Skull Break Challenge:సోషల్ మీడియాలో ప్రాణాంతక ఛాలెంజ్..పేరెంట్స్ జాగ్రత్త..!
వెర్రి వెయ్యి రకాలు అని ఊరికే చెప్పలేదు పెద్దవాళ్లు. సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తుండటంతో వెర్రి వేషాలు కూడా అంతే స్థాయిలో విస్తరిస్తున్నాయి. మంచి పనికోసం సోషల్ మీడియా ఎలాగైతే ఉపయోగపడుతుందో కొన్ని వికృత చేష్టలకు కూడా వేదికగా నిలుస్తోంది. ఫలితంగా ఈ ప్రక్రియలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో స్కల్ బ్రేక్ ఛాలెంజ్ అనేది వైరల్‌గా మారుతోంది. అసలు స్కల్ బ్రేక్ ఛాలెంజ్ అంటే ఏంటి..?

ప్రాణాంతకంగా మారిన స్కల్ బ్రేక్ ఛాలెంజ్
సోషల్ మీడియాల వేదికగా ఇప్పటివరకు అనేక రకాల ఛాలెంజ్‌లను చూశాం. ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ వంటివి ఎన్నో చూశాం. తాజాగా స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సరదాగా ప్రారంభమైయ్యే ఈ ఛాలెంజ్ ఏకంగా వ్యక్తి ప్రాణాలమీదకు తీసుకొస్తోంది. ఇది ఒకప్పుడు పాపులర్ అయిన బ్లూవేల్ ఛాలెంజ్లానే ఉంటుంది. స్కల్ బ్రేక్ ఛాలెంజ్ స్వీకరిస్తే ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లే అని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్కల్ బ్రేక్ ఛాలెంజ్ అంటే ఏమిటి..?
స్కల్ బ్రేక్ ఛాలెంజ్ ఒక ప్రమాదకరమైన సవాల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది టిక్ టాక్ యాప్‌పై ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఈ ఛాలెంజ్‌లో ముగ్గురు పాల్గొంటారు. అందులో ముగ్గురూ వరుసగా నిల్చొని మొదటి వ్యక్తి , మూడో వ్యక్తి ముందుగా గాల్లోకి ఎగిరి భూమిపై ల్యాండ్ అవుతారు. ఇక మధ్యలో వ్యక్తి అంటే రెండో వ్యక్తి గాల్లోకి ఎగిరిన సమయంలో ఈ ఇద్దరు వ్యక్తులు రెండో వ్యక్తి గాలిలో ఉన్న సమయంలో కిందకు ల్యాండ్ కాకముందే అతని కాళ్లను ముందుకు కొట్టేస్తారు. దీంతో ఆ రెండో వ్యక్తి అమాంతం కిందకు పడిపోతాడు. ఇక్కడే ఆ వ్యక్తి ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి. తల వెనక భాగం లేదా వెన్నెముక లాంటి సున్నితమైన ప్రాంతాల్లో గాయాలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందంటున్నారు.
తల్లిదండ్రులకు కొత్త తలనొప్పులు
సాధారణంగా మూడో వ్యక్తి గాల్లోకి ఎగిరిన సందర్భంలో తనను మిగతా ఇద్దరు వ్యక్తులు కాళ్లపై కొడతారనే విషయం ముందుగానే చెప్పరు. ఇదంతా ఒక ప్రాంక్ వీడియోలా చేస్తారు. ఈ ఛాలెంజ్‌లో ఎక్కువగా టీనేజర్లు, విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇది తల్లిదండ్రులకు కొత్త తలనొప్పి తీసుకొచ్చి పెడుతోంది. స్కూలుకు వెళ్లిన పిల్లలు ఇలాంటి ఛాలెంజ్‌లు చేసి నడుము విరగొట్టుకుంటున్నారని తల్లిదండ్రులు ఆందోళనతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఒక స్కల్ బ్రేకర్ ఛాలెంజింగ్‌ను తొలిసారిగా వెనెజులాలోని కొందరు విద్యార్థులు వీడియోగా చేశారు. ఆ తర్వాత ఇది వైరల్‌గా మారింది.

స్కల్ బ్రేక్ ఛాలెంజ్ చేస్తే జైలుశిక్ష
ఇక ఈ స్కల్ బ్రేక్ ఛాలెంజర్‌ను సోషల్ మీడియాలో చూసిన నెటిజెన్లు ఇదొక ప్రమాదకరమైన ఛాలెంజ్ అని దీన్ని ఎవరూ ట్రై చేయొద్దంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ ప్రాణాంతక ఛాలెంజ్‌పై అడ్వైజరీలను సైతం విడుదల చేశాయి. ఉదాహరణకు స్కల్ బ్రేక్ ఛాలెంజ్‌లో పాల్గొనే వారికి 10 ఏళ్లు జైలుశిక్ష విధిస్తామంటూ బ్యాంకాక్ పోలీసులు హెచ్చరించారు. ఈ స్కల్ బ్రేక్ ఛాలెంజ్‌ను ట్రిప్పింగ్ జంప్ ఛాలెంజ్‌గా కూడా పిలుస్తారు. అమెరికా యూరప్ దేశాల్లో ఈ ఛాలెంజ్ వల్ల చాలామంది గాయపడినట్లు రిపోర్టు చెబుతోంది.