
వెనక్కి తగ్గిన రష్యా: అక్కడి నుంచి సైన్యం ఉపసంహరణకు ఓకే: ఇస్తాంబుల్ చర్చలు ఫలించినట్టే?
వాషింగ్టన్: నెలరోజులకు పైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతూ వచ్చిన భీకర యుద్ధానికి పుల్‌స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. ఇప్పట్లో ఈ యుద్ధానికి అంతు అనేదే ఉండకపోవచ్చంటూ వార్తలు వెలువడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. వెనక్కి తగ్గింది. రష్యాతో వెనకడుగు వేయించడానికి పాశ్చాత్య దేశాలు చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించనప్పటికీ- టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా సాగిన శాంతి చర్చలు కొంత ప్రభావాన్ని చూపాయి. ఈ చర్చల పాక్షికంగా సఫలం అయ్యాయి.

రష్యాతో యుద్ధాన్ని మాన్పించడానికి
రష్యా-ఉక్రెయిన్ మధ్య 34 రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యాపై అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్, నాటో సభ్యత్వ దేశాలు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినప్పటికీ ఫలించలేదు. రష్యా ఏ మాత్రం వెరవలేదు. ఆయా చర్యలు రష్యాను మరింత రెచ్చగొట్టినట్టయ్యాయి. ఇది కాస్తా ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనలోకి నెట్టేసింది. కిందటి నెల 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధంలో అంచనాలకు మించిన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది.

ఎర్డొగాన్ ఎంట్రీతో మారిన పరిణామాలు..
యుద్ధాన్ని నివారించడానికి ఇటీవలే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, వొలిదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. సుదీర్ఘకాలం పాటు వారి మధ్య సంభాషణ కొనసాగింది. కాల్పులను విరమించాల్సిందిగా ఆయన పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. మానవతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాలని సూచించారు.

ఇస్తాంబుల్‌లో చర్చలకు ఆఫర్..
రెండు దేశాలు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని, ఈ రీజియన్‌లో ఉద్రిక్తతలను నివారించడానికి, శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికి సహకరించాలని కోరారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఇస్తాంబుల్‌లో ఇరు దేశాలు చర్చలకు రావాలని కూడా టర్కీ అధ్యక్షుడు ఆహ్వానించారు. ఇస్తాంబుల్‌లో శాంతిచర్చలు చేపట్టడానికి అనుమతి ఇస్తాననీ స్పష్టం చేశారు.

తటస్థంగా ఉంటామంటూ..
దీని తరువాత- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. రష్యాతో శాంతి చర్చలకు అంగీకారం తెలిపారు. ఇస్తాంబుల్‌లో భేటీకి తాను సిద్ధమని ప్రకటించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా న్యూట్రల్ స్టేటస్ అజెండాగా చర్చలను జరపాల్సి ఉంటుందని చెప్పారు. శాంతిచర్చల ద్వారా వెల్లడయ్యే ఫలితాలకు థర్డ్‌పార్టీ ద్వారా లీగల్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. సెక్యూరిటీ గ్యారంటీలు, తటస్థత, అణ్వాయుధేతర దేశంగా గుర్తింపు.. ఈ అజెండాతో చర్చలకు తాము సిద్ధమని పేర్కొన్నారు.

ఇస్తాంబుల్‌లో భేటీ..
ఆ అజెండాతో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధులు ఇస్తాంబుల్‌లో సమావేశం అయ్యారు. మూడు గంటలకు పైగా వారి మధ్య చర్చలు కొనసాగాయి. అవి కొంతవరకు ఫలించినట్టే కనిపిస్తోన్నాయి. రష్యా కొంత సానుకూలంగా వ్యవహరించింది. ఇదివరకు నిర్వహించిన శాంతి చర్చల సందర్భంగా ఉక్రెయిన్ ప్రతిపాదించిన అంశాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోని రష్యా.. తన వైఖరిని మార్చుకుంది. సానుకూలంగా వాటిని పరిశీలనలోకి తీసుకుంది.

ఆ రెండు నగరాల నుంచి..
రాజధాని కీవ్, చెర్నిహివ్ నుంచి సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడానికి రష్యా అంగీకరించింది. ఈ రెండు నగరాల నుంచి తమ సైనిక బలగాలను భారీగా తగ్గిస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉప మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ వెల్లడించారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయని చెప్పారు. శాంతి చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా- తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

సెక్యూరిటీ గ్యారంటీకి ఓకే..
తటస్థంగా వ్యవహరించగలిగితే- ఉక్రెయిన్‌కు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని అలెగ్జాండర్ ఫోమిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ తన అజెండాకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని చెప్పారు. కీవ్, చెర్నిహివ్ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి తాము అంగీకరించామని, మిగిలిన నగరాల్లో సైనిక చర్యలు యధాతథంగా కొనసాగే అవకాశాలు లేకపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం రష్యా ప్రతినిధులు మాస్కోకు బయలుదేరి వెళ్లారు.