హైలెవెల్ మీటింగ్‌లో కిమ్ జాంగ్ ఉన్.. మృతి చెందారన్న వార్త వట్టి పుకార్లే.. ఇదిగో సాక్ష్యం..!
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పై ఎన్నో వార్తలు వస్తున్నాయి. అసలు కిమ్ అనే పేరే వార్తగా మారింది. కొద్ది రోజుల క్రితం కిమ్ తన అధికారాలు తన సోదరి కిమ్ యో జాంగ్‌కు బదిలీ చేస్తున్నారనే వార్త హల్చల్ చేసింది. ఆ తర్వాత కిమ్ కోమాలోకి వెళ్లారనే వార్తలు వచ్చాయి. ఆ వెంటనే కిమ్ మరణించారని మరో జర్నలిస్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు ఏవైనా ఇక్కడ కామన్ పాయింట్ మాత్రం కిమ్ అయ్యారు. తాజాగా కిమ్‌కు సంబంధించిన వార్త మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..?
Kim jong Un ఫోటోలన్నీ ఫేక్ :కోమాలో కిమ్..? చైనా నుంచే సమాచారం..అందుకే సోదరికి కీలక బాధ్యతలు

కిమ్ ఫోటోలు విడుదల
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి మరో వార్తతో న్యూస్‌లో నిలిచారు. ఇప్పటి వరకు కిమ్ కోమాలో ఉన్నారని, మరణించారని వస్తున్న వార్తలన్నిటికీ చెక్ పెడుతూ ఉత్తరకొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ ఓ ఫోటోను విడుదల చేసింది. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించినట్లు కేసీఎన్ఏ వార్తను ప్రచురించింది. అంతేకాదు కిమ్ అధ్యక్షత వహించిన పొలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించిన ఫోటో కూడా విడుదల చేసింది.

కరోనావైరస్ వరదలపై కిమ్ సమీక్ష
ఇదిలా ఉంటే విపత్తు సమయాల్లో ఎలా వ్యవహరించాలనేదానిపై విఫలమయ్యామని కిమ్ మీటింగ్‌లో చెప్పినట్లు సమాచారం. దీని సరిదిద్దాలని అధికారులను ఆదేశించినట్లు కేసీఎన్ ఏ కథనం ప్రచురించినట్లు రైటర్స్ పేర్కొంది. చాలా కాలం తర్వాత సమావేశం జరుగుతుండటం అది కూడా ఉన్నత స్థాయి పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుండటం ఇది మూడవ సారి మాత్రమే కావడం విశేషం. ఇప్పటి వరకు ఉత్తరకొరియాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఎక్కడా అధికారికంగా ఆ దేశం ప్రకటించలేదు. కానీ ఉత్తరకొరియాలో కచ్చితంగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉంటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

కిమ్ కలలకు కరోనా బ్రేక్
ఇక ఇదే సమావేశంలో కిమ్ జాంగ్ ఉన్ దేశాన్ని అతలా కుతలం చేసిన వరదలపై కూడా సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. జరిగిన నష్టాన్ని వెంటనే పూడ్చాలని అన్ని సహాయక చర్యలు త్వరతగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బావి తుఫాను దక్షిణ కొరియాకు సమీపంలో ఉంది. గంటకు 155 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గత వారం జరిగిన సమావేశంలో రానున్న ఐదేళ్లకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కరోనావైరస్ విజృంభించడంతో ఆదేశ ఆర్థిక వ్యవస్థ పతనం స్థాయికి చేరుకుందనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా చైనాకు ఉత్తరకొరియాకు ఉన్న వాణిజ్య సంబంధాలకు బ్రేక్ పడగా.. కిమ్ ఆర్థిక పరమైన కలలన్నీ ఆవిరైనట్లు తెలుస్తోంది.
మొత్తానికి కిమ్ మృతి చెందారని వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉండే ఫోటోలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫోటోలను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక రైటర్స్ ప్రచురించింది.