• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'పెళ్లైతే భర్త పేరు తగిలించుకోవాలా?': పాకిస్తాన్‌ అమ్మాయిల్లో మారుతున్న ట్రెండ్

By BBC News తెలుగు
|

ముస్లిం మహిళలు
Click here to see the BBC interactive

"ఇప్పటివరకూ నా పేరు జుహా జుబైరీనే. నా పేరు మార్చుకోవాలి అంటే, చాలా వింతగా అనిపిస్తోంది. పేరు మారితే, నా గుర్తింపునే కోల్పోతానేమో అన్న భావన కలుగుతోంది" అన్నారు పాకిస్తాన్‌లో ఉంటున్న జుహా జుబైరీ.

పెళ్లి తర్వాత భార్య... భర్త పేరును గానీ భర్త ఇంటిపేరును గానీ తన పేరు చివర పెట్టుకునే సంప్రదాయం చాలా దేశాల్లో ఉంది. పాకిస్తాన్ కూడా అందులో ఒకటి. అయితే, ఈ సంప్రదాయాన్ని పాటించకూడదని జుహా జుబైరీ నిర్ణయించుకున్నారు.

పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోకుండా ఉండే ట్రెండ్ పాకిస్తాన్ మహిళల్లో ఇటీవల పెరుగుతోంది.

''మా ఇంట్లో, నా స్నేహితుల్లో... పెళ్లి తర్వాత పేరు మార్చుకోని మహిళల్లో నేనే మొదటిదాన్ని'' అని చెప్పారు జుహా.

"మా అమ్మకు పెళ్లి కాగానే, పేరు మారిపోయింది. ఆమెకు అంతకు ముందున్న పేరేంటో ఇప్పుడు ఎవరికీ గుర్తులేదు. మా అక్క కూడా పెళ్లి తర్వాత తన పేరు మార్చుకుంది" అని చెప్పారు.

బాలాచ్ తన్వీర్, జుహా జుబైరీ

తన పెళ్లి తేదీ దగ్గరపడుతున్న కొద్దీ తన పేరును మార్చుకోవాల్సి వస్తుందేమోనని జుహా ఆందోళన చెందారు. అందుకు కారణం, తన పేరంటే ఆమెకు చాలా ఇష్టం. ప్రొపెషనల్ లైఫ్‌లో ఆమెను అందరూ ఆ పేరుతోనే గుర్తుపడతారు.

"కాలేజీలో అందరూ నన్ను జుబైరీ అనే పిలుస్తారు. నేనొక ఆర్కిటెక్ట్‌ను, పాటలు కూడా పాడుతుంటా. ఈ రెండు రంగాల్లో అందరికీ నేను ఈ పేరుతోనే తెలుసు" అన్నారు.

పేరు మార్చుకోకూడదని జుహా తీసుకున్న నిర్ణయానికి ఆమె భర్త బాలాచ్ తన్వీర్ కూడా మద్దతుగా నిలిచారు.

"జుహా తన అసలు పేరుతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఉన్న రంగాల్లో ప్రజల నమ్మకం ఆ పేరుతో ముడిపడి ఉంది" అన్నారు బాలాచ్.

జన్నత్ కరీమ్ ఖాన్

పాకిస్తాన్‌కే చెందిన జన్నత్ కరీమ్ ఖాన్ కూడా దాదాపు ఇలాగే ఆలోచిస్తున్నారు.

జుహా జుబైరీ లాగే జన్నత్ కరీమ్ ఖాన్ కూడా పెళ్లి తర్వాత తన పేరు మార్చుకోలేదు.

"జీవితంలో మనం ముందుకు వెళ్తున్నకొద్దీ మన పేరే మనకు గుర్తింపుగా మారుతుంది. నేను జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, అవన్నీ నా పేరుతోనే ముడిపడి ఉంటాయి అన్నారు" జన్నత్.

పెళ్లి తర్వాత పేరు మార్చుకోవాలా? వద్దా? అన్నది మహిళల వ్యక్తిగత నిర్ణయం కావాలని ఎలాఫ్ జహ్రా నక్వీ అంటున్నారు.

"కొంతమంది మహిళలకు తమ పేరంటే ఇష్టం ఉంటుంది. తమ పేరుతో వారికి ఓ ప్రత్యేక బంధం ఏర్పడుతుంది. కారణం ఏదైనా, దానిపై నిర్ణయం తీసుకునే హక్కు మహిళకే ఉండాలి" అని ఆమె అన్నారు.

ఎలాఫ్ భర్త తలాల్ కూడా ఈ విషయంపై స్పందించారు.

''ఎలాఫ్ తన పేరు పక్కన నా పేరు పెట్టుకుంటే బాగుంటుందని మొదట్లో నాకు అనిపించేది. ప్రభుత్వ పత్రాల్లో భార్యాభర్తల పేర్లు ఒకేలా ఉంటే ఇమిగ్రేషన్, మిగతావి సులభంగా అవుతాయని అనుకున్నా" అని తలాల్ అన్నారు.

కానీ, ఎలాఫ్‌తో మాట్లాడిన తర్వాత.. ఎవరికైనా పుట్టినప్పటి నుంచి ఉన్న పేరును మార్చేయడం సరికాదన్న అభిప్రాయానికి వచ్చానని ఆయన చెప్పారు.

"మనిషి ఏ పేరుతో ఈ ప్రపంచంలోకి వస్తాడో, ఏ పేరుతో పెరిగి పెద్దవుతాడో, దానిని మార్చడం అంటే, అది ఒక విధంగా వారికి అన్యాయం చేసినట్లే. మీకు ఎవరితోనో పెళ్లైనంత మాత్రాన, మీ పేరు కూడా మార్చుకోవాలా" అని తలాల్ నవ్వుతూ అన్నారు.

అనమ్ సయీద్

సెంటిమెంట్

పుట్టినప్పటి నుంచి ఉన్న పేరును మార్చుకోవడమన్నది మహిళలకు ఒక భావోద్వేగపరమైన విషయం.

పెళ్లైన కొన్నేళ్ల తర్వాత తన పాత పేరు మారడంతో చాలా బాధ పడ్డానని అనమ్ సయీద్ చెప్పారు.

''ఆ సమయంలో నా భర్త పేరు పెట్టుకోవడం మంచి సంప్రదాయం అనిపించింది. అది భర్తకు ఇచ్చే గౌరవానికి ప్రతీక అనిపించింది. అందుకే నా పేరుకు నా భర్త వంశం పేరైన 'ఇక్బాల్'ను జత చేసుకున్నాను. కానీ, కొన్నేళ్ల తర్వాత నేను అమెరికా వెళ్లినపుడు, అక్కడున్న వాళ్లు మిసెస్ ఇక్బాల్, అనమ్ ఇక్బాల్ అనడం మొదలెట్టారు. అప్పుడు నాకు నా గుర్తింపు కోల్పోయినట్టు అనిపించింది. చనిపోయిన మా నాన్న నాకు ఇచ్చిన పేరు లేకుండా పోయిందే అనే బాధ కలిగింది'' అని అనమ్ అన్నారు.

అందుకే, కొన్నేళ్ల తర్వాత తిరిగి ఆమె అనమ్ సయీద్ అని తన పాత పేరునే పెట్టుకున్నారు.

పుట్టినప్పుడు పెట్టిన పేరు తమ పుట్టింటితో అనుబంధానికి సంబంధించిన విషయమని కొంతమంది మహిళలు అంటున్నారు.

తనకు పేరు పెట్టిన తండ్రి ఇప్పుడు ఈ లోకంలో లేరని, అందుకే ఆ పేరంటే తనకు ఇష్టమని జన్నత్ కరీమ్ ఖాన్ కూడా చెప్పారు.

'పొగరు ఎక్కువ అంటారు’

ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో కొందరు పేరు మార్చుకోవడం వల్ల సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని హుమా జహాజేబ్ చెప్పారు.

పేరు మార్చుకుంటే... విద్య, ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికెట్లలోనూ పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇదంతా గందరగోళంతో కూడిన ప్రక్రియ.

కానీ, ఇప్పటికీ పాకిస్తాన్ సమాజంలో మహిళలు పేరు మార్చుకోకపోతే పెద్ద విషయంలా చూస్తుంటారు. పేరు మార్చుకోని మహిళలు చాలాసార్లు బంధువులు, స్నేహితుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

పేరు మార్చుకోని మహిళలకు పొగరు ఎక్కువ అన్న అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తుంటారు.

తలాల్

'ఆశ్చర్యపోతుంటారు'

'నా భార్య ఎలాఫ్ పెళ్లి తర్వాత పేరు మార్చుకోలేదని చెబితే నా స్నేహితులు ఆశ్చర్యపోతుంటారు'' అని తలాల్ చెప్పారు.

పెళ్లి సమయంలో మహిళలు పేరు ఎందుకు మార్చుకోవడం లేదని కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారని కొందరు మహిళలు చెబుతున్నారు.

''పెళ్లి తర్వాత గుర్తింపు కార్డ్ కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాను. వాళ్లే స్వయంగా నా పేరు మార్చారు. నా భర్త పేరు జోడించారు. నేను అభ్యంతరం చెబితే, పెళ్లైన తర్వాత కూడా పేరు ఎందుకు మార్చుకోవడం లేదని వాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు'' అని ఎలాఫ్ చెప్పారు.

ముదవ్ ఫాతిమా ఫర్హాన్

'సంతోషంగానే మార్చుకుంటున్నాం'

పెళ్లి తర్వాత సంతోషంగా పేరు మార్చుకుంటున్న మహిళలు కూడా చాలా మంది ఉంటున్నారు.

పెళ్లి సమయంలో పేరు మార్చుకోవడం అనేది భర్తపై తమ ప్రేమను వ్యక్తం చేయడం లాంటిదని ముదవ్ ఫాతిమా ఫర్హాన్ అభిప్రాయపడ్డారు.

''ఒక వ్యక్తి మనల్ని గాఢంగా ప్రేమిస్తున్నప్పుడు, మనల్ని అన్ని రకాలుగా చూసుకుంటున్నప్పుడు, ఆయన పేరు జీవితాంతం మనతో ఉండాలని మన మనసు కూడా కోరుకుంటుంది'' అని ఆమె అన్నారు.

అయితే, ఫాతిమా తన భర్త ఇంటి పేరును కాకుండా, ఆయన పేరులో మొదటి భాగాన్ని తన పేరు పక్కన పెట్టుకున్నారు.

చాలా మంది మహిళలు పెళ్లైన వెంటనే, సంతోషంగా సోషల్ మీడియాలో తమ పేరు మార్చుకుని తమకు పెళ్లైనట్లు ప్రకటిస్తుంటారు.

ఎవరికైనా పేరు మార్చుకోవడం సంతోషాన్ని ఇస్తుంటే, అలా చేయడంలో ఏ సమస్యా లేదని దానిష్ బతూల్ అన్నారు.

ఇక సిద్‌రాహ్ ఔరంగజేబ్‌కు పెళ్లై పదేళ్లు కావస్తోంది. అయితే, తనకు పెళ్లైనప్పుడు చట్టపరంగా, సామాజిక పరంగా పేరు మార్చుకోవడం తప్పనిసరి కాదని చాలా మంది మహిళల్లాగే తనకూ తెలీదని ఆమె చెప్పారు.

''పేరు మార్చుకోకపోవడం అంటే భర్త కుటుంబంలో మనం పూర్తిగా కలవలేకపోతున్నట్టు అవుతుంది అని అనుకునేదాన్ని'' అని ఆమె అన్నారు.

సిద్‌రాహ్ అభిప్రాయంతో హుమా కూడా ఏకీభవించారు.

''ఈ విషయం గురించి మహిళలకు పూర్తి అవగాహన ఉండటం లేదు. ఇది వారి వ్యక్తిగత విషయం అని, ఏ నిర్ణయం తీసుకున్నా అది వారి భర్త, సమాజం స్వీకరించాల్సి ఉంటుందని మహిళలకు తెలియజెప్పాలి'' అని ఆమె అన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'Should I name my husband if I get married?': A changing trend among Pakistani girls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X