
ఉక్రెయిన్ పై రష్యా వార్ పార్ట్-2 మొదలు-టార్గెట్ డాన్ బాస్-గెలిస్తే ఆ రెండు దేశాలకు యాక్సెస్
ఉక్రెయిన్ లో రష్యా దూకుడు మళ్లీ పెరుగుతోంది. ఇప్పటికే రెండు నెలలుగా అక్కడ పోరు సాగిస్తున్న రష్యా యుద్ధాన్ని గెలవకపోగా.. భారీ నష్టాలు చవిచూస్తుందన్న విమర్శల నేపథ్యంలో పుతిన్ వ్యూహాలు మారుస్తున్నారు. మారిన వ్యూహాలతో తాజాగా ఓడరేవు నగరం మేరియుపోల్ ను తాజాగా స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు.. ఇప్పుడు మరో కీలక నగరం డాన్ బాస్ పై దాడిని ప్రారంభించాయి. మరోవైపు పశ్చిమదేశాలు తమపై విధించిన ఆంక్షలు విఫలమయ్యాయని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు.

ఉక్రెయిన్ లో రష్యా దూకుడు
ఉక్రెయిన్ లో రష్యా పోరు మరింత ముమ్మరం అవుతోంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభించి రెండునెలలైనా ఫలితం తేలకపోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న రష్యా సేనలు.. ఉక్రెయిన్ లో దాడులు ముమ్మరం చేశారు. తాజాగా ఓడరేవు నగరం మేరియుపోల్ ను స్వాధీనం చేసుకున్న రష్యా.. అదే ఊపులో మరో కీలక నగరం డాన్ బాస్ పై దాడులు ముమ్మరం చేస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ కూడా నిర్ధారించారు. దీంతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ దాడులు కొనసాగిస్తోంది.

కీలక నగరం డాన్ బాస్ టార్గెట్ గా
ఉక్రెయిన్ లో రెండు వేర్పాటు వాద ప్రాంతాలైన లుహాన్స్స్, డోనెట్స్క్ ను ప్రత్యేక దేశాలుగా గుర్తించిన రష్యా.. ఈ పోరులో మాత్రం వాటికి చేరుకోలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం డాన్ బాస్ నగరంపై పట్టు సంపాదించలేకపోవడమే. దీంతో ఇప్పుడు డాన్ బాస్ పై రష్యా దృష్టిపెట్టింది. అక్కడ మిలటరీ బేస్ లతో పాటు ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాల్ని టార్గెట్ చేస్తూ రష్యా సేనలు రెచ్చిపోతున్నాయి. దీంతో ఇప్పుడు డాన్ బాస్ పోరు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. డాన్ బాస్ ను గెలిస్తే లుహాన్స్స్, డోనెట్స్క్ కు వెళ్లేందుకు అవకాశం దొరుకుతుందని రష్యా ఆశాభావంగా ఉంది.

తిప్పికొడతామంటున్న జెలెన్ స్కీ
ఉక్రెయిన్ లోని డాన్బాస్ మొత్తం తూర్పు ప్రాంతాన్ని నాశనం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. రష్యన్ దళాలు డాన్బాస్ కోసం యుద్ధాన్ని ప్రారంభించాయని ఆయన ధృవీకరించారు. దీని కోసం వారు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నట్లు జెలెన్ స్కీ తెలిపారు. అయితే డాన్బాస్ ను కాపాడుకునేందుకు తుదికంటా పోరాడతామని జెలెన్ స్కీ చెప్తున్నారు. ఇప్పటికే రాజధాని కీవ్ తో పాటు మిగతా చోట్ల కూడా అనుసరించిన గెరిల్లా వ్యూహంతో డాన్ బాస్ ను ఉక్రెయిన్ కాపాడుకుంటుందని ఆయన చెప్తున్నారు.

ఆంక్షలు ఫలించలేదన్న పుతిన్
ఉక్రెయిన్ పై దండయాత్రకు ప్రతిఫలంగా రష్యాపై పశ్చిమదేశాలు విధించిన ఆంక్షలు విఫలమైనట్లు రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ ప్రకటించారు. పశ్చిమ దేశాలు తమ ఆర్ధిక వ్యవస్ధను ఇబ్బందిపెడతాయని, కలవరపెడతాయని, మార్కెట్లలో భయాందోళనలను రేకెత్తించాలని, బ్యాంకింగ్ వ్యవస్థ పతనం, దుకాణాల్లో కొరతను రేకెత్తించాలని భావిస్తున్నాయని పుతిన్ వెల్లడించారు. అయితే పశ్చిమదేశాలు రష్యాపై చేపట్టిన ఆర్థిక మెరుపు వ్యూహం విఫలమైందని పుతిన్ ప్రకటించారు. అయితే పశ్చిమదేశాలు మాత్రం పుతిన్ వాదనను కొట్టేపారేస్తున్నాయి. తమ ఆంక్షల ప్రభావం రష్యాపై తీవ్రంగా ఉందని చెప్తున్నాయి.