• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నికొలస్ చాచెస్కూ: ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత

By BBC News తెలుగు
|
Google Oneindia TeluguNews
నికొలస్ చాచెస్కూ

చాలా మందికి ఇప్పుడు నమ్మకం కలగకపోవచ్చు. కానీ 60వ దశకంలో రొమేనియా నియంత నికొలస్ చాచెస్కూ 25 ఏళ్ల పాటు, దేశంలో మీడియా గొంతు నొక్కేయడమే కాదు, ఆహారం, చమురు, మందులపై కూడా పరిమితులు విధించాడు.

ఫలితంగా ఎన్నో వేల మంది వ్యాధులు, ఆకలి చావులకు గురయ్యారు. అంతకంటే ఘోరంగా 'సెక్యూరిటెట్' అనే ఆయన నిఘా పోలీసు విభాగం సామాన్యుల వ్యక్తిగత జీవితాలపై కూడా నిఘా పెట్టింది.

చాచెస్కూను రొమేనియా 'కండూకేడర్' రూపంలో గుర్తుచేసుకుంటుంది. అంటే నేత అని అర్థం. ఆయన భార్య ఎలీనా 'జాతిమాత' పురస్కారం కూడా అందుకున్నారు.

నికొలస్ చాచెస్కూ

నీడను చూసి భయపడ్డ రొమేనియా ప్రజలు

రొమేనియాలో భారత్ రాయబారిగా పనిచేసిన రాజీవ్ డోగ్రా తను రొమేనియా వెళ్లేనాటికి చాచెస్కూ మరణించి పదేళ్లు గడిచిందని, కానీ అప్పటికి కూడా అక్కడి ప్రజల్లో ఆయనంటే భయం పోలేదు అని చెప్పారు.

"నేను నా విధుల్లో చేరేందుకు రొమేనియా చేరుకున్నప్పుడు, అక్కడ జనం తమ నీడను చూసి తామే భయపడటం కనిపించింది. వాళ్లు రోడ్డు మీద నడుస్తుంటే, ఎవరైనా తమను వెంటాడుతున్నారేమో అని వెనక్కు చూస్తూ వెళ్లేవారు" అని చెప్పారు.

"జనం పార్కులో ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా తమపై నిఘా పెట్టారేమో అని చుట్టూ చూస్తుండేవారు. చాచెస్కూ అధికారంలో ఉన్నప్పుడు కొందరు ఏజెంట్లు వార్తాపత్రికలో రంధ్రం చేసుకుని జనాలపై నిఘా పెట్టేవారు" అని రాజీవ్ చెప్పారు.

నికొలస్ చాచెస్కూ

ఇళ్ల కిటికీలు తెరిచి ఉంచాలని ఆదేశం

కార్మన్ బుగాన్ అనే రొమేనియా మహిళ తండ్రి చాచెస్కూ వ్యతిరేకుల్లో ఒకరు. నిఘా పోలీసులు 'సెక్యూరిటెట్' 1982 మార్చి 10న ఆయన గ్రామంపై దాడి చేశారు. తర్వాత ఐదేళ్ల పాటు ఆ కుటుంబం ఏమేం చేస్తోంది అనే దానిపై నిఘా పెట్టారు. ఇంట్లో వారు మాట్లాడిన ప్రతి మాటా రికార్డ్ చేశారు.

"నేను స్కూలు నుంచి తిరిగి వచ్చేసరికే, మా ఇల్లంతా పోలీసులతో నిండిపోయి ఉంది. వాళ్లు మా ఇల్లంతా నిఘా మైక్రో ఫోన్లు పెడుతున్నారు. మా అమ్మ-నాన్న సిగరెట్లు తాగుతున్నారు. మమ్మల్ని అడగకుండానే ఇంట్లో కాఫీ చేసుకుంటున్నారు" అని కార్మన్ బీబీసీకి చెప్పారు.

"అప్పుడు నాకేం అర్థం కాలేదు. మా నాన్న కారులో వెళ్లి బుఖారెస్ట్‌లో చాచెస్కూకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచారని తర్వాత తెలిసింది. మా నాన్న అప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. మా అమ్మ ఆస్పత్రిలో ఉంది. వాళ్లు మా ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ తీసుకెళ్లిపోయారు. నేను మూడు వారాలు నీళ్లు తాగే బతకాల్సి వచ్చింది."

మాపై నిఘా పెట్టడానికి వీలుగా, ఎంత చలిగా ఉన్నా, ఇంటి కిటికీలు తెరిచే ఉంచాలని వాళ్లు మాకు గట్టిగా చెప్పారు. నేను స్కూలుకు వెళ్తున్నప్పుడు ఒక నిఘా ఏజెంట్ నా వెనకాలే వచ్చేవాడు. నాకు అతడి బ్రౌన్ కోట్, కాప్ ఇప్పటికీ గుర్తుంది. స్కూల్ వదిలాక గేట్ దగ్గరే నాకోసం ఎదురుచూస్తూ ఉండేవాడు" అని కార్మన్ చెప్పారు.

నికొలస్ చాచెస్కూ

పొడవుగా కనిపించాలని కోరిక

బలంగా ఉండే చాచెస్కూ ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలే. దాంతో, తను అందరికీ పొడవుగా కనిపించేలా ఫొటోలు తీయాలని రొమేనియాలో ఉండే ఫొటోగ్రాఫర్లకు ఆయన సూచించారు.

చాచెస్కూకు 70 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా ఆయన 40 ఏళ్ల వయసులో తీసిన ఫొటోలనే ప్రచురించేవారు. ఎవరైనా అందమైన మహిళలు ఆయన పక్కన నిలబడి ఫొటో తీసుకుంటే, చాచెస్కూ భార్య ఎలీనాకు నచ్చేది కాదు.

ఎలీనా చాలా సబ్జెక్టుల్లో ఫెయిలవడంతో 14 ఏళ్లకే చదువు ఆపేశారు. కానీ రొమేనియా 'ఫస్ట్ లేడీ' అయిన తర్వాత ఆమె రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ చేశానని ప్రకటన చేయించుకున్నారు. కానీ, అది నకిలీ డిగ్రీ అనే విషయం అందరికీ తెలుసు.

నికొలస్ చాచెస్కూ

ప్రపంచంలో రెండో అతిపెద్ద భవన నిర్మాణం

రొమేనియాను ఒక ప్రపంచ శక్తిగా మార్చాలని చాచెస్కూ భావించారు. అలా కావాలంటే దేశ జనాభా పెరగాలని అనుకున్నారు. అందుకే, రొమేనియాలో అబార్షన్‌లపై నిషేధం విధించారు.

చాచెస్కూ పొట్టిగా ఉన్నా అన్నీ భారీగా ఉండాలనే కోరుకునేవారు.

రాజధాని బుఖారెస్ట్‌లో చాచెస్కూ బిలియన్ డాలర్ల ఖర్చుతో పీపుల్స్ హౌస్ నిర్మించారు. దాని హీటింగ్, విద్యుత్ ఖర్చు ఇప్పుడు కూడా లక్షల డాలర్లలో ఉంటుంది. ఇప్పుడు, ఆ భవనం నిర్మించి 25 ఏళ్లవుతున్నా, లోపల 70 శాతం గదులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.

పీపుల్స్ హౌస్‌ను సుమారు 15 వేల మంది పనివాళ్లు నిర్మించారు. మూడు షిఫ్టుల్లో దాని పని జరిగేది. చాచెస్కూ తరచూ ఈ భవనాన్ని తనిఖీ చేసేవారు. 1989 డిసెంబర్ ప్రారంభంలో అయితే ఆయన వారానికి మూడుసార్లు అక్కడికి వెళ్లి చూసేవారు.

"ఆ భవనం కోసం పనిచేసిన 15 వేల మంది పనివారికి అక్కడ ఒక్క టాయిలెట్ కూడా లేదు. దాంతో, ఎక్కడ చోటు దొరికితే అక్కడ వారు తమ పని కానిచ్చేసేవారు" అని చాచెస్కూ జీవితంపై 'ద లైఫ్ అండ్ ఈవిల్ టైమ్స్ ఆఫ్ నికోలస్ చాచెస్కూ' పుస్తకంలో రచయిత జాన్ స్వీనీ రాశారు.

"ఆ భవనం అంతా కంపు కొట్టేది. చాచెస్కూ రాబోతున్నారని తెలిసినప్పుడల్లా కొంతమంది పనివాళ్లు, భవనంలో ఆయన వచ్చే ప్రాంతంలో ఉన్న గదులను శుభ్రం చేసేవారు. ఒకసారి, అక్కడకు వచ్చిన చాచెస్కూ, పొరపాటున శుభ్రంగా ఉన్న గదులకు పక్కనే, కాస్త చీకటిగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లిపోయారు. పనివాళ్లు మలవిసర్జన చేసిన చోట కాలు వేశారు. ఆయన రెండు బూట్లూ అక్కడ ఇరుక్కుపోయాయి" అని అందులో చెప్పారు.

నికొలస్ చాచెస్కూ

రోజుకు 20 సార్లు ఆల్కహాలుతో చేతులు కడిగేవారు

"అది చూసి కొంతమంది పనివాళ్లకు నవ్వొచ్చింది. కానీ సెక్యూరిటెట్ పోలీసుల భయంతో వారు అదంతా లోలోపలే అణచుకున్నారు" అని స్వీనీ తన పుస్తకంలో రాశారు.

"సెక్యూరిటెట్‌లో ఒక పోలీస్.. చాచెస్కూ బూట్లను తుడిచారు. ఆయన ఆ బూట్లతోనే కారు వైపు వెళ్లారు. ఆ ఘటన చాచెస్కూను వెంటాడింది. పరిశుభ్రతకు ప్రాణం ఇచ్చే చాచెస్కూ పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి. అక్కడ నుంచి వచ్చాక ఆయన ఇన్ఫెక్షన్లు ఏవీ రాకుండా రోజుకు 20 సార్లు ఆల్కహాలుతో తన చేతులు కడుక్కునేవారు" అని తెలిపారు.

"తర్వాత సెక్యూరిటెట్ ఆ ఘటనపై విచారణ చేసింది. కానీ, ఆ పని ఎవరు చేశారో వారికి తెలీలేదు. అయితే భవనంలో జరిగిన ఆ విషయం బయటకు రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి."

నికొలస్ చాచెస్కూ

సోవియట్ యూనియన్‌తో విరోధం

సోవియట్ క్యాంపులో ఉన్నప్పటికీ సోవియట్ యూనియన్‌ను ఏడిపించడం అంటే చాచెస్కూకు ఆనందంగా ఉండేది. సోవియట్ యూనియన్‌ను విమర్శించే ప్రపంచ నేతలను ఆయన తరచూ తమ దేశానికి ఆహ్వానించేవారు.

1966లో ఆయన చైనా అధ్యక్షుడు చౌ ఎన్-లైను రొమేనియాకు ఆహ్వానించారు. తర్వాత 1967లో అమెరికా భవిష్యత్ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌ కూడా ఆయన ఆతిథ్యం స్వీకరించారు.

"కమ్యూనిజంకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును అణచివేసేందుకు సోవియట్ యూనియన్ చెకొస్లొవేకియాపై దాడి చేసినపుడు చాచెస్కూ అత్యంత కీలకంగా మారారు" అని ఇటీవలే ముద్రితమైన 'హౌ టూ బీ ఏ డిక్టేటర్'లో రచయిత ఫ్రాంక్ డికోటెర్ రాశారు.

సోవియట్ యూనియన్‌కు మద్దతుగా బల్గేరియా, పోలండ్, హంగరీ తమ సైనికులను పంపిస్తామని మాట ఇచ్చాయి. కానీ రొమేనియా మాత్రం సోవియట్ యూనియన్‌కు మద్దతు ప్రకటించలేదు.

నికొలస్ చాచెస్కూ

ప్రేగ్‌లోకి సోవియట్ యూనియన్ ట్యాంకులు చొచ్చుకెళ్లినపుడు, ప్యాలెస్ స్క్వేర్‌లో జరిగిన ఒక భారీ బహిరంగసభలో ప్రసంగించిన చాచెస్కూ, ఆ చర్యలను ఖండించారు. అదో పెద్ద తప్పిదం అని, అలా చేయడం వల్ల యూరప్‌లో శాంతికి పెను ప్రమాదం రావచ్చని అన్నారు. దాంతో ఆయన రాత్రికి రాత్రే 'నేషనల్ హీరో' అయిపోయారు.

చాచెస్కూ చైనా వెళ్లినప్పుడు అక్కడి అగ్ర నేతలు విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. బీజింగ్‌లో రహదారికి రెండు వైపులా చేతులు ఊపుతూ చైనీయులు ఆయన పట్ల తమ గౌరవం చూపించారు.

బీజింగ్ తియనాన్మెన్ స్క్వేర్ వద్ద ఆయన కోసం ఒక పెద్ద జిమ్నాస్టిక్ షో కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇటలీలో హిట్లర్ తొలి పర్యటనలాగే, చైనా కూడా తనపై చూపులకే అంత మర్యాద ఇస్తోందని, చాచెస్కూ తెలుసుకోలేకపోయారు.

చైనా నుంచి తిరిగొచ్చాక చాచెస్కూ తమ దేశంలో కూడా ఒకలాంటి మినీ సాంస్కృతిక విప్లవం తీసుకొచ్చారు. ప్రెస్ మీద సెన్సార్‌షిప్‌ కాస్త సడలించారు. టెలివిజన్‌లో కొన్ని విదేశీ కార్యక్రమాలు చూపించడం మొదలైంది. కానీ ఇవన్నీ పరిమితంగా ఉండేవి. ఎందుకంటే తన సోషలిస్టు ప్రభుత్వంలో లెనినిజం, మార్క్సిజంకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

నికొలస్ చాచెస్కూ

పెద్ద అక్షరాలతో పేరు

చాచెస్కూ తన గురించి చాలా భ్రమలు ప్రచారం చేసేవారు. ఉదాహరణకు ఆయన జీవిత చరిత్ర రాసిన ఫ్రెంచ్ రచయిత మైకేల్ పియర్ హామ్లెట్... చాచెస్కూ అత్యంత పేదరికంలో పుట్టారని, స్కూలుకు చెప్పులు కూడా లేకుండా వెళ్లేవారని రాశారు.

1972లో డొనాల్డ్ కచ్‌లోన్ ఆయన జీవిత చరిత్రను ప్రచురించారు. దాంతో చాచెస్కూ గురించి కథలు ప్రచారం చేయడం మరింత సులువైంది. ఈ పుస్తకంలో రాసిన ఒక విషయాన్ని చాచెస్కూ స్వయంగా అంగీకరించారు. దానిని ఎన్ని కాపీలు వేయాలో కూడా ఆయనే చెప్పారు.

చాచెస్కూ ముఖస్తుతి ఏ స్థాయికి చేరిందంటే, రొమేనియాలో సినతియా అనే వార్తాపత్రిక ఆయన్ను రొమేనియా జూలియస్ సీజర్, నెపోలియన్, పీటర్ గ్రేట్, లింకన్ అంటూ రాయడం మొదలెట్టింది.

చాచెస్కూ 60వ జన్మదినం సందర్భంగా రొమేనియాలోని ఒక రాజకీయ నాయకుడు ఆయన్ను రొమేనియా దేశ చరిత్రలోనే అత్యంత జనాదరణ పొందిన నేతగా వర్ణించేశారు.

తర్వాత చాచెస్కూ వ్యక్తిపూజ మరింత పెరిగింది. ఆయన పేరును పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం మొదలెట్టారు. ఆయనకు రెండోసారి రొమేనియా అత్యున్నత పౌర పురస్కారం "హీరో ఆఫ్ ద సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ రొమేనియా" ఇచ్చారు.

యుగొస్లేవియా ఆయనకు 'హీరో ఆఫ్ సోషలిస్ట్ లేబర్' పురస్కారం ఇచ్చింది, అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆయనకు, ఆయన భార్యకు వైట్ హౌస్‌లో ఘన స్వాగతం పలికారు.

నికొలస్ చాచెస్కూ

బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో బస

1979లో చాచెస్కూ బ్రిటన్ వెళ్లారు. మహారాణి ఎలిజబెత్‌తో కలిసి గుర్రపుబగ్గీలో కూర్చుని లండన్ వీధుల్లో ప్రయాణించారు. అక్కడ ఆయనకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో బస ఏర్పాటు చేశారు.

ఆ భవనంలో చాచెస్కూకు వడ్డించిన పదార్థాలను మొదట ఆయన అంగరక్షకులు రుచిచూడడం అక్కడ ఉన్న వారందరికీ వింతగా అనిపించింది.

"పైకి చాచెస్కూ పర్యటన చాలా విజయవంతం అయినట్లే కనిపించింది. బ్రిటన్ మహారాణి ఆయనకు పాయింట్ 270 బోర్ టెలిస్కోపిక్ రైఫిల్‌, ఎలీనాకు బంగారు, వజ్రాల బ్రోచ్‌ బహుమతిగా ఇచ్చారు" అని జాన్ స్వీనీ తన 'ద లైఫ్ అండ్ ఈవిల్ టైమ్స్ ఆఫ్ నికొలస్ చాచెస్కూ'లో చెప్పారు.

"బకింగ్‌హామ్ ప్యాలెస్‌ అప్పుడూ ఇప్పుడూ తమ అద్భుత ఆతిథ్యానికి పేరు పొందింది. కానీ చాచెస్కూ ప్రతి ఒక్కరికీ షేక్ హాండ్ ఇచ్చాక ఆల్కహాల్‌తో తన చేతులు కడుక్కోవడం చూసి కూడా అక్కడ ఉన్న వారందరూ చాలా షాక్ అయ్యారు".

దాంతో, చాచెస్కూ చేతులు కడుక్కోవడం కోసం, ఆయన ఉన్న గదిలోని మూడు బాత్రూంలలో మూడు ఆల్కహాల్ బాటిళ్లు ఉంచారు.

బ్రిటన్ మహారాణికి కోపం

"రాజ భవనంలో ఉన్న వ్యక్తి వింత ప్రవర్తన గురించి తెలుసుకోడానికి మహారాణికి ఎంతోసేపు పట్టలేదు" అని స్వీనీ తన పుస్తకంలో రాశారు.

"ఒక రోజు ఉదయం ఆరు గంటలకు చాచెస్కూ తన సెక్యూరిటీతో బకింగ్‌హామ్ ప్యాలెస్ గార్డెన్లో వాకింగ్ చేస్తూ కనిపించారు. ఆ ప్యాలెస్‌లోని ప్రతి గదిలో తన మాటలు రికార్డ్ చేస్తున్నారేమో అని ఆయనకు భయంగా ఉండేది. అందుకే ఆయన తన సెక్యూరిటీతో మాట్లాడ్డానికి గార్డెన్లోకి వచ్చేవారు".

"అనుకోకుండా మహారాణి అదే సమయంలో గార్డెన్లో వాకింగ్ చేస్తున్నారు. చాచెస్కూను చూసి ఆమె ఒక పొద దగ్గరే ఉండిపోయారు. ఆయన పద్ధతి చూసిన ఆమె రొమేనియా పర్యటనకు వెళ్లకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారు".

నికొలస్ చాచెస్కూ

ఆహారంపై పరిమితులు, హీటింగ్‌పై నిషేధం

చాచెస్కూ పాలనాకాలం అంతటా రొమేనియన్లు అష్టకష్టాలు పడ్డారు. ప్రతి చోటా సరుకుల కోసం పొడవాటి క్యూలు ఉండేవి. మాంసం అమ్మే షాపుల్లో కోడి కాళ్లు తప్ప వేరే ఏవీ దొరికేవి కావు.

షాపుల్లో పళ్లు కూడా ఉండేవి కావు. అప్పుడప్పుడు ఎండిపోయిన ఆపిల్స్ కనిపించేవి. వైన్ సామాన్యులకు దక్కని వస్తువుగా మారింది.

దీని గురించి ఫ్రాంక్ డికోటేర్ చెప్పారు.

"అప్పుడు అత్యంత పెద్ద సమస్య కరెంటే. మూడింటిలో ఒక బల్బే వెలిగేది. ఆదివారం ప్రజారవాణాపై నిషేధం ఉండేది".

ఒక పెద్ద పారిశ్రామిక బేస్ నిర్మించాలనుకున్న చాచెస్కూ పశ్చిమ దేశాల నుంచి టెక్నాలజీ, ముడి సరుకులు, యంత్రాలు భారీగా దిగుమతి చేసుకునేవారు. కానీ 1979లో చమురు ధరలు పెరగడంతో ఆయనకు అప్పులు పెరిగిపోయాయి.

తర్వాత హఠాత్తుగా ఆయన అన్ని రుణాలు ఒకేసారి తీర్చేయాలని నిర్ణయించారు. దానికోసం ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచారు.

సోవియట్ యూనియన్‌కు మాంసం ఎగుమతిని రెండేళ్లలో మూడు రెట్లు పెంచారు. పండ్లు, కూరగాయలు, వైన్ అన్నింటినీ విదేశీ మార్కెట్లకు పంపించడం మొదలుపెట్టారు.

ఆహారంపై ఆంక్షలు విధించారు. విద్యుత్ వినియోగంలో భారీ కోతలు పెట్టారు. లైట్లు, హీటింగ్ లేక జనం చీకట్లలో, ఎముకలు కొరికే చలిలో గజగజ వణుకుతూ జీవించేవారు.

ప్రజల జీవితాలను నరకంగా మార్చిన చాచెస్కూ, వారు ఎప్పుడూ తనకు అనుకూలంగా ఉంటారని ఆశించేవారు.

నికొలస్ చాచెస్కూ

వెనక తిట్టుకునేవారు

చాచెస్కూ వ్యక్తిపూజ అంతకంతకూ పెరిగింది. తర్వాత దేశంలో ప్రతి పాఠ్యపుస్తకం మొదటి పేజీలో తన ఫొటోను తప్పనిసరిగా ముద్రించాలని ఆయన ఆదేశించారు.

టెలివిజన్‌లో కేవలం ఒకే చానల్ వచ్చేది. అందులో సగం కార్యక్రమాల్లో చాచెస్కూ కార్యకలాపాలు, ఆయన విజయాలనే చూపించేవారు.

పుస్తకాలు, మ్యూజిక్ షాపుల్లో ఆయన ప్రసంగాల సేకరణ కచ్చితంగా ఉండాలి. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవాలన్నా, చాచెస్కూ అనుమతి అవసరం అయ్యేది.

రోడ్ల పేర్లు మార్చాలన్నా చాచెస్కూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. రెండు ఫుట్‌బాల్ టీముల మధ్య మ్యాచ్ జరుగుతుంటే, వారిలో ఎవరు గెలవాలి, ఆ మ్యాచ్‌ను టీవీలో ప్రసారం చేయాలా, వద్దా అనేది, చాచెస్కూ భార్య ఎలీనానే నిర్ణయించేవారు.

"అందరూ నాయకుడి గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉండేవారు. కానీ లోలోపల మాత్రం ఆయన్ను తిట్టుకునేవారు. చాచెస్కూ ఏదైనా భవనాన్ని తనిఖీ చేయడానికి బయటికి వస్తే, జనం చప్పట్లతో ఆయనకు స్వాగతం పలికేవారు. కానీ ఆయన తిరిగి వెళ్లిపోగానే నానా తిట్లు తిట్టడం నేను స్వయంగా చూశాను" అని ఫ్రాంక్ డికోటెర్ తన పుస్తకంలో రాశారు.

నికొలస్ చాచెస్కూ

1989 డిసెంబర్ 21న చివరి ప్రసంగం

1979 డిసెంబర్ 7న రొమేనియా సైన్యం తిమిస్వారా ఆందోళనకారులపై కాల్పులు జరిపింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

1989 డిసెంబర్ 21న బుఖారెస్ట్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం బాల్కనీ నుంచి నికొలస్ చాచెస్కూ ప్రసంగించారు. ఆయన మాట్లాడిన కొన్ని నిమిషాలకు ఆయన వెనక నుంచి ఈలలు, అరుపులు వినిపించాయి.

చాచెస్కూ చెయ్యి పైకెత్తి మైక్‌ను తడుతూ అందరినీ శాంతింపజేయాలని ప్రయత్నించారు. కానీ ఆయన వెనక అరుపులు అంతకంతకూ పెరిగాయి.

దాంతో చాచెస్కూ భార్య ఎలీనా ముందుకు వెళ్లి జనాలను అదుపు చేయాలని ప్రయత్నించారు. "ఆగండి, ప్రశాంతంగా ఉండండి. మీకేమైంది" అని అరుస్తున్నారు.

కానీ ఆమె జనాలను అడ్డుకోలేకపోయారు. ఎలీనా అక్కడి నుంచే తడబడుతున్న గొంతుతో "కనీస వేతనాలను పెంచుతానని ప్రకటించు" అని భర్తకు సలహా ఇచ్చారు.

ఆయన అదే ప్రకటన చేశాడు. కానీ అది జనంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కాసేపట్లోనే బహిరంగ సభలో అల్లర్లు మొదలయ్యాయి.

నికొలస్ చాచెస్కూ

విప్లవానికి శ్రీకారం

ఆ ప్రసంగం టెలివిజన్లో లైవ్ వస్తోంది. హఠాత్తుగా టీవీలో తెర నల్లగా మారగానే, దేశంలో విప్లవానికి బీజం పడిందని ప్రతి ఒక్కరికీ అర్థమైంది.

దేశమంతటా ప్రజలు చాచెస్కూ వ్యతిరేక ప్రదర్శనలకు దిగారు. ప్రభుత్వ భవనాలపై దాడులు జరిగాయి. చాచెస్కూ ఫొటోలను పగలగొట్టి, చించేశారు.

చాచెస్కూ తన సెక్యూరిటెడ్ పోలీసులతో ఆ తిరుగుబాటును అణచివేయాలని ఆదేశించారు. రాత్రంతా వారు ఆందోళనకారులపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. కానీ వారిని అడ్డుకోలేకపోయారు.

పారిపోతూ లిఫ్టులో ఇరుక్కున్నారు

తర్వాత రోజు సైన్యం కూడా తిరుగుబాటు చేసింది. నిరసనకారులు ఆగ్రహంతో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఎలీనా, చాచెస్కూ చివరికి హెలికాప్టర్లో పారిపోవాల్సి వచ్చింది. కానీ అక్కడ కూడా హైడ్రామా కొనసాగింది.

చాచెస్కూ లిఫ్టులో భవనంపైకి వెళ్లారు. అక్కడ ఆయన కోసం ఒక హెలికాప్టర్ ఎదురుచూస్తోంది.

జాన్ స్వీనీ ఆ ఘటన గురించి రాశారు.

"చాచెస్కూ లిఫ్టులోకి వెళ్లగానే ఆయన సైన్యాధ్యక్షుడు జనరల్ స్టాన్‌కులుస్కూ తన కార్లో కూర్చుని రక్షణ శాఖ భవనం వైపు వెళ్లిపోయారు".

నికొలస్ చాచెస్కూ

"ప్రధాన కార్యాలయానికి రక్షణ ఇవ్వడం ఆపేయాలని ఆయన కార్లో నుంచే భద్రతా బలగాలను ఆదేశించారు. సైనికులు అక్కడి నుంచి వెళ్లిపోగానే విప్లవకారులు ఆ భవనంలోకి చొరబడ్డారు. కానీ చాచెస్కూ ఇంకా దాని లోపలే ఉన్నారని వారికి తెలీదు. ఎందుకంటే ఆయన పైకి వెళ్లడానికి ఎక్కిన లిఫ్టు తలుపులు జామ్ అయిపోయాయి".

"ఎలాగోలా లిఫ్టు తలుపు విరగ్గొట్టిన చాచెస్కూ బయటపడ్డారు. హెలికాప్టర్ ఎక్కేశారు. విప్లవకారులు మేడమీదకు చేరుకునేలోపు ఆరుగురు వెళ్లగలిగే ఆ హెలికాప్టర్ గాల్లోకి లేచింది. దానిలోపల అసలు చోటు లేదు. చివరికి దాని కో పైలెట్ చాచెస్కూ మోకాళ్ల మీద కూర్చోవాల్సి వచ్చింది".

నికొలస్ చాచెస్కూ

క్రూర నియంత క్రూరంగానే అంతమయ్యారు

పైలట్ హెలికాప్టర్‌ను రాజధాని బుఖారెస్ట్ బయట ఒక పొలంలో దించారు. చాచెస్కూ దంపతులను వారి అంగరక్షకుడితోపాటు అక్కడ వదిలేసి తిరిగి వెళ్లిపోయారు.

అదే రోజు చాచెస్కూ, ఆయన భార్యను సైన్యం అరెస్టు చేసింది. క్రిస్మస్ రోజున ఇద్దరినీ ఒక సైనిక కోర్టులో విచారించి మరణ శిక్ష విధించారు.

ఇద్దరికీ చేతులు కట్టేసి, ఒక గోడవైపు తిప్పి నిలబెట్టారు. మొదట చాచెస్కూ, ఎలీనా ఇద్దరినీ విడివిడిగా కాల్చి చంపాలని అనుకున్నారు. కానీ సైన్యంతో "మేం ఇద్దరం కలిసి చనిపోవడానికే ఇష్టపడతాం" అని ఎలీనా చెప్పారు.

సైనికులు వారికి తుపాకులు గురిపెట్టారు. మరు క్షణంలో.. 25 ఏళ్లు రొమేనియాపై అధికారం చెలాయించిన నిరంకుశ నియంత నికోలస్ చాచెస్కూ నేలకూలారు.

"జనం తమ చరిత్రను స్వయంగా లిఖిస్తారు, కానీ చరిత్ర ఎప్పుడూ వారికి నచ్చినట్లు ఉండదు" అని కార్ల్ మార్క్స్ చెప్పింది ముమ్మాటికీ నిజమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Nicholas Chachescu: An authoritarian dictator who washes his hands with alcohol
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X