• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తల్లడిల్లుతున్న మెక్సికో.. భూకంపం దెబ్బకు 225 మంది మృతి, శిథిలాల కింద ఇంకెందరో?

By Ramesh Babu
|

మెక్సికో సిటీ: మెక్సికోను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. తీవ్రస్థాయి జననష్టం, ఆస్తినష్టంతో పెనువిషాదాన్ని మిగిల్చింది. మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.1 స్థాయిలో భూమి కంపించడంతో రాజధాని మెక్సికో సిటీతోపాటుగా పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. 21 మంది బడిపిల్లలతో సహా కనీసం 225 మంది ప్రాణాలు కోల్పోయారు.

మధ్య మెక్సికోలోని జనావాసాలు భూకంప ప్రభావానికి గురయ్యాయి. మెక్సికో సిటీలోని ఓ ప్రాథమిక పాఠశాల భవనం కుప్పకూలడంతో అందులోని అనేకమంది పిల్లలు సజీవసమాధి అయ్యారు.

1985లో సరిగ్గా ఇదే రోజున... మళ్లీ ఇప్పుడు...

1985లో సరిగ్గా ఇదే రోజున... మళ్లీ ఇప్పుడు...

1985లో ఇదే రోజున (సెప్టెంబర్ 19) దారుణమైన భూకంపం సంభవించింది. మళ్లీ ఇదే రోజే మరో తీవ్రస్థాయి భూకంపం రావడంతో మెక్సికో ప్రజలు తల్లడిల్లిపోయారు. మరీ ముఖ్యంగా పాఠశాల దుర్ఘటన అందరినీ కలచివేసింది. మృతులు సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని భూకంప బాధిత ప్రాంతాలను సందర్శించిన మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియటో ప్రకటించారు.

పేకమేడలా కూలిన పాఠశాల భవనం...

పేకమేడలా కూలిన పాఠశాల భవనం...

రాజధాని నగరం దక్షిణ ప్రాంతంలోని ఎన్రిక్ రెబ్సామెన్ ప్రైమరీ స్కూల్ మూడు అంతస్తులు భూకంపం ధాటికి పేకమేడలా కూలిపోయాయి. ఆ భవనం శిథిలాల కింద 21 మంది విద్యార్థులు, ఐదుగురు టీచర్లు నలిగిపోయారు. మరికొందరు శిథిలాల కింద ఇంకా సజీవంగా ఉన్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ముమ్మరంగా సహాయక చర్యలు...

ముమ్మరంగా సహాయక చర్యలు...

వందలమంది సైనికులు, పోలీసులు, స్వచ్ఛంద కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని పసిగట్టేందుకు పోలీసు జాగిలాలను వినియోగిస్తున్నారు. 21 మంది పిల్లలు, ఐదుగురు పెద్దలు పాఠశాల దుర్ఘటనలో మరణించినట్లు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న నౌకాదళాధికారి మేజర్ జోస్ లూయిస్ వెర్గారా ధ్రువీకరిచారు. ‘‘శిథిలాల కింది మరో 30-40 మంది చిక్కుకున్నారు. ఇప్పటివరకు 11 మంది పిల్లలను కాపాడగలిగాం..'' అని ఆయన చెప్పారు.

శిథిలాల కింద నుంచి కాపాడమంటూ వాట్సప్ సందేశాలు...

శిథిలాల కింద నుంచి కాపాడమంటూ వాట్సప్ సందేశాలు...

రెండు కోట్లమంది జనాభా కలిగిన మెక్సికోసిటీలో కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం తీవ్రంగా గాలింపు జరుగుతోంది. . శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారు తమను కాపాడమంటూ వాట్సప్ సందేశాలు పంపుతున్నారని స్థానిక మీడియా తెలిపింది.

మళ్లీ 32 ఏళ్ల క్రితంనాటి పీడకల...

మళ్లీ 32 ఏళ్ల క్రితంనాటి పీడకల...

‘‘ఇళ్ల గోడలు, పైకప్పులు ఊగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులై వీధుల్లోకి పరుగులు తీశారు. 32 ఏళ్ల క్రితం భూకంపం చూశాను. మళ్లీ అదేరోజు భూమి కంపించడంతో నేను వణికిపోయాను. మళ్లీ అదే పీడకల నా కళ్ల ముందు మెదిలింది.. నాకు ఏడుపు ఆగడం లేదు..'' అంటూ జార్జినా సాంచెజ్ (52) అనే మహిళ మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. ‘‘జననష్టం 1985 నాటి స్థాయిలో లేకున్నా అనేక భవనాలు మాత్రం రాళ్లకుప్పలుగా మారాయి. కుప్పకూలిన భవనాలను చూడలేకపోతున్నాం.. ధ్వంసమైన బస్తీలు యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి..'' అని లీజావిసాజ్ హెరేరా (27) పేర్కొన్నారు.

కొంపముంచిన మాక్ డ్రిల్...

కొంపముంచిన మాక్ డ్రిల్...

మూడు దశాబ్దాల క్రితం ఇదే సమయంలో చోటుచేసుకున్న భూకంపం కారణంగా మెక్సికోలో 10 వేల మందికి పైగా చనిపోయారు. ఆ భూకంపం కూడా సరిగ్గా సెప్టెంబర్ 19నే చోటుచేసుకుంది. ఆ విలయాన్ని గుర్తుచేసుకుని మెక్సికో వాసులు ఇప్పటికీ ఆందోళన చెందుతారు . ఈ నేపథ్యంలోనే భూకంపంపై ముందు జాగ్రత్తగా అధికారులు మంగళవారం కూడా మెక్సికోలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ నిర్వహించిన తర్వాత కొద్ది గంటల్లోనే భూకంపం చోటుచేసుకుంది. అయితే భూకంపంపై అధికారులు సైరన్ మోగించినప్పటికీ... అది మాక్ డ్రిల్‌లో భాగంగానే అనుకుని చాలామంది ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. దీంతో వారంతా శిథిలాల కింద చిక్కుకునిపోయారు. లేకుంటే ఇంతగా ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని చెబుతున్నారు.

ఆ కాసేపూ ఉరుకులు, పరుగులు,

ఆ కాసేపూ ఉరుకులు, పరుగులు,

సకాలంలో స్పందించినవారు భవనాలకు దూరంగా పారిపోయి నేలమీద ఒరిగారు. భూకంపం తాకిడికి భవనాలు నేలమట్టమైన తర్వాత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జనం తమవారికోసం వెదుకుతూ రోడ్లమీద అటూఇటూ పరుగులు తీశారు. దాంతో ట్రాఫిక్ జామ్ అయింది. అంబులెన్స్‌ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాంక్రీటు శకలాల కింద వెదుకులాట సందర్భంగా హృదయవిదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. శకలాల కింద నుంచి సహాయం కోసం అర్థించే వారి ఆర్తనాదాలు వినిపించాలంటే ప్రజలు నిశ్శబ్దంగా ఉండాలని అత్యవసర విభాగం కార్యకర్తలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెక్సికో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడు గంటలపాటు మూసేశారు. ఇళ్లు కూలిపోయిన బాధితులు పార్కుల్లో, శిబిరాల్లో గడుపుతున్నారు. దొంగతనాలు, దారిదోపిడీలు జోరుగా సాగుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి.

రెండు వారాల క్రితం కూడా భూకంపం...

రెండు వారాల క్రితం కూడా భూకంపం...

రెండు వారాల క్రితం కూడా మెక్సికోలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దానికి కూడా కోకోస్ భూఫలకం నొక్కుకుపోవడమే కారణమని తేల్చారు. టెక్టానిక్ ఫలకాలు అలా కదులుతున్నప్పుడు భూమి పొరల్లో ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉండే శిలలు రాపిడికి గురై వాటి మధ్య లంకె ఏర్పడుతుంది. ఈ సంఘటన వల్ల ఊహించని పీడనం ఏర్పడి ఆ ఒత్తిడికి ఒకటిగా కలిసి ఉండే శిలలు తమ మధ్య బలాలను అధిగమించడంతో అవి కాస్త పగిలిపోతాయి. దాంతో భూమి పొరల్లో అకస్మాత్తుగా మార్పు వచ్చి భూమి కంపిస్తుంది.

కోకోస్ ఫలక కదలికల వల్లే భూకంపం...

కోకోస్ ఫలక కదలికల వల్లే భూకంపం...

సాధారణంగా 90 శాతం భూకంపాలు భూమిలో ఉండే టెక్టానిక్ ఫలకల కదలికల కారణంగా సంభవిస్తాయి. మెక్సికో తీరం వెంబడి కోకోస్ ఫలకం, ఉత్తర అమెరికా భూఫలకం కిందకు క్రమంగా చొచ్చుకెళుతోంది. ఏడాదికి 75 మిల్లీమీటర్ల చొప్పున కోకోస్ ఫలకం ముందుకు కదులుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. తాజా భూకంపానికి ఆ రెండు భూ ఫలకాలు ఢీకొనడం కారణం కాదని, ఉత్తర అమెరికా ఫలకం కిందకు చొచ్చుకెళ్లిన కోకోస్ ఫలకం మరింత కిందకు వంగడమే కారణమని సమాచారం.

2 నిమిషాలపాటు ప్రకంపనలు...

2 నిమిషాలపాటు ప్రకంపనలు...

మంగళవారం సంభవించిన భారీ భూకంపానికి మెక్సికో చిగురుటాకులా వణికిపోయింది. రాజధాని మెక్సికో సిటీ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, భూకంప కేంద్రం మాత్రం ప్యూబ్లా ప్రాంతానికి సమీపంలో ఉండడం గమనార్హం. 30 మైళ్ల లోతున భూకంప కేంద్రం ఉందని, 20 సెకన్లపాటు మాత్రమే కంపించిందని, కానీ దాని ప్రకంపనలు మాత్రం రెండు నిమిషాలపాటు సాగాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఆ రెండు భూకంపాలకు సంబంధముందా?

ఆ రెండు భూకంపాలకు సంబంధముందా?

ఒకదాని వెంట ఒకటిగా వచ్చిన రెండు భూకంపాలు మెక్సికోను అతలాకుతలం చేశాయి. ఈనెల 7న రిక్టర్ స్కేల్‌పై 8.1 తీవ్రతతో భూమి కంపించగా, తాజా భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. అయితే ఈ రెండు భూకంపాలకు సంబంధముందా? అన్న ప్రశ్నకు అలా ఏమీ కనిపించడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ ఆ రెండు భూకంపాలకు సంబంధముంటే భూకంప కేంద్రాల మధ్య దూరం వంద కిలోమీటర్ల లోపు ఉండాలి. కానీ, అలా లేదు. ఉత్తర అమెరికా భూఫలకం కిందకు చొచ్చుకెళుతున్న కోకోస్ భూఫలకం కిందివైపు వంగడం వల్ల ఈనెల 7న భూకంపం సంభవించింది. దానికి కొనసాగింపుగా తాజా భూకంపం జరిగినట్లయితే, రెండువారాల సమయం తీసుకునేది కాదని భూకంప పరిశోధకులు చెప్తున్నారు. కోకోస్ ఫలకం మార్పుల కారణంగానే సంభవించినా, ఈ రెండు సెప్టెంబర్ భూకంపాలకు ఎలాంటి సంబంధమూ లేదని భావిస్తున్నారు.

ఆదుకుంటామన్న ట్రంప్...

ఆదుకుంటామన్న ట్రంప్...

పాఠశాలలు, ఇతర భవనాలు, ఇళ్లు కూలిపోయి పెద్ద సంఖ్యలో జనం మరణించడం దురదృష్టకరమని అధ్యక్షుడు నియటా అన్నారు. మెక్సికోసిటీతో పాటుగా పుయెబ్లా, మోరెలోస్, మెక్సికో, గురేరా రాష్ట్రాల్లో జననష్టం అధికంగా సంభవించిందని ఆంతరంగిక శాఖమంత్రి మిగ్యూయెల్ మోరెలోస్ చెప్పారు. తీవ్ర భూకంపానికి గురైన మెక్సికోకు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. మెక్సికోను బద్ధశతృవుగా భావించే అమెరికా సైతం ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మెక్సికోకు సంతాపం తెలిపారు. అన్నిరకాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ట్విట్టర్‌లో ప్రకటించారు.

English summary
Desperate rescue workers scrabbled through rubble in a floodlit search on Wednesday for dozens of children feared buried beneath a Mexico City school, one of hundreds of buildings wrecked by the country's most lethal earthquake in a generation. The magnitude 7.1 shock killed at least 225 people, nearly half of them in the capital, 32 years to the day after a devastating 1985 quake. The head of Mexico's national civil defense agency, Luis Felipe Puente, posted a tweet saying 94 are known dead in Mexico City, 71 in Morelos state, 43 in Puebla, 12 in the State of Mexico, four in Guerrero and one in Oaxaca.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X