వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహం కొనసాగాలి, మొదటి ప్రధానిని, గర్వించదగ్గ పరిణామం: మోడీ, జింపింగ్‌తో భేటీ

|
Google Oneindia TeluguNews

వుహాన్‌: ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. శుక్రవారం ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. గురువారం రాత్రి హుబెయ్‌ ప్రావిన్స్‌ రాజధాని వుహాన్‌ చేరుకున్న మోడీ అక్కడే బస చేశారు. శుక్రవారం హుబేయ్‌ పురావస్తు శాలలో ఇరు దేశాధినేతలు కలుసుకున్నారు.

మ్యూజియం చేరుకున్న మోడీని చైనా ప్రధాని జిన్‌పింగ్‌ కరచాలనం చేసి సాదరంగా ఆహ్వానించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో మోడీకి ఆహ్వానం పలికారు. అయితే, అనంతరం వీరి సంభాషణలో భాగంగా ప్రధాని ఓ ఆసక్తికరమైన అంశాన్ని జిన్‌పింగ్‌తో పంచుకున్నారు.

 Modi, Xi hold extensive and fruitful informal summit to solidify India-China ties

ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ...' మీరు నాకోసం ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. మీరే వ్యక్తిగతంగా నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఇది వరకు నేను చైనాకు వచ్చినప్పుడు బీజింగ్‌లో స్వయంగా మీరే వచ్చి ఆహ్వానించారు. ఇప్పుడు బీజింగ్‌లో కాకుండా ఇక్కడా మీరే నాకు స్వాగతం పలకడం సంతోషించదగ్గ విషయం. ఇప్పటి వరకు అలాంటి ఘనత పొందిన భారత దేశపు మొదటి ప్రధానిని నేనే. ఇది మా దేశ ప్రజలు గర్వించదగ్గ పరిణామం. ఇక్కడ మనం ఎటువంటి ఒప్పందాలు, చర్చలు లేకుండా ఉండటం కలిసొచ్చే అంశం. మీరు కూడా మా దేశానికి రండి. అక్కడా ఇదే తరహా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం ' అని మోడీ అన్నారు.

అంతేగాక, ప్రధాని మోడీ.. భారత్, చైనా ప్రజల మధ్య బంధాల బలోపేతాన్ని కాంక్షిస్తూ స్ట్రెంత్‌ అనే పదానికి కొత్త నిర్వచనాన్నిచ్చారు. స్ట్రెంత్‌ పదంలోని ఆంగ్ల అక్షరాలకు వరుసగా ఎస్‌ అంటే ఆధ్యాత్మికత (స్పిరిచువాలిటీ), టీ అంటే సంప్రదాయం, వాణిజ్యం, సాంకేతికత (ట్రెడిషన్, ట్రేడ్, టెక్నాలజీ), ఆర్‌ అంటే బంధం (రిలేషన్‌షిప్‌), ఈ అంటే వినోదం (ఎంటర్‌టైన్‌మెంట్‌ - సినిమాలు, కళలు, నృత్యాలు మొదలైనవి), ఎన్‌ అంటే పర్యావరణ పరిరక్షణ (నేచర్‌ కన్జర్వేషన్‌), జీ అంటే క్రీడలు (గేమ్స్‌), టీ అంటే పర్యాటకం (టూరిజం), హెచ్‌ అంటే ఆరోగ్యం (హెల్త్, హీలింగ్‌) అని మోడీ పేర్కొన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య చైనాలోని పర్యాటక కేంద్రం వుహాన్‌లో శుక్రవారం అనధికార శిఖరాగ్ర భేటీ ప్రారంభమైంది. హృదయపూర్వక సమావేశం (హార్ట్‌ టు హార్ట్‌ సమ్మిట్‌)గా పేర్కొంటున్న ఈ భేటీలో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, చైనాల సంప్రదాయ, సాంస్కృతిక స్నేహ సంబంధాలను గుర్తు చేసుకున్నారు.

తమ రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రపంచ పురోగతిలో కీలక పాత్ర పోషించే సమర్థత భారత్, చైనాలకుందని స్పష్టం చేశారు. భేటీ అనంతరం తొలి రోజు చర్చలు విస్తృతంగా, ఫలప్రదంగా ముగిశాయని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. రెండో రోజు చర్చలు నేడు ఉదయం ప్రారంభం కానున్నాయి. సరిహద్దు వివాదాలు సహా ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపైనే వీరిరువురు చర్చించారు. ఇరుదేశాల మధ్య ఇలాంటి చర్చలు తరచూ జరుగుతూ ఉండాలని మోడీ అభిలషించారు. 2019లో భారత్‌లో జరిగే ఈ తరహా చర్చలకు రావాలని జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు.

కాగా, భారత్, చైనాలు కలసి పనిచేస్తే తమ దేశాల ప్రజలతోపాటు ప్రపంచానికి మేలు చేసేందుకు గొప్ప అవకాశం లభిస్తుందని మోడీ తెలిపారు. భారత్‌-చైనాల మధ్య శతాబ్దాల బంధాన్ని మోడీ గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత్, చైనాలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. 'గత 2వేల ఏళ్లలో దాదాపు 1600 ఏళ్ల పాటు భారత్, చైనాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి. ఈ రెండు దేశాలే దాదాపు 50 శాతం భాగస్వామ్యాన్ని కలిగున్నాయి' అని మోడీ పేర్కొన్నారు.

ఇలాంటి చర్చలు భవిష్యత్తులో కూడా జరుగుతాయని ఆశిస్తున్నట్లు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల్లో ఈ భేటీ కొత్త అధ్యాయానికి తెరలేపనుందని ఆయన తెలిపారు. 'గంగా, యాంగ్జీ నదులు నిరంతరం ప్రవహిస్తున్నట్లే ఇరుదేశాల మధ్య స్నేహం కూడా కొనసాగుతూనే ఉండాలి. భారత్‌-చైనా సహకారానికి బంగారు భవిష్యత్తు ఉందని మేం భావిస్తున్నాం' అని పేర్కొన్నారు. 'ఐదేళ్లుగా మనం చాలా సాధించాం. సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకున్నాం. ఈ దిశగా సానుకూల ఫలితాలు సాధిస్తున్నాం. మరింత అభివృద్ధి జరిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మన భాగస్వామ్య ప్రభావం స్పష్టంగా కనబడుతోంది' అని జిన్‌పింగ్‌ తెలిపారు. 'మీతో కలిసి పలు అంశాలపై మరింత లోతైన భాగస్వామ్యం ఏర్పడాలని కోరుకుంటున్నాను' అని ఆయన మోడీతో తెలిపారు. 'మన దేశాలకు పునరుత్తేజం కల్పించేందుకు అవసరమైన సుస్థిరత కల్పించుకోవటం, అన్ని రంగాల్లో అభివృద్ధి, పరస్పర అభివృద్ధికి సహకారాన్ని బలోపేతం చేసుకోవటం, ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం పనిచేయటంపై భారత్‌-చైనా దృష్టిపెట్టాలి' అని చైనా అధ్యక్షుడు పేర్కొన్నారు. అమెరికా సహా పలు దేశాలు రక్షణాత్మక వ్యూహాలు అమలుచేస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాగా, ఈ చర్చల సందర్భంగా ప్రఖ్యాత చైనా కళాకారుడు జు బీహోంగ్‌ వేసిన చిత్రాన్ని జిన్‌పింగ్‌కు మోడీ కానుకగా ఇచ్చారు. ప్రస్తుత పశ్చిమబెంగాల్‌లోని విశ్వభారతి యూనివర్సిటీలో 20వ శతాబ్దపు ప్రారంభంలో బీహోంగ్‌ చిత్రలేఖనం బోధించేవారు. ఆధునిక చైనా చిత్రకళను ఈయన ప్రపంచానికి పరిచయం చేశారు.

చర్చల అనంతరం ఇరువురు నేతలు హుబీ ప్రావిన్షియల్‌ మ్యూజియంను సందర్శించారు. ఈ మ్యూజియంలో పెద్ద సంఖ్యలో చైనా చారిత్రక, సాంస్కృతిక స్మారకాలున్నాయి. సాయంత్రం ఇరువురు నేతల మధ్య చర్చల్లో ఇరుదేశాల నుంచి ఆరుగురు అధికారుల చొప్పున పాల్గొన్నారు. రాత్రి ఈస్ట్‌ లేక్‌ ఒడ్డున ఉన్న అతిథిగృహంలో వీరిద్దరు మాత్రమే భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు. దీంతో తొలిరోజు చర్చలు ముగిశాయి. శనివారం ఉదయం పదిగంటలనుంచి (స్థానిక కాలమానం ప్రకారం) మళ్లీ ఇరువురు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి.

English summary
Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping today held "extensive and fruitful" meetings here on the first day of an unprecedented two-day informal summit to "solidify" the India-China relationship and exchanged views on how the two countries can work together for the benefit of their people and the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X