• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మియన్మార్ సైనిక కుట్ర: నగర వీధుల్లో సైనిక శకటాలు... ఇంటర్నెట్ కట్

By BBC News తెలుగు
|
మియాన్మర్ నిరసనలు

మియన్మార్‌లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సైనిక కుట్రపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను అణచివేయటానికి సైన్యం సన్నద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

దేశంలోని పలు నగరాల్లోని వీధుల్లో సాయుధ సైనిక వాహనాలు కనిపించాయి. అర్థరాత్రి నుంచి ఇంటర్నెట్‌ను దాదాపు పూర్తిగా నిలిపివేశారు.

ఉత్తర ప్రాంతంలోని కచిన్ రాష్ట్రంలో నిరసనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.

ఫిబ్రవరి ఒకటో తేదీన కుట్ర చేసిన సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు ఆంగ్ సాన్ సూచీ సహా అనేక మంది ప్రజాప్రతినిధులను నిర్బంధించింది. దీనికి వ్యతిరేంగా దేశంలో గత తొమ్మిది రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి.

https://twitter.com/RapporteurUn/status/1361025118642843649

సైన్యం ప్రజల మీద యుద్ధం ప్రకటించిందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి టామ్ ఆండ్రూస్ ఆరోపించారు. ఈ చర్యలకు సైనిక జనరల్స్‌ను బాధ్యత వహించేలా చేస్తామని చెప్పారు.

యాంగోన్‌లో సైనిక వాహనాలు

సైన్యం సంయమనం ప్రదర్శించాలని పశ్చిమ దేశాల రాయబార కార్యాలయాలు విజ్ఞప్తి చేశాయి.

యూరోపియన్ యూనియన్, అమెరికా, బ్రిటన్‌లు సంతకం చేసిన ఒక ప్రకటనలో, ''చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని కూలదోయటంపై నిరసన తెలుపుతున్న ప్రదర్శనకారులపై హింసకు పాల్పడవద్దని భద్రతా బలగాలను మేం కోరుతున్నాం’’ అని పేర్కొన్నాయి.

ఆంగ్ సాన్ సూచీ పార్టీ నవంబరులో జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. అయితే, ఆ ఎన్నికల్లో మోసం జరిగిందని సైన్యం అంటోంది. సూచీ సారథ్యంలోని పౌర ప్రభుత్వాన్ని సైనిక కుట్ర ద్వారా తొలగించింది.

సూచీ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు. వందలాది మంది ఉద్యమకారులు, ప్రతిపక్ష నాయకులను కూడా నిర్బంధించారు.

మియన్మార్ నిరసనలు

అణచివేత సంకేతాలు ఏమిటి?

దేశవ్యాప్తంగా సైన్యానికి వ్యతిరేకంగా లక్షలాది మంది నిరసనకారులు వరుసగా తొమ్మిదో రోజూ ప్రదర్శనలు నిర్వహించారు.

కచిన్ రాష్ట్రంలోని మైట్కీనా నగరంలో.. సైనిక కుట్రకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన నిరసనకారులతో భద్రతా బలగాలు తలపడ్డాయి. ఈ సందర్భంగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. అయితే వారు రబ్బరు బుల్లెట్లు పేల్చుతున్నారా లేక నిజమైన బులెట్లు పేల్చుతున్నారా అనేది ఇంకా తెలీదు.

సైన్యం అరెస్టు చేసిన వారిలో ఐదుగురు జర్నలిస్టులు కూడా ఉన్నారు.

సైనిక కుట్ర జరిగిన తర్వాత మొదటిసారిగా యాంగాన్ నగర వీధుల్లో సాయుధ సైనిక వాహనాలు సంచరిస్తూ కనిపించాయి. బౌద్ధ సన్యాసులు, ఇంజనీర్లు అక్కడ ప్రదర్శనకు సారథ్యం వహించారు.

ఇక రాజధాని నగరం నేపీటాలో మోటార్‌సైకిళ్ల మీద ప్రదర్శన నిర్వహించారు.

ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయాలని తమకు ఆదేశాలు వచ్చాయని మియన్మార్‌లోని టెలికామ్ ఆపరేటర్లు చెప్పారు.

మియన్మార్ నిరసనలు

ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాక ఇంటర్నెట్ ట్రాఫిక్ సాధారణ స్థాయి నుంచి 14 శాతానికి పడిపోయిందని నెట్‌బ్లాక్ అనే పర్యవేక్షణ సంస్థ చెప్పింది.

భద్రతా బలగాలు రాత్రిళ్లు ఇళ్ల మీద దాడులు చేస్తున్నాయని నేపీటాలోని ఒక ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ ఒకరు బీబీసీకి తెలిపారు.

''కర్ఫ్యూ విధిస్తున్నామని, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని వారు ప్రకటిస్తారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే పోలీసులు, సైనికులు మావంటి వారిని అరెస్ట్ చేసే సమయం ఇదే’’ అని ఆ వైద్యుడు వివరించారు. భద్రతా కారణాల రీత్యా ఆయన పేరు వెల్లడించడం లేదు.

''ఆ ముందు రోజు వారు ఒక ఇంటి ముందుకు వచ్చి, కంచెను కత్తిరించి, ఇంట్లోకి అడుగుపెట్టి జనాన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. అందుకే నాకు కూడా ఆందోళనగా ఉంది’’ అని చెప్పారాయన.

https://twitter.com/ACSRangoon/status/1360948903705600000

మియన్మార్‌లో ఉన్న అమెరికా జాతీయులు కర్ఫ్యూ సమయంలో ఇళ్లలోనే ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది.

ఏడుగురు ప్రముఖ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయటానికి వారెంట్లు జారీ చేశామని సైన్యం శనివారం నాడు ప్రకటించింది. అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న నాయకులకు ఆశ్రయం కల్పించవద్దని ప్రజలను హెచ్చరించింది.

అయితే, జనం ఆంక్షల్ని ధిక్కరిస్తూ రావడం వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. భద్రతా బలగాలు రాత్రిపూట దాడులు చేస్తున్నపుడు కుండలు, పళ్లాలు చరుస్తూ తమ పొరుగువారిని హెచ్చరిస్తున్నారు.

ఎవరినైనా 24 గంటలకన్నా ఎక్కువ సేపు అరెస్టు చేయటానికి, ప్రైవేటు ఇళ్లలో సోదాలు చేయటానికి కోర్టు ఆదేశాలు అవసరమని చెప్పే చట్టాలను కూడా సైన్యం శనివారం నాడు సస్పెండ్ చేసింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Myanmar military coup: Military strikes on city streets,Internet cut
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X