Russia Ukraine Video:అయ్యో పాపం.. వారం రోజుల క్రితం స్కూల్లో ఈ చిన్నారులు..మరి ఇప్పుడు..?
రష్యా ఉక్రెయిన్ పై పగబట్టింది. ఎక్కడా కించిత్ జాలి దయ లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆ చిన్న దేశంపై రష్యా రాకాసి వ్యవహరించిన తీరుపట్ల ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా ఇంత దారుణానికి పాల్పడటంపై ఐక్యరాజ్య సమితి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు తమ లక్ష్యం ఉక్రెయిన్ పౌరులు కాదంటూనే మరో వైపు అదే పౌరులు నివసించే ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. రష్యా చేసిన ఈ భీకర దాడికి చిగురుటాకుల వణికిపోతోంది ఉక్రెయిన్. ఈ సమయంలో ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌కు మానసికంగా అండగా ఉంటామని చెబుతున్నాయే తప్ప... ఒక్కరూ కూడా తమ బలగాలను పంపుతామని చెప్పడం లేదు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తమకు ఆయుధాలను ఇస్తే రష్యాను తమ బలగాలు ధీటుగా ఎదుర్కొంటాయని వేడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చాలామంది తండ్రులు తమ కుటుంబాలను వీడి రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు ఒక్కొక్కరూ సైనికుడయ్యారు. ఇక అక్కడ తండ్రులను వదిలి తల్లులతో ఉన్న చిన్నారుల బాధ వర్ణనాతీతం. అలాంటి కదిలించే కథలు వీడియో రూపంలో మీకోసం వన్ఇండియా అందిస్తోంది.
యుద్ధం చూసి వణికిపోతున్న చిన్నారులు
ఒక వారం పదిరోజుల క్రితం ఉక్రెయిన్‌లో పిల్లలు చాలా సంతోషంగా ఉండేవారు. తెల్లారితే చకచకా రెడీ అయి స్కూలుకు వెళ్లి పాఠాలు నేర్చుకుంటూ తమ స్నేహితులతో ఆనందంగా గడిపేవారు. కానీ ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు పిల్లలు భయపడుతున్నారు. వేలాదిగా పిల్లలు తండ్రులను వదిలి కేవలం తల్లులతోనే ఉంటున్నారు. తమకు నాన్న కావాలంటూ పిల్లలు ఏడుస్తుంటే ప్రతి ఒక్కరినీ ఈ దృశ్యం కదిలిస్తోంది. ఉక్రెయిన్ కోసం తాను పోరాటం చేసేందుకు వెళుతున్నానని మీరంతా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని ఓ భర్త తనకు చెప్పినట్లు ఓ భార్య వెల్లడించింది.
రష్యా పై పోరాడేందుకు....
రష్యా ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న వేళ ఇతర దేశాల్లో ఉద్యోగాల రీత్యా లేదా ఇతర పనులపై వెళ్లి అక్కడే స్థిరపడ్డ ఉక్రెయిన్ పురుషులు తమ భూమిని శతృదేశం నుంచి కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌కు వచ్చారు. తమ దేశం పట్ల తమకున్న భక్తిని చాటుకున్నారు. రష్యా దాడి చేయడం ప్రారంభించగానే కొన్ని వేల మంది ఉక్రెయిన్ పురుషులు వారుంటున్న దేశాలను వీడి ఉక్రెయిన్‌కు చేరుకుని పోరాటానికి దిగారని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో పేర్కొంది. వీరంతా పోలాండ్ నుంచి ఉక్రెయిన్‌లోకి అడుగుపెట్టినట్లు పేర్కొంది.తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఇలా ఇతర దేశాల భూభాగాన్ని ఉపయోగించుకోవడం చాలా అరుదుగా జరిగింది.
విదేశీయులు
ఉక్రెయిన్ను వీడి తమ సొంత దేశాలకు వెళ్లాలంటూ ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులకు వారి దేశ ప్రభుత్వాలు ఆదేశాలు చేశాయి. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశాయి. అయితే ఉక్రెయిన్‌కు సరిహద్దుగా ఉన్న పోలాండ్ లేదా హంగేరీ లాంటి దేశాల్లోకి ప్రవేశిస్తే ఇక అక్కడి నుంచి తమ ప్రభుత్వం వారిని సురక్షితంగా చేరుస్తుందంటూ ప్రకటన చేశాయి. ఇక్కడే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్ను వీడి వెళుతున్న వారి సంఖ్య ఇప్పటికే 10 లక్షలు దాటినట్లు ఐక్యరాజ్య సమితి రెఫ్యూజీ ఏజెన్సీ పేర్కొంది.మరో 4,70,000 వేల మంది విదేశీయులు సరిహద్దు వద్ద చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.
మొత్తానికి రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఆగి శాంతి చర్చలు జరిగేవరకు ఇరు దేశాలకు ఇబ్బందులు తప్పవు. ఉక్రెయిన్ రష్యాతో ఇబ్బంది పడితే.. రష్యా మాత్రం ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలతో ఇబ్బంది పడుతోంది.