ట్రంప్ సహా 7 దేశాల అధ్యక్షులతో ప్రధాని మోదీ భేటీ.. సంచలన నిర్ణయాల దిశగా..!
భారత ప్రధాని నరేంద్ర మోదీ యూరోప్ టూర్ ఖరారైంది. జూన్ 16, 17 తేదీలలో ఫ్రాన్స్‌లోని ఏవియన్ లో జరగనున్న జీ7 (G7) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ధృవీకరించింది. ఈ పర్యటన ప్రధానంగా అంతర్జాతీయ వేదికపై భారత్ తన దౌత్యపరమైన ముద్రను వేసే కీలక అవకాశంగా కనిపిస్తోంది.
ఈ పర్యటన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల భేటీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే.. వీరిద్దరి సమావేశం అధికారిక షెడ్యూల్‌లో ఉందో, లేదో చెప్పలేమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గత వారం ట్రంప్ స్వయంగా జీ7 సదస్సుకు హాజరవుతానని ప్రకటించడంతో, ఇరువురు నేతల మధ్య ముఖాముఖి చర్చలు జరిగే అవకాశం ఉందనే చర్చ అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సదస్సులో భాగంగా ప్రధాని మోదీ జీ7 దేశాధినేతలతో అలాగే ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రధానంగా 'కొత్త భాగస్వామ్యాల నిర్మాణం, అంతర్జాతీయ సంఘీభావం', 'సమతుల్య, నిలకడైన ఆర్థిక వృద్ధిని పునర్జీవింపజేయడం', అలాగే 'సురక్షితమైన, వేగవంతమైన కృత్రిమ మేధ (AI) విస్తరణ' వంటి ముఖ్యమైన అంశాలు చర్చాంశాలుగా మారనున్నాయి.
ఒకవేళ ఈ భేటీ ఖరారైతే.. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన తర్వాత ఇరువురు నేతలు భౌతికంగా కలుసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. అయితే, గత కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ముఖ్యంగా రష్యా చమురు కొనుగోళ్లపై సుంకాలు విధించడం, భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు, అలాగే చైనా పర్యటనపై ట్రంప్ చేసిన విమర్శలు దౌత్యపరమైన సవాళ్లుగా నిలిచాయి.
అయినప్పటికీ, ఇటీవలి కాలంలో ఇరు నేతలు క్రమం తప్పకుండా ఫోన్ సంభాషణల ద్వారా టచ్‌లోనే ఉన్నారు. గత నెలలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ లో పర్యటించి, రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, విద్య ఇంధన భద్రత వంటి రంగాల్లో సహకారాన్ని పెంచే దిశగా పురోగతిని వివరించారు. ఈ పరిణామాలు దౌత్యపరంగా సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి.

ఈ క్రమంలోనే.. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో జరిగిన చర్చల్లో, వస్తువుల వాణిజ్యం, సుంకేతర అడ్డంకులు, కస్టమ్స్ విధానాలు, ఆర్థిక భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు లోతుగా చర్చించారు. ఈ దౌత్య ప్రయత్నాలు రానున్న రోజుల్లో మరింత ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications