కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమం?: పెంటగాన్ ఏం చెప్పిందంటే..?
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాట్ టాపిక్‌గా మారారు. ఆయన ఆరోగ్యం విషమించిందని, అతని తర్వాత ఉత్తర కొరియా బాధ్యతను కిమ్ సోదరి చూసుకునే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.

నిఘా విభాగం స్పష్టత లేదు..
కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను అమెరికా ఖండించింది. అమెరికాలో రెండో అత్యంత కీలకమైన పదవిలో కొనసాగుతున్న యూఎస్ జనరల్ ఈ విషయంపై స్పందించారు. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఏ నిఘా విభాగం కూడా ఖరారు చేయలేదని, అలాగే తిరస్కరించలేదని చెప్పారు.

కిమ్ ఆధీనంలోనే మిలిటరీ..
అయితే, కిమ్ జోంగ్ ఉన్ నియంత్రణలోనే ఆ దేశ సైన్యం ఉందని తాము భావిస్తున్నట్లు యూఎస్ జనరల్ తెలిపారు. న్యూక్లియర్ దళాలు, ఆర్మీ బలగాలు కూడా ఇప్పటికీ కిమ్ జోంగ్ ఉన్ ఆధీనంలోనే ఉన్నాయని తాము నమ్ముతున్నట్లు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వైస్ ఛైర్మన్, ఎయిర్ ఫోర్స్ జనరల్ జాన్ హైటన్ తెలిపారు. దీన్ని నమ్మకపోవడానికి ఎలాంటి కారణాలు లేవని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ఇలా..
కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇంతకుముందు స్పందించారు. కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదని చెప్పారు. తమ అధికారులు కిమ్ జాంగ్ ఉన్ పరిస్థితి విషమంగా ఉందని చెబుతుండగా దక్షిణ కొరియా ప్రభుత్వం మాత్రం కిమ్ బాగానే ఉన్నారనే ప్రకటన చేసిందని దీంతో స్పష్టమైన సమాచారం లేదని ట్రంప్ చెప్పారు. ఒకవేళ నిజంగానే కిమ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోతే తాను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు.
4

ఉత్తర కొరియాలో ఏం జరుగుతోంది..?
కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతోనే ఆయన గత కొద్ది రోజులుగా బయట కనిపించడం లేదని పలు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. కిమ్ తర్వాత ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియా బాధ్యతలు చూసుకుంటారని కూడా కథనాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఉత్తర కొరియా దాయాది దేశం దక్షిణ కొరియా మాత్రం కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతోంది. కానీ, ఇటీవల ఉత్తరకొరియాలో జరిగిన కిమ్ జోంగ్ ఉన్ తాత జయంతి ఉత్సవాల్లో ఆయన కనిపించకపోవడం మీడియాలో వచ్చిన వార్తలకు బలం చేకూరుస్తోంది. కిమ్ పై ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ ఉత్తర కొరియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.