• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాక్‌లో మరో సంక్షోభం- ఇమ్రాన్‌ ఖాన్‌ను తప్పించేందుకు కూటమిగా విపక్షం- ఆర్మీపైనా పోరు..

|

నిత్యం రాజకీయ సంక్షోభాలతో సతమతం అయ్యే పాకిస్తాన్‌లో మరో కొత్త సంక్షోభానికి విపక్షం తెరలేపింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు ఆయన్ని ఆ పదవిలో కూర్చోబెట్టిన సైన్యానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ కలిపి ఓ కూటమిగా మారాయి. దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. దేశంలోని వ్యవస్ధలో ఆర్మీ జోక్యాన్ని నిరసిస్తూ ప్రారంభమైన విపక్షాల పోరాటం ఇప్పుడు వారిని ఓ కూటమిగా మార్చింది. విపక్ష పార్టీలన్నీ కలిపి పాకిస్తాన్‌ ప్రజాస్వామ్య పోరు పేరుతో ప్రారంభించిన ఈ కూటమి వచ్చే నెల నుంచి తమ పోరాటం ప్రారంభించనుంది. దీనికి లండన్‌లో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో పాటు మరో మాజీ ప్రధాని భుట్టో కుటుంబం కూడా మద్దతుగా నిలుస్తోంది.

 మరో సంక్షోభం ముంగిట పాకిస్తాన్‌...

మరో సంక్షోభం ముంగిట పాకిస్తాన్‌...

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని అధికార పార్టీ తెహ్రీక్‌ ఇ- ఇన్సాఫ్‌తో పాటు ఆయన్ను అధికారంలో కూర్చోబెట్టిన సైన్యానికి వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటయ్యాయి. కొంతకాలంగా అధికార వ్యవస్ధల్లో సైన్యం జోక్యం పెరిగిపోతోందని ఆరోపిస్తున్న విపక్షాలు.. అందుకు ఇమ్రాన్ ఖాన్‌ సర్కారు మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే కారణంతో ఇమ్రాన్‌ సర్కారును సాగనంపేందుకు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. పాకిస్తాన్‌ డెమోక్రాటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) పేరుతో విపక్ష పార్టీలైన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ, పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌), జమాతే ఉలేమా-ఏ-ఇస్లాం ఫజల్‌ (జేయూఐ-ఎఫ్‌)తో పాటు ఇతర పార్టీలు ఒక్కటయ్యాయి. నిన్న వర్చువల్ మీటింగ్‌ ద్వారా సమావేశమైన విపక్ష కూటమి నేతలు భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేశాయి.

 దేశవ్యాప్త పోరుకు నిర్ణయం..

దేశవ్యాప్త పోరుకు నిర్ణయం..

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ను గద్దె దింపేందుకు వీలుగా విపక్ష కూటమి 26 అంశాలతో ఓ అజెండాను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు దశల్లో పోరును ఖరారు చేసింది. అక్టోబర్‌ నుంచి ఈ పోరు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి దశలో నాలుగు రాష్ట్రాల్లో విపక్ష పార్టీలన్నీ కలిపి సంయుక్తంగా ర్యాలీలు నిర్వహిస్తాయి. డిసెంబర్లో దేశవ్యాప్తంగా ప్రతీ ప్రాంతంలో మరింత భారీ ర్యాలీలకు పిలుపునిచ్చారు. చివరికి వచ్చే ఏడాది జనవరిలో రాజధాని ఇస్లామాబాద్‌కు లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని కూటమి నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వంపై, ఆర్మీపై పూర్తి స్ధాయిలో ఒత్తిడి పెంచేందుకు విపక్ష కూటమి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత ఇమ్రాన్‌ ఖాన్ సర్కారును రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌తో ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

 ఆర్మీ జోక్యమే అసలు సమస్య...

ఆర్మీ జోక్యమే అసలు సమస్య...

సాధారణంగా పాకిస్తాన్‌ రాజకీయ వ్యవహారాల్లో ఆర్మీ జోక్యం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇది అప్పుడప్పుడూ శృతి మించేలా ఉంటుంది. అప్పుడు రాజకీయ పక్షాలు సహజంగానే ఆర్మీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటాయి. తాజాగా మరోసారి అదే జరుగుతోంది. రాజకీయ వ్యవస్దల్లో ఆర్మీ జోక్యమేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ప్రధాని ఇమ్రాన్‌ కూడా స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే పటిష్టంగా ఉండే ఆర్మీని ప్రశ్నిస్తే తన పదవి ఊడటం ఖాయమని ఇమ్రాన్‌కూ తెలుసు. దీంతో ఆయన ఆర్మీ పాత్రపై స్పందించడం లేదు. కాబట్టి పార్లమెంటు రబ్బరు స్టాంప్‌గా మారిపోయి ఆర్మీ తమను నియంత్రించడమేంటని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగని ఆర్మీపై నేరుగా యుద్ధం ప్రకటించే పరిస్ధితి లేదు. దీంతో ఆర్మీకి బదులుగా వారు అండగా నిలుస్తున్న ఇమ్రాన్‌పై విపక్షం దేశవ్యాప్త పోరుకు సిద్దమవుతోంది.

 నవాజ్‌ షరీఫ్‌ రాకకు సహకరిస్తున్న విపక్షం..

నవాజ్‌ షరీఫ్‌ రాకకు సహకరిస్తున్న విపక్షం..

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం నుంచి వెళ్లిపోయి లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను రంగంలోకి దింపేందుకు విపక్షం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇమ్రాన్‌ను గద్దె దించేందుకు తగిన వ్యక్తిగా నవాజ్‌ను భావిస్తున్న విపక్ష నేతలు ఆయన్ను నిన్న జరిగిన విపక్ష కూటమి వర్చువల్‌ భేటీకి ఆహ్వానించారు. రాజకీయాల్లోకి తిరిగి వచ్చేందుకు ఎలాగో ఎదురుచూస్తున్న నవాజ్‌ షరీఫ్‌ వారు కోరగానే వర్చువల్‌ భేటీకి హాజరయ్యారు. త్వరలో దేశానికి తిరిగి వచ్చి ఇమ్రాన్ సర్కారుపై పోరుకు విపక్షంతో కలిసి ప్రణాళికలు రచించేందుకు నవాజ్‌ షరీఫ్‌ రంగం సిద్దం చేస్తున్నారు. అయితే ఆర్మీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షం చేసే పోరు ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

English summary
Demanding Pakistan Prime Minister Imran Khan’s immediate resignation, the country’s major Opposition parties have launched an alliance to hold a countrywide protest movement to oust his government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X