• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇరాన్‌లో నీటి కోసం నిరసనలు, ఆ దేశం ఎందుకు ఎండిపోతోంది?

By BBC News తెలుగు
|
ఇరాన్‌లో నీటి పరిస్థితి దిగజారుతోందని నిపుణులు ఎంతో కాలంగా హెచ్చరిస్తున్నారు

ఇరాన్ ప్రస్తుతం భయంకరమైన నీటి ఎద్దడి, విద్యుత్ కోత సమస్యలను ఎదుర్కొంటోంది.

ఇరాన్ ప్రజలు ఈ సంక్షోభం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌లో నీటి కొరత మరింత దారుణంగా మారుతోందని నిపుణులు ఎంతోకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు.

ఆ దేశంలో ఈ స్థాయిలో నీటి ఎద్దడి ఏర్పడడానికి కారణాలేంటి?

ఊహించని స్థాయిలో కరువు ఏర్పడవచ్చని, వర్షపాతం గణనీయంగా తగ్గుతుందని, దీర్ఘకాలిక సగటు కన్నా తక్కువ స్థాయికి పడిపోతుందని ఏప్రిల్‌లో ఇరాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది.

ఇరాన్

నీళ్ల కోసం జనం నిరసనలు

చమురు ఉత్పత్తి చేసే ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో ప్రజలు రోడ్లపైకొచ్చి నీటి కొరతపై నిరసనలు చేశారు.

ఇతర నగరాల్లో జలవిద్యుత్ కొరతకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.

అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం అత్యవసర సహాయాన్ని అందించింది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం, వరదలు, సరస్సులు ఎండిపోవడం వంటి అనేక పర్యావరణ సమస్యలను ఇరాన్ ప్రస్తుతం ఎదుర్కొంటోంది.

ఇరాన్

భయపెడుతున్న గణాంకాలు

ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉన్న డేటా ప్రకారం, 2020 సెప్టెంబర్, 2021 జులై మధ్య ఇరాన్ ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాల్లో, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది.

అంతకుముందు సంవత్సరాలలో నమోదైన ప్రభుత్వ గణాంకాలు మాకు లభించలేదు. కానీ అమెరికాకు చెందిన పరిశోధకులు ఉపగ్రహ చిత్రాల ద్వారా డాటాను సేకరించారు.

ఈ గణాంకాలలో ఈ ఏడాది మార్చి వరకు కురిసిన వర్షపాతాన్ని, గత 40 సంవత్సరాల సగటుతో పోల్చి చూశారు.

2021లో మొదటి మూడు నెలల్లో నమోదైన వర్షపాతం ఆ సగటు కన్నా చాలా తక్కువగా ఉందని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఐర్విన్‌కు చెందిన సెంటర్ ఫర్ హైడ్రోమెటోరాలజీ తెలిపింది.

ఇరాన్‌లో మూడింట ఒక వంతు సాగు భూమికి మాత్రమే నీటి పారుదల సౌకర్యం ఉంది. మిగతా భాగమంతా వర్షాధారమైన భూములేనని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ అంచనా వేసింది.

2018లో కరువు కారణంగా నది మొత్తం ఎండిపోయింది

ఖుజెస్తాన్‌లో ఏం జరుగుతోంది?

ఈ ప్రాంతంలో తీవ్రమైన నీటి కరువు ఏర్పడడంతో స్థానిక ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.

"నాకు దాహంగా ఉంది" అంటూ నినాదాలు చేశారు.

ఒకప్పుడు ఇక్కడ అధిక నీటి ప్రవాహం ఉన్న ప్రధాన నది 'కరున్' ఎండిపోవడంతో నీటి సమస్య ప్రారంభమైంది.

స్టుట్‌గార్ట్ యూనివర్సిటీ సేకరించిన డాటా ప్రకారం, గత ఏడాది కాలంలో ఈ నదిలో నీటిమట్టం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది.

2019లో భారీ వరదలు సంభవించినప్పుడు కరున్ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. తర్వాత క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది.

అంతే కాకుండా, ముఖ్యమైన అనేక డ్యామ్‌లలో నీరు తగ్గిపోతోంది. ఆ ఉన్న కాస్త నీటిని దిగువ ప్రాంతాల్లో ధాన్యం పండించే రైతుల కోసం, పశువుల ఫారంల కోసం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అక్కడి చమురు పరిశ్రమ కారణంగానే స్థానికంగా పర్యావరణం దెబ్బతిందని కొందరు ఆరోపిస్తున్నారు.

ఈ ప్రాంతాల నుంచి దేశంలోని మధ్య ఎడారి ప్రాంతాలకు నీరు మళ్లించడం కూడా ఈ సంక్షోభానికి మరో కారణం.

"వాతావరణ మార్పులు, కరువు ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అయితే ఎన్నో సంవత్సరాలుగా వేళ్లూనుకుని ఉన్న నిర్వహణలోపాలు, పేలవమైన పర్యావరణ వ్యవస్థ, దూరదృష్టి లేకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్ధంగా లేకపోవడం వంటి కారణాలు ఈ సమస్యకు మూలం" అని ఇరానియన్ ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ మాజీ డిప్యూటీ హెడ్ కవేహ్ మదానీ అన్నారు.

మరింత పెరగనున్న నీటి సమస్యలు

ఇరాన్ అటుగంటుతున్న నీటి వనరులపై అధికంగా ఆధారపడి ఉంది.

తీవ్ర కరువు పరిస్థితులు, వాతావరణ మార్పుల కారణంగా నెలకొన్న సమస్యలతో ఇరాన్‌లో నీటి సమస్యలు అధికమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం జలవిద్యుత్ ఉత్పత్తిపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఇప్పటికే జలవిద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గిపోవడంతో ఈ వేసవిలో ఇరాన్‌లో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది.

విద్యుత్ కొరత కారణంగా టెహ్రాన్‌తో సహా పలు నగరాల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.

అధిక వేడిని తట్టుకునేందుకు ఏసీల వాడకం పెరగడం వల్ల కూడా పవర్ గ్రిడ్‌లపై ఒత్తిడి పెరిగింది.

ఇరాన్‌లో విద్యుత్ సరఫరా తగ్గిపోవడానికి క్రిప్టో కరెన్సీ మైనింగ్ కూడా కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియకు భారీ స్థాయిలో విద్యుత్ అవసరం అవుతుంది.

ఇరాన్

నీటి నిర్వహణలో దీర్ఘకాలిక సమస్యలు

ఇరాన్‌లో కరువు పరిస్థితులు గందరగోళాన్ని సృష్టిస్తున్నప్పటికీ, ఆ దేశంలో నీటి సంక్షోభానికి మరిన్ని లోతైన కారణాలు ఉన్నాయి.

నీటి సమస్యలకు త్వరగా పరిష్కారం కనుగొనకపోతే లక్షలమంది ప్రజలు దేశం విడిచి వెళిపోయే ప్రమాదం ఉందని 2015లోనే పర్యావరణ నిపుణులు హెచ్చరించారు.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు రావలసిన ఆవశ్యకత ఉందని ఇరాన్ పర్యావరణ శాఖ అధిపతి మసౌమె ఎబ్టేకర్ పిలుపునిచ్చారు.

భూగర్భజలాలు వేగంగా క్షీణిస్తున్న దేశాలలో భారతదేశం, అమెరికా, సౌదీ అరేబియా, చైనాలతో పాటు ఇరాన్ కూడా ఉంది.

ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటూ పిలుపునివ్వడంతో ఇరాన్‌లో రైతులు భారీగా భూగర్భజలాలపై ఆధారపడ్డారు.

భూగర్భజలాలను వేగంగా వెలికి తీయడం వలన, నేలలోని లవణాల స్థాయి పెరుగుతుంది. ఇది సారవంతమైన నేలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇరాన్‌లో అనేక ప్రాంతాల్లోని అధిక లవణాల సమస్య ఉన్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది.

ఇరాన్

మాయమైపోతున్న సరస్సులు

చిత్తడి నేలలు, నదులు ఎండిపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. దీని వలన ప్రమాదకరమైన దుమ్ము తుఫానులు సంభవించే ప్రమాదం ఉంది.

ఒకప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సులో ఒకటైన ఉర్మియా సరస్సు ఇప్పుడు పర్యావరణ విపత్తుకు చిహ్నంగా మిగిలింది.

ఒకప్పుడు 1,930 చదరపు మైళ్ల కన్నా ఎక్కువ వైశాల్యమున్న ఈ సరస్సు 2015నాటికి అందులో పదో వంతుకు ఎండిపోయింది.

నీటి సమస్యను పరిష్కరించాలంటూ ప్రజలు గగ్గోలు పెట్టడం, ఇరాన్ అధ్యక్షుడి చొరవతో మెరుగైన నీటి పారుదల పద్ధతుల కారణంగా ఈ సరస్సు పరిస్థితులు కొంత బాగుపడ్డాయి.

చారిత్రకంగా ఉన్న వైశాల్యంలో సగానికి ఈ సరస్సులో నీటిమట్టం పెరిగింది. అయితే, ఈ సరస్సులో నీటిమట్టం పెరగడానికి కారణం సంస్కరణలా లేక పెరిగిన వర్షపాతమా అన్నది స్పష్టంగా తెలీదు. ప్రస్తుతం ఏర్పడిన కరువు పరిస్థితులు మళ్లీ ఈ సరస్సుకు ముప్పు తేవచ్చు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Protests for water in Iran, why is that country drying up
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X