
ఉక్రెయిన్‌పై రసాయన దాడులకు రష్యా ప్లాన్..!! అప్రమత్తంగా ఉండాలని నాటో హెచ్చరిక
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరింత రెచ్చిపోయి బాంబులతో విరుచుకుపడుతున్నారు. వేలాది మంది మృతి చెందారు. తాజాగా రష్యా చర్యలపై నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్లెన్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లోని బయోలాజికల్ లేబొరేటరీలకు అమెరికా నిధులు అందించిందంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా ఖండించారు. రష్యా దుర్మార్గపు చర్యలు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రష్యా రసాయన దాడులకు ప్లాన్
ఉక్రెయిన్‌పై రష్యా రసాయన దాడులకు ప్లాన్ చేస్తోందని జెన్స్ స్టోల్లెన్ బర్గ్ ఆరోపించారు. ఇది యుద్ధ నేరమే అవుతోందని వ్యాఖ్యానించారు. రష్యా చర్యల నేపథ్యంలో నాటో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రష్యా దాడులు ఉద్ధృతం చేసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌తో మాట్లాడిన జెలెన్ స్కీ.. పుతిన్‌తో జెలుసలెంలో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని కోరారు.

ఊచకోతలను నిలిపేయండి..పోప్ ఫ్రాన్సిస్
రష్యా దండయాత్రపై పోప్ ఫ్రాన్సిస్ మరో సారి తీవ్రంగా స్పందించారు. ఉక్రెయిన్ దురాక్రమణ చర్యలను ఖండించారు. దాడులతో వేలాది మంది మృతి చెందారని , లక్షలాది మంది నిరాశ్రయులైయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాలు శ్మశానవాటికలుగా మారకముందే ఈ సాయుధ దురాక్రమణను , ఊచకోతలను నిలిపియాలని కోరారు.
అటు లుహాన్స్క్ తూర్పు ప్రాంతంలో రష్యా సేనలు ఫాస్పరస్ బాంబు దాడులకు పాల్పడుతుందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో వైట్ ఫాస్పరస్ బాంబుల వినియోగంపై నిషేధం ఉందని పేర్కొంది.

వీడియో జర్నలిస్ట్ మృతి
అటు ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో విదేశీయులు సహితం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇర్పిన్ ప్రాంతంలో జరిగిన దాడులలో అమెరికాకు చెందిన వీడియో జర్నలిస్ట్ బ్రెంట్ రెనాడ్ మృతి చెందారు. అయితే తొలుత న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన జర్నలిస్లు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థ డిప్యూటీ మేనేజింగ్ ఎడిటర్ క్లీఫ్ లెవీ వివరణ ఇచ్చారు. రెనాడ్ గతంలో తమ సంస్థలో పనిచేశారని తెలిపారు. కానీ ప్రస్తుతం తన అసైన్ మెంట్‌పై ఉక్రెయిన్‌లో లేరని వెల్లడించారు. బ్రెంట్ రెనాడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.