వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్: రాచరికం, హిందూ రాజ్యం పునరుద్ధరించాలంటూ ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నేపాల్‌లో ఆందోళనలు

రెండున్నరేళ్ల క్రితం నేపాల్‌లో పాత జాతీయ గీతం పాడినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. 'అసభ్యంగా’ ప్రవర్తించారంటూ వారిపై కేసు పెట్టారు.

అయితే, ఆ ఇద్దరు యువకుల అరెస్టు తర్వాత కాఠ్‌మాండూలోని వారి సహచరులు దేశవ్యాప్తంగా పాత జాతీయ గీతం పాడే ఉద్యమం మొదలుపెడుతున్నట్లు ప్రకటించారు. నేపాల్‌లో రాచరికాన్ని, హిందూ రాజ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

నేపాల్ రాజు జ్ఞానేంద్ర, రాణి కోమల్ చిత్రాలు ఉన్న టీషర్టులను జనాలకు పంచడం మొదలుపెట్టారు.

తమ బృందానికి 'వీర్ గోర్‌ఖాలీ అభియాన్’ అని పేరు పెట్టుకున్నారు. కమల్ థాపా నేతృత్వంలోని రాష్ట్రీయ ప్రజాతంత్రిక్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నవారితో ఈ బృందం మొదలైంది.

టీషర్టులు పంచడం, పాత జాతీయ గీతం పాడటం వంటి చర్యలతో మొదలైన ఈ కార్యక్రమం.. రాచరిక వ్యవస్థ పునరుద్ధరణను డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రదర్శనలు నిర్వహించే స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ ప్రదర్శనలు మొదలయ్యాయి.

గుర్తింపు లేని చాలా రాజకీయ పార్టీలు ఈ ఆందోళనల్లో భాగమయ్యాయి. పెద్ద నగరాల్లో యువకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. 'దేశాన్ని రాజు వచ్చి కాపాడతారు’ అంటూ నినాదాలు చేశారు.

సోషల్ మీడియాలోనూ ఇవన్నీ ప్రచారమయ్యాయి. ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతోనే ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయని ప్రజాస్వామ్య మద్దతుదారులు అంటున్నారు.

ఎవరి నాయకత్వంలో జరుగుతున్నాయి?

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. రకరకాల సంస్థలు వీటిని నిర్వహిస్తున్నాయి.

'వీర్ గోర్‌ఖలీ అభియాన్’ పేరుతో సెప్టెంబర్ 8న ఈ నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయని సౌరభ్ భండారీ అనే వ్యక్తి చెప్పారు. ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నవారిలో ఆయన కూడా ఒకరు.

ప్రభుత్వం నిరసనలను అణిచివేస్తుండటంతో అనుకున్నంత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నామని, ఆందోళన కార్యక్రమాలను ఆపేయాల్సి వచ్చిందని సౌరభ్ అన్నారు.

అయితే, అక్టోబర్ 30న బుల్వాల్‌లో బైక్ ర్యాలీతో నిరసన ప్రదర్శనలు మళ్లీ మొదలయ్యాయి.

రాష్ట్రవాదీ నాగరిక్ సమాజ్, నేపాల్ విద్వత్ పరిషద్, స్వతంత్ర్ దేశభక్త్ నేపాలీ నాగరిక్, పశ్చమాంచల్‌బాసీ నేపాలీ జనతా, నేపాల్ రాష్ట్రవాదీ సమూహ్, రాష్ట్రీయ్ శక్తి నేపాల్, 2047-రాజ్యాంగ పునఃస్థాపన అభియాన్ లాంటి సంస్థలు ఈ నిరసనలను నిర్వహిస్తున్నాయి.

గోర్‌ఖలీ అభియాన్ ద్వారా ఈ ఆందోళనల్లో భాగమైన యువకులు అన్ని సంస్థలు నిర్వహిస్తున్న ప్రదర్శనల్లో పాల్గొంటున్నారని సౌరభ్ భండారీ అన్నారు.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిరసన ప్రదర్శనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ప్రభుత్వ హెచ్చరికలను లెక్క చేయకుండా, చాలా ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

తమకు ఎవరూ నాయకత్వం వహించడం లేదని ఈ నిరసనకారులు అంటున్నారు.

''ఇది పౌరుల నుంచి పుట్టుకువచ్చిన ఆందోళన. దీనికి ఎవరూ నాయకులు లేరు. అయితే, మాకు ఓ ప్రణాళిక ఉంది. రేపటి రోజున నాయకులు రావొచ్చు’’ అని రాష్ట్రీయ నాగరిక్ ఆందోళన సమన్వయకర్త బాలకృష్ణ న్యోపానే అన్నారు.

డిమాండ్లు ఏంటి?

పాత రాజ్యాంగాన్ని తేవాలని ఆందోళనకారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తిరిగి రాచరికం తేవాలని కూడా కోరుతున్నారు. అయితే, హిందూ రాజ్యం ఏర్పాటు విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆందోళనల్లో పాల్గొంటున్న వరల్డ్ హిందూ ఫెడరేషన్ సంస్థ హిందూ రాజ్యం కోసం డిమాండ్ చేస్తోంది.

''మేం హిందూ రాజ్యాన్ని కోరుకుంటున్నాం. అందుకే ఈ ఆందోళనలకు మద్దతు ఇస్తున్నాం’’ అని వరల్డ్ హిందూ ఫెడరేషన్ అంతర్జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి అస్మితా భండారీ చెప్పారు.

అయితే, హిందూయిజంతో పాటు బౌద్ధం, కిరంత్ మతాలకు కూడా నేపాల్ దేశంగా ఉండాలని తాము ఆశిస్తున్నామని రాష్ట్రీయ నాగరిక్ ఆందోళన్ సమన్వయకర్త న్యోపానే చెప్పారు.

నేపాల్‌లో ఆందోళనలు

రాచరికాన్ని ఎందుకు కోరుకుంటున్నారు?

రాజకీయ పార్టీలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని, అందుకే జనం రాచరికం కోరుకుంటున్నారని యువరాజ్ గౌతమ్ అనే జర్నలిస్టు అన్నారు.

''జాతీయవాదం గురించి మాట్లాడేవారు ఈ నిరసన కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. ఒక గట్టి ప్రత్యామ్నాయం కోసం వారు వెతుకుతున్నారు. జాతి ప్రయోజనాల పేరుతో దేశాన్ని విదేశాల చేతులో కీలుబొమ్మగా మార్చుతుండటం పట్ల యువత ఆగ్రహంతో ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.

ప్రభుత్వం పనిచేస్తున్న తీరు నచ్చక యువత ఈ ఆందోళనల్లో భాగమవుతోందని ప్రొఫెసర్ కృష్ణ ఖనాల్ అంటున్నారు.

''ప్రభుత్వ వైఫల్యాలు, సోషల్ మీడియా ప్రభావంతో ఆందోళనలు విస్తరిస్తున్నాయి. ఈ ఆందోళనల వెనుక రాష్ట్రీయ ప్రజాతంత్ర్ పార్టీ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. సొంతంగా ప్రభావం చూపలేకపోతున్నందున.. ఇలా పౌర ఉద్యమాల సాయంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

కానీ, ఆందోళనకారులు మాత్రం తమ వెనుక రాష్ట్రీయ ప్రజాతంత్ర్ పార్టీ లేదని అంటున్నారు.

''అసలు ఈ పరిస్థితికి రాష్ట్రీయ ప్రజాతంత్ర్ పార్టీనే కారణం. రాచరికం రద్దు కావడంలో ప్రధాన పాత్ర పోషించింది ఆ పార్టీనే. అందరి ఆస్తులపై విచారణ జరగాలని మేం డిమాండ్ చేశాం. రాష్ట్రీయ ప్రజాతంత్ర్ పార్టీ నాయకుల ఆస్తులపై కూడా జరగాలి’’ అని న్యోపానే అన్నారు.

రాచరికం కోసం జరుగుతున్న ఆందోళనలతో నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్రకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన వ్యక్తిగత కార్యదర్శి సాగర్ తిమిలసినియా స్పష్టం చేశారు.

https://twitter.com/ANI/status/1335149146005590016

ఇతర కారణాలు...

ఈ ఆందోళనలు తీవ్రమవుతుండటం వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయి.

దేశంలోని దేవాలయాల్లో తొలిసారి పూజలు నిలిపివేయడం కూడా వీటిలో ఒక కారణమని చరిత్రకారుడు మహేశ్ రాజ్ పంత్ బీబీసీతో చెప్పారు.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేవాలయాలను మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంది హిందువులకు ఆగ్రహం తెప్పించింది.

అలాంటి వారు చాలా మంది రాచరికం రావాలని కోరుతూ, నిరసనల్లో పాల్గొంటున్నారు.

ప్రభుత్వం ఏమంటోంది...

దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలపై నేపాల్ ప్రభుత్వం స్పందించింది. ఇలాంటి ప్రదర్శనలకు అనుమతి ఇవ్వలేదని హోం మంత్రిత్వశాఖ పేర్కొంది.

కరోనావైరస్ వ్యాప్తి ముప్పు నేపథ్యంలో ఈ వారం నుంచి ఎలాంటి ఆందోళన ప్రదర్శనలూ నిర్వహించకుండా ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పింది.

ప్రదర్శనలు ఆపకపోతే, చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని హోం శాఖ అధికార ప్రతినిధి చక్ర బహాదుర్ బుఢా ప్రకటించారు.

ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకకివాదాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఈ ఆందోళనలు విజయవంతం కావని అధికార పార్టీ నాయకులు అంటున్నారు.

''ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడ్డంకులన్నీ తొలగించుకుంటూ మేం ముందుకు సాగుతున్నాం. తిరోగామి శక్తులు తిరిగి వేళ్లూనుకునే ఆలోచనే చేయకూడదు’’ అని అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్‌కాజీ శ్రేష్ఠ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why are there concerns about the restoration of the monarchy and the Hindu kingdom in Nepal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X