India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారంపై పాటలు పాడుతున్న పాప్ స్టార్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
లేడీ మౌనాస్

సెనెగల్‌లో అత్యాచారాలకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనల ఫలితంగా 2020లో చట్టాన్ని సవరించారు. ఈ సవరణతో అత్యాచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించడం మొదలైంది. అంతవరకూ ఇక్కడి చట్టాలు రేప్‌ను ఒక అనుచిత చర్యగానే గుర్తించాయి.

అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజల చేపట్టిన నిరసనలు లైంగిక దాడులు, దాడుల వల్ల కలిగే అవమానాలు, బాధ్యతల మీద చర్చలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఒక పాప్ నటి తనకు స్వయంగా ఎదురైన అనుభవం గురించి పాటల ద్వారా సమాజానికి తెలిపేందుకు ధైర్యం చేశారు.

సెనెగల్ రాజధానికి రెండు గంటల దూరంలో ఉన్న డకార్‌లోని తన ఇంటిలో పాప్ స్టార్ మౌనాస్ మాకు వలోఫ్ భాషలో రచించిన పాటను పాడి వినిపించారు.

పోరాడేందుకు నాకు శక్తి లేదు

వాదించేందుకు కూడా ఓపిక లేదు

నేను ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయాను.

నాకు ప్రియమైన విషయాన్ని నువ్వు దోచుకున్నావు

దయచేసి, మహిళల గురించి ఆలోచించండి.

లేడీ మౌనాస్ సరసమైన పదాలు, సెక్సీ తరహాలో పాడే పాటలకు పేరు పొందారు. కానీ, ఈ పాట మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఆమె 2011లో ఇద్దరు పురుషుల చేతిలో అత్యాచారానికి గురైన తర్వాత అనుభవించిన మానసిక వేదనను ఈ పాటలో పొందుపరిచారు.

"ఈ సంఘటన నాకే ఎదురవడంతో ఒంటరిగా పాట పాడటం చాలా కష్టమైంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయేదానిని. అత్యాచారం వల్ల కలిగిన అవమాన భారాన్ని మోస్తూ బతకాల్సి వచ్చింది" అని అన్నారు.

తనపై జరిగిన దాడి గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కానీ, ఎటువంటి అభియోగాలు నమోదు చేయకుండా అతడిని విడుదల చేశారని ఆమె చెప్పారు.

తనకు జరిగిన అన్యాయం పట్ల మౌనంగా ఉండమని ఆమె కుటుంబం సలహా ఇచ్చింది. కానీ, గత ఏడాది ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె నిజాన్ని చెప్పేశారు.

'మీరేదో చెప్పాలని అనుకుంటున్నారు. మీ మనసు చాలా సున్నితంగా కంపిస్తున్నట్లుంది' అంటూ టీవీ ప్రెజెంటర్ పదే పదే అడగడంతో నాకు ఏడుపు ఆగలేదు. నిజం చెప్పేశానని ఈ గాయని వివరించారు.

ఈ విషయాన్ని వెల్లడి చేసిన తర్వాత ఆమె చాలా దిగ్బ్రాంతికి గురయ్యారు. మౌనాస్ పాటల్లో ఉండే రెచ్చగొట్టే ధోరణి మగవాళ్లకు ఆమె పట్ల తప్పుడు అభిప్రాయం కలిగేలా చేసిందని కొందరు విమర్శకులు వ్యాఖ్యానించారు. ఆమె ప్రచారం కోసమే ఇలా చెప్పారని కూడా కొందరు తేలికగా మాట్లాడారు.

"నేను అందరి దృష్టిని ఆకర్షించేందుకే ఇలా చేశానని కొందరు విమర్శించారు. ఆ మాటలు నన్ను చాలా గాయపరిచాయి. అందుకే ఈ విషయం గురించి మాట్లాడవద్దని సూచించామని నా కుటుంబం కూడా నన్ను వేలెత్తి చూపింది" అని ఆమె అన్నారు.

లేడీ మౌనాస్

ఆ తర్వాత అత్యాచారానికి గురైన చాలా మంది మహిళలు తమకు ఎదురైన ఆ బాధాకర అనుభవాల గురించి నాతో పంచుకోవడం మొదలుపెట్టారు. చాలా భయంకరమైన కథలు ఉండేవి. ఒకామె తన సొంత తాత చేతిలో, మరొకరు తండ్రి చేతిలో అత్యాచారానికి గురైనట్లు చెప్పారు.

ఇవన్నీ విన్న తర్వాత లైంగిక హింస వ్యతిరేక స్వరానికి మౌనాస్ ప్రతినిధిగా మారారు. ఆమె లైంగిక హింసకు గురైనప్పుడు మహిళలకు ఎదురయ్యే చట్టపరమైన సహాయం గురించి అవగాహన కల్పించే ప్రభుత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా సంచరించారు. ఆ ప్రచారానికి ఆమె పాడిన పాట సౌండ్ ట్రాక్ గా మారింది.

సెనెగల్‌లో అత్యాచారం గురించి మాట్లాడటాన్ని అవమానంగా పరిగణిస్తారు. అలాంటి పరిస్థితుల్లో అత్యాచారం గురించి పాటను విడుదల చేయడం ధైర్యంతో కూడుకున్న విషయమే అని చెప్పవచ్చు. అత్యాచారం మూలంగా అవమాన భారాన్ని తాను మోయాల్సిన పని లేదని ఆమె నిర్ణయించుకున్నారు.

కానీ, లైంగిక హింసకు గురి కావడం అంటే కుటుంబం నుంచి సమాజం నుంచి తిరస్కారానికి గురయినట్లేనని భావిస్తారు చాలా మంది మహిళలు. గృహ హింసకు, లైంగిక హింసకు గురైన ఇద్దరు మహిళలు ఇలాగే భావించారు. వారి పేర్లను మార్చాం. వీరిద్దరూ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తున్న ఒక కేంద్రంలో ఉంటున్నారు. వారిని బీబీసీ కలిసింది.

ఈ కేంద్రాన్ని యాసిన్ డయూఫ్ నిర్వహిస్తున్నారు. ఆమె సెనెగల్ మాజీ అధ్యక్షుని కూతురు.

యాసిన్ డయూఫ్

ఈ కేంద్రంలో ఒకేసారి 25-30 మంది మహిళలు ఉంటారు. వీరిక్కడి నుంచి బయటకు వెళ్లిన తర్వాత స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన శిక్షణను, నైపుణ్యాన్ని ఇస్తారు.

డీనాకు 19 సంవత్సరాలు. ఆమె ఆగకుండా ఫోన్ స్క్రోల్ చేస్తున్నారు. 15 ఏళ్ల వయసులో ఆమె అత్యాచారానికి గురయ్యారు. దీంతో, ఆమె గర్భం దాల్చారు. ప్రస్తుతం ఆమె మూడేళ్ళ బిడ్డకు తల్లి.

"నా పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు దొంగ సాక్ష్యాలు చూపించారు. ఒక నెల రోజులు తర్వాత విడుదలయ్యాడు. అయితే, నా బిడ్డను ఆమోదించి తండ్రిగా ఉండేందుకు అతడు అంగీకరించాడు. ఆ సాక్ష్యం ఉపయోగించుకుని నేను ఫిర్యాదు చేశాను. కానీ, ఆయన గినియా పారిపోయారు" అని డీనా చెప్పారు.

రోజుకు 150 రూపాయలు సంపాదించేందుకు డీనా కష్టపడుతున్నారు. "జీవితం చాలా కష్టంగా ఉంది. నేను స్కూలులో చదివేదానిని కానీ, మధ్యలోనే వదిలిపెట్టాల్సి వచ్చింది. నాకు మరో మార్గం లేదు. నా బిడ్డకు తిండి పెట్టాలి. ఇది చాలా కష్టమైన స్థితి . ఇదంతా జరిగిన తర్వాత నా తల్లితండ్రులిద్దరూ విడాకులు తీసుకున్నారు.

డీనా పక్కనే 19 సంవత్సరాల శారా కూర్చుని ఉన్నారు. గత ఏడాది ఆమెపై అత్యాచారం జరిగింది. ఆమె ఇప్పుడు గర్భంతో ఉన్నారు.

ఆమె పోలీసు స్టేషన్‌కు వెళ్ళలేదు. ఆమెకు జరిగిన విషయం గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఆమె గర్భం దాల్చినట్లు తెలిసిన తర్వాత ఆమె పై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె కుటుంబం ఆమెను ఇంటి నుంచి తరిమేసింది. ఆమె వీధుల్లో పడుకోవడం ఈ కేంద్రం సిబ్బంది చూశారు. వారు ఆమెను ఇక్కడకు తీసుకొచ్చారు.

"వారి సంస్కృతిలో అత్యాచారం జరగడాన్ని అవమానకరంగా చూస్తారు. దాంతో, ఆమె తల్లి, తండ్రి వైపు బంధువులంతా ఆమెను వెలి వేశారు" అని కేంద్రంలో పని చేసే సిబ్బంది చెప్పారు.

సెనెగల్‌లో ఉన్న ఈ సంస్కృతి వల్ల లైంగిక హింసకు గురైన బాధితులను నిశ్శబ్దంగా ఉండేలా చేస్తుంది" అని మహిళల హక్కుల కోసం యూ ట్యూబ్ నిర్వహించే ఫతౌ వర్ఖా చెప్పారు.

"మహిళలు ఇలాంటి విషయాలను దాచి పెట్టి ఉంచాలనే ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ సంస్కృతి వల్ల అత్యాచారం జరిగినప్పుడు మహిళలు గొంతు విప్పేలా చేయడం ఒక ఆటంకంగా మారుతోంది" అని ఆమె అన్నారు.

ఫెమినిస్ట్ సభ్యులతో కూడిన వర్ఖా గ్రూపు డఫాడోయ్ కలెక్టివ్‌ను ప్రారంభించింది. 'ఇప్పటి వరకు జరిగింది చాలు' అని దీనర్ధం. 2019లో ప్రచారకర్తలు మీ టూ ఉద్యమం మాదిరిగా డఫాడోయ్ హ్యాష్ ట్యాగ్ ద్వారా లైంగిక హింసకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.

అదే ఏడాదిలో మహిళల పై జరిగిన లైంగిక దాడులకు తీవ్రమైన నిరసన ఎదురయింది. 23 ఏళ్ల బినెటా కమారాను అత్యాచారం చేసి చంపిన తర్వాత ఈ నిరసనలు మరింత ఉధృతం అయ్యాయి. ఈ కేసు పట్ల సమాజంలో అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది.

"దేశంలో పితృస్వామ్య సమాజం ఉన్నందున ఈ ప్రదర్శనల్లో పురుషులు కూడా పాల్గొనడం అవసరం" అని నిరసనల్లో పాల్గొంటున్న ఒక విద్యార్థి ఎలియాస్ డోయ్ అన్నారు.

"నేనెప్పుడూ మహిళల వైపే మాట్లాడతానని కొంత మంది ఆరోపిస్తుంటారు. నిజానికి మహిళల గొంతు కూడా వినాల్సిన సమయం వచ్చింది. తమ కూతుళ్ళు, కుటుంబ సభ్యులకు కూడా ముప్పు పొంచి ఉండటంతో కొంత మంది పురుషులు కూడా మా వెంట ఉన్నారు.

ఎలియాస్ డోయ్

దేశంలో పేరున్న ఇస్లామిక్ సంస్థ జామ్రా అధినేత మమాదౌ మక్తర్ గాయే కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.

"పురుషులు తమ ప్రవర్తనను మార్చుకోవాలి" అని ఆయన అన్నారు. ఈ నిరసనల ద్వారా చట్టంలో మార్పులు వచ్చాయి.

పార్లమెంటులో ఏకగ్రీవంగా జరిగిన వోటింగ్ తర్వాత దేశాధ్యక్షుడు మేకీ సాల్ అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తూ జనవరి 10, 2020న అధికారికంగా చట్టాన్ని అమలులోకి తెచ్చారు. ఇకపై అత్యాచార కేసుల విచారణ క్రిమినల్ కోర్టులో జరుగుతుంది. అత్యాచార నేరం రుజువైతే 10 సంవత్సరాలు జైలు లేదా జీవిత ఖైదు శిక్ష పడవచ్చు.

సెనెగల్‌లో లైంగిక హింసకు గురైన మహిళల సంఖ్య గురించి అధికారిక గణాంకాలు లేవని మహిళా, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు.

లైంగిక హింసకు గురైనప్పుడు మహిళలు పోలీసులను సంప్రదించేందుకు అనువైన చర్యలను తీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్‌లలో లైంగిక బాధితులతో మాట్లాడేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. మహిళా అధికారులను కూడా నియమిస్తున్నారు.

యూరోపియన్ యూనియన్ సహకారంతో నడుస్తున్న ప్రాజెక్టులో భాగంగా ఈ మార్పులు చేస్తున్నారు.

దేశంలో లైంగిక హింసకు సంబంధించిన కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు.

పోలీస్ అధికారి

పోలీసులు కూడా స్థానికంగా ఉండే మహిళలతో కలిసి పని చేస్తున్నారు. వారిని పిన్ని అని పిలుస్తారు. సెనెగల్ కుటుంబాల్లో పిన్ని ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇలా నియమించిన మహిళలు బాధిత మహిళలు, పిల్లలకు సహాయం చేసే విధంగా ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

"సమాజంలో జరిగే విషయాలను తెలుసుకుని వీరు పోలీసులకు సమాచారం అందిస్తారు" అని పోలీస్ అధికారి చెప్పారు.

సెనెగల్‌లో అమలు చేసిన మార్పులు సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

గృహ, లైంగిక హింస గురించి ఫిర్యాదు చేసేందుకు మహిళలు ముందుకు రావడం పెరిగిందని తెలిపారు.

అసోసియేషన్ ఆఫ్ సెనెగల్ జ్యూరిస్ట్స్ దేశంలో ఏర్పాటు చేసిన న్యాయ కేంద్రాల ద్వారా ఉచిత న్యాయ సహాయం కూడా అందిస్తున్నారు. ఒక్క 2021లోనే 3000కు పైగా లైంగిక హింసకు సంబంధించిన కేసులను నమోదు చేసినట్లు అసోసియేషన్ తెలిపింది.

కొత్త చట్టంలో ఉన్న సంక్లిష్టత వల్ల విచారణ, దోషులకు శిక్షలు వేసే ప్రక్రియకు చాలా సమయం పడుతోంది.

"ఇప్పటి వరకు చాలా మంది పై కేసులు నమోదు చేసినప్పటికీ కూడా, ఒక్కరికి కూడా శిక్ష విధించలేదు. కొత్త ప్రక్రియ సుదీర్ఘమైంది మాత్రమే కాకుండా విస్తృతమైన విచారణ కూడా చేయాల్సి ఉంటుంది" అని మాజీ పోలీస్ అధికారి అసోసియేషన్ ఆఫ్ సెనెగల్ జ్యూరిస్ట్స్ అబీ డైయాలో చెప్పారు.

నిరసనలు

ప్రక్రియలో జాప్యం మూలంగా చట్టం వల్ల ప్రయోజనం దెబ్బ తింటోందా?

"ఇదొక మంచి చట్టం. కానీ, దీనిని సక్రమంగా అమలు చేయాలి. దీని కోసం ఎక్కువ మంది న్యాయాధికారులు కావాలి. సమాజంలో అవగాహన కూడా పెరగాలి" అని డైయాలో అన్నారు. గతంలో అయితే చాలా మంది నిందితులు అరెస్టు అయిన కొన్ని రోజులకే బయటకు వచ్చేస్తూ ఉండేవారు.

ఇది బాధితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపేది. "కఠినమైన శిక్షల ద్వారానే ఇటువంటి చర్యలను అరికట్టే వీలుంటుంది" అని డైయాలో అన్నారు.

దేశంలో ఇప్పటికీ చాలా మంది లైంగిక హింస బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.

లేడీ మౌనాస్ రాసిన గీతం ద్వారా మరింత మంది ముందుకు వచ్చి మాట్లాడతారని ఆశిస్తున్నారు. "ఒక గాయనిగా నాకొక వేదిక ఉంది. నాకు బాధ్యత ఉందని భావిస్తున్నాను. దీని గురించి మాట్లాడాలని అనుకున్నాను" అని అన్నారు.

"ఈ అత్యాచార సంస్కృతిని ఆపమని నేను పరుషులకు పిలుపునిస్తున్నాను. ఇలాంటిదేమైనా జరిగితే మౌనంగా ఉండాలని మహిళలకు సూచించకూడదని కోరుతున్నాను" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Senegal Pop star Mounass singing songs about rape
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X