
మిస్ యూనివర్స్ కంటెస్ట్పై ఇజ్రాయెల్-పాలస్తీనా గొడవ: బాయ్‌కాట్ పిలుపు: ప్రతికూల పరిస్థితుల్లో
జెరుసలెం: ఇజ్రాయెల్ ఇల్లియాట్‌లో నిర్వహించిన 70వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో భారతీయురాలు హర్నాజ్ సంధు విజేతగా నిలిచారు. పంజాబ్‌కు చెందిన మోడల్ ఆమె. 17 ఏళ్ల వయస్సు నుంచే వివిధ అందాల పోటీల్లో పాల్గొంటున్నారు. టైటిల్స్‌ను గెలుస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన మిస్ దివా- 2021 టైటిల్‌ను ఎగరేసుకెళ్లారు. అంతకంటే ముందు 2019లో ఫెమీనా మిస్ ఇండియా పంజాబ్ విన్నర్‌గా నిలిచారు. టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
హర్నాజ్ కంటే ముందు ఇద్దరు భారతీయులు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్నారు. సుస్మితాసేన్, లారాదత్తా ఈ ఘనతను సాధించారు. 2000లో లారాదత్తా మిస్ యూనివర్స్‌గా నిలిచారు. ఆ తరువాత మళ్లీ భారత్ ఖాతాకు టైటిల్ దక్కడం ఇదే తొలిసారి. 2019లో ఏడాది నిర్వహించిన మిస్ ఇండియా అందాల పోటీల్లో టాప్-12లో నిలిచారు. ఇప్పుడు హర్నాజ్ సంధు ప్రతికూల పరిస్థితుల్లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇజ్రాయెల్ దీనికి వేదిక కావడం అంతర్జాతీయ వివాదానికి కేంద్రబిందువైందీ ఈవెంట్. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి వైరం ఉందనే విషయం తెలిసిందే. అదే ఇజ్రాయెల్.. మిస్ యూనివర్స్ అందాల పోటీలను నిర్వహించడాన్ని పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఈవెంట్‌ను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. పాలస్తీనా సారథ్యాన్ని వహిస్తోన్న బాయ్‌కాట్ మూవ్మెంట్.. కొన్ని హెచ్చరికలను సైతం జారీ చేసింది. ఈ అందాల పోటీలను అడ్డుకుంటామంటూ పేర్కొంది.
అంతర్జాతీయంగా పాలస్తీనాకు మద్దతు పలుకుతున్న కొన్ని దేశాలు.. ఈ ఈవెంట్‌ను బహిష్కరించాయి కూడా. ది పాలస్తీనియన్ క్యాంపెయిన్ ఫర్ అకడమిక్ అండ్ కల్చరల్ బాయ్‌కాట్ ఆఫ్ ఇజ్రాయెల్ లిఖితపూరకంగా వార్నింగ్స్ ఇచ్చింది. ఇందులో పాల్గొనదలిచిన వారందరూ విత్‌డ్రా కావాలని సూచించింది. ఇండొనేషియా, మలేసియా ఈ అందాల పోటీల్లో పాల్గొనలేదు. కోవిడ్ 19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తాము పాల్గొనట్లేదని, మరే ఇతర కారణం కాదని వివరణ ఇచ్చాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా తన దేశం నుంచి ఎవ్వరినీ పంపించలేదు. మొదట్లో యుఏఈ.. ఇజ్రాయెల్‌ను విభేదించేది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్.. ఆ దేశంలో పర్యటించడంతో ఈ వివాదాలకు పుల్‌స్టాప్ పడింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. అయినప్పటికీ.. మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పాల్గొనట్లేదని స్పష్టం చేసింది యూఏఈ. తమ ప్రతినిధిని పంపించడానికి చాలినంత సమయం దక్కలేదనే వివరణ ఇచ్చింది.