడు ఆయనకు 21 ఏళ్ల వయసు అని, ఇంగ్లండ్‌లో చదువు ముగించుకుని తిరిగి ఇంటికివచ్చారని, తన చిన్నాన్నతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారని ఉంది.

హీరమ్ స్టీవెన్స్ మాక్సిమ్

ఆయుధ వ్యాపారం

ఇస్తాంబుల్‌లో జాహ్రాఫ్ చిన్నాన్నకు పెద్ద బట్టల వ్యాపారం ఉంది. లండన్‌లో తమ సంస్థ ప్రతినిధిగా జాహ్రాఫ్‌ను ఆయన చిన్నాన్న నియమించారు.

అయితే, రెండేళ్ల తర్వాత జాహ్రాఫ్ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన అరెస్టయ్యారు. కేసు కోర్టు దాకా వెళ్లింది.

అప్పట్లో గ్రీకు సమాజంలో తమ కుటుంబ వివాదాలు ఆంగ్లేయుల కోర్టుల వరకూ వెళ్లకూడదన్న భావన ఉండేది.

కోర్టు అధికార పరిధిలోనే ఉంటూ అవకతవకలకు పాల్పడిన సొమ్మును తిరిగి చెల్లించాలన్న షరతుపై జాహ్రాఫ్ అప్పుడు విడుదలయ్యారు.

కానీ, విడుదలవ్వగానే జాహ్రాఫ్ తన పేరు మార్చుకుని గ్రీస్ రాజధాని ఏథెన్స్‌కు పారిపోయారు. అనుకోకుండా ఆయుధాల వ్యాపారంలో అడుగుపెట్టారు.

ఏథన్స్‌లో స్థానిక ఫైనాన్సర్, దౌత్యవేత్త స్టెఫానోస్ స్కోలిడిస్‌ను జాహ్రాఫ్ కలిశారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది.

స్కోలిడిస్‌కు స్వీడన్‌కు చెందిన ఓ మిత్రుడు ఉన్నారు. ఆయన స్వీడన్‌లో ఆయుధాలు తయారుచేసే థాస్టర్న్ నార్దన్‌ఫెల్ట్ సంస్థలో పనిచేసేవారు.

అయితే, ఆయన ఉద్యోగం మానేయాలని అనుకుని, తన స్థానంలో జాహ్రాఫ్‌ను చేర్చుకోవాలని సిఫార్సు చేశారు.

అలా ఆయుధాలు తయారుచేసే సంస్థలో జాహ్రాఫ్ పనిచేయడం మొదలుపెట్టారు.

బెసిల్ జాహ్రాఫ్

1877లో బాల్కాన్ ప్రాంతంలో థాస్టర్న్ నార్దర్న్‌ఫ్లెట్ ప్రతినిధిగా జాహ్రాఫ్ నియమితుడయ్యారు. ఆ సంస్థ విస్తరిస్తున్న కొద్దీ జాహ్రాఫ్ పరపతి కూడా పెరుగుతూ పోయింది.

1888లో హీరమ్ స్టీవెన్స్ మాక్సిమ్ (ఆటోమెటిక్ మెషీన్ గన్ ఆవిష్కర్త) తన సంస్థ మాక్సిమ్‌ను నార్దర్న్‌ఫ్లెట్‌లో విలీనం చేశారు. కొత్తగా ఏర్పడిన మాక్సిమ్ నార్దర్న్‌ఫ్లెట్ గన్స్ అండ్ అమ్యూనిషన్ కంపెనీ లిమిటెడ్‌కు తూర్పు యూరప్, రష్యా ప్రతినిధిగా జాహ్రాఫ్ నియమితుడయ్యారు.

అప్పట్లో బాల్కాన్ దేశాలు, టర్కీ, రష్యాల మధ్య రాజకీయ, సైనికపరంగా ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దేశాలన్నీ తమ పొరుగు దేశాల దాడుల నుంచి రక్షణ కోసం చర్యలను పెంచాయి.

దీంతో జాహ్రాఫ్‌కు ఆయుధాల అమ్మకాలను పెంచుకునేందుకు సువర్ణ అవకాశం వచ్చినట్లైంది. దాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు.

1897లో మాక్సిమ్ నార్దర్న్‌ఫ్లెట్‌ను బ్రిటన్‌కు చెందిన వికర్స్ సన్స్ అండ్ కంపెనీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత జాహ్రాఫ్‌ పని పరిధితోపాటు ఆయన ఆధిపత్యం కూడా పెరిగింది.

బెసిల్ జాహ్రాఫ్

తప్పుడు పద్ధతులు

వికర్స్ సన్స్ అండ్ మాక్సిమ్ సంస్థను విజయవంతం చేయడంలో జాహ్రాఫ్ ప్రముఖ పాత్ర పోషించారు. 1927 వరకు ఆయన ఆ సంస్థలో పనిచేశారు.

ఆయుధాలు అమ్మేందుకు జాహ్రాఫ్ ఉద్రిక్తతలున్న దేశాల నడుమ శత్రుత్వం పెంచేవారు. ఆ తర్వాత వాటికి సైనిక సామగ్రి, వాహనాలు అమ్మేవారు.

నార్దర్న్‌ఫ్లెట్ జలాంతర్గాముల అమ్మకాలు ఇందుకు ఓ ఉదాహరణ.

చెల్లింపుల విషయంలో వెసులుబాటులు కల్పిస్తూ ముందుగా గ్రీస్‌కు మొదటి మోడల్ జలాంతర్గామిని జాహ్రాఫ్ అమ్మారు.

ఆ తర్వాత గ్రీస్ వద్ద ఈ సబ్‌మెరైన్ ఉండటం వల్ల టర్కీకి భ్రదతపరంగా ముప్పు ఉందని చెప్పి, ఆ దేశానికి రెండు జలాంతర్గాములు అమ్మారు.

నల్ల సముద్రంలో మూడు జలాంతర్గాములతో ముప్పు ఉందని చెబుతూ, రష్యాతో రెండు జలాంతర్గాములను కొనిపించారు.

అయితే, వీటిలో ఏ జలాంతర్గామి కూడా వినియోగంలోకి రాలేదు. ఈ మోడల్‌ లోపపూరితంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, ఈ చర్యల వల్ల ఉద్రిక్తతలైతే పెరిగాయి.

నార్దర్న్‌ఫ్లెట్ జలాంతర్గామి

ఒక దేశాన్ని మరో దేశంపైకి వెళ్లేలా జాహ్రాఫ్ రెచ్చగొట్టేవారని పేరుంది. అప్పట్లో చాలా యుద్ధాల వెనుక ఆయన హస్తం ఉందని కూడా కొందరు ఆరోపిస్తుంటారు.

'ద అడ్వెంచర్స్ ఆఫ్ టిన్‌టిన్' కార్టూన్ కథల సృష్టికర్త జార్జెస్ రెమీ... జాహ్రాఫ్ నుంచి స్ఫూర్తి పొంది బెసిల్ బజారాఫ్ అనే పాత్రను సృష్టించారు.

1937లో ప్రచురితమైన 'ద బ్రోకెన్ ఇయర్' పుస్తకంలో ఈ పాత్ర కనిపిస్తుంది. రెండు కల్పిత దేశాలకు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకునేందుకు బజారఫ్ పాత్ర ఇందులో ఆయుధాలు అమ్ముతుంది.

1932, 1935ల్లో పరాగ్వే, బొలీవియాల మధ్య జరిగిన యుద్ధాలతో ప్రభావితమై జార్జెస్ రెమీ ఈ కథ రాసినట్లు చెబుతారు.

జాహ్రాఫ్ జీవితం ఆధారంగా 'ద మర్చెంట్ ఆఫ్ డెత్' అనే పుస్తకం కూడా వచ్చింది. ఉరుగ్వేకు చెందిన జోర్వాసియో పోసాదా దీన్ని రాశారు.

పరాగ్వే, బొలీవియా యుద్ధాలకు జాహ్రాఫ్ కారణమని ఆయన అన్నారు.

1904, 1905ల్లో రష్యా-జపాన్ యుద్ధం... ఆసియా, ఆఫ్రికాల్లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్ల వెనుక కూడా జాహ్రాఫ్ హస్తం ఉంది. ఆయా సమయాల్లో జాహ్రాఫ్ విపరీతమైన ఆదాయం సంపాదించారు.

బెసిల్ జాహ్రాఫ్

వ్యక్తిగత జీవితం

జాహ్రాఫ్ వ్యక్తిగత జీవితంలోనూ అనేక వివాదాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌లో మొదటి భార్యను ఆయన విడిచిపెట్టారు. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే అమెరికాలో రెండో పెళ్లి చేసుకున్నారు.

స్పెయిన్ రాచకుటుంబ సభ్యుడిని వివాహమాడిన మరియా దె పిలార్ ముగురియోతో జాహ్రాఫ్‌కు వివాహేతర సంబంధం ఉండేది. అప్పట్లో స్పెయిన్‌లో అత్యంత ధనిక మహిళల్లో మరియా ఒకరు.

1923లో మరియా భర్త చనిపోయారు. ఆ తర్వాత ఆమె జాహ్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇది జాహ్రాఫ్‌కు మూడో వివాహం. అయితే, మూడేళ్ల తర్వాత మరియా చనిపోయారు.

ఆ తర్వాత జాహ్రాఫ్ పని నుంచి విశ్రాంతి తీసుకున్నారు. మాంటే కార్లోలోని మోనైకోలో నివాసం ఉన్నారు. అక్కడ ఆయన ఓ కాసినో నడిపారు.

అయితే, ఆయన స్వయంగా ఎప్పుడూ జూదం ఆడేవారు కాదు. 1936లో 87 ఏళ్ల వయసులో జాహ్రాఫ్ చనిపోయారు.

బెసిల్ జాహ్రాఫ్

చరిత్రలో చెడ్డ పేరు తెచ్చుకున్నప్పటికీ జాహ్రాఫ్‌కు... మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో విశేషమైన సేవలు అందించినందుకుగానూ మిత్ర రాజ్యాల నుంచి గౌరవాలు దక్కాయి.

మిత్ర రాజ్యాలకు గ్రీస్‌ను చేరువ చేయడంలో జాహ్రాఫ్ కీలక పాత్ర పోషించారు.

యుద్ధం తర్వాత ఫ్రాన్స్ జాహ్రాఫ్‌ను లీజన్ ఆఫ్ హానర్‌లో ఓ పెద్ద అధికారిని చేసి గౌరవించింది.

బ్రిటన్ ఆయనకు 'నైట్‌హుడ్' హోదాను ఇచ్చింది. అందుకే ఆయన్ను సర్ బెసిల్ జాహ్రాఫ్‌గా కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Wealthy merchant Basil Zaharoff who escalates hostility between nations and sells weapons
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X