అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నీరవ్ లీలలు...ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే ప్రయత్నాలు
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు పంగనామం పెట్టి పత్తాలేకుండా పోయిన డైమండ్ మర్చంట్ నీరవ్ మోడీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాదాపు రూ.13వేల కోట్లకుపైగా రూపాయలు ఎగ్గొట్టిన నీరవ్.. చట్టానికి చిక్కకుండా తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు. ఇందులో భాగంగా తొలుత ఆస్ట్రేలియాకు 1750కిలోమీటర్ల దూరంలో ఉన్న వనౌతు ద్వీప దేశపు పౌరసత్వం కోసం నీరవ్ దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పాటు సింగపూర్ శాశ్వత పౌరసత్వం కోసం తీవ్రంగా శ్రమించాడు.
అయితే ఈ ప్రయత్నాలన్నీ సఫలం కాకపోవడంతో పోలీసులు, న్యాయస్థానాల నుంచి రక్షణ పొందేలా బ్రిటన్ లోని పెద్ద న్యాయసంస్థలతో సంప్రదింపులు జరిపాడు. గతేడాది జనవరిలో భారత్ నుంచి పారిపోయిన నీరవ్ మోడీ.. అప్పటి నుంచి విచారణ తప్పించుకునేందుకు వేసిన వేషాలు, చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఆచూకీ దొరకుండా ప్రపంచంలో మారుమూల ప్రాంతానికి వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేసిన ఆయన.. చివరకు బ్రిటన్ చేరుకున్నాడు. లండన్ నుంచి తన వ్యాపారం నడిపిస్తూ దొంగ పాస్ పోర్టులపై తిరిగాడు.

ప్లాస్టిక్ సర్జరీ కోసం ప్రయత్నాలు
ఇటీవల వెలుగులోకి వచ్చిన లండన్ వీధుల్లో నీరవ్ తిరుగుతున్న దృశ్యాలు ఆయన వేషధారణను పూర్తిగా మార్చేసుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. క్లీన్ షేవ్, నీట్ క్రాఫ్ తో కనిపించే నీరవ్, లండన్ లో మాత్రం గడ్డం, మీసాలు పెంచి తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నీరవ్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని భావించాడట.
పీఎన్బీ కేసు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో తన జాగ్రత్తల్లో తానున్న నీరవ్.. చివరకు ప్లాస్టిక్ సర్జరీకి కూడా ప్రయత్నించాడని తెలుస్తున్నది. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖ కవలికలను మార్చుకునేందుకు చూశాడు. ఆ లోపే తనను గుర్తు పట్టిన మెట్రో బ్యాంక్ క్లర్క్ స్కాట్లాండ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు నీరవ్ మోడీని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో నీరవ్ హోలీ రోజున జైలులోనే గడిపాడు.

బ్రిటన్ వాసినంటూ బుకాయింపు
నీరవ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తిని కూడా బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. తాను బ్రిటన్ వాసినని నిరూపించుకునేందుకు విఫలయత్నం చేశాడు. తాను లండన్ ట్యాక్స్ పేయర్ నని, తనకంటూ సొంత చిరునామా ఉందని, ఓటు హక్కు కోసం బ్రిటన్ ఎన్నికల అధికారుల నుంచి ఆఫర్ కూడా వచ్చిందని జడ్జికి చెప్పాడు. నీరవ్ తరఫు లాయర్లు కూడా ఇదే వాదన వినిపించారు. గతేడాది జనవరి నుంచి నీరవ్ లండన్ లోనే ఉంటున్నాడని, ఆయన కొడుకు ఇక్కడి స్కూల్ లోనే ఐదేళ్లుగా చదువుతున్నాడని, ఓ బిజినెస్ ఐపీఓ కోసం బ్రిటన్ వచ్చి, లండన్ హెడ్ క్వార్టర్ గా తన బిజినెస్ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారని వాదించడం విశేషం.
ఇంట్రెస్టింగ్: నీరవ్ మోడీ అరెస్టు కాగానే చెప్పిన కథ ఇదే... బెయిల్ తిరస్కరించిన కోర్టు

నీరవ్ దగ్గర 4 పాస్ పోర్టులు
గతేడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం నీరవ్ మోడీ పాస్ పోర్టు రద్దుచేసింది. ఆలోపే లండన్ కు చేరుకున్న నీరవ్.. ఇండియన్ పాస్ పోర్టు ఆధారంగా ఇన్వెస్టర్ వీసా సంపాదించాడు. లండన్ లో డైమండ్ హోల్డింగ్స్ పేరిట కంపెనీ రిజిస్టర్ చేసుకున్నాడు. భారత్‌ది కాకుండా మరో మూడు పాస్ పోర్టులు కలిగి ఉన్న నీరవ్ వాటిపై సింగపూర్, యూఏఈ, హాంకాంగ్, కరేబియన్ దీవులకు ప్రయాణం చేసినట్లు బ్రిటన్ అధికారులు గుర్తించారు. నీరవ్ అరెస్ట్ చేసిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఓ పాస్ పోర్టును స్వాధీనం చేసుకోగా.. బ్రిటన్ హోం మినిస్ట్రీ జారీ చేసిన మరో పాస్ పోర్ట్ గడువు తీరిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం బ్రిటన్ డ్రైవింగ్, వెహికిల్ లైసెన్సింగ్ అధారిటీకి ఆయన మరో పాస్ పోర్ట్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

బ్రిటన్‌తో చురుగ్గా సంప్రదింపులు
నీరవ్ అరెస్ట్ నేపథ్యంలో అతనికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను భారత్ బ్రిటన్ కు సమర్పిస్తోంది. వీటి ఆధారంగా వీలైనంత తొందరగా ఆయన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ఈడీ, సీబీఐ ప్రయత్నిస్తున్నాయి. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఉన్న నీరవ్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని భారత తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) బలమైన వాదనలు వినిపిస్తోంది. సీపీఎస్ వాదనల కారణంగానే నీరవ్ కు బెయిల్ తిరస్కరించిన కోర్టు 29 దాకా కస్టడీ విధించింది. నీరవ్ మోడీకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కూడా చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంటిగ్వాలో తలదాచుకుంటున్న నీరవ్ మోడీ మామ మెహుల్ చోక్సీని కూడా ఆ దేశం త్వరలోనే భారత్ కు అప్పగిస్తుందని ఆశిస్తున్నారు.