• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మియన్మార్‌ సంక్షోభం: ఆ దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది?

By BBC News తెలుగు
|
మియన్మార్ మరోసారి సైన్యం చేతిలోకి వెళ్లిపోయింది

ఫిబ్రవరి 1న జరిగిన సైనిక తిరుగుబాటుతో మియన్మార్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా వార్తలకెక్కింది. ఆ దేశానికి నాయకత్వం వహిస్తున్నఆంగ్‌ సాన్‌ సూచీతోపాటు ఇతర పార్లమెంటు సభ్యులను కూడా సైన్యం నిర్బంధించింది.

మియన్మార్‌ ఎక్కడుంది?

మియన్మార్‌కు 'బర్మా' అని కూడా మరో పేరు ఉంది. దక్షిణాసియా దేశాలలో థాయ్‌లాండ్‌, లావోస్‌, బంగ్లాదేశ్‌, చైనా, ఇండియాలతో మియన్మార్‌కు సరిహద్దులు ఉన్నాయి.

సుమారు 5.40 కోట్ల జనాభా ఉన్న మియన్మార్‌లో ఎక్కువమంది బర్మీస్‌ భాష మాట్లాడతారు. మరికొన్ని భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. యాంగాన్‌ సిటీ దేశంలోనే అతి పెద్ద నగరం కాగా, నేపీటా ఆ దేశానికి రాజధాని నగరం.

ఇక్కడ ఎక్కువమంది బౌద్ధ మతాన్ని ఆచరిస్తారు. రోహింజ్యా ముస్లింలతోపాటు మరికొన్ని తెగల ప్రజలు కూడా మియన్మార్‌లో నివసిస్తున్నారు.

1948లో బ్రిటీష్‌ సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యం పొందిన మియన్మార్‌ 1962 నుంచి 2011 వరకు సైనిక పాలనలోనే ఉంది. ఆంగ్‌ సాన్‌ సూచీ నాయకత్వంలో 2011లో ప్రజాస్వామ్య పాలన అమలులోకి వచ్చింది.

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యాధిపతి హ్లయింగ్ అంటున్నారు

బర్మా అని ఎందుకు పిలుస్తారు?

మియన్మార్‌ను అనేక తరాలపాటు బర్మా పేరుతోనే పిలిచేవారు. అక్కడ నివసించే తెగ పేరే దేశం పేరుగా మారింది. 1989లో జరిగిన తిరుగుబాటును అణచివేసిన సైనిక ప్రభుత్వం బర్మా పేరును మియన్మార్‌గా మార్చింది.

ఇంగ్లీషులో మియన్మార్‌ అని పిలుస్తున్నా దాని అర్ధం మాత్రం అదే. అయితే మియన్మార్ అన్నది గౌరవవాచకం. అయితే సైనికపాలనను వ్యతిరేకిస్తూ కొన్ని దేశాలు ఆ నాయకులు పెట్టిన పేరును పిలవడానికి తిరస్కరించాయి.

అయితే 2011 నుంచి ప్రజాస్వామ్య పాలన అమలులోకి రావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బర్మాను మియన్మార్‌ అనే పిలుస్తున్నారు. అమెరికా ఇప్పటికీ బర్మా అనే పిలుస్తుండగా, ఏ పేరుతో పిలిచినా తేడా ఏమీ ఉండదని ఆంగ్‌ సాన్‌ సూచీ 2016లో వ్యాఖ్యానించారు.

ఏం జరుగుతోంది? ఎందుకిలా అయ్యింది?

మియన్మార్‌లో మరోసారి సైనిక పాలన అమలులోకి వచ్చింది. సంవత్సరంపాటు అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని సైనిక నాయకత్వం ప్రకటించింది.

గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆంగ్‌ సాన్‌ సూచీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డి) ప్రభుత్వాన్ని సైనిక నాయకత్వం అంగీకరించ లేదు.

ప్రతిపక్షపార్టీ మద్దతున్న సైనిక నాయకత్వం దేశంలో మరోసారి ఎన్నికలు జరగాలని కోరుతోంది. గత ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయన్నది సైన్యం, ప్రతిపక్షాల ఆరోపణ. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆ దేశ ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది.

కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు ప్రారంభించే ముందుగానే సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

మియన్మార్‌లో ఏం జరుగుతుందనే సమాచారం త్వరగా బైటికి రావడం లేదు. ఆంగ్‌ సాన్‌ సూచీ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారని తెలుస్తోంది. సైనిక నాయకత్వం ఆమెపై పలు ఆరోపణలు చేసింది.

ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన అనేక నియమాలను సూచీ పాటించలేదని, చట్ట విరుద్ధంగా ఆమె కొన్ని సమాచార సాధనాలు వాడుతున్నారని సైన్యం ఆరోపణలు చేసింది. సూచీతోపాటు అనేకమంది పార్లమెంటు సభ్యులను కూడా నిర్బంధంలో ఉంచింది.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సూచీ దశాబ్దాలుగా పోరాడుతున్నారు

పాలన ఎవరి చేతిలో?

ప్రస్తుతం ఆ దేశ అధికారం కమాండర్‌ ఇన్ చీఫ్‌ మిన్ ఆంగ్‌ హ్లయింగ్‌ చేతిలో ఉంది.

గత కొన్నేళ్లుగా మియన్మార్ ప్రజాస్వామ్య దేశంగా మారినా, దేశంపై సైన్యం పట్టును సడలనివ్వకుండా హ్లయింగ్ జాగ్రత్తపడ్డారు.

అయితే మైనారిటీలైన రొహింజ్యాల అణచివేతలో హ్లయింగ్‌ వ్యవహరించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వినిపించాయి.

హ్లయింగ్ నాయకత్వంలోని సైన్యం ఆర్ధిక, ఆరోగ్య, హోంశాఖ మంత్రులు, వారి ఉపమంత్రులను కూడా పదవుల నుంచి తొలగించింది. ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిపిస్తామని ప్రకటించింది.

ఆంగ్‌ సాన్‌ సూచీ ఎవరు ?

దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని, ప్రజాస్వామ్య పాలన రావాలని కోరుతూ 90లలో ఆంగ్‌ సాన్‌ సూచీ ఉద్యమించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన నాటి సైనిక ప్రభుత్వం ఆమెను దాదాపు 15 ఏళ్లపాటు నిర్బంధంలో పెట్టింది.

1991లో ఆంగ్‌ సాన్‌ సూచీని నోబెల్‌ బహుమతి వరించింది.

2015లో సూచీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్‌ డెమొక్రసీ పార్టీ విజయం సాధించింది. దాదాపు 25సంవత్సరాల తర్వాత ఏర్పడిన ప్రజా ప్రభుత్వం అది.

నిర్మానుష్యంగా ఉన్న యాంగాన్ నగర వీధులు

రోహింజ్యా వివాదం

రోహింజ్యాల విషయంలో మియన్మార్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆంగ్‌ సాన్‌ సూచీకి ప్రపంచవ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చింది. రోహింజ్యాలను వలసదారులుగా గుర్తించిన ప్రభుత్వం వారికి పౌరసత్వం ఇచ్చేందుకు నిరాకరించింది.

ప్రభుత్వ అణచివేత నుంచి తప్పించుకోవడానికి రోహింజ్యాలు దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. సైన్యం దాడులతో వేలమంది రోహింజ్యాలు మరణించగా, సుమారు 7లక్షలమంది శరణార్ధులుగా బంగ్లాదేశ్‌కు పారిపోయారు.

ఈ వివాదం కారణంగా ఆంగ్‌ సాన్‌ సూచీ 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి వచ్చింది. సైన్యం జన హననానికి పాల్పడిందన్న ఆరోపణలను సూచీ అప్పట్లో తోసిపుచ్చారు.

అంతర్జాతీయ సమాజం ఏమంటోంది?

బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌, ఆస్ట్రేలియా సహా పలుదేశాలు మియన్మార్‌లో సైనిక తిరుగుబాటును ఖండించాయి. “ప్రజాస్వామ్య సంస్కరణలకు ఇది పెద్ద విఘాతం” అని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరి జనరల్‌ ఆంటోనియో గుటెర్రాస్‌ వ్యాఖ్యానించారు.

మియన్మార్‌పై ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. అయితే అన్ని దేశాలు ఈ స్థాయిలో స్పందించ లేదు.

మియన్మార్‌ పరిణామాలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి చేసిన ప్రకటనను చైనా తప్పుబట్టింది. మియన్మార్ ఆ దేశ వ్యవహారాలలో ప్రపంచ దేశాలు కల్పించుకోరాదని గతంలో వాదించిన చైనా, తాజా ఘటనలు ఆ దేశంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలాంటివని అభిప్రాయపడింది.

ఇది మియన్మార్‌ అంతర్గత వ్యవహారమని పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్ అభిప్రాయపడ్డాయి.

మియన్మార్ మ్యాప్

నిరసనలు ఎలా జరుగుతున్నాయి?

సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆంగ్‌ సాన్‌ సూచీ తన మద్దతుదారులను కోరారు. కానీ ప్రస్తుతం ఆ దేశంలో పెద్ద పెద్ద ఆందోళనలు జరగడం లేదు.

తాము ఆందోళనలు నిర్వహించాలని అనుకోవడం లేదని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని సూచీ పార్టీ ఎన్‌ఎల్‌డీకి చెందిన నేత ఒకరు ఏపీ న్యూస్‌ ఏజెన్సీతో అన్నారు.

శాసనాలను ఉల్లంఘించడం ద్వారా ప్రజలు ఈ పరిణామాలపట్ల తమ వ్యతిరేకతను ప్రదర్శించాలని కొందరు నేతలు సూచించారు.

యాంగాన్‌లో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుండగా, కొందరు ప్రజలు ఇంట్లో గిన్నెలు, పళ్లేల మీద కొడుతూ, కారు హారన్లు వినిపిస్తూ తమ నిరసనను తెలియజేశారు.

ఆసుపత్రుల సిబ్బంది సైనికాధికారులకు నిరసన తెలుపుతూ కొద్దిసేపు విధులను బహిష్కరించారు. మరికొందరు రిబ్బన్లు కట్టుకోవడం ద్వారా తమ వ్యతిరేకతను వ్యక్తంచేశారు. సోషల్‌ మీడియాలో పలువురు యూజర్లు తమ ప్రొఫైల్‌ పిక్చర్లకు ఎరుపు రంగును జత చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Milatary Coup im Myanmar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X