• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

RSV: కరోనా తగ్గినా, చిన్నారులకు ప్రాణాంతకంగా మారుతున్న మరో వైరస్

By BBC News తెలుగు
|

ఆర్‌ఎస్‌వీ అనేది శీతాకాలంలో కనిపించే కాలానుగుణ వైరస్ అని వైద్యులకు బాగా తెలుసు. అయితే, ఉత్తరార్ధగోళంలో గత కొన్ని నెలల్లో ఈ కేసులు పెరగడం వారికి ఆశ్చర్యం కలిగించింది.

2021 ప్రారంభంలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని మైమోనిడెస్ పిల్లల ఆసుపత్రి సిబ్బంది కొద్దిగా ఉపశమనం పొందినట్లు అనిపించినా, అప్రమత్తంగానే ఉన్నారు.

నగరంలో కోవిడ్-19 కేసులు తగ్గుతున్నాయి. సామాజిక దూరం, మాస్కు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం లాంటి జాగ్రత్తల వల్ల కేసుల్లో తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో వారి దృష్టికి వచ్చిన ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా చాలా తక్కువ.

కానీ, మార్చి నెలలో బాగా దగ్గుతున్న పిల్లలు, శిశువులను పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారిలో కొందరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.

వారంతా రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వీ) బారినపడ్డారు. ఇది ఊపిరితిత్తుల సమస్యలను కలిగించే సాధారణ శీతాకాల వ్యాధి.

ఏడాదిలో ఈ సమయంలో, ఆర్‌ఎస్‌వీ కేసులు తగ్గుతూ ఉండాలి. కానీ అవి విపరీతంగా పెరిగాయి.

తరువాతి నెలల్లో, దక్షిణ అమెరికా, స్విట్జర్లాండ్, జపాన్, యూకే వంటి సుదూర ప్రాంతాలలో ఆర్‌ఎస్‌వీ కేసులు పెరిగి వేసవికి అంతరాయం కలిగించింది.

ఈ వైరస్ ప్రవర్తనకు, కరోనా మహమ్మారి పరోక్ష కారణమని వైద్యులు చెబుతున్నారు. గత సంవత్సరం, లాక్‌డౌన్‌లు, పరిశుభ్రత చర్యలు కరోనా వైరస్‌తో పాటు ఆర్‌ఎస్‌వీ వంటి ఇతర వైరస్‌లను కూడా అరికట్టాయి. ఫలితంగా, పిల్లలు తాము రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే అవకాశాన్ని కోల్పోయారు.

ఆంక్షలు సడలించిన తర్వాత, ఆర్‌ఎస్‌వీ వైరస్‌కు శిశువులు, పిల్లలపై దాడి చేసేందుకు అవకాశం ఏర్పడింది.

ఇది ఊహకందని రీతిలో కేసుల నమోదుకు దారి తీసింది. గతంలో అంచనాకు అందిన ఈ వ్యాధి ప్రవర్తన, ప్రస్తుతం సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఆసుపత్రులు, కుటుంబాలను ఆశ్చర్యపరిచేలా మారింది.

అకాల వ్యాప్తి ఆసుపత్రుల్లోని వార్డులకు వాటి పరిమితిని తెలియజేసింది. కుటుంబాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ -19, దాని అనుబంధ చర్యలు ప్రపంచాన్ని ఎంతగా మార్చాయో ఆర్‌ఎస్‌వీ చూపించింది.

విధుల్లో ఉన్న సిబ్బంది దీనిని ఊహించలేదు. "మా ఐసీయూ మళ్లీ నిండిపోయింది. ఈసారి కోవిడ్‌తో కాదు. మరో వైరస్‌తో" అని మైమోనిడెస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ అంటు వ్యాధుల విభాగం డైరెక్టర్ రబియా అఘా గుర్తు చేసుకున్నారు.

ఏప్రిల్ ప్రారంభంలో ఆర్‌ఎస్‌వీ ఉధృతి తారస్థాయికి చేరుకుంది. ఐసీయూలో చేరిన మెజారిటీ పిల్లలు ఆర్‌ఎస్‌వీ చికిత్సకు వచ్చినవారే. ప్రపంచవ్యాప్తంగా, అంటువ్యాధుల నుండి నెలల తరబడి రక్షణపొందిన చిన్నపిల్లలు అకస్మాత్తుగా వీటికి గురవుతున్నారు.

"ఇది మాకు ఆశ్చర్యం కలిగించింది. ఇది మేం గమనించాల్సిన విషయం అని మాకు తెలుసు. కానీ అది ఇంత ఉధృతంగా ఉంటుందని మేం అనుకోలేదు" అని జ్యూరిచ్‌లోని యూనివర్శిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో అంటు వ్యాధులు, హాస్పిటల్ ఎపిడెమియాలజీ విభాగం అధిపతి క్రిస్టోఫ్ బెర్గర్ చెప్పారు .

ఆయన ఆసుపత్రిలో, ఆర్‌ఎస్‌వీ కేసులు సాధారణంగా జనవరిలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. జూన్ నుండి ఆగస్టు వరకు ఉండే వేసవి నెలల్లో దాదాపు సున్నా కేసులు నమోదవుతాయి. ఈ సంవత్సరం, శీతాకాలంలో

కేసులు లేవు. బదులుగా, అవి జూన్‌లో పెరిగాయి. జూలైలో కేసుల సంఖ్య 183కి చేరింది. ఈ సంఖ్య శీతాకాలంలో నమోదయ్యే కేసుల కంటే చాలా ఎక్కువ.

"మా ఆసుపత్రి నిండిపోయింది. బెడ్స్ ఖాళీ లేవు. మాకు అదొక సవాలు" అంటూ బెర్జర్ జులైలో వ్యాప్తి తీవ్రతను గుర్తు చేసుకున్నారు. ఆర్‌ఎస్‌వీతో అనారోగ్యంగా ఉన్న పిల్లలను ఇంకా ఖాళీగా ఉన్న

ఇతర ఆసుపత్రులకు బదిలీ చేయాల్సి వచ్చింది. ఇతర స్విస్ ఆసుపత్రులకు ఇదే అనుభవం ఎదురైంది.

మీరు ఒక సీజన్‌ని దాటొస్తే, దానికి వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ఆగిపోతోంది. తల్లుల ద్వారా పిల్లలకు అందేందుకు వారి శరీరంలో కూడా యాండీబాడీలు ఉత్పత్తి కావడం లేదు అని రబియా అఘా తెలిపారు.

స్విట్జర్లాండ్‌లో వేసవిలో కరోనా వైరస్ కంటే ఆర్‌ఎస్‌వి వారికి పెద్ద సమస్యగా మారింది. "ఆ కాలంలో మాకు దాదాపు కోవిడ్ కేసులు లేవు" అని బెర్గర్ చెప్పారు. కోవిడ్‌తో ఆసుపత్రికి వచ్చిన కొద్ది మంది పిల్లలు చాలా త్వరగా కోలుకున్నారు. కానీ ఆర్‌ఎస్‌వీ సోకిన వారు ఎక్కువ కాలం ఉన్నారు అని ఆయన చెప్పారు.

ఒక్క ఆర్‌ఎస్‌వీ ఇన్ఫెక్షన్ మాత్రమే అప్రమత్తం అవ్వడానికి కారణం కాదు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, చాలా మంది పిల్లలు రెండు సంవత్సరాల వయస్సులోపు ఈ రెండు వ్యాధుల్లో ఒక దానికి గురై ఉంటారు. ఎక్కువ మందికి జలుబు, ముక్కు కారడం, దగ్గు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలలో ఇది బ్రాంకోలైటిస్‌కు దారి తీయొచ్చు. ఫలితంగా ఊపిరితిత్తుల దిగువ భాగాల వాపు వస్తుంది. దీని వల్ల వారు వారు శ్వాస తీసుకోవడానికి, ఆహారం తినడానికి ఇబ్బంది పడతారు.

6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులకు ఆర్‌ఎస్‌వీ సోకితే, వారిలో 1-2శాతం మందిని మాత్రమే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కోలుకునేందుకు వారికి ట్యూబ్‌ ద్వారా అదనపు ఆక్సిజన్ ఇవ్వాలి. కొందరికి ఫీడింగ్ ట్యూబ్ కూడా అవసరం కావొచ్చు. కొద్ది రోజుల్లోనే వారికి నయమవుతుంది.

ఆర్ఎస్‌వీ వైరస్ ముప్పు

కరోనా వైరస్ మహమ్మారికి ముందు, శీతాకాలం ప్రారంభమవుతుందనగా ఆర్‌ఎస్‌వీ కేసుల తాకిడిని తట్టుకునేందుకు ఆసుపత్రులు సిద్ధంగా ఉండేవి. నెలలు నిండకుండా పుట్టిన శిశువులు, అప్పటికే ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారికి పాలివిజుమాబ్ అనే యాంటీ బాడిస్ డోస్‌ను ఇవ్వడం ద్వారా కాపాడొచ్చు. ఆర్‌ఎస్‌వీ కేసులు అధికంగా ఉన్న నెలల్లో ప్రతి నెలా ఈ షాట్‌ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేసుల తాకిడిని తట్టుకునేందుకు చేసుకునే ముందస్తు చర్యల్లో ఇది కూడా ఒక భాగం.

కరోనా మహమ్మారి కాలానుగుణ వ్యాధుల క్రమాన్ని, పిల్లల రోగ నిరోధక శక్తి సాధారణ అభివృద్ధిలో దాని పాత్రను దెబ్బతీసింది.

"కోవిడ్ కోసం మేం తీసుకున్న చర్యలతో, ప్రజలు ఒకరినొకరు కలుసుకోలేదు, ప్రయాణాలు చేయలేదు. మాస్కులు పెట్టుకుని, సామాజిక దూరం పాటించారు. దాని వల్ల కోవిడ్‌తో పాటు అన్ని ఇతర వైరస్‌లను దూరంగా ఉంచడానికి అవకాశం కలిగింది. కాబట్టి, ఓ ఆర్‌ఎస్‌వీ వ్యాధి సీజన్ పూర్తిగా తప్పిపోయింది. ఫలితంగా దానికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలు ఏర్పడలేదు. తల్లుల ద్వారా పిల్లలకు అందేందుకు వారి శరీరంలో కూడా యాండీబాడీలు ఉత్పత్తి కావడం లేదు" " అని అఘా చెప్పారు. "

దీని ఫలితంగా, ప్రపంచం కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినప్పుడు ఆ పిల్లలు ముఖ్యంగా ఆర్ఎస్‌వీ బారిన పడతారు.

సీజన్‌ను తప్పించుకోవడం వల్ల రోగ నిరోధక శక్తికి అంతరం కలుగుతుందని చెప్పడానికి వివిధ దేశాల డేటా కూడా మద్దతునిస్తోంది.

"గత శీతాకాలంలో ఏడాది వయసు పిల్లలు అత్యధికంగా, ఈ వైరస్ బారిన పడ్డారని, కేసుల్లో సాపేక్ష పెరుగుదల ఉందని" పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ అధికారులు బీబీసీకి చేసిన ఈ-మెయిల్ లో వివరించారు. వేసవిలో ఇంగ్లాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో కేసుల పెరుగుదలను వివరించారు.

మిస్ అయిన సీజన్ పిల్లలకు జబ్బు సోకే అవకాశాన్ని పెంచుతుంది. చలికాలం అంతటా భద్రంగా ఉన్నవారందరితో పాటు ఈ సమయంలో పుట్టిన వారికి కూడా ఈ ముప్పు ఉంటుంది. దీని వల్ల వైరస్ తీవ్రత అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది. 2003లో ఆర్ఎస్‌వీపై పర్యవేక్షణ ప్రారంభమైనప్పటి నుండి పరిశోధకులు కేసుల్లో అత్యధిక వార్షిక పెరుగుదలను ఈ ఏడాదే గుర్తించారు. మహమ్మారి సమయంలో వ్యాధి నిరోధకశక్తి తగ్గడం వల్లే, ఈ ఏడాది అధికంగా కేసులు వెలుగుచూశాయని భావిస్తున్నారు.

వైరస్ వ్యాప్తికి ఇతర కారణాలపై ఇంకా స్పష్టత లేదు. కోవిడ్ వ్యతిరేక చర్యలు వదులుకున్న తర్వాత ఆర్ఎస్‌వీ కేసులు ఎందుకు పెరిగాయి అనే ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ ఫ్లూ కేసులు ఎందుకు నమోదు కాలేదు అనే అనుమానం మొదలైంది.

సీజన్ తర్వాత ఆర్ఎస్‌వీ పెరుగుదల తీరు ఒక దేశానికి, మరొక దేశానికి భిన్నంగా ఉంది. బ్రూక్లిన్‌లోని అఘా, ఆమె బృందం తీవ్రత అసాధారణమని గమనించారు. చిన్న పిల్లలను ప్రభావితం చేసి, ఎక్కువ మందిని ఐసీయూ పాలు చేస్తుందని గుర్తించారు. కానీ, ఆస్ట్రేలియాలో ఇదిమునుపటిలా కాకుండా పెద్ద వయసు కలిగిన సమూహాన్ని ప్రభావితం చేసింది. సాధారణ శీతాకాలపు తీవ్రతతో పోల్చితే, స్విస్‌లో వేసవి వ్యాప్తి మరింత తీవ్రంగా లేదని బెర్గర్ చెప్పారు.

రాబోయే నెలల్లో ఈ వ్యాప్తి ఎలా ఉండబోతోందన్న విషయమే ఓ పెద్ద ప్రశ్న. వేసవిలో కేసులు పెరిగాయంటే, చలికాలంలో తీవ్రత మరింత పెరుగుతుందని అనుకోలేం. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది.

"ఆర్ఎస్‌వీ.. అది కలిగించే బ్రాంకోలైటిస్‌పై పిల్లల ఆసుపత్రులు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోవడం కీలకమైన విషయం" అని గ్రేట్ ఆర్మండ్‌ స్ట్రీట్ ఆసుపత్రిలోని డిప్యూటీ మెడికల్ డైరెక్టర్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ సోఫియా వరద్కర్ చెప్పారు.

ఆమె ఆసుపత్రిలో, కేసులు పెరగడం ప్రారంభమయ్యాయి. రాబోయే వారాల్లో మరిన్ని కేసులు వస్తాయని ఆమె భావిస్తున్నారు. శిశువులను చూసుకునే వారికి, ఆర్ఎస్‌వీ, కోవిడ్ -19 కంటే ఎక్కువ ఆందోళన కలిగిస్తుందని వరద్కర్ చెప్పారు.

"సాధారణంగా పిల్లలకు కోవిడ్ పెద్ద అనారోగ్యం కాదు. ఇది చాలా మంది పిల్లలను నిజంగా అస్వస్థతకు గురి చేయలేదు. ఆర్ఎస్‌వీ అనేది ఒక పెద్ద అనారోగ్యం. చాలామంది పిల్లలను ప్రభావితం చేస్తుంది. అది వారిని అస్వస్థతకు గురి చేస్తుందని మాకు కచ్చితంగా తెలుసు" అని ఆమె అన్నారు.

పాఠశాలలు మళ్లీ ప్రారంభం కావడంతో ఆర్ఎస్‌వీతో సహా పలు వైరస్‌లు వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ పెద్దల ప్రవర్తన మరింత కీలకం కావచ్చు.

స్విట్జర్లాండ్‌లో, శీతాకాలం అంతా నర్సరీలు, ప్లే గ్రూపులు తెరిచే ఉన్నాయి. చిన్న పిల్లలు మాస్క్‌లు ధరించలేదు. అయినప్పటికీ, ఆ శీతాకాలంలో ఆర్ఎస్‌వీ, ఫ్లూ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు దాదాపు ఏ పిల్లలల్లోనూ కనిపించలేదు. ఎందుకంటే పెద్దల పరిశుభ్రత వారిని రక్షించడంలో సహాయపడతాయి.

"పిల్లల నుంచి పెద్దలకు జబ్బులు సోకుతాయని చెబుతుంటారు, కానీ మీరు దాని గురించి ఆలోచిస్తే, ఇక్కడ అస్సలు అలా జరగదు. అది మరో విధంగా ఉంటుంది" అని బెర్గర్ చెప్పారు.

"పెద్దలు, ఎదిగిన పిల్లలు మాస్క్‌లు ధరించినప్పుడు, సామాజిక దూరం పాటించినప్పుడు, చేతులు కడుక్కున్నప్పుడు, ఫ్లూ లేదా ఆర్ఎస్‌వీ లాంటి జబ్బులు కనిపించవు. వారు నిర్లక్ష్యం వహించినప్పుడు వైరస్ మళ్లీ వ్యాపిస్తుంది. ఎక్కువ మంది చిన్న పిల్లలు ఆసుపత్రి పాలవుతారు" అన్నారు.

చేతులు కడుక్కోవడం, ముక్కు కారడం, దగ్గు ఉన్న వ్యక్తుల నుండి శిశువులను దూరంగా ఉంచడం వల్ల జబ్బు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సాయపడుతుంది. వేసవిలో కేసుల పెరుగుదల తర్వాత కూడా ఆయన ఆసుపత్రి ఇంకా జాగ్రత్తగానే ఉంది" ఇది ఎలా కొనసాగుతుందో నాకు తెలియదు, ఇక్కడితో ఆగిపోతాయా లేదా శీతాకాలంలో వైరస్ మళ్లీ విజృంభిస్తుందా అన్నది నాకు తెలియదు."

చేతులు కడుక్కోవడం, ముక్కు కారడం,దగ్గు ఉన్న వ్యక్తుల నుండి శిశువులను దూరంగా ఉంచడం వల్ల జబ్బు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సాయపడుతుంది. దీని వల్ల కేసుల సంఖ్య విపరీతంగా పెరగదు. ఫలితంగా జబ్బు సోకిన ప్రతి బిడ్డకు సమయానికి వైద్యం అందుతుంది.

"చాలా మంది పిల్లలకు, ఇది స్వల్ప అనారోగ్యం. వారిని వారి తల్లిదండ్రులు చూసుకోవచ్చు. వారికి సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. తరచుగా తినిపించాలి. జ్వరం ఉంటే పారాసిటమాల్ ఇవ్వాలి. అంతే" అని లండన్‌లోని వరద్కర్ చెప్పారు. కానీ శిశువు శ్వాస తీసుకోవడానికి లేదా తిండి తినడానికి ఇబ్బంది పడుతున్నా, సరిగ్గా లేదని తల్లిదండ్రులు భావిస్తే, వారు సహాయం కోరాలి అని ఆమె చెప్పారు.

బ్రూక్లిన్‌లోని మైమోనిడెస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌ ఆర్ఎస్‌వీ తారస్థాయిని దాటేసింది. కానీ కోవిడ్ -19 అనంతరం ఆసుపత్రులు చేసుకోవాల్సిన సర్దుబాట్లపై అఘా విస్తృత పాఠాన్ని చూపుతున్నారు.

"ఇది మాకు నేర్పించినది ఏమిటంటే, మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇవి రెండేళ్ల క్రితం జరిగిన విషయాలు కాదు. జీవితం మారిపోయింది, ప్రపంచం మారిపోయింది. ఈ వైరస్‌లు ఊహించని విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రవర్తిస్తున్నాయి" అంటారు అఘా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
RSV: Corona is another virus that can be fatal to children, even if it is reduced
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X