వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సైన్యంలోని 'రహస్య దళం'లో పని చేసిన టిబెట్ సైనికుడికి అధికారిక అంత్యక్రియలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారత్-చైనా ఉద్రిక్తతలు

ఆ ఇంటిలో ఒక మూలన నీమా తెంజిన్ ఫోటో కనిపిస్తోంది. దీని ఎదురుగా ఒక దీపం వెలుగుతోంది. పక్క గదిలో కొందరు బౌద్ధ గురువులు, కుటుంబ సభ్యులు శాంతి మంత్రాలు జపిస్తున్నారు. ఇది నీమా ఇంటిలో పరిస్థితి.

కొన్ని రోజుల ముందు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సో సరస్సు సమీపంలో ఓ మందుపాతర పేలడంతో 51ఏళ్ల నీమా మరణించారు.

ఈ ప్రాంతంలో కొన్ని నెలలుగా భారత్-చైనా ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నాయి. నీమా మృతికి కారణమైన మందుపాతర 1962 భారత్-చైనా యుద్ధ కాలంనాటిదని సైనిక వర్గాలు బీబీసీకి తెలిపాయి.

''ఆగస్టు 30న రాత్రి 10.30కి నాకు ఫోన్ వచ్చింది. నీమాకు గాయాలయ్యాయని చెప్పారు. ఆయన మరణించారని మాత్రం చెప్పలేదు. కొద్దిసేపటి తర్వాత ఆయన స్నేహితుడు ఫోన్‌ చేసి.. నీమా చనిపోయారని చెప్పాడు''అని నాటి సంగతిని నీమా సోదరుడు నామ్‌దాఖ్ గుర్తుచేసుకున్నారు.

భారత్-చైనా ఉద్రిక్తతలు

21 తుపాకులతో వందనం

నీమా ప్రత్యేక ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్‌ఎఫ్‌ఎఫ్)లో పనిచేసేవాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ రహస్య విభాగంలో దాదాపు 3,500 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది టిబెట్ నుంచి వచ్చిన శరణార్థులే.

నీమా కూడా టిబెట్ నుంచే వచ్చారని, మూడు దశాబ్దాలుగా భారత సైన్యంలో పనిచేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే, ఎస్‌ఎఫ్‌ఎఫ్ గురించి పెద్దగా సమాచారం బయటకు తెలియదు.

అసలు ఇలాంటి విభాగం ఒకటుందని భారత సైన్యం ఎప్పుడూ చెప్పలేదు. అయితే, సైనిక నిపుణులు, విదేశాంగ నిపుణులు, లద్దాఖ్ నుంచి పనిచేస్తున్న కొందరు పాత్రికేయులకు మాత్రం దీని గురించి తెలుసు.

భారత్-చైనా ఘర్షణల నడుమ నీమా మృతి చెందినట్లు భారత అధికారులు ధ్రువీకరించారు. టిబెటన్ సంతతికి చెందిన వారి పాత్ర గురించి భారత సైన్యం ఇలా మాట్లాడటం ఇదే తొలిసారి. నీమాకు 21 తుపాకులతో వందనం సమర్పించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. లెహ్‌లోని టిబెట్ వాసులు, స్థానికులు వీటిలో పెద్దయెత్తున పాల్గొన్నారు.

భారత్-చైనా ఉద్రిక్తతలు

ఎస్‌ఎఫ్‌ఎఫ్ ఎలా ఏర్పడిందంటే..

నీమా అంత్యక్రియలకు హాజరైనవారిలో సీనియర్ బీజేపీ నాయకుడు రామ్‌ మాధవ్ కూడా ఉన్నారు. నీమా శవపేటికపై ఆయన పుష్పగుచ్ఛంతో నివాళులు అర్పించారు.

శవపేటికపై భారత జెండాతోపాటు టిబెట్ జెండానూ కప్పారు. దీన్ని సైనిక వాహనంలో ఇంటి వరకు తీసుకెళ్లారు.

మరోవైపు నీమా ఎస్‌ఎఫ్‌ఎఫ్‌లో సభ్యుడని, లద్దాఖ్‌లో సైన్యం తరఫున పోరాడుతూ ఆయన అమరుడు అయ్యారని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. అయితే కొంతసేపటి తర్వాత ఆ ట్వీట్‌ను ఆయన డిలీట్ చేశారు.

ట్వీట్‌లో భారత్-చైనా సరిహద్దుకు బదులు ఆయన భారత్-టిబెట్ సరిహద్దు అని రాసుకొచ్చారు.

నీమా మృతిపై ఇటు భారత ప్రభుత్వం కానీ, సైన్యం కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. అయితే, భారత మీడియాలో మాత్రం చాలా వార్తలు వచ్చాయి. చైనాకు దీని ద్వారా గట్టి సందేశం పంపినట్లు అయిందని వ్యాఖ్యానాలు కూడా ప్రచురితం అయ్యాయి.

''ఇప్పటివరకు ఆ దళం రహస్యంగా ఉండేది. ఇప్పుడు అది ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సైన్యం కోసం పనిచేసే వారందరినీ గుర్తుపెట్టుకోవాలి. వారికి మద్దతు పలకాలి''అని నామ్‌దాఖ్ వ్యాఖ్యానించారు.

''1971 యుద్ధంలో మేం పోరాడాం. కానీ దాన్ని రహస్యంగా ఉంచారు. పాకిస్తాన్‌పై కార్గిల్ యుద్ధంలోనూ మేం పోరాడాం. అది కూడా రహస్యంగానే ఉంచారు. కానీ, తొలిసారి మా ఉనికిని అంగీకరించారు. నాకు చాలా సంతోషంగా ఉంది''.

1962లో చైనాతో యుద్ధం అనంతరం ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ను ఏర్పాటుచేశారని నిపుణులు చెబుతున్నారు.

''భారత్‌కు శరణార్థులుగా వచ్చిన టిబెటన్ ప్రజలను సైన్యంలోకి చేర్చుకోవడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటుచేశారు. ఎందుకంటే వీరికి అత్యధిక ఎత్తుల్లో పోరాడిన అనుభవం ఉంటుంది. వీరు చైనా సైన్యంపై గెరిల్లా పోరాటాలు చేసేవారు''అని టిబెట్ జర్నలిస్టు, సినీ ప్రముఖుడు కల్‌సింగ్ రిన్‌చెన్ చెప్పారు. మాజీ ఎస్‌ఎఫ్‌ఎఫ్ సభ్యులను రిన్‌చెన్ ఇంటర్వ్యూ చేస్తుంటారు.

1959లో చైనాపై తిరుగుబాటు విఫలం కావడంతో 14వ దలైలామా టిబెట్‌ను వదిలి భారత్‌కు వచ్చేశారు. ఇక్కడ ఆయన అజ్ఞాత టిబెటన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆయనతోపాటు వేల మంది టిబెటన్లు భారత్‌కు వచ్చారు.

భారత్-చైనా ఉద్రిక్తతలు

అమెరికా ప్రత్యేక దళాల శిక్షణ

దలైలామాతోపాటు ఆయనతో వచ్చిన వారికి మద్దతు ఇవ్వడంపై భారత్, చైనాల మధ్య విభేదాలు వచ్చాయి. 1962 యుద్ధంలో భారత్ ఓటమి కూడా ఈ విభేదాలను మరింత పెంచింది.

అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ సహకారంతో భారత మాజీ సైన్యాధిపతి బీఎన్ మాలిక్ ఈ ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ను ఏర్పాటుచేసినట్లు సమాచారం.

ఈ విషయంలో అమెరికా పాత్రపైనా వివాదముంది. కొందరైతే భారత్ సొంతంగానే ఈ దళాన్ని ఏర్పాటుచేసిందని చెబుతుండగా.. కొందరు అమెరికా సాయంతో భారత్ ఏర్పాటు చేసిందని అంటున్నారు.

దాదాపు 12,000 మంది టిబెటన్లకు అమెరికా ప్రత్యేక బలగాలు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు మరికొందరు చెబుతున్నారు.

''మాలో చాలా మందికి అమెరికన్లే శిక్షణ ఇచ్చారు. ఓ సీఐఏ ప్రతినిధికి కొంచెం కొంచెం హిందీ వస్తుంది. అతడే మాలో హిందీ మాట్లాడే నలుగురికి శిక్షణ ఇచ్చారు. సమస్య ఏమిటంటే మాలో చాలా మందికి హిందీ రాదు. అందుకే హిందీ వచ్చిన వారు ముందు శిక్షణ తీసుకొని.. వారు మిగతావారికి శిక్షణ ఇస్తారు''అని ఎస్‌ఎఫ్‌ఎఫ్‌లో చేరిన టిబెటన్ శరణార్థి జంపా వివరించారు.

భారత్-చైనా ఉద్రిక్తతలు

తిరస్కరించిన చైనా

తొలుత కేవలం టిబెటన్ శరణార్థుల కోసమే ఈ దళాన్ని ఏర్పాటుచేశారు. కానీ, తర్వాత మిగతా వారికి దీనిలో చోటు ఇస్తూ వచ్చారు.

కేంద్ర క్యాబినెట్‌కు నేరుగా ఈ దళం రిపోర్టులు సమర్పిస్తుందని, భారత సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారి కింద ఇది పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

''చైనాకు వ్యతిరేకంగా రహస్యంగా సమాచారం సేకరించడం, పనిచేయడమే ఈ దళం లక్ష్యం''అని రిన్‌చెన్ వివరించారు.

మరోవైపు ఎస్‌ఎఫ్‌ఎఫ్ లాంటిదేమీలేదని చైనా తిరస్కరిస్తూ వస్తోంది.

''భారత సైన్యంలో టిబెటన్ శరణార్థులు పనిచేస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ ప్రశ్నను మీరు భారత్‌ను అడగాలి''అని ఇటీవల విలేకరుల సమావేశంలో చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ వ్యాఖ్యానించారు.

సరిహద్దు

సరిహద్దుల విషయంలో ఉద్రిక్తతలు

''చైనా వాదనలో ఎలాంటి సందేహాలూ లేవు. టిబెటన్‌లకు స్వాతంత్ర్యం కోసం మద్దతు పలుకుతున్న ఏ దేశంతోనైనా మేం విభేదిస్తాం''అని చున్యింగ్ వ్యాఖ్యానించారు.

టిబెట్ తమ దేశంలో భాగంగా చైనా భావిస్తూ వస్తోంది.

గాల్వన్‌ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య విధ్వంసకర ఘర్షణల అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించారు. అయితే చైనా వైపు మరణించిన వారి సమాచారాన్ని బయటకు విడుదల చేయలేదు.

రెండు దేశాల మధ్య అస్పష్టమైన సరిహద్దే చాలా వివాదాలకు కారణం. చాలా క్లిష్టమైన ప్రాంతాల గుండా ఈ సరిహద్దు ఉంది. ఈ ప్రాంతాలకు చేరుకోవడం చాలా కష్టం. దీంతో స్పష్టమైన సరిహద్దులు లేకుండా పోయాయి.

''ఇదొక వింత పరిస్థితి. టిబెటన్లను చైనాపై పోరాటంలో ఉపయోగిస్తామని భారత్ చాలాసార్లు చెప్పింది. కానీ, అధికారికంగా మాత్రం స్పందించదు''అని వెస్ట్‌మినిస్టర్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్ దిబ్యేశ్ ఆనంద్ వ్యాఖ్యానించారు.

''మేం భారత సైనికులు చేసే అన్ని పనులూ చేస్తాం. కానీ భారత సైనికులకు ఇచ్చే గుర్తింపు మాకు ఇవ్వరు. ఇది వింటే చాలా బాధని పిస్తుంది''అని మాజీ ఎస్‌ఎఫ్‌ఎఫ్ సభ్యుడైన జంప ఆవేదన వ్యక్తంచేశారు.

ఎస్‌ఎఫ్‌ఎఫ్ ఉనికిని భారత్ అంగీకరిస్తే.. చైనా, భారత్‌ల మధ్య సంబంధాలు మరింత దిగజారతాయి. ఎందుకంటే భారత్‌లో నివసిస్తున్న 90 వేల పైచిలుకు టిబెటన్ల విషయంలో ఇప్పటికే చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

వీరిలో చాలా మంది మళ్లీ టిబెట్‌కు వెళ్తామని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. అయితే, చాలా మంది భారత్‌ను తమ సొంత దేశంగా భావిస్తారు.

''భారత్, టిబెట్‌ల కోసం నీమా తమ జీవితాన్ని త్యాగం చేసినందుకు మేం గర్వపడుతున్నాం''అని నీమా బంధువు తుడుప్ తాశీ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Official funeral of a Tibetan soldier who served in the 'Secret Forces' of the Indian Army
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X