‘స్పుత్నిక్-వీ’గా ప్రపంచం ముందుకు రష్యా వ్యాక్సిన్: ఎందుకంటే..?, బిలియన్ ఆర్డర్లు వచ్చేశాయ్!
మాస్కో: ప్రపంచంలో అందరికంటే ముందు తాము కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా తీసుకొస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు పేరును కూడా ఖరారు చేసింది. స్పుత్నిక్ వీ (Sputnik V) పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని వెల్లడించింది.
ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరమ్ ఇనిస్టిట్యూట్, ప్రపంచంలోనే అత్యధికంగా..

‘స్పుత్నిక్ ఐ’ లానే.. స్పుత్నిక్ వీ..
స్పత్నిక్-ఐ ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనను ఉత్తేజపరిచింది. ఇక ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చే కరోనావైరస్ వ్యాక్సిన్ ‘స్పత్నిక్'గా పిలువబడుతుంది. దీంతో ఇప్పుడు కూడా అదే మొదటి స్పుత్నిక్ సందర్భం వచ్చినట్లుంది. ఈ పోలికతోనే కరోనా వ్యాక్సిన్ పేరును ‘స్పుత్నిక్ వీ'గా నిర్ణయించినట్లు సంబంధిత వెబ్సైట్ వివరించింది.

బుధవారం నుంచి ఫేస్ 3 ట్రయల్స్..
స్పుత్నిక్ వీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని సదరు వెబ్సైట్ పేర్కొంది. వ్యాక్సిన్‌కు సంబంధించి వచ్చే తప్పుడు వివరాలను ఈ వెబ్సైట్ ఖండిచడమేగాక, వాస్తవాలను వివరిస్తోంది. వ్యాక్సిన్ ప్రాజెక్టుకు నిధులను అందించే ది రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హెడ్ కిరిల్ దిమిత్రీవ్ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ఫేస్ 3 ట్రయల్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు.

ఇప్పటికే బిలియన్ డోసులకుపైగా ఆర్డర్ చేసిన 20 దేశాలు
అంతేగాక, ప్రపంచంలోని 20 దేశాలు ఇప్పటికే బిలియన్ డోసుల కంటే ఎక్కువగానే ఆర్డర్ చేశాయని కిరిల్ వివరించారు. కాగా, రష్యా దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే, కట్టడి సమర్థవంతంగా చేయడంతో ఇటీవల కాలంలో ఎక్కువ కేసులు నమోదు కావడం లేదు. రష్యాలో ఇప్పటి వరకు 8,97,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 15,131 మంది కరోనా బారినపడి మరణించారు. తాజాగా 4,945 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. తాజాగా, రష్యాలో కరోనాతో 130 మంది మృతి చెందారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో యూఎస్ఏ, బ్రెజిల్, ఇండియాల తర్వాత రష్యా కొనసాగుతోంది.