బిగ్ షాక్ : ఒకేసారి 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్న సంస్థ.. కరోనా ఎఫెక్ట్..
బ్రిటీష్ ఇంధన దిగ్గజం బీపీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 10వేల మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 15శాతంగా చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పాటిస్తుండటంతో చమురు ధరలు అమాంతం పడిపోయిన నేపథ్యంలో.. నష్టాలను తగ్గించుకోవడానికి బీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపింది.

ఉద్యోగులకు సీఈవో మెయిల్..
బీపీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నర్డ్ లూనే కంపెనీ ఉద్యోగులకు రాసిన ఈమెయిల్లో ఉద్యోగాల కోత గురించి పేర్కొన్నారు. చమురు ధరలు దారుణంగా పడిపోవడంతో.. కంపెనీని నష్టాల నుంచి తిరిగి లాభాల పట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఆర్జిస్తున్న దాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తోందని.. ప్రతీరోజూ మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. దాని కారణంగా కంపెనీ నికర అప్పు 6 బిలియన్లకు చేరుకుందన్నారు.

ఉద్యోగాలు కోల్పోయేవారిలో వారే ఎక్కువ..
ఉద్యోగాలు కోల్పోయేవారిలో ఎక్కువమంది ఆఫీస్ స్టాఫ్ ఉంటారని సీఈవో స్పష్టం చేశారు. అలాగే ఈ ఏడాది సీనియర్లకు వేతనాల పెంపు ఉండదని,అలాగే నగదు బోనసులను కూడా రద్దు చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో బీపీ 4.4బిలియన్ డాలర్ల మేర నష్టాలను చవిచూసింది. అదే సమయంలో బీపీ గ్రూప్ సీఈవో బాబ్ డూడ్లే పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా ఆయన ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. సంస్థతో ఆయనకు 40 ఏళ్ల అనుబంధం ఉంది.

కంపెనీ నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకే..
కొత్త సీఈవో లూనే బీపీ సంస్థకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేశారు. 2050 నాటికి 'నెట్ జీరో' కార్బన్ ఉద్గారాలను లక్ష్యంగా పెట్టారు. సంస్థ భవిష్యత్ గురించి తాను నమ్మకంగా ఉన్నానని.. ఇది సంస్థను సరికొత్తగా ఆవిష్కరించాల్సిన సమయమని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ నిర్వహణకు ఏటా 22బిలియన్ డాలర్లు అవుతోందన్నారు. ఇందులో 8 బిలియన్ డాలర్లు ఉద్యోగుల కోసమే వెచ్చిస్తున్నట్టు తెలిపారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ నిర్వహణ ఖర్చును తగ్గించుకోవాలనుకుంటున్నామని.. ఈ ఏడాది 25శాతం మేర ఖర్చును తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. తద్వారా 3బిలియన్ డాలర్లు కంపెనీకి ఆదా అవుతాయని చెప్పారు.