ఉద్యోగం ఆశ చూపి : ఇండియన్ యువతిని రేప్ చేసిన పాకిస్తానీ
దుబాయ్ : ఉద్యోగాల పేరిట మహిళలను వంచిస్తున్న ఘటనలు రోజూ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దుబాయ్ లోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఉద్యోగం పేరుతో ఓ భారతీయ యువతిని నమ్మించి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన ఓ పాకిస్థాన్ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. స్థానిక రియల్ ఎస్టేట్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గా పనిచేస్తున్న ఓ 33 ఏళ్ల పాకిస్థాన్ వ్యక్తిని ఉద్యోగం కావాలంటూ సంప్రదించింది ఇండియాకి చెందిన యువతి(19). మహిళ అడిగిన సహాయాన్ని ఆసరాగా తీసుకున్న సదరు పాకిస్తానీ, ఇంటర్వ్యూ పేరు చెప్పి యువతిని రషీదియా అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు.

ఉద్యోగంపై ఆశతో సదరు యువతి కూడా మరో ఆలోచన లేకుండా అతనితో పాటు ఆ ప్రాంతానికి వెళ్లింది. కాగా.. తీరా అక్కడికి చేరుకున్న తర్వాత యువతిని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు.
ఘటన తర్వాత ఎలాగోలా నిందితుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు, జరిగిన విషయాన్ని పోలీసులను ఫిర్యాదు చేసింది. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.