కుల్‌భూషణ్ జాధవ్‌కు భారత కాన్సులర్ యాక్సెస్ ఇస్తామంటూ పాక్ ప్రకటన
ఇస్లామాబాద్ : మాజీ నేవీ కమాండర్ కుల్భూషణ్జాదవ్కు భారత కాన్సులర్ యాక్సెస్ ఆగష్టు 2న ఇస్తామని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తమ నిర్ణయంను ప్రకటించి ఇప్పుడు భారత్ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. కుల్‌భూషణ్ జాదవ్‌కు భారత అధికారులు కలిసేందుకు అనుమతి ఇస్తామని పాక్ ఒప్పుకున్న 15 రోజులకు అనుమతి విషయంపై స్పష్టత ఇచ్చింది. వియన్నా కన్వెన్షన్‌ను పాకిస్తాన్ ఉల్లంఘించిందంటూ అంతర్జాతీయ న్యాయస్థానం మొట్టికాయ వేశాకా భారత్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇచ్చేందుకు పాక్ అంగీకరించింది.
అంతర్జాతీ కోర్టు కుల్‌భూషణ్ జాదవ్‌కు భారత కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని చెప్పడంతో కోర్టు ఆదేశాలను బాధ్యతాయుతమైన దేశంగా పాకిస్తాన్ అమలు చేస్తుందని పాక్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే పాక్ చట్టాలకు అనుగుణంగానే ఇది జరుగుతుందని స్పష్టం చేసింది. దీనిపై సాధ్యసాధ్యాలను కూడా వర్కౌట్ చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే జూలై 18న అంతర్జాతీయ కోర్టు విచారణ చేసి తీర్పును వెలువరించింది. కుల్ భూషణ్ జాదవ్‌కు మరణ శిక్షను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. అంతేకాదు మరణశిక్ష విధించడంపై పునఃపరిశీలించాలని పాకిస్తాన్‌ను అంతర్జాతీయ కోర్టు కోరింది.

ఇక ముందునుంచి భారత్ చెబుతున్నట్లుగా పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్‌ను ఉల్లంఘించిందని అంతర్జాతీయ న్యాయస్థానం అంగీకరించింది. అంతేకాదు జాదవ్ గూఢచర్యం చేయలేదని పేర్కొంది. ఇక తీర్పు వెలువరించిన వెంటనే భారత విదేశాంగ కార్యదర్శి రవీష్ కుమార్ స్పందించారు. అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినట్లుగా పాకిస్తాన్ వెంటనే కుల్‌భూషణ్ జాదవ్‌ను భారత అధికారులు కలిసేందుకు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే అని కోర్టు చెప్పిందంటే అది వెంటనే జరిగిపోవాలని రవీష్ కుమార్ చెప్పారు.