
పాకిస్తాన్: కరాచీలో ముగ్గురు చైనా పౌరుల హత్య తరువాత రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయా?

కరాచీలో గత నెలలో ముగ్గురు చైనా పౌరుల హత్య తర్వాత పాకిస్తాన్-చైనా ద్వైపాక్షిక సంబంధాలు కాస్త ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌పై చైనా విశ్వాసం తగ్గినట్లు పాకిస్తానీ సెనేట్ డిఫెన్స్ కమిటీ నిపుణుడు కూడా అంగీకరించారు.
''తమ పౌరులను, ప్రాజెక్టులను పాకిస్తాన్ భద్రతా దళాలు కాపాడగలవనే విషయంలో చైనా విశ్వాసం కాస్త తగ్గినట్లు అనిపిస్తోంది’’అని డిఫెన్స్ కమిటీ ఛైర్మన్ ముషాహిద్ హుస్సేన్ చెప్పినట్లు డాన్ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది.
గత వారం చైనా ఎంబసీ పర్యటనకు వెళ్లిన పాకిస్తానీ నాయకుల్లో సెనేటర్ ముషాహిద్ కూడా ఒకరు. చైనా పౌరుల మృతిపై వీరు సంతాపం ప్రకటించారు. కరాచీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చైనా పౌరులపై దాడి అనంతర పరిణామాలపై డాన్ వార్తా సంస్థతో ముషాహిద్ మాట్లాడారు.
కరాచీలో చైనీయులపై జరిగిన దాడితో గత ఏడాదిలో చైనావాసులే లక్ష్యంగా మూడు దాడులు జరిగినట్లయింది.
''ఆ దాడి వల్ల చైనావాసుల్లో ఒక రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అదే తరహాలో మళ్లీ మళ్లీ దాడులు జరుగుతున్నాయి. అంటే మనవైపు భద్రతా పరమైన లోపాలున్నట్లు స్పష్టం అవుతోంది. మనం హామీలు ఇస్తున్నప్పటికీ, వాటిని నెరవేర్చలేకపోతున్నాం’’ అని ఆయన అన్నారు.
''మన భద్రతా సంస్థలు కళ్లు మూసుకుని పడుకున్నట్లు అనిపిస్తోంది. అలాంటి దాడులు జరుగుతూ పోతే, చైనా మాత్రమే కాదు. ఇతర దేశాల పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లిపోతాయి’’అని ఆయన చెప్పారు.
కరాచీ దాడి తర్వాత పెద్దయెత్తున చైనావాసులు పాకిస్తాన్ వదిలివెళ్లిపోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, అలాంటిదేమీలేదని చైనా అధికారులు చెప్పినట్లు డాన్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.
- 'ఇస్లాంను భుజాన వేసుకునే’ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి పోవడంపై ఇస్లామిక్ ప్రపంచం ఏమనుకుంటోంది?
- పాకిస్తాన్: ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

చైనా ఏం అంటోంది?
పాకిస్తాన్లో పరిణామాలపై బీజింగ్‌లో ఒక విలేకరుల సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియాన్ ఝావో మాట్లాడారు. ''రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు ఉగ్రవాదులు ఇలాంటి దాడులు చేపడుతున్నారు. కానీ, వారు విజయం సాధించలేరు’’అని ఆయన అన్నారు.
మరోవైపు చైనా ప్రభుత్వ వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక సంపాదకీయాన్ని కూడా ప్రచురించింది. ''చైనా ప్రజలకు కల్పిస్తున్న భద్రతను కొన్నేళ్లుగా పాకిస్తాన్ మరింత పటిష్ఠం చేస్తూ వస్తోంది. అయినప్పటికీ, భద్రతా పరమైన లోపాల వల్ల దాడులు జరుగుతున్నాయి’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

నిధుల విడుదలలో జాప్యం
సీపెక్ ప్రాజెక్టుల విషయంలో చోటుచేసుకుంటున్న జాప్యం వల్ల పాకిస్తాన్-చైనాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది.
సీపెక్ కింద చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు నిధుల విడుదలలో జాప్యం చోటుచేసుకుంటోందని ఆ కథనంలో పేర్కొన్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం సీపెక్ అథారిటీని రద్దుచేసింది. సీపెక్ ప్రాజెక్టులను వేగంగా చేపట్టేందుకు ఈ అథారిటీని ఏర్పాటుచేశారు.
''మౌలిక సదుపాయాల కల్పన కోసం సీపెక్ కింద చేపడుతున్న ప్రాజెక్టులకు నిధులను విడుదల చేసేందుకు చైనా నిరాకరిస్తోంది. మరోవైపు సీపెక్ కింద కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు చైనా కంపెనీలు నిరాకరిస్తున్నాయి. మొదట పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త ప్రాజెక్టులు చేపడతామని అంటున్నాయి’’అని ఏఎన్ఐ కథనంలో వివరించారు.
''సీపెక్ రుణాల కోసం భారీ వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. మరోవైపు సీపెక్ ప్రాజెక్టులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో నిధుల విడుదలలో జాప్యం చేసుకుంటోంది’’అని ఏఎన్ఐ కథనంలో పేర్కొన్నారు.
మరోవైపు పాకిస్తాన్ కూడా సీపెక్ రుణాల కోసం భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. అయినప్పటికీ ఈ ప్రాజెక్టుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది.
పాత బకాయిలు చెల్లించకపోవడం వల్లే చైనా విద్యుత్ కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేశాయని ఏఎన్ఐ కథనంలో వివరించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక లోటు 13.2 బిలియన్ డాలర్లకు (రూ.1,01,581 కోట్లు) పెరిగింది. ఇది ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల జీడీపీలో ఐదు నుంచి ఆరు శాతం వరకూ ఉంది.
- చైనా, భూటాన్ ఒప్పందంతో భారత్‌కు టెన్షన్ తప్పదా... 'చికెన్స్ నెక్' మీద డ్రాగన్ కన్ను పడిందా?
- చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?
గత నెలలో కరాచీలో దాడి
ఏప్రిల్ 26న కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూజియస్ సెంటర్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు చైనా టీచర్లు మరణించారు.
కన్ఫ్యూజియస్ సెంటర్‌కు టీచర్లను తీసుకెళ్తున్న బస్సుపై మిలిటెంట్లు దాడి చేశారు.
ఈ సెంటర్‌కు ఇటీవల డైరెక్టర్ నియమితులైన అధికారితోపాటు మరో ఇద్దరు టీచర్లు, ఒక పాకిస్తానీ డ్రైవర్ ఈ దాడిలో మరణించారు.
షారీ బలూచ్ అలియాస్ బర్మాస్ ఈ దాడిని చేపట్టినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఈ సంస్థపై వేర్పాటువాద మిలిటెంట్ సంస్థగా పాకిస్తాన్ ముద్ర వేసింది.
- భారత్ – చైనా: గల్వాన్ లోయ ఘర్షణలకు ఏడాది.. సరిహద్దుల్లో పరిస్థితి ఇప్పుడెలా ఉంది
- ఆర్సీఈపీ: చైనా ముందుండి నడిపించిన ఈ ఒప్పందంలో భారత్ ఎందుకు చేరలేదు?

మూడు ప్రాజెక్టులు మాత్రమే పూర్తి
సీపెక్ ప్రాజెక్టుల్లో భాగంగా గ్వాదర్ నౌకాశ్రయంలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో కేవలం మూడు మాత్రమే పాకిస్తాన్ పూర్తి చేయగలిగిందని సీపెక్ అధికారులు చెప్పినట్లు పాకిస్తానీ వార్తా పత్రిక ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఓ కథనం ప్రచురించింది. వీటి మొత్తం విలువల 300 మిలియన్లు (రూ.2308 కోట్లు) మాత్రమే. మరోవైపు 2 బిలియన్ డాలర్ల (రూ.15391 కోట్లు )విలువైన మరో 12 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో మంచి నీటి సరఫరా, విద్యుత్‌లకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులపై స్టాటస్ నివేదికను గత నెలలో పాకిస్తాన్ ప్రభుత్వానికి సీపెక్ అథారిటీ సమర్పించింది.
కేవలం వీటిలో మూడు ప్రాజెక్టులు మాత్రమే పూర్తైనట్లు నివేదికలో పేర్కొన్నారు. వీటిలో గ్వాదర్ స్మార్ట్ పోర్ట్ సిటీ మాస్టర్ ప్లాన్ కూడా ఉంది.
ప్రస్తుతం చాలా ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్‌ను ఇరాన్ నుంచి దిగుమతి చేస్తున్నారు. ఇక్కడ సొంతంగా విద్యుత్ ఉత్పత్తిచేసే ప్రాజెక్టు 2017లోనే పూర్తికావాల్సి ఉంది. కానీ, అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
- 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం: భారత్‌ను భయపెట్టేందుకు అమెరికా నేవీని పంపించింది. తర్వాత ఏం జరిగింది?
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
ఏమిటీ సీపెక్ ప్రాజెక్టు?
62 బిలియన్ డాలర్ల (రూ.4,77,121 కోట్లు) పెట్టుబడులతో చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్)ను చైనా చేపడుతోంది. దీనిలో భాగంగా పాకిస్తాన్లో చాలా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడుతున్నారు.
చైనా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌లో సీపెక్ కూడా భాగం. ఇది 2013లో ప్రారంభమైంది. అయితే, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతూ వస్తోంది. దీంతో చాలా ప్రాజెక్టులు మొదలు కూడా కాలేదు.
సీపెక్‌లో భాగంగా పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో గ్వాదర్ ఓడరేవును చైనా అభివృద్ధి చేస్తోంది.
ఇన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వస్తున్నప్పటికీ గ్వాదర్ ప్రాంత వాసులకు మంచినీటికి కూడా చాలా కష్టాలు పడాల్సి వస్తోందని బీబీసీ పరిశోధనలో తేలింది. స్థానికులు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకించడానికి ఇది కూడా ఒక కారణం.
- రాజీవ్ గాంధీ 1971 యుద్ధంలో దేశం వదిలి పారిపోయారా
- 'మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
చైనా పౌరులపై ఎప్పుడు దాడులు జరిగాయి?
- 2022 ఏప్రిల్ 26న కరాచీలో జరిగిన దాడిలో ముగ్గురు చైనా పౌరులు మరణించారు.
- 2021 జులై 14లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన బాంబు దాడిలో పది మంది చైనా పౌరులు మరణించారు. ఈ దాడిలో మరో 26 మంది చైనా వాసులు గాయాలపాలయ్యారు.
- 2021, జులై 28న కరాచీలో చైనీయులు ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపారు.
- 2019 మే 11న గ్వాదర్‌లో చైనీయులు బసచేసే ఒక ఫైవ్ స్టార్ హోటల్‌పై మిలిటెంట్లు దాడిచేశారు.
- 2018 నవంబరు 23న పాకిస్తాన్‌లోని చైనా కాన్సులేట్‌పై దాడి జరిగింది. దీనిలో నలుగురు మరణించారు.
- 2018, ఆగస్టు 11న బలూచిస్తాన్‌లో ముగ్గురు చైనా ఇంజినీర్లపై దాడి జరిగింది.
- 2018 ఫిబ్రవరిలో కరాచీలో ఇద్దరు చైనా పౌరులపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు.
- 2017 మేలో క్వెట్టాలో ఒక చైనా జంటను కిడ్నాప్ చేసి, హత్య చేశారు.
ఇవి కూడా చదవండి:
- కాజల్ అగర్వాల్: 'నిన్ను కన్న క్షణమే నీతో ప్రేమలో పడిపోయా...'
- మదర్స్ డే: తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇది
- తాలిబాన్ ఆదేశం: 'మహిళలు బురఖా ధరించాల్సిందే.. లేకుంటే కుటుంబంలోని మగవాళ్లకు జైలు శిక్ష’
- భారత్‌లో మెక్‌డోనాల్డ్స్ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ ఎలా విజయం సాధిస్తోంది
- Mother's Day: మాతృ దినోత్సవాన్ని మొదలుపెట్టింది, తర్వాత రద్దు చేయాలని డిమాండ్ చేసిందీ ఈమే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)