కరోనా బిగ్ న్యూస్: వ్యాక్సిన్ వచ్చేసింది - రష్యా రికార్డు - పుతిన్ కూతురికి మొదటి డోసు..
అడ్డూఅదుపులేకుండా సాగిపోతున్న కరోనా మహమ్మారికి ఎట్టకేలకు చెక్ పడింది. యావత్ మానవాళి ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తోన్న వ్యాక్సిన్ రానే వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కొవిడ్-19 వ్యాక్సిన్ ను రష్యా విడుదల చేసింది. మంగళవారం మాస్కోలో జరిగిన అధికారక కార్యక్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీన్ని లాంచ్ చేశారు. అంతేకాదు, జనం కోసం సిద్దం చేస్తోన్న వ్యాక్సిన్ మొదటి డోసును పుతిన్ కూతురికే అందించారు.
రాజధానిపై ట్విస్ట్: అమరావతి ముహుర్తానికే విశాఖలో శంకుస్థాపన - మోదీ కోసం జగన్ గజయత్నం - అంతలోనే..

వ్యాక్సిన్ పేరు ఇదే..
కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో అమెరికా, చైనాకు దీటుగా ప్రయోగాలు నిర్వహించిన రష్యా.. టీకాను తీసుకొచ్చిన తొలి దేశంగా రికార్డు నెలకొల్పింది. రష్యా ఆరోగ్య, రక్షణ శాఖలతోపాటు గమలేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఈ ప్రయోగాల్లో పాలుపంచుకుంది. రష్యా తయారీ వ్యాక్సిన్ కు ‘‘స్పుత్నిక్-V'' గా పేరును ఖరారు చేశారు. అమెరికా, చైనాతో విభేధాల నడుమ రష్యా రూపొందించిన స్పుత్నిక్ వ్యాక్సిన్ పై అనుమానాలు, విమర్శలు సైతం వెల్లువెత్తాయి, అయితే వాటిని లెక్కచేయకుండా పుతిన్ అనుకున్న సమయానికే వ్యాక్సిన్ ను విడుదల చేశారు.

పుతిన్ కీలక వ్యాఖ్యలు..
‘‘మన ఎదురుచూపులకు కాలం చెల్లిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మన గమలేయా ఇనిస్టిట్యూట్ రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ చాలా బాగా పనిచేస్తోంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ సందర్భంగా నేనో విషయం స్పష్టం చేయదల్చుకున్నాను.. ఏదో తొందరలో తీసుకొచ్చిన వ్యాక్సిన్ కాదిది. అన్ని రకాలుగా అవసరమైన ప్రయోగాలు, పరీక్షలు చేసిన తర్వాతే వ్యాక్సిన్ విడుదల చేస్తున్నాం. నా ఇద్దరు కూతుళ్లలో ఒకరికి ఇప్పటికే వ్యాక్సిన్ డోసు ఇచ్చాం. ఇప్పుడామె చాలా ఆరోగ్యంగా ఉంది. అతి త్వరలోనే దేశ ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తాం'' అని పుతిన్ చెప్పారు.

స్పుత్నిక్-v ఎలా పనిచేస్తుందంటే..
ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ గా అందుబాటులోకి వచ్చిన గమ్ కొవిడ్ పై రష్యన్ సైంటిస్టులు చెప్పిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తికి టీకా మొదటి డోసు వేసిన తరువాత 21వ రోజుకు వైరస్‌ను అడ్డుకునేలా రోగనిరోధక వ్యవస్థ అతనిలో బలోపేతమవుతుంది. రెండో డోసుతో రోగనిరోధక వ్యవస్థ రెట్టింపు బలోపేతమై, వైరస్ ప్రభావానికి లోనుకాని స్థితి ఏర్పడుతుంది. ఈ టీకాను అడినోవైరస్ భాగాలతో చేసినట్లుగా రష్యా మీడియా పేర్కొంది.

ముందుగా వ్యాక్సిన్ వీళ్లకే..
రష్యా రూపొందించిన స్పుత్నిక్-v వ్యాక్సిన్ ప్రస్తుతాకికి పరిమిత సంఖ్యలో మాత్రమే డోసులు అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెల నుంచి వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈలోపు మరిన్ని క్లినికల్ ట్రయల్స్ చేస్తామని పుతిన్ చెప్పారు. ముందుగా కరోనాపై పోరులో అగ్రభాగాన ఉన్న డాక్టర్లు, పోలీసులు, టీచర్లకు టీకా అందిస్తామని, నవంబర్ నాటికి దేశంలో చిట్టచివరి వ్యక్తికి కూడా వ్యాక్సిన్ అందుతుందని స్పష్టం చేశారు.