కరోనా బలహీనం- కొత్త వైరస్ల విజృంభణ-దేశానికో రకంగా పలురెట్లు వేగంగా
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగైనట్లు వార్తలొస్తున్నాయి. భారత్‌లోనూ దీని ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. అయితే వైరస్‌లకు ఉన్న ప్రత్యేక స్వభావం దృష్ట్యా దీన్నుంచి కొత్త వైరస్ స్ట్రెయిన్లు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. ఇవి కరోనా వైరస్ తరహాలో అన్ని దేశాల్లో ఒకేలా లేవు. వేర్వేరు లక్షణాలతో, వేర్వేరు తీవ్రతలతో విజృంభిస్తున్న ఈ కొత్త వైరస్‌లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్ధితి. ఇవి దేశానికో రకంగా ఉన్న తీరు అందరినీ కలవరపెడుతోంది.

బలహీన పడిన కరోనా
రెండేళ్ల క్రితం చైనాలోని వుహాన్ నగరంలో బయటపడిన సార్స్ సీవోవీ 2 వైరస్ కోవిడ్ 19గా ప్రపంచ దేశాలకు సుపరిచితమైంది. కరోనా వైరస్‌గా పిలుచుకున్న ఈ వైరస్‌తో ప్రభావితం కాని దేశాలు, నగరాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఏడాది కాలంగా నానా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రపంచ దేశాలు తాజాగా ఇప్పుడిప్పుడే దీని ప్రభావం నుంచి బయటపడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కరోనా వైరస్ బలహీనపడటమే. కోట్లాది మందికి వ్యాపించిన తర్వాత సహజంగానే ఈ వైరస్ బలహీనపడిపోయింది. ఇప్పటికే కరోనా బారిన పడిన వారి నుంచి వారికి అత్యంత సమీపంలో ఉన్న ఒకరిద్దరికి సోకడం మినహా దాదాపు దీని ప్రభావం తగ్గిపోయింది. దీంతో ప్రపంచమంతా ఊపిరిపీల్చుకుంటోంది.

కరోనా పిల్ల వైరస్ల దాడి
కరోనా ప్రభావం తగ్గిందని భావిస్తున్నే తరుణంలోనే పలు దేశాల్లో దాన్నుంచి ఉద్భవించిన పలు కొత్త రకాల స్ట్రెయిన్(రకాలు) ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముందుగా యూరప్ దేశాల్లో బయటపడిన ఈ కొత్త స్ట్రెయిన్లు ఇప్పుడు దక్షిణాఫ్రికా, అమెరికా వంటి దేశాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇలా ఒక్కో దేశంలో ఈ కొత్త స్ట్రెయిన్ల ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఆయా దేశాలు తిరిగి అప్రమత్తమై లాక్డౌన్లు విధించాల్సిన పరిస్ధితులు తలెత్తున్నాయి. కరోనాను మించిన లక్షణాలు, తీవ్రతతో ఈ కొత్త వైరస్లు చేస్తున్న దాడితో ప్రపంచమంతా మరోసారి ఉలిక్కిపడుతోంది. అలాగే ఈ వైరస్లు ఓ దేశం నుంచి మరో దేశానికి కూడా పాకేస్తున్నాయి. బ్రిటన్ నుంచి భారత్‌కు ఓ స్టెయిన్ వ్యాప్తి చెందగా.. తాజాగా బ్రెజిల్ నుంచి జపాన్‌కు మరో స్ట్రెయిన్ విస్తరించినట్లు గుర్తించారు.

ఒక్కో దేశంలో ఒక్కో రకంగా...
యూరప్‌లోని బ్రిటన్‌లో తొలుత కొత్త స్ట్రెయిన్ ప్రభావం కనిపించింది. దీని బారిన పడిన వారిని పరీక్షించినప్పుడు వారికి కరోనా వైరస్ లక్షణాలతో పాటు మరిన్ని కొత్త లక్షణాలు కనిపించాయి. శాంపిల్స్ నిశితంగా పరీక్షించిన వైద్యులు ఇదో కొత్త స్ట్రెయిన్ అని తేల్చేశారు. వెంటనే ఇది మరింత మందికి పాకకుండా చర్యలు చేపట్టారు. భారత్ కూడా అప్రమత్తమై బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలు నిలిపేసింది. అప్పటికే వేలాది మంది భారత్‌కు వచ్చేశారు. దీంతో వీరికి ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. దీనిపై చర్చ సాగుతుండగానే దక్షిణాఫ్రికా, బ్రెజిల్లో మరో రెండు కొత్త స్ట్రెయిన్ల ప్రభావం కనిపించింది. వీటిపై చర్చించే లోపే అమెరికాలో మరో రెండు కొత్త స్ట్రెయిన్లు కనిపించాయి. వీటి ప్రభావం కరోనా కంటే అధికంగా ఉన్నట్లు తేలింది.

కరోనా కంటే వాడిగా, వేగంగా
కరోనా స్ధానంలో పలు దేశాల్లో బయటపడుతున్న కొత్త స్ట్రెయిన్ల ప్రభావం దారుణంగా ఉంది. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి వేగంగా వ్యాప్తి చెందుతూ ఈ కొత్త స్ట్రెయిన్లు భయపెడుతున్నాయి. దీంతో ఈ కొత్త వైరస్ల పేరు తలచుకోవాలంటేనే భయపడే పరిస్ధితి ఆయా దేశాల్లో కనిపిస్తోంది. కొత్త స్ట్రెయిన్ల ప్రభావంతో ఇప్పటికే బ్రిటన్, జర్మనీలో తిరిగి లాక్డౌన్ ప్రకటించారు. అదే బాటలో పలు దేశాలు తిరిగి లాక్డౌన్లను ఆశ్రయించాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతున్న ఈ కొత్త స్ట్రెయిన్లపై ఇప్పటికే అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు పనిచేస్తాయని కొందరు, పనిచేయవని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఓసారి వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే వీటిపై ప్రయోగించేందుకు ఆయా దేశాలు సిద్దమవుతున్నాయి.