• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రిన్స్‌ ఫిలిప్‌: రాజు-రాణి... అజరామర ప్రేమ గాథ

By BBC News తెలుగు
|
ప్రిన్స్‌ ఫిలిప్‌

వారిద్దరి బంధం వయసు ఏడు దశాబ్దాలు. క్వీన్‌ రాచ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ప్రిన్స్‌ ఆమెకు సహాయకుడి పాత్రలో కనిపిస్తారు. వ్యక్తిగత జీవితంలో రాణి గురించి బాగా తెలిసిన, అర్ధం చేసుకున్న ఏకైక వ్యక్తి ప్రిన్స్‌ ఫిలిప్‌.

"రాణిని సామాన్యురాలిగా చూడగలిగే ఒకే ఒక్క వ్యక్తి ప్రిన్స్‌ ఫిలిప్‌. ఆయన మాత్రమే అలా చేయగలరు" అని ప్రైవేట్‌ కార్యదర్శి ఒకరు అన్నారు.

వారిద్దరిదీ ప్రేమ వివాహం. ఒకరినొకరు ఇష్టపడి, అర్ధం చేసుకుని దంపతులయ్యారు.

1939 లో డార్ట్‌మౌత్‌ నేవల్‌ కాలేజిని ప్రిన్సెస్‌ ఎలిజబెత్‌ సందర్శించినప్పుడు వారిద్దరూ తారసపడ్డారు. వారిద్దరు తొలిసారి కలుసుకున్నప్పటి ఆ ఫొటోలు ఒక సుదీర్ఘ ప్రారంభానికి సాక్ష్యంగా నిలిచాయి.

18 ఏళ్ల డాషింగ్ క్యాడెట్‌గా టెన్నిస్, క్రోక్‌ గేమ్స్ ఆడుతుండగా ప్రిన్స్‌ ఆమె దృష్టిని ఆకర్షించారు. అప్పటికి ప్రిన్సెస్‌ వయసు 13 ఏళ్లు

మొదట వారిదద్దరు స్నేహితులయ్యారు. తర్వాత ప్రేమలో పడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంనాటికి ఒకరికొకరు లేఖలు రాసుకుంటున్నారు. కొన్నిసార్లు కలుసుకున్నారు కూడా.

రాయల్‌ నేవీలో ఫిలిప్‌ విధులు నిర్వర్తించడానికి వెళ్లినప్పుడు, యువరాణి ఆయన ఫొటోను తన గదిలో గోడకు అంటించుకున్నారు.

ప్రిన్స్‌ బాల్యమంతా దేశాలు తిరగడంలోనే గడిచింది. గ్రీస్‌లో జన్మించినా, దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. తరువాత యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆయన నివసించారు.

సొంత కాళ్ల మీద నిలబడటం తప్ప ఆయనకు వేరే మార్గం లేదు. స్వీయానుభవాలు, మానసిక బలం ఉన్న వ్యక్తి ఆయన.

కానీ, యువరాణి అలా కాదు. వాస్తవిక ప్రపంచానికి దూరంగా విలాసవంతమైన రాజభవనాల్లో పెరిగారు.

ఆమె సిగ్గరి, రిజర్వ్‌డ్‌గా ఉండే తెలివైన అమ్మాయి. వారు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలుపుకునే వారు.

"ఆయన మాటలకు, చేష్టలకు ఆమె నవ్వేవారు. ఎందుకంటే వారిద్దరి నేపథ్యాలు వేరువేరు. ప్రిన్స్‌ జీవన విధానానికి, క్వీన్‌ లైఫ్‌స్టైల్‌ పూర్తి భిన్నంగా ఉంటుంది. నిజంగా వారిద్దరిది అద్భుతమైన జంట" అని వారి మనుమడు ప్రిన్స్‌ విలియం ఒకసారి అన్నారు.

ప్రిన్స్‌ ఫిలిప్‌

'ప్రేమలో మునిగిపోయా'

1947లో క్వీన్ ఎలిజబెత్ 21 వ పుట్టిన రోజున వారిద్దరి నిశ్చితార్ధాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే అంతకు ఏడాది ముందు నుంచే ప్రిన్స్‌ తమ ప్రేమ వ్యవహారాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశారు.

వివాహ నిశ్చితార్ధపు ఉంగరాన్ని డిజైన్‌ చేయడంలో ప్రిన్స్‌ సాయపడ్డారు. వజ్రాలు, ప్లాటినంతో తయారు చేసిన ఈ ఉంగరాన్ని ప్రిన్స్‌ తల్లి, గ్రీస్‌ యువరాణి ఆలిస్ కిరీటం నుంచి తీసుకున్న ఆభరణాలతో రూపొందించారు.

"నేను పూర్తిగా ప్రేమలో మునిగి పోయాను" అంటూ క్వీన్‌ మదర్‌కు ప్రిన్స్‌ ఫిలిప్‌ తన పెళ్లికి కొద్ది రోజులు ముందు రాసిన లేఖలో పేర్కొన్నారు.

వెస్ట్‌ మినిస్టర్‌ అబ్బే వద్ద 2 వేల మంది అతిథుల సమక్షంలో ఈ జంట వివాహం జరిగింది.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు సంవత్సరాల తరువాత, దేశం ఇంకా యుద్ధం నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వీరి పెళ్లి వేడుక జరిగింది.

"ఇది కష్ట సమయంలో విరిసిన నవోదయం" అని అప్పటి ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ వ్యాఖ్యానించారు.

మరుసటి సంవత్సరం పెద్ద కుమారుడు చార్ల్స్‌ జన్మించారు. ఆ తరువాత కుమార్తె అన్నే పుట్టారు.

అప్పటికి ప్రిన్స్‌ ఫిలిప్ నౌకాదళంలో వేగంగా ఎదుగుతున్నారు. అప్పట్లో మాల్టాలో హెచ్ఎంఎస్ చెకర్స్‌ అనే యుద్ధ నౌకలో ఈ యువ జంట కాపురం చేస్తుండేది.

ఈ యువజంట ఒకరికొకరు సాయపడుతూ, చాలా సాదాసీదా జీవితం గడిపేవారు.

వీరిద్దరు ఒకరి చెంత ఒకరు ఉంటూ, రాజప్రసాదానికి, సైనిక విధులకు దూరంగా, ఉల్లాసంగా గడుపుతున్న దృశ్యాలు ఓ వీడియో ఫుటేజ్‌లో కనిపిస్తాయి.

ప్రిన్స్‌ ఫిలిప్‌

జీవితం మారిపోయింది

ఆరో కింగ్‌ జార్జ్‌ హఠాన్మరణంతో వారి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. 1952 ఫిబ్రవరి 6న కింగ్ జార్జ్ VI మరణించారు. అప్పటికి ప్రిన్సెస్‌ ఎలిజబెత్‌ వయసు 25 సంవత్సరాలు. ఫిలిప్‌ వయసు 30 ఏళ్లు.

యువరాణి ఎప్పటికైనా రాణి అవుతారని ఆయనకు తెలుసు. కానీ, ఈ రాచ సంప్రదాయాలకు దూరంగా మరికొంత కాలం గడపవచ్చని ఆయన అనుకున్నారు.

ప్రిన్సెస్‌ క్వీన్‌ కావడమంటే నేవీలో తాను సాధించాలనుకున్న పదవుల గురించి ఆశ వదులుకోవడమే. హఠాత్తుగా ఒక ఓడను నడిపే వ్యక్తికి సహాయకారి పాత్రగా మారిపోవడం అంత సులభం కాదు.

పైగా ఇది జరిగింది 1950లలో. భర్తను కాదని భార్య ఉన్నత పదవులలో సాగడం అరుదు. అప్పటికి యువరాణి తల్లి కూడా.

కానీ, ఆమె తాను ఏ పాత్ర కోసం జన్మించారో దానిని పోషించక తప్పదు.

ప్రిన్స్‌ ఫిలిప్‌

డబుల్ రోల్

ఇద్దరి పాత్రలు మార్చుకోవాల్సి రావడంతో వారి విభేదాలు వచ్చినా అవి నాలుగు గోడల మధ్యే ఉండిపోయాయి.

ప్రిన్స్‌ ఫిలిప్‌ రాణికి సహచరుడిగా తన పాత్రను నిర్వర్తించడానికి పూనుకున్నారు. అయితే, ఆయన చాలాసార్లు రాజప్రసాదంలోని అధికారులతో పోరాడాల్సి వచ్చింది.

1956లో ఆయన నాలుగు నెలలపాటు కామన్వెల్త్‌ దేశాలకు దూరంగా వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయనకు భార్య పట్ల ఉన్న నిబద్ధతపై అనుమానాలు తలెత్తాయి.

కానీ తమ మధ్య ఉన్న పొరపొచ్చాలను సరిదిద్దుకోవడంతో వారి బంధం దశాబ్దాలపాటు సాగింది.

రాణికి ఆమె విధుల్లో సహకరిస్తూనే, కుటుంబ బాధ్యతలను కూడా డ్యూక్‌ నిర్వర్తించారు. బాహ్య ప్రపంచంలో ఆమె మహారాణి కాగా ఆయన ఆమెకు సహాయకుడు. కానీ వ్యక్తిగత జీవితంలో వారి పాత్రలు యాథావిధిగా రివర్స్‌లోలో కనిపించేవి.

ప్రిన్స్‌ ఫిలిప్‌ వంటలకు ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తుండగా, క్వీన్‌ వంట పాత్రలు కడుగుతున్న దృశ్యాలు 1960లో రాయల్‌ ఫ్యామిలీపై చిత్రించిన డాక్యుమెంటరీలో కనిపిస్తాయి.

రాణితో కలిసిప్రిన్స్ ఫిలిప్ దేశాల పర్యటనలు, పార్లమెంటు సమావేశాలు, వార్షికోత్సవాలు, ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాలకు హాజరవుతుండేవారు.

ప్రిన్స్‌ ఫిలిప్‌

పాత వీడియోలలో వారిద్దరూ చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి.

రాణి వచ్చే వరకు అక్కడికి వచ్చిన ప్రజలతో, గెస్టులతో మాట్లాడటంలో డ్యూక్‌ బిజీగా ఉండేవారు. అప్పుడు రాణి పని కూడా సులభమయ్యేది.

కుక్కలు, గుర్రాలను పెంచడంపై రాణికి ఆసక్తి ఉండేది. వాటి శిక్షకులు, సంరక్షకులతో ఆమె ఎక్కువగా మాట్లాడేవారు.

ప్రిన్స్‌ ఫిలిప్‌ తన జీవితాంతం క్రీడల మీద, కుటుంబ ఎస్టేట్లను నిర్వహించడం మీదా ఆసక్తి చూపేవారు.

తరచూ ఆయన విండ్సర్‌ గ్రేట్‌ పార్క్‌, సాండ్రింగ్‌హమ్‌ చుట్టూ డ్రైవింగ్‌ చేస్తూ కనిపించేవారు.

"మా తాత అందరితో మాట్లాడుతూ, తిరుగుతూ, నదిలో చేపలా ఉల్లాసంగా ఉన్నప్పటికీ, ఆయన మనసంతా ఆమె దగ్గరే ఉండేది. ఆయన లేకుండా ఆమె రాచ కార్యాలు నిర్వహించగలరని నేను అనుకోను" అని 2012లో ప్రిన్స్‌ హ్యారీ వ్యాఖ్యానించారు.

2017లో ప్రజా జీవితం నుండి ప్రిన్స్‌ ఫిలిప్ రిటైర్ అయ్యారు. "నేను నా వంతు సేవ చేశాను'' అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.

2020 మార్చి నాటికి నార్ఫోక్‌లోని సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో ఉన్న ఉడ్‌ఫామ్‌లో ఆయన తరచూ కనిపించే వారు.

ప్రిన్స్‌ ఫిలిప్‌

హెచ్‌ఎమ్‌ఎస్‌ బబుల్‌

హడావిడిని, ఆడంబరాలను ఇష్టపడని వ్యక్తిత్వం ఆయనది. చదవడం, రాయడం, పెయింటింగ్‌లాంటి వాటిలో సమయం గడపడం ఆయనకు ఇష్టం. కానీ రాణి జీవితం అందుకు భిన్నం. ఎన్నో అధికారిక కార్యక్రమాలు ఉండేవి.

అందువల్ల ఆమె ఎక్కువకాలం లండన్‌ బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో, విండ్సర్‌ ప్యాలెస్‌లో కాలం గడిపేవారు. ఇద్దరూ తరచూ మాట్లాడుకున్నా, భౌతికంగా దూరదూరంగానే గడిపేవారు.

అయితే కోవిడ్ -19 మహమ్మారి రాకతో వారిద్దరినీ విండ్సర్‌ ప్యాలెస్‌లో ఒక చిన్న ప్రాంతంలో, కొందరు సేవకుల సమక్షంలో ఉంచాలని అధికారులు భావించారు. దీనిని హెచ్‌ఎమ్‌ఎస్‌ బబుల్‌ అని అంటారు.

వైరస్‌ కారణంగా దంపతులిద్దరూ ఎక్కువ కాలం ఒకే చోట కాలం గడిపే అవకాశం వచ్చింది. జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి వారికి తగినంత సమయం దొరికి ఉండాలి.

ఇద్దరూ 70 సంవత్సరాలపాటు కలిసి మెలసి ఉన్నారు. ఇప్పుడు రాణికి ప్రిన్స్‌ దూరమయ్యారు.

చరిత్రలో వారిద్దరి జీవితం శాశ్వతమైన ప్రేమ కావ్యంగా మిగిలిపోవడం ఖాయం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Prince Philip: King-Queen ... Immortal love story
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X