కరోనాతో మహాత్మాగాంధీ మునిమనవడు సతీష్ కన్నుమూత
జోహన్నెస్‌బర్గ్/న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా కరోనాతో కన్నుమూశార. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో కరోనాతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సతీష్ ధుపేలియా(66) ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
గత కొంతకాలంగా సతీష్ న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. దీనికి చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గుండెపోటుతో సతీష్ ధుపేలియా కన్నుమూసినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా మిస్త్రీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

మూడు రోజుల క్రితమే పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న సతీష్ ధుపేలియా మరణించంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, సతీష్ ధుపేలియాతోపాటు ఉమా ధుపేలియా, కీర్తి మీనన్, మనీలాల్ గాంధీ వారసులు. మనీలాల్.. మహాత్మాగాంధీ సోదరుడు. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో అక్కడ నిర్వహించిన కార్యకలాపాలను వారు ముందుకు తీసుకెళ్తున్నారు.
డర్బన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్మెంట్ వద్ద మహాత్మాగాంధీ ప్రారంభించిన పనులను కొనసాగించేందుకు గాంధీ డెవలప్మెంట్ ట్రస్టుకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సతీష్ తన జీవితంలో ఎక్కువ భాగం మీడియాలోనే గడిపారు.
ముఖ్యంగా వీడియో గ్రాఫర్, ఫొటో గ్రాఫర్‌గా ఆయన పనిచేశారు.
అంతేగాక, పలు సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు. సతీష్ ధుపేలియా మరణం పట్ల ఆయన స్నేహితులు, ప్రముఖులు నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కాగా, మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన విషయం తెలిసిందే.