ఒంటరివాళ్లం కాదు: భూమిలాంటి మరో 10గ్రహాలను గుర్తించిన నాసా
న్యూయార్క్: మనం ఒంటిర వాళ్లం కాదు... ఎందుకంటే?.. మన పాలపుంతలో భూ గ్రహం లాంటి మరో పది గ్రహాలున్నాయి. ఈ మేరకు నాసా శాస్త్రవేత్తలు తాజాగా ఈ పది గ్రహాలను కనుగొన్నారు. నాసాకు చెందిన కెప్లర్ టెలిస్కోప్ ఈ గ్రహాలను కనుగొంది. ఎక్సోప్లానెట్లుగా పిలుస్తున్న ఆ గ్రహాలు భూ గ్రహం సైజులో, రాళ్ల మాదిరిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఆ గ్రహాలపై ద్రవ రూపంలో నీరు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వాటి వాతావరణ పరిస్థితులు కూడా జీవుల మనుగడకు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు.
తాజాగా కెప్లర్ టెలిస్కోప్ 219 ఎక్సోప్లానెట్లకు సంబంధించిన డేటాను రిలీజ్ చేసింది. మన సౌర వ్యవస్థకు ఆవల ఇవి ఉన్నట్లు గుర్తించారు. అయితే అందులో పది గ్రహాలు మాత్రం అచ్చం మన భూమి లాగే ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అంతేగాక, సూర్యుడికి భూమి ఎంత దూరంలో ఉందో, అదే మాదిరిగా ఆ ఎక్సోప్లానెట్లు కూడా తమ నక్షత్రాలకు అదే కక్ష్యలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2009 నుంచి గ్రహాంతర వేట కొనసాగిస్తున్న కెప్లర్ టెలిస్కోప్ ఇప్పటివరకు 4034 కొత్త గ్రహాలను కనుగొంది. అందులో 2335 గ్రహాలు నిజమైనవే అన్న అంశాన్ని మిగిలి టెలిస్కోప్ల ద్వారా దృవీకరించారు.
ఎక్సోప్లానెట్లపై తాజాగా రూపొందించిన క్యాటలాగ్ సమగ్రంగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సిగ్నస్ కాన్స్టెల్లేషన్ (సిగ్నస్ పాలపుంత)లో ఉన్న సుమారు లక్షన్నర నక్షత్రాలను కెప్టెర్ టెలిస్కోప్ అధ్యయం చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా, కొత్తగా కనుగొన్న పది గ్రహాల ద్వారా మన పాలపుంతలో భూమి లాంటి అనువైన వాతావరణం ఉన్న గ్రహాల సంఖ్య 50కి చేరినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాలిఫోర్నియాలో ఉన్న నాసాకు చెందిన ఏమ్స్ రీసర్చ్ సెంటర్లో జరిగిన నాలుగవ కెప్లర్ మరియ కే2 సైన్స్ కాన్ఫరెన్స్లో శాస్త్రవేత్తలు తాజాగా ఈ వివరాలను వెల్లడించారు.