మైక్రోసాఫ్ట్‌కు పెంటగాన్ మిలటరీ కీలక ప్రాజెక్టు..డీల్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది
వాషింగ్టన్: అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్‌కు సంబంధించి ఓ కీలక ప్రాజెక్టును ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు. ఈ ప్రాజెక్టు దక్కించుకునేందుకు అమెజాన్ విశ్వప్రయత్నాలు చేసింది. అయితే ట్రంప్ రాజకీయంతో ఈ ప్రాజెక్టు అమెజాన్‌కు కాకుండా మైక్రోసాఫ్ట్‌కు దక్కిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. అమెజాన్‌కు ట్రంప్‌కు మధ్య నెలకొన్న వివాదంతోనే ఈ భారీ ప్రాజెక్టు అమెజాన్‌కు దక్కకుండా పోయిందని ఓ అమెజాన్ ఉన్నతాధికారి తెలిపారు.

జాయింట్ ఎంటర్ప్రైజ్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
జాయింట్ ఎంటర్ప్రైజ్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జేడీ) పేరుతో ఈ భారీ ప్రాజెక్టుకు బిడ్డింగ్ జరిగింది. ఈ ప్రాజెక్టుకు బిడ్డింగ్ దాఖలు చేసిన సంస్థల్లో మైక్రోసాఫ్ట్ అమెజాన్ సంస్థలతో పాటు ఒరాకిల్ మరియు ఐబీఎంలు కూడా ఉన్నాయి.అయితే ఈ బిడ్డింగ్ అమెజాన్‌కే దక్కుతుందని చాలామంది భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. ఇక ఒరాకిల్, ఐబీఎం సంస్థలు బిడ్డింగ్ పద్ధతిపై గతేడాది బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇక ఒరాకిల్ సంస్థ అయితే ఏకంగా కోర్టులో కేసు వేసింది. ఇక రంగంలోకి ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగారు.

అమెజాన్‌తో విబేధాల కారణంగానే...
బిడ్డింగ్ ప్రక్రియపై ప్రభుత్వం పునరాలోచిస్తుందని ట్రంప్ చెప్పారు. ఈ ప్రక్రియలో తనకు కొన్ని ఫిర్యాదులు అందినందున తనే స్వయంగా సమీక్షిస్తానని చెప్పారు ట్రంప్. అప్పటికే అమెజాన్‌తో ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్‌తో ట్రంప్‌కు విబేధాలున్నాయి. ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్టుకు కూడా అధినేత అయిన జెఫ్ బెజోస్.. ఆ పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుండటంపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అమెజాన్‌కు దక్కాల్సిన ఈ జేడీ ప్రాజెక్టుకు ట్రంప్ అడ్డుపడ్డారనే వార్తలు వస్తున్నాయి.

జేడీ వ్యవస్థ ఏం చేస్తుంది..?
జాయింట్ ఎంటర్ప్రైజ్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జేడీ) సిస్టంలు పెద్ద ఎత్తున సేకరించిన సమాచారంను స్టోర్ చేసి పెట్టుకుంటుంది. క్లౌడ్‌లోని డేటాను మొత్తం ఏకీకృతం చేస్తారు. యుద్ధ సమయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అమెరికా మిలటరీ ఈ క్లౌడ్ డేటాను వినియోగించుకుంటుంది. అంతకు ముందున్న క్లౌడ్ వ్యవస్థపై పెంటగాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొత్త క్లౌడ్ వ్యవస్థకోసం బిడ్డింగ్‌కు పిలిచింది. ఇదిలా ఉంటే బిడ్డింగ్ సందర్భంగా అన్ని నిబంధనల ప్రకారమే పారదర్శకతతో జరిగిందని పెంటగాన్ తెలిపింది. గత రెండేళ్లలో 11 బిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టులను 10 వేర్వేరు క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలకు అప్పగించామని అధికారులు చెప్పారు.

క్లౌడ్ కంప్యూటింగ్‌లో తొలిస్థానంలో ఉన్న అమెజాన్
అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం ప్రస్తుతం మార్కెట్లో ముందంజలో ఉండగా దాన్ని కాదని రెండో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌కు భారీ డీల్‌ను ట్రంప్ సర్కార్ అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌లో అమెజాన్‌కు 48శాతం మార్కెట్ కలిగి ఉంది. ఆ తర్వాత 16శాతంతో మైక్రోసాఫ్ట్ నిలిచినట్లు ఓ నివేదిక తెలిపింది. ఇక గతేడాదిగా అమెరికా మిలటరీతో మైక్రోసాఫ్ట్ సంస్థ మంచి సంబంధాలు కొనసాగిస్తోంది. గత కొంత కాలంగా అమెరికా మిలటరీకి టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ సంస్థ అందిస్తోందని మైక్రో సాఫ్ట్ సంస్థ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ చెప్పారు. ఇకపై కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

బిడ్డింగ్‌లో పాల్గొనకూడదని డిసైడైన గూగుల్
ఇక బిడ్డింగ్ విషయానికొస్తే ఒరాకిల్, ఐబీఎం సంస్థలు ముందుగానే తప్పుకున్నాయి. ఇక అంతిమపోరు అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ల మధ్యే సాగింది. ఇక గూగుల్ అసలు బిడ్డింగ్‌లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విలువలతో గూగుల్ విబేధిస్తున్న నేపథ్యంలో పోటీ చేయకూడదని గతేడాదే డిసైడ్ అయ్యింది. అంతేకాదు ప్రభుత్వ కాంట్రాక్టులు ఏవీ చేపట్టరాదని ఉద్యోగులు కూడా ఒత్తిడి తీసుకురావడంతో బిడ్డింగ్‌లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది.