• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ విజయం అందరిదీ: ప్యారిస్ ఒప్పందంపై మోడీ

|

న్యూఢిల్లీ: భూతాపాన్ని రెండు డిగ్రీల సెల్సియస్‌ కన్నా బాగా తక్కువకు పరిమితం చేయడానికి అంగీకరిస్తూ కుదిరిన పారిస్‌ ఒప్పందం పట్ల ప్రపంచ నేతలు హర్షం వ్యక్తం చేశారు. భూతాపాన్ని నియంత్రించే దిశగా ఇదో పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. ఈ విజయం వాతావరణ న్యాయానిదే అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఒప్పందంలో విజేతలు, పరాజితులు ఎవరూ లేరని చెప్పారు.

కాప్‌21 సదస్సులో ఒప్పంద సాధనకు ప్రతి దేశమూ సవాల్‌ను స్వీకరించిందని అభినందించారు. ఒక రకంగా చెప్పాలంటే ఎదురవుతున్న సవాళ్ల పట్ల ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడి విజ్ఞతను కనబర్చాయని, ఆ విధంగా పర్యావరణ న్యాయం చేశాయని మోడీ పేర్కొన్నారు.

గతంలో మాదిరిగా కాకుండా ఈ ఒప్పందంలో కుదిరిన అంశాలన్నీ చట్టంబద్ధం కావడం అన్నది ప్రత్యేకంగా పేర్కోవాల్సిన అంశమని, భూగోళ ఉష్ణోగ్రతను 2డిగ్రీల సెల్సియస్‌కు దిగువన ఉంచేందుకు, అదే విధంగా 2020 వరకు ధనిక దేశాలు వర్ధమాన దేశాలకు ఏటా వంద బిలియన్ డాలర్లను అందించేందుకు ఈ ఒప్పందం బలమైన బాట వేసిందని తెలిపారు.

కాగా, ఈ అంశంపై ప్యారిస్‌లో మాట్లాడిన భారత పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాత్రం ఇంకొంచెం అర్థవంతమైన రీతిలో ఈ ఒప్పందాన్ని తీర్చిదిద్ది ఉండాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

PM Narendra Modi Says 'Climate Justice' Won In Paris Accord

అయినప్పటికీ ఉష్ణోగ్రత స్థాయిని 2 డిగ్రీల్ సెల్సియస్‌కు దిగువనే పరిమితం చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ముందుకు రావడం చారిత్రక పరిణామమని అన్నారు. ధనిక దేశాలు తమ చారిత్రక బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని మరింత సహకరించి ఉంటే ప్యారిస్ ఒప్పందం అనూహ్యమైన రీతిలోనే ఫలితాలను ఇచ్చేందుకు దోహదం చేసేదన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వేగంగా అభివృద్ధి చెందేందుకు వర్ధమాన దేశాలకు అవకాశం ఇవ్వడం అన్నది అత్యంత శ్లాఘనీయ అంశమని తెలిపారు. ‘ఈ భూగోళం అన్నది మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చింది కాదు. భవిష్యత్తరాల నుంచి మనం దీన్ని రుణంగా తీసుకున్నాం' అంటూ పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ఉద్ఘాటిస్తూ మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలను జవదేకర్ గుర్తుచేశారు.

భవిష్యత్ తరాలకోసం ఈ అవనిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఈ చారిత్రక ఒప్పందం దోహదం చేస్తుందని, ఆ దిశగా ఇదో ఘనమైన ముందడుగని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. పదిరోజులపాటు ఎడతెగని రీతిలో ప్యారిస్ చర్చలు సాగాయని, అంతిమంగా అన్ని దేశాల సహకారంతో ఈ తలమానిక ఒప్పందం సాధ్యమైందని ఒబామా తెలిపారు.

అన్ని దేశాలు చేతులు కలిపితే అసాధ్యం అంటూ ఏదీ ఉండదని చెప్పడానికి ఇంతకుమించిన నిదర్శనం లేదన్నారు. ప్యారిస్ ఒప్పందం అందించిన ధీమా ఈ భూగోళ పరిరక్షణకు మానవాళి తన వంతు కృషి చేస్తుందన్న నమ్మకాన్ని కలిగించిందని వైట్‌హౌస్ నుంచి చేసిన ప్రసంగంలో ఒబామా పేర్కొన్నారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, బ్రిటిష్ ప్రధాన మంత్రి డేవిడ్ కేమెరాన్, జర్మనీ చాన్సలర్ ఏంజిలా మోర్కెల్‌లో ఈ ఒప్పందాన్ని శాంతియుత విప్లవంగా అభివర్ణించారు. సమైక్యత, లక్ష్య సాధన, నిబద్ధత అన్నవి అడుగడుగునా కనబరిస్తే ఈ భూగోళాన్ని భవిష్యత్ తరాలకోసం కాపాడడమన్నది సుసాధ్యమేనని అన్నారు. అంతర్జాతీయ సహకారంలో ఇది కొత్త ప్రారంభమని చైనా పేర్కొంది.

అన్ని దేశాలూ కలిసిరావడం సానుకూల పరిణామమని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యంగ్‌ కిమ్‌ అన్నారు. 21వ శతాబ్దంలో వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు పారిస్‌ ఒప్పందం కీలక ముందడగు అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఎండీ క్రిస్టిన్‌ లెగార్డ్‌ అన్నారు. పేదరికాన్ని అంతం చేయడంతోపాటు అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడానికి ఉద్దేశించిన తలమానికమైన ఒప్పందంగా ప్యారిస్ పర్యావరణ ఒడంబడికను ఐరాస సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ అభివర్ణించారు.

English summary
Prime Minister Narendra Modi has hailed the landmark climate accord in Paris, saying it pointed the world towards a greener future. The historic accord adopted by 195 nations in Paris on Saturday aims to stop global warming by cutting emissions and eliminating greenhouse gas pollution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X