• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐఎస్, హమస్‌కు ఆర్థిక దన్ను: ఇందుకే ఖతార్‌పై ఆంక్షలు

By Swetha Basvababu
|

రియాద్/ దుబాయి: అరబ్ ప్రపంచంలో దౌత్యపరమైన కల్లోలం చెలరేగింది. ఉగ్రవాదులకు ఆర్థిక, హార్దిక సాయం అందిస్తున్నదన్న కారణంతో ఖతార్‌తో అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటున్నట్లు ఏడు ముస్లిం దేశాలు ప్రకటించాయి. తొలుత సౌదీ అరేబియా, ఈజిప్ట్ దౌత్య సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించాయి.

తర్వాత యెమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్, లిబియా, మాల్దీవులు జత కలిశాయి. అరబ్ దేశాలతో మాల్దీవులు చేతులు కలపడం ఆశ్చర్యకర పరిణామమే మరి. దీంతో సమృద్ధిగా ముడి చమురు నిల్వలు గల అరబ్ దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నట్లయ్యింది.

దీనివల్ల అంతర్జాతీయంగా ఖతార్‌కు గల ప్రతిష్ఠ దెబ్బ తినే అవకాశం కనిపిస్తున్నది. సౌదీ‌తో సుదీర్ఘ కాలంగా విభేదిస్తున్న ఖతార్‌కు నమ్మకమైన మిత్రదేశం ఇరాన్.. ఈ నిర్ణయం వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుట్ర దాగి ఉన్నదని ఆరోపించింది. కానీ ఈజిప్ట్‌తోపాటు గల్ఫ్ దేశాలు సుదీర్ఘ కాలంగా ప్రారంభం నుంచి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), అల్ ఖైదా, పాలస్తీనాలోని హమస్ తదితర సంస్థలతోపాటు ప్రత్యేకించి ఈజిప్ట్ కేంద్రంగా పనిచేస్తున్న ముస్లిం బ్రదర్‌హుడ్‌కు ఖతార్ చేయూతనిస్తున్నదని ఆరోపిస్తున్నాయి.

అరబ్ ప్రపంచంలో అతి చిన్న దేశమైన ఖతార్ పట్ల ఇతర గల్ఫ్ దేశాలు కత్తి కట్టడానికి నేపథ్యం.. కారణాలు ఉన్నాయి. గాజా స్ట్రిప్‌లో హింసాత్మక ఘటనలకు నేపథ్యంగా మారిన హమస్‌కు ఆర్థిక, హార్దిక అండదండలు కల్పిస్తున్నదని, పాలస్తీనా నుంచి తప్పించుకుని వచ్చిన హమస్ నేత ఖాలీద్ మషాల్‌కు 2012 నుంచి ఖతార్ ఆశ్రయం కల్పించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్ దూకుడును నిలువరించేందుకు హమస్ పని చేస్తున్నది.

ఖతార్‌తో ఉద్రిక్తతలు ఇలా

ఖతార్‌తో ఉద్రిక్తతలు ఇలా

సౌదీ అరేబియాతోపాటు ఇజ్రాయెల్ కూడా అమెరికాకు అత్యంత ఇష్టమైన దేశాల్లో ఒకటిగా ఉన్నది. దీనికి తోడు గత నెలాఖరులో తమ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థను పొరుగు దేశాలు హ్యాకింగ్‌కు గురి చేశాయని ఖతార్ రాజు తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆరోపణలకు దిగారు. దీనిపై గల్ఫ్ దేశాలన్నీ ఆగ్రహించాయి. ఖతార్ ఆరోపణలను ఖండిస్తూ ప్రకటనలిచ్చాయి. ఆ ప్రకటనలేవీ ఖతార్‌లోని మీడియా సంస్థలేవీ ప్రచురించలేదు.. ప్రసారం చేయలేదు. చివరకు ఖతార్ ప్రభుత్వ అధికారిక టీవీ చానెల్ ‘అల్ జజీరా' కూడా సహచర గల్ఫ్ దేశాల ప్రతిస్పందనలను పట్టించుకోకపోవడంతో ఖతార్‌కు, మిగతా గల్ఫ్ దేశాలకు మధ్య ఇప్పటివరకు ఉన్న ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అప్పట్లో ఈజిప్టులో అంతర్యుద్ధం వచ్చినప్పుడు దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన ముస్లిం బ్రదర్ హుడ్ సోదరుడు మోర్సీకి మద్దతుగా ఖతార్ నిలిచిందన్న ఆరోపణలు వచ్చాయి.

తాలిబన్లకు కార్యాలయం తర్వాత ఎంబసీగా మార్పు

తాలిబన్లకు కార్యాలయం తర్వాత ఎంబసీగా మార్పు

ఇక ఖతార్ వ్యవహార శైలి మరింత వివాదాస్పదంగా మారడానికి కారణాలు బాగానే ఉన్నాయి. ఖతార్ రాజధాని ‘దోహా'లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల్లో ఒక్కటైన ‘ఆఫ్ఘన్ తాలిబన్' సంస్థకు కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంలో ఆ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించిందన్న ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు తర్వాత దాన్ని రాయబార కార్యాలయంగా కూడా మార్చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్‌లో తాలిబన్ కీలక నాయకులు ఏకాకులవుతున్నా.. దోహాలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్న తాలిబన్ల వద్దకు వివిధ సంస్థల ప్రతినిధులు వచ్చి వెళుతుండటం సహజంగానే అమెరికా, దాని మిత్ర దేశాలకు సుతారామూ ఇష్టంగా ఉండే అవకాశాలు లేవు. దీనికి తోడు సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన సందర్భంగా ఖతర్‌ రాజు(అమీర్‌) షేక్‌ అల్‌ థానీ కొన్ని వ్యాఖ్యలు చేశారని ఇటీవల ఖతర్‌ న్యూస్‌ ఏజెన్సీలో వార్తలు వచ్చా యి. ఇరాన్‌పై అమెరికా శత్రువైఖరిని ఆయన ప్రశ్నించారని, ట్రంప్‌ చాలా కాలం పదవిలో కొనసాగరని, ఖతర్‌- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయని ఆయన అన్నట్లు కథనాలు వచ్చాయి. వీటిని ఖతర్‌ తోసిపుచ్చింది. తమ న్యూస్‌ ఏజెన్సీని హ్యాక్‌ చేశారని, తాము సైబర్‌ నేర బాధితులమని పేర్కొంది.

ఇరాన్ ప్రగతి సౌదీకి కంటగింపు

ఇరాన్ ప్రగతి సౌదీకి కంటగింపు

దీనికి తోడు రెండోసారి ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన హసన్ రౌహానీని గత నెల 27వ తేదీన ఖతార్ రాజు తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అభినందించారు. సంప్రదాయ అతివాదులపై పట్టు సాధించిన రౌహానీ క్రమంగా ఇరాన్‌ను ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సంస్కరణావాదిగా ఉన్నా తమ బద్ధ వ్యతిరేకి ఇరాన్ అధ్యక్షుడిని అభినందించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నచ్చలేదు. ఇక అమెరికా మద్దతుదారుగా ఉన్న సౌదీ అరేబియాకు అసలే నచ్చలేదని విశ్లేషకులు చెప్తున్నారు. తొలి నుంచి గల్ఫ్ రీజియన్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న సౌదీ అరేబియాకు ఇటీవలి కాలంలో ఇరాన్ ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్లడం సుతారామూ ఇష్టం లేదని పరిణామాలు చెప్తున్నాయి.

ఖతార్‌పై ఆంక్షలు కుట్రపూరితమేనా?

ఖతార్‌పై ఆంక్షలు కుట్రపూరితమేనా?

పది రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాలో పర్యటించినప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందుకు కూటమి కట్టాలని కూడా సూచించారు. ఇక ఐఎస్, అల్ ఖైదా, బ్రదర్ హుడ్ తదితర ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు ఖతార్ మద్దతునిస్తున్నదన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. తాజాగా వార్తాసంస్థ హ్యాకింగ్ ఆరోపణ, ప్రతిగా తమ ప్రతిస్పందనలను ప్రచురించకపోవడాన్నీ.. ఇరాన్ అధ్యక్షుడు రౌహానీని అభినందించడాన్ని సాకుగా తీసుకున్న గల్ఫ్ దేశాలు ఖతార్‌పై ఆంక్షలు విధించేందుకు పూనుకున్నాయని విమర్శలు ఉన్నాయి. ముస్లిం బ్రదర్‌హుడ్‌తోపాటు అల్‌కాయిదా, ఐఎస్ తదితర ఉగ్రవాద సంస్థలకు ఖతార్ తోడ్పాటు ఇస్తున్నదని సౌదీ వార్తా సంస్థ ఎస్పీఏ ఆరోపించింది. ఇరాన్ మద్దతుదారులైన మిలిటెంట్లకు, బహ్రెయిన్‌లోని ఖతీఫ్‌లో షియా ముస్లింలకు ఖతార్ మద్దతు తెలుపుతున్నదని ఆరోపించింది. ఖతార్ ప్రభుత్వ రంగ టీవీ చానెల్ అల్‌జజీరా ఉగ్రవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నదన్నది. ఉగ్రవాదం నుంచి జాతీయ భద్రతకు తలెత్తే ముప్పును ఎదుర్కోవడానికి.. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నందుకు ఖతార్‌పై అంక్షలు విధించామని సౌదీ అరేబియా, బహ్రెయిన్ తెలిపాయి.

ఆంక్షల అమలుగా శరవేగంగా ఇలా అరబ్ దేశాల అడుగులు

ఆంక్షల అమలుగా శరవేగంగా ఇలా అరబ్ దేశాల అడుగులు

గమ్మత్తేమిటంటే ఇస్లామిక్ ఉగ్రవాదులకు సౌదీ అరేబియా నుంచి ఇంటా బయటా సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తూనే ఉన్నాయి. కానీ అమెరికాకు అరబ్ ప్రపంచంలో నమ్మకమైన మిత్ర దేశంగా సౌదీ అరేబియాకు పేరు ఉన్నది. దాంతోపాటు ఇటీవల ప్రగతి పథంలో దూసుకెళుతున్న ఇరాన్‌తో ఖతార్ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటంతో సౌదీ మండి పడింది. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నదని పేర్కొంటూ ఖతార్‌ను శిక్షించేందుకు సహచర గల్ఫ్ దేశాలకు చర్యలు చేపట్టిందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఆంక్షల అమలులో భాగంగా తమదేశాల్లో నివసిస్తున్న, సందర్శనకు వచ్చిన ఖతార్ పౌరులు వారి దేశానికి వెళ్లిపోయేందుకు గల్ఫ్ దేశాలు రెండు వారాల గడువు విధించాయి. యెమెన్‌లో ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సౌదీ ఆధ్వర్యంలో జరుగుతున్న సాయుధ దాడుల నుంచి కూడా ఖతార్‌ను బహిష్కరించాయి. ఇప్పటికే ఖతార్‌తో సౌదీ అరేబియా తన సరిహద్దులను మూసేసింది. ఈజిప్టు రహదారులు మూసేసింది. 2014 మార్చి నుంచి ఎనిమిది నెలల పాటు ఆంక్షలు అమలు చేసిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ రోడ్డు, నౌకాయానంపై నిషేధాజ్నలు అమలు చేయలేదు. కానీ ఈ దఫా ఆ రెండు మార్గాలను దిగ్బంధనం చేయనుండటంతో కనీస నిత్యావసర వస్తువుల కోసం ఖతార్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కువశాతం సౌదీ, ఈజిప్టుల నుంచి ఖతార్ తనకు కావాల్సిన సామగ్రి దిగుమతి చేసుకుంటున్నది మరి.

తమను ఏకాకిగా మార్చేందుకేనన్న ఇరాన్

తమను ఏకాకిగా మార్చేందుకేనన్న ఇరాన్

సోదర ముస్లిందేశాల ఆంక్షలపై దీటుగానే స్పందించిన ఖతార్ తాము ఐఎస్ ఉగ్రవాదులకు గానీ, గతంలో ఇరాన్‌కు గానీ మద్దతు ఇవ్వలేదన్నది. ఏడు ముస్లిం దేశాల ఆరోపణలు నిరాధారమని, తమతో దౌత్య సంబంధాలు తెంచుకోవడం అన్యాయమని ఖతార్ విదేశాంగశాఖ పేర్కొంది. తమను బలహీన పరిచేందుకు దుష్ప్రచారంచేస్తున్నారని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నది. తమపై నియంతృత్వం అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నదని తెలిపింది. ఖతార్‌పై ఏడు ముస్లిం దేశాలు విధించిన ఆంక్షలపై ఇంకా తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పాకిస్థాన్ స్పష్టం చేసింది. మిలిటెంట్ గ్రూపులకు మద్దతు, ఆర్థిక సాయం చేస్తున్నారన్న సాకుతో తమను ఏకాకిని చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుట్ర పన్నారని ఖతార్‌కు నమ్మకమైన మిత్ర దేశంగా ఉన్న ఇరాన్ స్టాఫ్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ హమీద్ అబౌతాలేబి ట్వీట్ చేశారు.

ఇది సౌదీ - ఖతార్ అంతర్గత సమస్య అన్న సుష్మ

ఇది సౌదీ - ఖతార్ అంతర్గత సమస్య అన్న సుష్మ

ఖతార్‌పై సౌదీ అరేబియా తదితర దేశాల ఆంక్షలతో తమకేం సంబంధం లేదని భారత్ విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఈ వివాదం ఆయాదేశాల మధ్య అంతర్గత వివాదమేనని మీడియాతో చెప్పారు. ముస్లిం దేశాల ఆంక్షల నేపథ్యంలో ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రత గురించే తాము ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఖతార్ లో భారతీయులు 6.5 లక్షల మందికి పైగా ఉండి ఉంటారని అంచనా. గల్ఫ్ దేశాల మధ్య దౌత్యపరమైన సమతుల్యత పాటిస్తూ భారత్ ముందుకు సాగుతున్నది. ఇక దేశీయ అవసరాల కోసం ఖతార్ నుంచే భారత్ 90 శాతం సహజ వాయువును దిగుమతి చేసుకుంటున్నది.

English summary
Saudi Arabia, Bahrain, the United Arab Emirates, and a growing list of other countries have cut diplomatic relations with Qatar over its alleged support of terrorism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X