ఉత్తర కొరియా నియంతను నడిపిస్తోన్న ఆమె? పాలన చేతులు మారిందా? చక్రం తిప్పుతోన్న సోదరి?
వాషింగ్టన్: ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్..దేశ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నారా? నామమాత్రపు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారా? కిమ్ సోదరి ఆయనను నడిపిస్తున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ ఉండదంటూ కిమ్‌జొంగ్ తేల్చేయడం వెనుక మర్మమేంటీ? తాజాగా తలెత్తుతోన్న అనుమానాలు ఇవి. దీనికి కారణాలు లేకపోలేదు. అమెరికా అధ్యక్షుడితో ఈ ఏడాది ఎలాంటి సమావేశాలను నిర్వహించట్లేదంటూ తాజాగా కిమ్‌జొంగ్ చేసిన ప్రకటనకు ఆయన సోదరి కిమ్ యో జొంగ్ ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

హై ప్రొఫైల్ భేటీ ఉండదంటూ..
డొనాల్డ్ ట్రంప్, కిమ్‌జొంగ్ మధ్య ఈ ఏడాది ఓ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు కావొచ్చంటూ ఇదివరకు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు సైతం ఓ దశలో ధృవీకరించారు. కిమ్‌జొంగ్ అంగీకరిస్తే..డొనాల్డ్ ట్రంప్ ఆయనతో భేటీ అవుతారంటూ నాలుగు నెలల కిందటే ఓ ప్రకటన చేశారు. అణ్వస్త్ర దేశంగా ఉత్తర కొరియా ఆవిర్భవించడంతో వారిద్దరి మధ్య ఓ హైప్రొఫైల్ సమావేశం ఏర్పాటు కావచ్చంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా- వాటిని తోసిపుచ్చింది ఉత్తర కొరియా ప్రభుత్వం. అలాంటి ప్రతిపాదనలను కొట్టి పారేసింది.

ట్రంప్‌తో భేటీ కావట్లేదంటూ..
డొనాల్డ్ ట్రంప్‌తో తన సోదరుడు కిమ్‌జొంగ్ ఎలాంటి సమావేశాన్నీ నిర్వహించట్లేదంటూ కిమ్ యో జొంగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ధృవీకరించింది. న్యూక్లియర్ డిప్లొమసీ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య షెడ్యూల్డ్ సమావేశాలు ఏవీ ఇప్పట్లో ఉండకపోవచ్చని స్పష్టం చేసింది. ఈ హైప్రొఫైల్ భేటీపై డొనాల్డ్ ట్రంప్-కిమ్‌జొంగ్ ఇద్దరు ఏవైనా కీలక నిర్ణయాలను తీసుకుంటే తప్ప వారిద్దరూ కలుసుకోవడం అసాధ్యమని కిమ్ యో జొంగ్ స్పష్టం చేసినట్లు ఆ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

రెండేళ్ల కిందటి భేటీకి కొనసాగింపుగా..
అమెరికా రాయబారి స్టీఫెన్ బీగన్.. దక్షిణ కొరియా, జపాన్ పర్యటన ముగింపు దశకు వచ్చిన సమయంలోనే కిమ్ యో జొంగ్ ఈ ప్రకటన చేశారు. దక్షిణ కొరియా, జపాన్లల్లో రెండు రోజుల పాటు స్టీఫెన్ బీగన్ పర్యటించారు. అనంతరం ఆయన ఉత్తర కొరియా పర్యటనకు వెళ్తారని ఆశించినప్పటికీ.. అది సాధ్యం కాలేదు. అదే సమయంలో కిమ్ యో జొంగ్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. నిజానికి 2018లో కిందట డొనాల్డ్ ట్రంప్-కిమ్‌జొంగ్ మధ్య ఓ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటైన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా మరోసారి ఈ ఇద్దరు దేశాధినేతలు భేటీ కావాల్సి ఉంది.

అణ్వస్త్ర విధానంపై భిన్నాభిప్రాయాలు..
అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణ్వస్త్ర విధానాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, రెండు దేశాధినేతలు దీనిపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారని కిమ్ యో జొంగ్ భావిస్తున్నట్లు కొరియన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కాగా.. ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కిమ్ యో జొంగ్ ట్రంప్‌తో భేటీకి తన సోదరుడు నిరాకరించేలా చేశారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమౌతున్నాయి. ట్రంప్ స్థానంలో కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తరువాత.. ఈ భేటీని పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.

అనారోగ్యంతో తెరపైకి సోదరి..
కిమ్‌జొంగ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఆయనకు సర్జరీ నిర్వహించారు. ఆ తరువాత ఆయన కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. సర్జరీ అనంతరం కిమ్‌జొంగ్ మూడుసార్లు మాత్రమే బాహ్య ప్రపంచానికి కనిపించారు. సర్జరీ అనంతరం ఆయన అనారోగ్యం తిరగబెట్టిందని, ఇదివరకట్లా చురుగ్గా పరిపాలనా వ్యవహారాల్లో పాల్గొనలేకపోతున్నారని, వేగంగా నిర్ణయాలను తీసుకోలేకపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఆయన సోదరి కిమ్ యో జొంగ్ ఎంట్రీ ఇచ్చారు. వస్తూ వస్తూనే ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టారు. కిమ్‌ను ముందు ఉంచి.. ఆమే చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.