వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎన్నికల్లో భారత్, పాకిస్తాన్ ప్రజలు ఒక్కటయ్యారు.. ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అది 2012 డిసెంబర్ 14. అమెరికాలోని కనెక్టికట్‌లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పుల వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది.

అప్పుడు ఒక పార్టీలో పాల్గొనటానికి తాను అధ్యక్ష భవనం శ్వేతసౌథంలో ఉన్నానని భారతీయ అమెరికన్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ శేఖర్ నరసింహన్ గుర్తుచేసుకున్నారు. కాల్పుల వార్త తెలియగానే పార్టీ వాతావరణం విషాదంగా మారిందని చెప్పారు. ఆ భయానక కాల్పుల్లో 20 మంది చిన్నారులు.. పదేళ్ల లోపు వయసు పిల్లలు, మరో ఆరుగురు పెద్దలు చనిపోయారనే వివరాలు తెలిసి ఎవరికీ మాటలు పెగలలేదన్నారు.

అదే రోజు దిలావర్ సయ్యద్‌ను కలిశారు శేఖర్. ఆయన ఒక పాకిస్తానీ అమెరికన్.

''మా హృదయాలు కలిశాయి. నా లాగే భావోద్వేగానికి గురైన ఒక సహ దక్షిణాసియా వాసిని నేను కలవటం జరిగింది'' అంటారు శేఖర్.

వారిద్దరూ త్వరలోనే సన్నిహితులయ్యారు. సంయుక్తంగా ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ (ఏఏపీఐవీఎఫ్) స్థాపించారు. ఈ ప్రాంతాల ప్రజలను సమీకరించి వారి గళాన్ని స్థానిక, జాతీయ రాజకీయాల్లో వినిపించటం లక్ష్యంగా స్థాపించిన బృందమిది. అమెరికా జనాభాలో ఆసియన్ అమెరికన్లు, పసిఫిక్ ఐలాండర్లు కలిసి మొత్తం రెండు కోట్ల మందికి పైగా ఉంటారు. కానీ వారు ఓటర్లుగా రిజిస్టర్ చేసుకోవటం, ఓట్లు వేయటం.. ఇతర ప్రజల జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని చెప్తారు.

ఈ పరిస్థితిని తమ సంస్థ ద్వారా మార్చాలన్నది శేఖర్, సయ్యద్‌ల లక్ష్యం.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉండటం వల్ల.. భారతీయులు, పాకిస్తానీయులు ఘర్షణపడుతుంటారని భావిస్తుంటారు. కానీ అమెరికాలో ఈ రెండు దేశాల ప్రజలు ఒకే దక్షిణాసియా ప్రజల్లో భాగంగా ఉన్నారు. రాజకీయ ప్రచారాల్లో వీరు తరచుగా కలిసి పనిచేస్తుంటారు.

''నాకు అందుబాటులో లేని వివిధ నెట్‌వర్క్‌లతో ఆయనకు (సయ్యద్‌కు) సంబంధాలున్నాయి'' అని శేఖర్ చెప్పారు. ఆయన మరో సమాజానికి చెందిన వ్యక్తి కనుక, అమెరికాలో మరో ప్రాంతంలో నివసిస్తుంటారు కనుక ఆయనతో కలిసి పనిచేయాలని తాను కోరుకున్నట్లు శేఖర్ వివరించారు.

వీరి బృందం గత జనవరిలో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు తెలిపింది. బైడెన్ గెలిస్తే.. అమెరికా ''మరింత సమానత్వంగా, మరింత న్యాయంగా'' మారుతుందని వీరిద్దరూ నమ్ముతున్నారు.

భారతీయులు, పాకిస్తానీయుల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. వారిలో కొందరు ఒకే తరహా భాష మాట్లాడుతారు. ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ ఆహారాలకు ఒకే చరిత్ర ఉంది. రెండు దేశాలకూ క్రికెట్ అంటే చాలా ఇష్టం. బాలీవుడ్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు.

కానీ తమను ఒక దగ్గరకు చేర్చింది అవి మాత్రమే కాదంటారు సయ్యద్. ''మా విలువలు కూడా ఒకే విధమైనవి'' అంటారాయన.

డోనల్డ్ ట్రంప్

కలిసి ప్రయాణం

భారత్, పాకిస్తాన్‌లకు ఉమ్మడిగా సంక్లిష్టమైన, సంఘర్షణాత్మక చరిత్ర కూడా ఉంది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర్యం వచ్చినప్పుడు ఉపఖండం రక్తసిక్తంగా విభజితమైంది. అప్పుడు జరిగిన మత హింసలో లక్షలాది మంది చనిపోయారు.

అప్పటి నుంచి ఈ రెండు అణ్వస్త్ర దేశాల మధ్య రెండు యుద్ధాలు జరిగాయి. కశ్మీర్ విషయంలో ఓ పోరాటం కూడా జరిగింది. సరిహద్దులో ఉన్న ముస్లిం మెజారిటీ ప్రాంతం తమకే చెందుతుందని రెండు దేశాలూ వాదిస్తుంటాయి. ఇది రెండు దేశాల మధ్య ఇప్పటికీ అతి పెద్ద వివాదాంశంగా కొనసాగుతోంది.

కానీ శేఖర్, సయ్యద్‌లు కశ్మీర్ విషయం గురించి చర్చించరు. ''ఆ అంశం జోలికి వెళ్లకుండా ఉండటానికి మేం ప్రయత్నిస్తాం. 'ఇక్కడి ఎన్నికలు ఈ దేశ అంతర్గత అంశాలకు సంబంధించినవి' అని మేం ఒకరికొకరం చెప్పుకుంటాం' అని కిశోర్ తెలిపారు.

తమ తమ దేశాల మధ్య వివాదాస్పద అంశాలు అమెరికాలో తమ రెండు దేశాల వారి మధ్య సంబంధాలను దెబ్బతీయలేదని చాలా మంది భారతీయ అమెరికన్లు, పాకిస్తానీ అమెరికన్లు చెప్తారు. తమ రోజు వారీ జీవితాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే అంశాల గురించే తమ రెండు సమాజాలూ ఎక్కువగా పట్టించుకుంటాయని కిశోర్ చెప్పారు. ఇక అమెరికాలో పుట్టి పెరిగిన తమ పిల్లలకు భారత్ - పాక్ వివాదం పెద్ద విషయం కాదని పేర్కొన్నారు.

''ఎప్పుడో 50 - 60 ఏళ్ల కిందట భారత్, పాకిస్తాన్‌లలో జరిగిన గొడవలకు మాకు సంబంధం ఏమిటి?' అని నా కొడుకు అంటాడు'' అని కిశోర్ తెలిపారు.

తొలి తరం పాకిస్తానీ అమెరికన్ల విషయంలో 9/11, ఆ తర్వాతి పరిణామాలు ముఖ్యమైనవని సయ్యద్ అంటారు. అమెరికాలో వారి అనుభవాలపై ఆ పరిణామాలు ప్రభావం చూపాయని చెప్తారు. ఆ సెప్టెంబర్ 11 దాడులు ముస్లింలు, సిక్కులు, అరబ్, దక్షిణాసియా సంతతి ప్రజలపై విద్వేషపూరిత దాడులకు, బెదిరింపులకు దారితీశాయి.

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయినప్పటి నుంచీ.. మైనారిటీల వ్యతిరేక, జాతివివక్ష వాదనలు పెరిగాయని ఆయన విమర్శకులు అంటారు. ''ద్వేషం, వివక్ష, వలస వ్యతిరేక మనోభావాలు పెరగటంలో'' ట్రంప్‌ బాధ్యత ఉందని సయ్యద్ ఏకీభవిస్తారు.

'మమ్మల్ని ప్రభావితం చేసేది స్థానికమే'

పాకిస్తానీ అమెరికన్ జనాభా దాదాపు పది లక్షల మంది ఉన్నారు. భారతీయ అమెరికన్లు సుమారు 45 లక్షల మంది ఉంటారని అంచనా. ఇరువురూ డెమొక్రటిక్ పార్టీ వైపు మొగ్గుచూపుతుంటారు. 2016 నాటి ఒక సర్వే ప్రకారం.. పాకిస్తానీ అమెరికన్లలో 88 శాతం మంది, భారతీయ అమెరికన్లలో 77 శాతం మంది గత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఓటు వేశారు. పాకిస్తానీ అమెరికన్లలో 5 శాతం మంది, భారతీయ అమెరికన్లలో 16 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు ఓటు వేశారని ఆ సర్వే చెప్తోంది.

ఈ ఏడాది ఈ రెండు సమాజాల సభ్యులూ కలిసి.. తమకు నచ్చిన అభ్యర్థికి మద్దతును కూడగట్టటానికి పనిచేస్తున్నారు. కేవలం అధ్యక్ష ఎన్నికల కోసం మాత్రమే కాదు.. సెనేట్, కాంగ్రెస్ సీట్లకు జరిగే ఎన్నికల కోసం కూడా ఈ పని చేస్తున్నారు.

భారతీయ అమెరికన్ మను మాథ్యూస్, ఆయన పాకిస్తానీ అమెరికన్ స్నేహితుడు రావు కమ్రాన్ అలీలు.. టెక్సస్‌లోని తమ జిల్లా నుంచి పోటీ చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి కాండేస్ వాలెంజెలా కోసం పని చేస్తున్నారు.

''మేం ఏకీభవించలేమని మాకు తెలిసిన విషయాలపై సంభాషణలు మా మధ్యకు రాకుండా మేం చూసుకుంటుంటాం'' అని మాథ్యూ చెప్పారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతల గురించి ఆయన మాట్లాడుతున్నారు.

రిపబ్లికన్ పార్టీ వైపు కూడా ఇంతే. ఇండియాలో పుట్టిన రియల్టర్ రాజ్ కథూరియా, పాకిస్తానీ అమెరికన్ షాహాబ్ ఖార్నీల ఇళ్ల మధ్య దూరం కేవలం 20 నిమిషాల ప్రయాణమే. వారిద్దరూ ట్రంప్ కోసం ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నారు.

కథూరియా తల్లిదండ్రులు విభజన సయమంలో పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చారు. ఈ రెండు దేశాల మధ్య వివాదాలు, ఉద్రిక్తతలు కథూరియాకు ముఖ్యమైనవి, వ్యక్తిగతమైనవి కూడా. కానీ అదే సమయంలో.. ఆ అంశాలు అమెరికాలో తన జీవితం మీద ప్రభావం చూపబోవని ఆయన అంటారు. ''మా మీద ప్రభావం చూపేది స్థానిక రాజకీయాలే'' అని ఆయన పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికల్లో పాకిస్తానీ అమెరికన్లు ఎటువైపు మొగ్గుతున్నారనేది అస్పష్టం. అయితే 2020 ఇండియన్ అమెరికన్స్ యాటిట్యూడ్ సర్వే ప్రకారం.. 70 శాతం మందికి పైగా భారతీయ అమెరికన్లు జో బైడెన్‌కు ఓటు వేయాలని ఆలోచిస్తున్నారు. ఈ సమాజం ఎప్పుడూ ప్రధానంగా డెమొక్రటిక్ పార్టీకే ఓటు వేస్తుందని ఇది సూచిస్తోంది.

పతాక శీర్షికల్లో కనిపించే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, డోనల్డ్ ట్రంప్‌కు మధ్య గల బలమైన స్నేహబంధం ఉన్నా.. భారతీయులు అత్యధికులు డెమొక్రటిక్ వైపే ఉన్నారని ఈ సర్వే చెప్తోంది. మోదీ, ట్రంప్‌లు కలిసి గత ఏడాది సెప్టెంబర్‌లో హూస్టన్‌లో 'హౌడీ మోడీ' పేరుతో జరిగిన ఒక భారీ సభలో పాల్గొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో డోనల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వెళ్లినపుడు మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో లక్ష మందితో నిర్వహించిన సభలో ఇద్దరూ పాల్గొన్నారు.

కానీ.. భారతీయ అమెరికన్లు ''అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేస్తామనేది నిర్ణయించే ప్రధాన అంశంగా భారత్ - అమెరికా సంబంధాలను పరిగణించరు'' అని ఈ సర్వే చెప్తోంది. చాలా మంది అమెరికన్ల లాగానే.. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థలను రెండు అతి ముఖ్యాంశాలుగా వీరు పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
People of India and Pakistan united in US elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X