• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్స్: కోవిడ్‌తో ఇంట్లో ఉండే సమయం పెరిగింది.. కానీ శృంగారం మీద ఆసక్తి తగ్గింది.. ఎందుకిలా..

By BBC News తెలుగు
|

సెక్స్ లైఫ్

కరోనావైరస్ మన సెక్స్ జీవితాన్ని ఎలా మార్చింది?

కరోనాకు ముందు పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో చాలామందికి తీరిక ఉండేది కాదు.

కరోనా కారణంగా ఇప్పుడు ఇంట్లో ఉండే సమయం పెరిగింది.

తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వెళ్తున్నారు.

గతంలో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో అలిసిపోయే జంటల్లో చాలామందికి లాక్‌డౌన్‌ కొంత ఊరటనిచ్చింది.

ఇంట్లోనే ఉండటం వల్ల ఒకరికొకరు సన్నిహితంగా ఉండే సమయం కూడా బాగా పెరిగింది.

''గతంలో దొరకని అవకాశాలను కరోనా, లాక్‌డౌన్ చాలామంది జంటలకు కల్పించింది. అంతకు ముందు వాళ్లు అరుదుగా మాత్రమే అలాంటి క్షణాలను అనుభవించేవారు. అయితే రానురాను పరిస్థితి మారిపోయింది. జంటల మధ్య బంధాలపై కొత్త ప్రభావం పడటం మొదలైంది. చాలా జంటల్లో సెక్స్‌ రిలేషన్‌లో తిరోగమనం మొదలైంది'' అని అన్నారు టెక్సాస్‌లో సెక్స్‌ థెరపిస్ట్‌గా పని చేస్తున్న ఎమిలీ జెమియా.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చేసిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

భాగస్వామితోపాటు, వ్యక్తిగతంగా కూడా చాలామందిలో శృంగారం పట్ల ఆసక్తి తగ్గిందని 2020లో టర్కీ, ఇటలీ, ఇండియా, అమెరికా దేశాల్లో జరిపిన పరిశోధనల్లో తేలింది.

దీనికి లాక్‌డౌన్ ప్రధాన కారణమని గుర్తించారు.

''చాలామంది ఒత్తిడికి గురయ్యారు. లైంగికాసక్తి తగ్గడానికి ఇదే ప్రధాన కారణం'' అని అమెరికాలో ఈ అధ్యయనం నిర్వహించిన 'ది కిన్సే ఇనిస్టిట్యూట్‌'కు చెందిన సైకాలజిస్ట్ జస్టిన్ లెమిల్లర్ అన్నారు.

కరోనా మహమ్మారి, ఆ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల ఒక అనిశ్చిత వాతావరణం నెలకొంది.

చాలామంది మానసిక, శారీరక ఆరోగ్యాలపై దీని ప్రభావం పడింది.

ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది, జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

ఈ కారణంగా చాలామందిలో 'స్ట్రెస్' (ఒత్తిడి) పెరిగింది.

దీనికి తోడు ఒకే ప్రదేశంలో ఎక్కువ సమయం గడపడంలాంటివి కూడా భాగస్వామితో సెక్స్ పట్ల విముఖతకు కారణమమని అధ్యయనంలో తేలింది.

మొత్తం మీద కోవిడ్-19 అనేది శృంగార జీవితానికి ఒక శరాఘాతమన్న విషయం తేలింది.

మరి కూలుతున్న ఈ బంధాలను నిలబెట్టడం సాధ్యమేనా? లేక ఈ పతనం ఇలాగే కొనసాగుతుందా?

సెక్స్ లైఫ్

దానిపై ఆసక్తి తగ్గింది..

లాక్‌డౌన్‌ ప్రారంభంలో జంటల మధ్య శృంగారంలో కొంత వృద్ధి కనిపించినట్లు తమ అధ్యయనంలో తేలిందని జెమియా వెల్లడించారు.

''లాక్‌డౌన్ మొదట్లో సెక్స్ పట్ల ఆసక్తి పెరగడం కేవలం హనీమూన్ ఫేజ్ అని చెప్పక తప్పదు'' అని టెక్సాస్‌ స్టేట్ యూనివర్సిటీలో సోషల్‌ సైకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రోండా బల్జారిణి అన్నారు.

''ఆ రోజుల్లో జనం కలిసి మెలసి ఉండేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రజల్లో భయం పెరిగింది. ఒత్తిడి ఎక్కువైంది. ఇన్నాళ్లు అనుభవించిన సంతోషం భ్రమ అన్నది అర్థమైంది. డిప్రెషన్ పెరిగింది. ఇది మొదలైనప్పుడే జంటల మధ్య శృంగారంలో తేడా కూడా మొదలైంది'' అని అన్నారామె.

కరోనా మహమ్మారి సమయంలో 57 దేశాలలో 18 సంవత్సరాలకు పైబడిన వారిపై తాము అధ్యయనం చేసినట్లు బల్జారిణి వెల్లడించారు.

ఆర్థికపరమైన సమస్యలు సెక్స్ జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపించినట్లు తాము గుర్తించామని బల్జారిణితో కలిసి అధ్యయనం చేసిన వారు చెప్పారు.

తర్వాత వాటికి ఒంటరితనం, కోవిడ్ భయం లాంటివి తోడయ్యాయి.

తమ భాగస్వాములలోనూ శృంగార ఆసక్తి తగ్గిందని అధ్యయనంలో పాల్గొన్నవారు వెల్లడించారు.

ఒత్తిడి, కుంగుబాటు, శృంగారం మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని బల్జారిణి చెప్పారు.

''మనుషులలో ఏర్పడిన ఒత్తిడి చాలాకాలం కొనసాగడంతో వ్యక్తులు నీరస పడిపోయారు. ఒత్తిడి కుంగుబాటుకు దారి తీసింది. చివరకు ఆ కుంగుబాటే శృంగారం మీద ప్రభావం చూపింది'' అన్నారు బల్జారిణి.

ఇక కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న పరిణామాలు అంటే, ఆసుపత్రి పాలవడం, మరణాలు లాంటివి కూడా ఆందోళన పెంచుతునాయి. చివరికి లైంగిక జీవితంపై ప్రభావం చూపడానికి అవి కారణం అవుతున్నాయి.

''రెండు జీబ్రాలు ఒక సింహం ముందు శృంగారంలో పాల్గొనలేవు'' అని ఒక సామెత ఉంది అన్నారు టెక్సాస్‌లో సెక్స్‌ థెరపిస్ట్‌గా పని చేస్తున్న జెమియా.

''ఇలాంటి భయాల కారణంగా శృంగారానికి ఇది సరైన సమయం కాదు అన్న సందేశం మన శరీరంలోకి వెళుతుంది. అంటే పెరిగిన భయం మనలో శృంగార ఆసక్తిని తగ్గిస్తుంది'' అన్నారు జెమియా.

సెక్స్ లైఫ్

మితిమీరిన సాన్నిహిత్యం

''లాక్‌డౌన్ ఆరంభంలో కలిసి స్నానం చేయడం, ఈత కొట్టడం లాంటి చర్యలు శృంగారం కన్నా హాయినిచ్చేవిగా ఉండేవి. కానీ రానురాను పరిస్థితి మారిపోయింది. పార్ట్‌నర్‌లు ఇద్దరూ ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకునే స్థాయికి తీసుకెళ్లింది. అతి సాన్నిహిత్యం కూడా దీనికి ఒక కారణం కావచ్చు'' అని అన్నారు 'ది కిన్సే ఇనిస్టిట్యూట్‌'కు చెందిన సైకాలజిస్ట్ జస్టిన్ లెమిల్లర్.

''భాగస్వామికి ఉన్న కొన్ని అలవాట్లను తప్పుబట్టడం లాంటి చర్యలు కూడా ఘర్షణకు దారి తీస్తాయి. ఉదాహరణకు మీ పార్టనర్ పెద్దగా శబ్దం వచ్చేలా నములుతుంటే అది మీకు నచ్చకపోవచ్చు. ఇలాంటి విషయాలలో ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు మొదలవుతాయి'' అన్నారాయన.

ఎక్కువసేపు కలిసి ఉండటం కూడా సెక్స్ పట్ల అనాసక్తికి కారణం కావచ్చు.

''దూరంగా ఉన్న కొద్దీ ఎదుటి వ్యక్తి మీద ఆకర్షణ పెరగడం సహజం. పొద్దున లేచిన దగ్గర్నుంచి ఒకరినొకరు చూసుకుంటుంటే అవతలి వ్యక్తిలోని తెలియని విషయాలు, రహస్యాలు అంటూ ఏమీ ఉండవు'' అంటారు లెమిల్లర్.

దీనికి తోడు కోవిడ్ ముందున్న కెరీర్ అవకాశాలు లాక్‌డౌన్ సమయంలో తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు ఇంటి దగ్గరుండి పని చేయడం వారి ప్రొఫెషనలిజంపై ప్రభావం చూపుతుంది. ఇంటి పనులు, పిల్లల పెంపకంలాంటి అంశాలు కెరీర్‌కు అడ్డుగా నిలుస్తాయి.

''మహిళలకు ఇలాంటి పరిస్థితి చాలా చాలా కష్టమైన విషయం'' అన్నారు సెక్స్‌ థెరపిస్ట్‌ జెమియా.

తమ గుర్తింపు తగ్గిపోతుందన్న ఆందోళన వారిలో పెరుగుతుంది. అది బెడ్ రూమ్ వరకు వస్తుంది'' అంటారు జెమియా.

సెక్స్ లైఫ్

పాత రోజుల్లోకి వెళ్లగలమా?

ఆందోళనల ప్రభావం సెక్స్‌ మీద పడకూడదంటారు కిన్సే ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు.

దీన్ని నివారించడానికి వీరు కొన్ని మార్గాలను కూడా సూచిస్తునారు.

అప్పటి వరకు ఉన్న పరిస్థితులకు భిన్నంగా వ్యవహరించడం ఇందులో ఒకటి అంటారు వారు.

తమ పరిశోధనలో పాల్గొన్న ప్రతి అయిదుగురిలో ఒకరు బెడ్ మీద కొత్తదనం కోసం ప్రయత్నం చేసినట్లు వారు వెల్లడించారు. ఈ ప్రయత్నాల వల్ల ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగి, కోరికలు కూడా వృద్ధి చెందుతాయని వారు చెప్పారు.

''కొత్తదనం కోసం ప్రయత్నించిన వారు తమలో శృంగార భావనలు, కోరికలు పెరిగినట్లు చెప్పారు'' అని సైకాలజిస్ట్ జస్టిన్ లెమిల్లర్ వెల్లడించారు.

కొత్త భంగిమలు, కొత్త ఊహలు, మసాజ్‌లకు ప్రయత్నించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని తమ అధ్యయనంలో తేలిందని లెమిల్లర్ అన్నారు.

మరి గత ఏడాది కాలంగా ఇలా తరిగిపోతూ వచ్చిన లైంగిక ఆసక్తులు తిరిగి గాడిన పడతాయా? అంటే పరిస్థితులను బట్టి ఉంటుందని అంటున్నారు నిపుణులు.

కొన్ని బంధాలు కోలుకోలేవని వారు చెబుతున్నారు. కొన్ని సంబంధాలు తిరిగి కలపలేనంతగా చెడిపోతాయని లెమిల్లర్ అభిప్రాయపడ్డారు.

కొంతమంది ఈ మహమ్మారి కాలంలో తమ భాగస్వాములను మోసం చేశారని, ఇలాంటి సందర్భంలో ఆ రిలేషన్లు పునరుజ్జీవం పొందడానికి చాలా సమయం పడుతుందని ఆయన అన్నారు.

సెక్స్ లైఫ్

మరికొందరు మహమ్మారి కారణంగా ఏర్పడిన నిరుద్యోగిత, ఆర్థికపరమైన సమస్యల్లాంటివి వారిని త్వరగా కోలుకోనివ్వవని ఆయన చెబుతారు.

అయితే చాలామంది ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశతో ఉన్నారు.

వ్యాక్సినేషన్ పూర్తవడం, బిజినెస్‌లు మొదలు కావడం, మళ్లీ ఆఫీసులకు వెళ్లే రోజులు రావడం లాంటివి వీటికి సహకరిస్తాయని చెబుతున్నారు.

''గతం పునరావృతం అయితే ఈ పరిస్థితులు కూడా మారతాయి'' అన్నారు జెమియా.

''కొంతమంది జంటలు తిరిగి వారి పాత జీవితంలోకి వెళితే ఇది సాధ్యమే'' అన్నారు లెమిల్లర్.

''ఒత్తిడి సడలిన నాడే వారి సెక్స్‌ జీవితం కూడా గాడిన పడుతుంది'' అంటారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sex: Time spent at home with covid increased,but interest in romance decreased why
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X