వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: రైతులకు చేరాల్సిన సొమ్ము ఆదాయపు పన్ను కట్టేవారి ఖాతాల్లో ఎందుకు పడుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వ్యవసాయం, రైతులు

రైతులకు లబ్ధి చేకూర్చేందుకు భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారుల్లో 28 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు ఇటీవల సమాచార హక్కు చట్టం కింద చేసిన ఓ దరఖాస్తు ద్వారా బయటపడింది.

ఈ 28 లక్షల మందిలో 55 శాతం మంది, అంటే 11.38 లక్షల మంది ఆదాయపు పన్ను కడుతున్నవారే.

నిజానికి ఆదాయపు పన్ను కట్టేవారికి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించదు. అయినా, ఇంత మంది ఎలా ప్రయోజనం పొందగలిగారన్నది చర్చనీయాంశంగా మారింది.

అనర్హులకు మొత్తంగా రూ.1,364 కోట్ల మేర లబ్ధి జరిగిందని సమాచార హక్కు (సహ) చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు స్పందిస్తూ కేంద్ర వ్యవయసాయశాఖ వెల్లడించింది.

పథకంలో పెట్టిన అర్హత ప్రమాణాలను చేరుకోని వారు లబ్ధిదారుల్లో 44.41 శాతం మంది ఉన్నారని కూడా పేర్కొంది.

కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ప్రొగ్రామ్ హెడ్ వెంకటేశ్ నాయక్ ఈ సహ దరఖాస్తు చేశారు.

వ్యవసాయం, రైతులు

ఆధార్ ఇచ్చినా...

ఈ పథకం లబ్ధిదారులు ప్రభుత్వానికి ఆధార్ సంఖ్య తెలియజేయడం తప్పనిసరి. మరోవైపు ప్రభుత్వం దగ్గర ఆదాయపు పన్ను చెల్లించేవారి మొత్తం సమాచారం ఉంటుంది.

దీంతో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారి సమాచారం తెలిసి కూడా ప్రభుత్వం ఈ పథకం కింద ప్రయోజనం ఎందుకు కల్పించిందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

''ప్రభుత్వం దగ్గర పన్ను చెల్లింపుదారుల వివరాలన్నీ ఉంటాయి. ఆధార్, పాన్ కార్డు కూడా అనుసంధానమై ఉంటాయి. 2018లో ఆధార్ విషయమై సుప్రీం కోర్టు తీర్పునిస్తూ... ఆధార్ వెల్లడి 'స్వచ్ఛందమని చెప్పింది. కానీ, ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలు, సేవలు పొందడానికి మాత్రం ఇది తప్పనిసరి అని పేర్కొంది. ప్రైవేటు రంగానికి మాత్రం ఆధార్‌ను వినియోగించుకునే అనుమతి ఇవ్వలేదు’’ అని వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ చెప్పారు.

''పీఎం కిసాన్ పథకం కింద వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రయోజనం దక్కుతుంది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఆదాయపు పన్ను సమాచారంతో సరిపోల్చి, అనర్హులను ప్రభుత్వం ఏరివేయడం సాధ్యమయ్యే పనే’’ అని ఆయన అన్నారు.

పీఎం కిసాన్ సమ్మాన్ లబ్ధిదారుల్లో రెండు రకాల వాళ్లు ఉన్నారని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఒకటి ఆదాయపు పన్ను చెల్లించేవారు. రెండు అర్హత ప్రమాణాలను అందుకోనివారు.

ప్రభుత్వం చెబుతున్నదాని కన్నా, పథకంలోని అనర్హుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందని వెంకటేశ్ నాయక్ అంటున్నారు.

''ఇందులో సామాన్య ప్రజల కన్నా ప్రభుత్వం తప్పే ఎక్కువ. జనంలో చాలా మందికి అసలు అర్హత ప్రమాణాలు ఏంటో తెలియవు. ప్రభుత్వ అధికారులకు నియమనిబంధనలు అన్నీ తెలుసు. అయినా, వారు సరిగ్గా పనిచేయలేదు. అనర్హులు స్వయంగా డబ్బును వెనక్కిఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ, అది సాధ్యపడలేదు. మహమ్మారి సమయంలో జనం ఆదాయం కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు అనర్హులను పేర్లను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని ఆయన అన్నారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఐదు ఎకరాల (రెండు హెక్టార్ల) లోపు భూమి ఉన్న రైతులకు ఒక్కొక్కరికీ ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తారు.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు, పది వేల రూపాయలకు పైగా పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.

2019లో కేంద్రం ఈ పథకం తెచ్చింది.

అయితే, ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమవ్వకుండానే ఈ పథకం తీసుకువచ్చిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

2019-20 మధ్యంతర బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఈ పథకం గురించి కేంద్రం ప్రకటించింది. 2018 డిసెంబర్ 1న దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

''ప్రభుత్వం తొందరపాటుతో ఈ పథకం మొదలుపెట్టింది. ఎన్నికలకు ఒక నెల ముందు దీన్ని ప్రారంభించింది. దీంతో ఎవరు లబ్ధిదారులు, ఎవరు కారన్నదానిపై అధికార యంత్రాంగం పెద్దగా దృష్టి పెట్టలేదు. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో అనర్హులు లబ్ధి పొందారు. ఈ పథకంలో కౌలు రైతులను పూర్తిగా విస్మరించారు. ఇది చాలా పెద్ద లోపం. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది’’ అని వెంకటేశ్ నాయక్ అన్నారు.

అయితే, కౌలు రైతులను ఈ పథకం పరిధిలోకి తేవడం చాలా సంక్లిష్టమైన వ్యవహారం. వారి సమాచారాన్ని ధ్రువీకరించుకోవడంలో ప్రభుత్వానికి అనేక చిక్కులు ఎదురవుతాయి.

మోదీ ప్రభుత్వం ఈ పథకం కోసం ఏటా రూ.75 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

ఇటీవల విడుదల చేసిన రూ.18 వేల కోట్లతో కలిపి ఇప్పటివరకూ రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1.10 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

తాను సహ దరఖాస్తు చేసేటప్పటికి ఈ పథకం కింద 9-9.5 కోట్ల మంది లబ్ధిదారులున్నారని, ఇప్పుడు వారి సంఖ్య పది కోట్లు దాటిందని వెంకటేశ్ నాయక్ అన్నారు.

వ్యవసాయం, రైతులు

'నెలవారీ డేటా విడుదల చేయాలి’

''పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి నెలవారీ డేటా విడుదల చేయాలి. అప్పుడే పరిశోధకులు అధ్యయనం చేసి సలహాలు, సూచనలు చేసేందుకు వీలు కలుగుతుంది’’ అని సిరాజ్ హుస్సేన్ అన్నారు.

మొదట్లో అనర్హులు కూడా ఈ పథకంలో చేరిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ఊరిలో ప్రజా సేవా కేంద్రాన్ని నడుపుతున్న సత్యేంద్ర చౌహాన్ అన్నారు.

''మొదట్లో అందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసేవారు. పెద్దగా పరిశీలన లేకుండానే, వాటికి ఆమోదం లభించింది. అప్పట్లో వ్యవసాయ శాఖ ఒక్కటే ఈ పని చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని సరిగ్గా ఉంటేనే, వ్యవసాయ శాఖ వరకూ పత్రాలు వెళ్తున్నాయి’’ అని అన్నారు.

దరఖాస్తు ఆమోదం పొందిన మూడు, నాలుగు నెలల తర్వాతే డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడతాయని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
PM Kisan Samman nidhi money owed to farmers falling on income taxpayers' accounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X